Gram Panchayat elections
-
ఇక ‘పంచాయతీ’ సమరం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసింది. గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమౌతోంది. ప్రస్తుత గ్రామ పంచాయతీ పాలకమండళ్ల పదవీకాలం ఫిబ్రవరి 1తో ముగియనున్న నేపథ్యంలో.. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సన్నాహాల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) నిమగ్నమైంది. రాజ్యాంగం ప్రకారం పంచాయతీరాజ్ (పీఆర్) సంస్థల ఐదేళ్ల పదవీకాలం ముగియడానికి ముందే, నూతన తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం పీఆర్ సంస్థల టర్మ్ ముగియడానికి మూడు నెలల ముందే ఎన్నికలు పూర్తిచేయాల్సి ఉంటుంది. దీంతో జనవరిలో లేదా ఫిబ్రవరిలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అనుమతినివ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల షెడ్యూల్‌తో సహా ప్రతిపాదనలు పంపించనున్నట్టు ఎస్ఈసీ వర్గాలు వెల్లడించాయి. దాదాపు నెల రోజుల పాటు ఈ ఎన్నికల ప్రక్రియ సాగనుంది. అయితే వచ్చే మార్చి, ఏప్రిల్‌లలో లోక్‌సభ ఎన్నికలు జరిగే అవకాశాలుండటం, ఆ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు చేయాల్సి ఉన్నందున ఈలోగా రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదనే వాదన కూడా వినిపిస్తోంది. కొత్త సర్కార్ కుదరదంటుందా? పంచాయతీ ఎన్నికల తేదీలపై తుది నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిది కావడంతో, వెంటనే మరో ఎన్నికల సమరానికి కొత్త ప్రభుత్వం మొగ్గు చూపక పోవచ్చుననే అభిప్రాయాన్ని ఉన్నతాధికారులు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ తన ఎన్నికల ప్రణాళికలో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతామని, ఉప కులాల వారీగా కూడా రిజర్వేషన్లు ఇస్తామని, ఆరు నెలల్లో దీనికి సంబంధించి బీసీ కమిషన్ నివేదిక తెప్పించుకున్నాక తదుపరి చర్యలు చేపడతామని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వకుళాభరణం కృష్ణమోహన్ నేతృత్వంలోని బీసీ కమిషన్ విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సిఉంది. అయితే ఈ ప్రక్రియ పూర్తవడానికి కొంత సమయం పట్టొచ్చునని అంచనా వేస్తున్నారు. వరుసగా జీపీ, ఎంపీపీ, జెడ్పీపీ, మున్సిపల్ పోల్స్ రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా తొలుత గ్రామ పంచాయతీ (జీపీ), ఆ తర్వాత కొన్ని నెలలకే మండల, జిల్లా ప్రజా పరిషత్ (ఎంపీపీ, జెడ్పీపీ), మరికొన్ని నెలల తర్వాత మున్సిపల్ ఎన్నికలు జరగాల్సి ఉంది. జీపీ ఎన్నికల నిర్వహణకు రిటర్నింగ్ ఆఫీసర్లు, పోలింగ్ సిబ్బంది ఎంపిక, నియామకం అనేది కీలకమైన నేపథ్యంలో ఈ నెల 30 లోగా దీనికి సంబంధించిన కసరత్తు పూర్తి చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్లను ఎస్ఈసీ ఆదేశించింది. ఈ ప్రక్రియకు సంబంధించి అనుసరించాల్సిన విధానంపై, ఈ ఎన్నికల నిర్వహణపై శిక్షణ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లకు ఎస్ఈసీ కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్ సర్క్యులర్ పంపించారు. పోలింగ్ బూత్‌లలో 200 మంది ఓటర్లకు ఒక ప్రిసైడింగ్ అధికారి, ఒక పోలింగ్ అధికారిని నియమించాలని సూచించారు. 201 నుంచి 400 ఓటర్ల దాకా ఒక ప్రిసైడింగ్ అధికారి, ఇద్దరు పోలింగ్ అధికారులను, 401 నుంచి 650 వరకు ఓటర్లకు ఒక ప్రిసైడింగ్ అధికారి, ముగ్గురు పోలింగ్ అధికారులను నియమించాలని తెలిపారు. ఏదైనా వార్డులో ఓటర్ల సంఖ్య 650 దాటితే రెండు పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. గతంలో మాదిరిగా ప్రతి జిల్లాలో మూడు విడతలుగా ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ ఏర్పాట్లు చేస్తున్నందున, మొదటి దశలో ఎన్నికలు నిర్వహించిన రిటర్నింగ్, ప్రిసైడింగ్, పోలింగ్ ఆఫీసర్ల సేవలను మూడో దశ ఎన్నికల నిర్వహణకు ఉపయోగించుకోవాలని సూచించారు. -
థాక్రే శిబిరానికి ఎదురుదెబ్బ.. జోష్‌లో బీజేపీ
ముంబై: న్యాయస్థానాల్లో, ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుందామంటూ షిండే-బీజేపీ కూటమికి తొలి నుంచి సవాల్ విసురుతున్నారు శివసేన అధ్యక్షుడు, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ థాక్రే. ఈ తరుణంలో.. తాజాగా థాక్రే శిబిరానికి పెద్ద ఎదురుదెబ్బే తగిలింది. అక్కడ జరిగిన పంచాయితీ ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోగా.. థాక్రే సారథ్యంలోని శివ సేన నాలుగో స్థానానికి పరిమితమైంది. మహారాష్ట్రంలో మొత్తం 28,813 గ్రామ పంచాయితీలు ఉన్నాయి. తాజాగా గురువారం 62 మండలాల్లోని 271 గ్రామ పంచాయితీలకు ఓటింగ్ జరిగింది. అందులో పుణే, సతారా, ఔరంగాబాద్, నాసిక్ పరిధిలోని గ్రామాలు సైతం ఉన్నాయి. శుక్రవారం వాటికి కౌంటింగ్ జరగ్గా.. ఫలితాల్లో బీజేపీ మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంది. బీజేపీ 82 స్థానాలు దక్కించుకోగా.. ఎన్సీపీ 53 స్థానాలు, శివ సేన(షిండే వర్గం) 40 స్థానాలు కైవం చేసుకుంది. ఇక శివ సేన(ఉద్దవ్ థాక్రే వర్గం) 27, కాంగ్రెస్ 22, ఇతరులు 47 చోట్ల విజయం సాధించారు. ఈ విజయంతో బీజేపీ సంబురాలు చేసుకుంది. గ్రామ పంచాయితీ ఎన్నికల్లోనూ బీజేపీ నెంబర్ వన్ పార్టీ అని, బీజేపీతో పాటు ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే సారథ్యంలోని శివ సేన బాగా పని చేసిందని ట్వీట్ చేశారు ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్. పనిలో పనిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్‌ను, కార్యకర్తలను అభినందించారాయన. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్పాటిల్ సైతం స్పందిస్తూ.. ఇది ప్రజాతీర్పు అని, ప్రజావ్యతిరేక కూటమికి(మహా వికాస్ అగాఢిని ఉద్దేశించి) ఇది ప్రజలు ఇచ్చిన తిరస్కారం, మునుముందు ఇదే కొనసాగుతుంది అంటూ పరోక్షంగా థాక్రే వర్గాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: అనారోగ్యానికి గురైన షిండే.. ఆ బాధ్యతలు ఫడ్నవీస్‌కు! -
నేటి నుంచి గ్రామాల్లో సర్పంచ్ల పాలన
సాక్షి, అమరావతి: గ్రామ పంచాయతీల్లో శనివారం నుంచి సర్పంచ్ల పాలన మొదలు కాబోతోంది. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు, వార్డు సభ్యులు రాష్ట్రమంతటా నేడు పదవీ ప్రమాణ స్వీకారం చేసి, అధికారికంగా బాధ్యతలు చేపట్టనున్నారు. దాదాపు రెండున్నర ఏళ్లుగా ప్రత్యేకాధికారుల ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీలు పని చేస్తున్నాయి. 2018 ఆగస్టు 1వ తేదీ నాటికే అప్పటి గ్రామ పంచాయతీ సర్పంచ్ల పదవీ కాలం ముగిసినప్పటికీ, అప్పటి చంద్రబాబు ప్రభుత్వం సకాలంలో ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేకాధికారుల పాలనకు ఉత్తర్వులు జారీ చేసింది. 2018 ఆగస్టు 2వ తేదీ నుంచి గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలనే కొనసాగుతోంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక 2020 మార్చిలో ఇతర స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు పంచాయతీ ఎన్నికలు జరిపేందుకు ప్రయత్నించగా, అప్పటి ఎస్ఈసీ కరోనా పేరుతో ఎన్నికలు వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరి–ఫిబ్రవరి నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా 13,097 గ్రామ పంచాయతీలకు నాలుగు విడతల్లో ఎన్నికలు నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలలో ఏప్రిల్ 3వ తేదీన కొత్తగా ఎన్నికైన సభ్యులతో తొలి సమావేశాలు నిర్వహించేందుకు పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో తాజాగా గ్రామాల్లో మళ్లీ సర్పంచ్ల పాలన కొనసాగబోతుంది. ప్రమాణ స్వీకారం.. ప్రతిజ్ఞ ► కొత్తగా సర్పంచ్‌లుగా ఎన్నికైన వారి ప్రమాణ స్వీకారం, బాధ్యతల స్వీకరణ కార్యక్రమాలు శనివారం నిర్వహించేందుకు పంచాయతీరాజ్ శాఖ ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమాలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలను ఆహా్వనించి ఘనంగా జరిపేందుకు పంచాయతీ రాజ్ శాఖ అధికారులు నిర్ణయించారు. ► అయితే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలతో రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ఈ కార్యక్రమాన్ని నిరాడంబరంగా ముగించాలని నిర్ణయించారు. ► శనివారం ఉదయం 11 గంటలకు సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం నిర్వహిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాలు, పారిశుధ్యం, మొక్కల పెంపకం, మంచినీటి సరఫరా, వీధి దీపాలు, వర్షపు నీటి సంరక్షణపై అన్ని గ్రామాల్లో సర్పంచులు, వార్డు సభ్యులు ప్రతిజ్ఞ చేస్తారు. ► 12.15 గంటలకు పంచాయతీ కార్యదర్శి, సిబ్బందితో కొత్తగా ఎన్నికైన సభ్యుల పరిచయ కార్యక్రమం ఉంటుంది. అన్ని చోట్ల కొత్తగా బాధ్యతలు చేపట్టిన వారితో గ్రామ పంచాయతీల మొదటి çసమావేశం నిర్వహిస్తారు. -
పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో అక్రమాలు లేవు
సాక్షి, అమరావతి: గ్రామ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఎటువంటి అక్రమాలు, అవకతవకలు జరగలేదని రాష్ట్ర ఎన్నికల కమిషన్ శుక్రవారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సమయంలో కరెంట్ నిలిపివేసి ఫలితాలను తారుమారు చేశారని, నిబంధనలకు విరుద్ధంగా పలుచోట్ల రీకౌంటింగ్ నిర్వహించారని ఫిర్యాదులు రావడంతో అన్ని జిల్లాల కలెక్టర్లు, పంచాయతీ రాజ్‌శాఖ కమిషనర్ నుంచి నివేదికలు తెప్పించుకున్నట్టు కమిషన్ తెలిపింది. కొన్ని చిన్న సంఘటనలు జరిగినప్పటికీ, వాటిలో తీవ్రంగా పరిగణించాల్సినవి ఏమీ లేవని పేర్కొంది. ఎక్కడా కూడా కరెంట్ నిలిపివేసి ఫలితాలను మార్చినట్టు నిర్ధారణ కాలేదని తెలిపింది. గుంటూరు జిల్లాలో నాలుగు పంచాయతీల్లో ఎక్కువ ఓట్ల తేడా ఉన్నా, రీ కౌంటింగ్ నిర్వహించినట్టు తెలిసిందని, వాటిపై జిల్లా కలెక్టరు నుంచి సమగ్ర నివేదిక తెప్పించుకున్నానని, రీకౌంటింగ్‌లో ఎటువంటి అవకతవకలు జరిగినట్లు నిర్ధారణ కాలేదని వెల్లడించింది. ఓట్ల లెక్కింపుపై వచ్చిన ఆరోపణలు పూర్తి నిరాధారమైనవని రాష్ట్ర ఎన్నికల కమిషన్ పేర్కొంది. -
ఏపీ పంచాయతీ ఎన్నికలు; మూడో విడత ఏకగ్రీవాల జోరు
సాక్షి, అమరావతి: మూడో విడత ఎన్నికలలో ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీల సంఖ్య పెరిగింది. 579 చోట్ల సర్పంచ్ పదవులు ఏకగ్రీవమైనట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ శనివారం అధికారికంగా ప్రకటించింది. మూడో విడత 3,221 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్లు జారీ కాగా, ఆయా గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం 3 గంటలకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. 13 జిల్లాల నుంచి సమాచారం అందాక, ఆ వివరాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం శనివారం అధికారికంగా విడుదల చేసింది. 579 సర్పంచ్ పదవులకు ఎన్నిక ఏకగ్రీవం కావడంతో మూడో విడత 2,640 సర్పంచ్ స్థానాలకు (రెండు స్థానాల్లో నామినేషన్ దాఖలు కాలేదు) ఎన్నికలు జరగనున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం పేర్కొంది. 7,756 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని, ఈ నెల 17వ తేదీన పోలింగ్ జరుగుతుందని తెలిపింది. కాగా, మూడో విడతలో ఎన్నికలు జరిగే 3,221 గ్రామ పంచాయతీల పరిధిలో 31,516 వార్డులు ఉన్నాయి. నామినేషన్ల ఉప సంహరణ ప్రక్రియ ముగిసిన తర్వాత 11,732 వార్డులకు ఎన్నిక ఏకగ్రీవంగా ముగిసినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ పేర్కొంది. 19,607 వార్డులలో 43,282 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్టు తెలిపింది. కాగా, 177 వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. నాలుగో విడత సర్పంచ్ పదవులకు 20,156 నామినేషన్లు నాలుగో విడతలో 3,228 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతుండగా, ఆయా గ్రామాల్లో సర్పంచ్ పదవులకు 20,156 నామి నేషన్లు, వార్డు పదవులకు 88,285 నామి నేషన్లు దాఖలు అయ్యాయి. ఈ గ్రామ పంచా యతీల్లో ఈ నెల 16వ తేదీ సాయంత్రం 3 గంటలకు నామినేషన్ల ఉప సంహరణ ప్రక్రియ ముగియనుంది. -
నాలుగో సింహానికి నాలుగు సవాళ్లు
సాక్షి, అమరావతి: పోలీస్ శాఖ ఇప్పుడు నాలుగు ప్రధాన సవాళ్లను ఎదుర్కొంటోంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఆలయాలకు బందోబస్తు, వ్యాక్సిన్ భద్రత, రోజువారీ శాంతిభద్రతల నిర్వహణ.. ఇలా అన్నింటినీ ఒకేసారి సమర్థవంతంగా నిర్వహిస్తూ అందరి మన్ననలను పొందుతోంది. ప్రధానంగా రాష్ట్రంలో పథకం ప్రకారం జరిగిన దేవుడి విగ్రహాల ధ్వంసం కేసుల చిక్కుముడులను చాకచక్యంగా విప్పి శభాష్ అనిపించుకున్నారు. సున్నితమైన మతపరమైన అంశాల ద్వారా అలజడులు సృష్టించేందుకు పన్నిన కుట్రలను ఛేదించడమే కాకుండా.. ఆలయాలపై నిరంతర నిఘా పెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మతపరమైన సంస్థలు, ఆలయాలను గుర్తించి.. జియో ట్యాగింగ్ చేయడంతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. అలాగే కోవిడ్ వ్యాక్సిన్ భద్రతా చర్యలను కూడా పోలీసులే చేపట్టారు. వైద్య ఆరోగ్య, మున్సిపల్ తదితర సిబ్బందికి వేస్తున్న వ్యాక్సినేషన్ కార్యక్రమానికి బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో హఠాత్తుగా వచ్చి పడిన పంచాయతీ ఎన్నికల విధులకు కూడా పోలీస్ శాఖ వెంటనే సిద్ధమైంది. నామినేషన్లు మొదలు.. ప్రచారం, పోలింగ్, కౌంటింగ్ తదితరాలన్నింటికీ బందోబస్తు నిర్వహిస్తూ గ్రామాల్లో ప్రశాంత వాతావరణం కొనసాగేలా చర్యలు తీసుకుంటోంది. విధుల కోసం వ్యాక్సిన్ వాయిదా.. ఫ్రంట్‌లైన్ వారియర్స్ అయిన పోలీసు శాఖలోని దాదాపు 73 వేల మంది సిబ్బంది, 16 వేల మంది హోంగార్డులకు ఈ నెల 16 నుంచి వ్యాక్సినేషన్ వేయాలని అధికారులు తొలుత నిర్ణయించారు. కానీ వారికి వ్యాక్సిన్ వేస్తే నెల రోజులపాటు ఎలాంటి రియాక్షన్ లేకుండా పరిశీలనలో ఉంచాలి. అయితే రోజువారీ శాంతిభద్రతల నిర్వహణ, వ్యాక్సిన్ భద్రత, ఎన్నికల విధులకు విఘాతం కలుగుతుందని భావించిన అధికారులు, సిబ్బంది.. వ్యాక్సిన్ తీసుకునే కార్యక్రమాన్ని కూడా వాయిదా వేసుకున్నారు. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం మార్చి 5లోపు వీరికి వ్యాక్సిన్ వేయాల్సి ఉంది. పోలీసు సిబ్బందికి సలామ్ చేస్తున్నా.. త్యాగాలకు ఏపీ పోలీసులు వెనుకాడరనే విషయాన్ని మరోసారి రుజువు చేశారు. ప్రజా శ్రేయస్సు కోసం వ్యాక్సిన్ కూడా వాయిదా వేసుకొని.. సేవలందిస్తున్నందుకు పోలీస్ బాస్‌గా వారికి సలామ్ చేస్తున్నాను. – డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ కుటుంబ ఒత్తిడి.. అయినా బాధ్యత ముఖ్యం కోవిడ్ విధులు మొదలైనప్పటి నుంచి కుటుంబసభ్యులు మా గురించి భయపడుతున్నారు. అయినా కూడా కుటుంబాలకు దూరంగా, ప్రాణాలకు తెగించి ప్రజల కోసం సేవలందిస్తున్నాం. 14,362 మంది పోలీసులు కోవిడ్ బారిన పడగా, 109 మందిని కోల్పోయాం. దీంతో కనీసం వ్యాక్సిన్ వేయించుకుంటే.. ప్రశాంతంగా ఉంటాం కదా అని కుటుంబసభ్యులు మా మీద ఒత్తిడి చేస్తున్నారు. అయినా ఎన్నికల తర్వాతే వ్యాక్సిన్ వేసుకోవాలనే నిర్ణయం తీసుకుని విధులు నిర్వహిస్తున్నాం. –జె.శ్రీనివాసరావు, ఏపీ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు -
టీడీపీ దాడులు.. దౌర్జన్యాలు
సాక్షి నెట్వర్క్: పార్టీ రహితంగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ నాయకులు దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గొడవలు సృష్టించాలని కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. పార్టీ రహిత ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేసిన చంద్రబాబు ఈ ఎన్నికలకు పార్టీ రంగు పూస్తున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్వయంగా బెదిరింపులకు పాల్పడగా పలుచోట్ల మాజీ మంత్రుల అనుచరులు, మాజీ ప్రజాప్రతినిధులు ప్రత్యర్థుల్ని భయభ్రాంతుల్ని చేస్తున్నారు. అచ్చెన్నాయుడు తన స్వగ్రామం నిమ్మాడలో తమకు పోటీగా ఎవరూ నామినేషన్ వేయకుండా ఫోన్లో బెదిరించడమేగాక ఆయన సోదరుడు, సోదరుడి కుమారుడు, టీడీపీ కార్యకర్తలు ఆదివారం బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం యాదమరి మండలంలో ఆదివారం నామినేషన్ కేంద్రాల వద్ద హల్చల్ చేసిన టీడీపీ ఎమ్మెల్సీ దొరబాబు తన కారుతో ఇద్దరు వైఎస్సార్సీపీ కార్యకర్తలను ఢీకొట్టిన విషయం విదితమే. వైఎస్సార్ జిల్లా చాపాడు మండలం బద్రిపల్లెలో ఆదివారం రాత్రి దళితులపై టీడీపీ వర్గీయులు దౌర్జన్యానికి దిగారు. 9వ వార్డు మెంబరు పదవికి నామినేషన్ వేసిన డేగల చంద్రలీల నామినేషన్ ఉప సంహరించుకునేందుకు వీల్లేదంటూ నెర్రవాడకు చెందిన టీడీపీ నాయకులు మాజీ జెడ్పీటీసీ మేకల బాబు, బుర్రి నాగరాజు, టీడీపీ మద్దతుతో బరిలో ఉన్న సర్పంచ్ అభ్యర్థి భర్త గుత్తి వీరనారాయణ, మేకల సుదర్శన్ మరో ఐదుగురు తమ మనుషులతో కలసి దళితులపై బెదిరింపులకు పాల్పడుతూ దాడికి యత్నించారు. దీనిపై దళితులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసి, న్యాయం చేయాలంటూ పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. దళిత తహసీల్దార్‌పై దాడికి యత్నం చిత్తూరు జిల్లా పాకాల తహసీల్దార్ లోకేశ్వరిని టీడీపీ పాకాల మండల మాజీ అధ్యక్షుడు నాగరాజునాయుడు శనివారం ఫోన్లో అంతుచూస్తానంటూ బెదిరించాడు. దళితురాలైన ఆమెను కులం పేరుతో దూషించాడు. అనుచరులతో కలిసి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి ఆమె మీద, సిబ్బంది మీద దాడికి ప్రయత్నించాడు. తహసీల్దార్ పాకాల పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నాగరాజు, మరో ఆరుగురిపై కేసు నమోదు చేశామని, నిందితులు పరారీలో ఉన్నారని పాకాల ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. నిమ్మాడలో జరిగిన దౌర్జన్యకాండలో అరెస్టు చేసిన వారిని కోర్టుకు తరలిస్తున్న పోలీసులు పరిటాల సునీత అనుచరుల బెదిరింపులు అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం మాదాపురంలో ‘మాపైనే పోటీ చేస్తావా.. మీ అంతుచూస్తాం’ అంటూ పరిటాల వర్గీయులు వీరంగం చేశారు. సర్పంచి పదవికి నాగరాజు భార్య నిర్మలమ్మ పోటీచేస్తోంది. టీడీపీకి చెందిన మాదాపురం శంకర్ భార్య గంగమ్మ బరిలో ఉన్నారు. సోమవారం గ్రామ వలంటీర్లు పింఛన్లు పంపిణీ చేస్తుండగా టీడీపీ నాయకుడు మాదాపురం శంకర్ తమ వారికి ఇంతవరకు ఎందుకు పింఛన్లు ఇవ్వలేదని వలంటీర్లపై విరుచుకుపడ్డాడు. విషయం తెలుసుకున్న స్థానికుడు బోయ నాగేంద్ర సర్దిచెప్పబోయాడు. మాపైనే మీ వదినను పోటీకి నిలుపుతావా? మీ అంతు చూస్తాం.. అంటూ శంకర్ బెదిరించాడు. బాధితులు రామగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిమ్మాడ ఘటనపై ఎస్ఈసీకి ఫిర్యాదు శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ సర్పంచ్ స్థానానికి నామినేషన్ వేసేందుకు వెళ్లిన కింజరాపు అప్పన్నతో పాటు ఆయనకు అండగా వెళ్లిన తనపైన కూడా అచ్చెన్నాయుడు వర్గీయులు దాడిచేసి చంపేందుకు ప్రయత్నించారని వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జ్ దువ్వాడ శ్రీనివాస్ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కు ఫిర్యాదు చేశారు. శ్రీకాకుళం కలెక్టరేట్ ప్రాంగణంలో సోమవారం ఆయన నిమ్మగడ్డను కలిశారు. ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు చేపట్టాలని వినతిపత్రం ఇచ్చారు. పరారీలో కింజరాపు హరిప్రసాద్, సురేష్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఇలాకా అయిన నిమ్మాడలో ఆదివారం జరిగిన దౌర్జన్యకాండకు సంబంధించి 12 మందిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. నిమ్మాడ సర్పంచ్ అభ్యర్థిగా అదే గ్రామానికి చెందిన కింజరాపు అప్పన్న నామినేషన్ వేసేందుకు వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్‌తో కలిసి వెళ్లగా.. అచ్చెన్నాయుడు సోదరుడు హరిప్రసాద్, ఆయన కుమారుడు సర్పంచ్ అభ్యర్థి సురేష్, ఆయన అనుచరులు, టీడీపీ కార్యకర్తలంతా బీభత్సం సృష్టించటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన విషయం విదితమే. ఈ సంఘటనపై బాధితుడు కింజరాపు అప్పన్న కోట»ొమ్మాళి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు సెక్షన్ 307 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సోమవారం సీఐ ఆర్.నీలయ్య, ఎస్ఐ రవికుమార్ నేతృత్వంలో 12 మందిని అరెస్టు చేసి కోటబొమ్మాళి కోర్టుకు తరలించారు. వీరికి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్‌ను విధించటంతో అంపోలు జైలుకు తరలించారు. ఘటనలో ప్రధాన సూత్రధారులైన కింజరాపు హరిప్రసాద్, ఆయన కుమారుడు సురేష్ పరారీలో ఉన్నారు. వారికోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని నామినేషన్ కేంద్రం రిటర్నింగ్ అధికారి యు.శ్రీనివాసరావు కూడా కోటబొమ్మాళి ఎస్ఐ రవికుమార్‌కు ఫిర్యాదు చేశారు. నిమ్మాడ ఘటనలో కేసు నమోదు:డీజీపీ సాక్షి, అమరావతి: శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం నిమ్మాడ పంచాయతీ నామినేషన్ల సందర్భంగా.. నామినేషన్ వేయకుండా అడ్డుకోవడం, జన సమీకరణ చేసి శాంతిభద్రతల సమస్య సృష్టించడం వంటి వాటిపై కేసు నమోదు చేసినట్టు డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ చెప్పారు. మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఆయన పోలీసు ప్రతినిధులతో సమావేశమయ్యారు. అనంతరం శాంతిభద్రతల అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్తో కలిసి డీజీపీ మీడియాతో మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా జరగాల్సిన గ్రామ పంచాయతీ ఎన్నికలను రాజకీయాలు చేస్తూ కొందరు నేతలు వివాదాస్పదం చేయడం సరికాదన్నారు. రాజకీయ జోక్యంతో రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసేవారిని సాంకేతిక పరిజ్ఞానం ఇట్టే పట్టిస్తుందన్నారు. నిమ్మాడలో ఒక అభ్యరి్థకి ఫోన్ చేసి బెదిరించిన ఒక పార్టీ నాయకుడి ఆడియో టేపు లీకవ్వడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. ఎన్నికల అనంతరమే టీకా వేయించుకోవాలని పోలీసులు నిర్ణయించినట్లు చెప్పారు. డీజీపీతో చర్చల అనంతరం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జనకుల శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి ఎండీ మస్తాన్, గౌరవాధ్యక్షుడు ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు మీడియాతో మాట్లాడుతూ పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా రాజకీయ నేతలు చేస్తున్న విమర్శలు మానాలని కోరారు. -
స్థానిక ఎన్నికలు: హైకోర్టును ఆశ్రయించిన సర్కార్
సాక్షి, అమరావతి: గ్రామ పంచాయతీ ఎన్నికల విషయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఏకపక్ష నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తలుపు తట్టింది. గ్రామ పంచాయతీలకు ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఈ నెల 8న జారీ చేసిన షెడ్యూల్‌ను సవాలు చేస్తూ శనివారం పిటిషన్ దాఖలు చేసింది. ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేస్తూ కమిషన్ జారీ చేసిన ప్రొసీడింగ్స్‌తో పాటు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, బదిలీల నిలిపివేత తదితర చర్యలన్నింటినీ రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించి, రద్దు చేయాలని కోరుతూ పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఈ పిటిషన్ దాఖలు చేశారు. ప్రొసీడింగ్స్‌తో సహా తదుపరి చర్యల అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఈ వ్యాజ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శులతో పాటు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌ను వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చారు. ఎన్నికల తేదీని ప్రకటించే ముందు రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పనిసరిగా సంప్రదించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందని, హైకోర్టు సైతం రాష్ట్ర ప్రభుత్వం తన అభ్యంతరాలు, ఆందోళనలన్నింటినీ లిఖిత పూర్వకంగా ఎన్నికల కమిషన్ ముందుంచాలని ఆదేశించిందని ద్వివేదీ తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ ఆదేశాల మేరకు తాము తమ అభ్యంతరాలన్నింటినీ ఆధారసహితంగా ఎన్నికల కమిషనర్ ముందు ఉంచామని వివరించారు. ఎన్నికల కమిషన్‌తో సంప్రదింపులు జరపాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు సంబంధించిన కాపీ అందుబాటులోకి రాక ముందే, సంప్రదింపులకు రావాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పంచాయతీ రాజ్ కమిషనర్లకు నిమ్మగడ్డ రమేశ్ లేఖలు రాశారని తెలిపారు. ఈ వ్యాజ్యంపై సోమవారం హైకోర్టు విచారణ జరపనుంది. పిటిషన్‌లోని వివరాలు ఇంకా ఇలా ఉన్నాయి. సంప్రదింపుల వెనుక చిత్తశుద్ధి లేదు.. – రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాలతో నిమిత్తం లేకుండా, ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా ఎన్నికల విషయంలో నిమ్మగడ్డ రమేశ్ ఓ నిర్ణయానికి వచ్చేశారు. ఈ నెల 8న సంప్రదింపులకు రావాలని అధికారులను ఆదేశించారు. – హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ముగ్గురు అధికారుల బృందం 8న సాయంత్రం ఎన్నికల కమిషనర్‌ను కలిసింది. మా బృందం కలిసి వచ్చిన కొద్ది గంటలకే ఎన్నికల కమిషనర్ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. – ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వేగాన్ని చూస్తే, సంప్రదింపుల ప్రక్రియ కేవలం ఓ ఫార్స్ అన్న సంగతి ఇట్టే అర్థమవుతోంది. సంప్రదింపుల విషయంలో కోర్టు ముందు అంగీకరించిన దానికి భిన్నంగా ఎన్నికల కమిషనర్ వ్యవహరించారు. నాలుగు దశల్లో ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్‌ను విడుదల చేశారు. దీనిని బట్టి షెడ్యూల్‌ను ముందుగానే సిద్ధం చేసుకున్నారని స్పష్టమవుతోంది. – తన పదవీ విరమణ తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోందని నిమ్మగడ్డ రమేశ్ స్వయంగా చేసిన ప్రకటనే, ఈ మొత్తం విషయాన్ని చెబుతోంది. ఆ ప్రకటనే ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసేలా చేసింది. – రాష్ట్ర ప్రభుత్వం తన అభిప్రాయాలను చెప్పడానికి ముందే ఎన్నికల షెడ్యూల్ తయారు చేశారు. కోర్టు ఆదేశాలను అమలు చేయడానికి మాత్రమే ప్రభుత్వాధికారులతో సంప్రదింపులు జరిపారే తప్ప, చిత్తశుద్ధితో జరపలేదు. సంప్రదింపుల ప్రక్రియను, కోర్టు ఆదేశాలను ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ అపహాస్యం చేశారు. కోవిడ్ వ్యాక్సినేషన్ ఎంతో ముఖ్యమని చెప్పినా వినలేదు – ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదనేందుకు ప్రభుత్వం చెప్పిన కారణాలు, క్షేత్ర స్థాయి పరిస్థితులను వివరిస్తూ అందజేసిన ఆధారాలను నిమ్మగడ్డ పరిగణనలోకి తీసుకోలేదు. ఏకపక్షంగా షెడ్యూల్ విడుదల చేశారు. – కోవిడ్ వ్యాక్సిన్ విషయంలో రాష్ట్రాలను సన్నద్ధం చేసేందుకు కేంద్ర హోం శాఖ, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలు రాష్ట్ర ప్రభుత్వాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నాయి. సాధారణ ఎన్నికలను ఎలా నిర్వహిస్తారో అలా కోవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం చెబుతూ వస్తోంది. – ప్రభుత్వ యంత్రాంగం మొత్తాన్ని ఈ కార్యక్రమంలో నిమగ్నం చేయాలని కోరుతోంది. ఈ నెల 11న ప్రధాన మంత్రి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కోవిడ్ వ్యాక్సిన్ సన్నద్దత, విధి విధానాలు తదితరాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు. – ఈ విషయాన్ని కూడా ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకెళ్లాం. ప్రధాన మంత్రి ప్రకటన తర్వాత నిర్ణయం తీసుకోవాలని కూడా కోరాం. ఇప్పటికే వ్యాక్సినేషన్ మార్గదర్శకాలను జారీ చేసిన విషయాన్ని కూడా కమిషనర్‌కు వివరించాం. పోలీసులతో సహా మొత్తం అధికార యంత్రాంగం కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పాల్గొనడం ఎంత ముఖ్యమో తెలియజేశాం. దురుద్దేశంతోనే ఈ నిర్ణయం – వీటన్నింటినీ బేఖాతరు చేస్తూ ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్ దురుద్దేశంతో ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. దీని వెనుక నిమ్మగడ్డకు కుటిల ఉద్దేశాలున్నాయి. ఎన్నికలను వాయిదా వేయాలన్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం క్షేత్ర స్థాయి పరిస్థితులను, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకుంది. – దీనికి, రాజకీయ పార్టీలకు ఎలాంటి సంబంధం లేదు. ప్రభుత్వ నిర్ణయాల్లో పార్టీ నేతల జోక్యం ఉండదు. ఇదే విషయాన్ని ఎన్నికల కమిషనర్‌కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చాలా స్పష్టంగా చెప్పారు. – నిమ్మగడ్డ రమేశ్ తన నోటిఫికేషన్లో బీహార్, కేరళ, అమెరికాలను ఉదాహరణగా పేర్కొన్నారు. ఆ ప్రాంతాల్లో ఎన్నికల తర్వాత కోవిడ్ కేసులు భారీగా పెరిగాయి. కేరళలో ఎన్నికలను నోటిఫై చేసిన నవంబర్ నాటికి 4.50 లక్షల కేసులు ఉంటే, మూడో దశ ఎన్నికల నాటికి ఆ సంఖ్య 6.50 లక్షలకు చేరింది. – ఈ రోజుకు (శనివారం) కేరళలో కోవిడ్ కేసులు 8.01 లక్షలు. అమెరికా విషయానికొస్తే, అమెరికా అధ్యక్ష్య ఎన్నికలు జరిగే నాటికి అక్కడ కోవిడ్ కేసులు 97.53 లక్షలు. ఇప్పుడు ఆ సంఖ్య 2.21 కోట్లకు చేరింది. – ఇదే రీతిలో రాజస్తాన్, బీహార్లలో కూడా ఎన్నికల తరువాత కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇక్కడ ఎన్నికలు నిర్వహించే నాటికి కోవిడ్ వ్యాక్సినేషన్‌కు సంబంధించి ఎలాంటి ప్రణాళికలు సిద్ధం కాలేదు. మార్గదర్శకాలు కూడా జారీ కాలేదు. నిమ్మగడ్డ ఇష్టాయిష్టాలకు ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టలేం – రాష్ట్ర ప్రభుత్వం ఎన్నడూ కూడా ప్రజాస్వామ్యయుతంగా నిర్వహించే ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోదు. ఎన్నికల ప్రక్రియపై రాష్ట్రానికి ఆపార గౌరవం ఉంది. ప్రజల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. – ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్ ఇష్టానుసారం తీసుకునే నిర్ణయాలకు ప్రజల ఆరోగ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పణంగా పెట్టలేదు. పౌరుల, ప్రభుత్వాధికారుల ఆరోగ్యాన్ని, ప్రాణాలను కాపాడాల్సిన రాజ్యాంగపరమైన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. – దేశం మొత్తం ఇప్పుడు జాతీయ విపత్తుల నిర్వహణ చట్టం పరిధిలో ఉంది. ఇలాంటి సమయంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు చేయడం సరికాదు. దీనిపై మా అభ్యంతరాలను పట్టించుకోలేదు. – నిమ్మగడ్డ రమేశ్ ప్రభుత్వ వ్యతిరేక భావనతో ఉన్నారు. ఎన్నికల షెడ్యూల్ జారీ వెనుక సదుద్దేశాలు, హేతుబద్ధత ఎంత మాత్రం లేదు. కోవిడ్ వ్యాక్సినేషన్ దృష్ట్యా ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేయలేదన్న విషయాన్ని నిమ్మగడ్డ రమేశ్ ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్నారు. ప్రజల ఆరోగ్యం ముడిపడి ఉన్న ఈ వ్యవహారంలో న్యాయస్థానం జోక్యం చేసుకోవాలి. -
ఫిబ్రవరిలో ‘పంచాయతీ’!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు వచ్చే ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించిందంటూ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ మంగళవారం ప్రొసీడింగ్స్ పేరుతో ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలతోపాటు అన్ని జిల్లాల కలెక్టర్లు, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్యశాఖ, పట్టణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులకు ఈమేరకు ఉత్తర్వులు పంపారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న రాష్ట్ర ఎన్నికల కమిషనరే సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతర్ చేస్తూ ప్రభుత్వాన్ని కనీసం సంప్రదించకుండా ఎన్నికల నిర్వహణపై ఇలాంటి ఉత్తర్వులు జారీ చేయడం అధికార, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ ఏడాది మార్చిలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసిన సమయంలో తదుపరి ఎన్నికల నిర్వహణ తేదీలపై రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి నిర్ణయం తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే అందుకు భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వంతో ఎటువంటి సంప్రదింపులు జరపకుండా 2021 ఫిబ్రవరిలో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని కమిషన్ నిర్ణయించిందని, అందుకనుగుణంగా ఏర్పాట్లు చేపట్టాలని పేర్కొంటూ దీనికి కొనసాగింపుగా ఎన్నికల నోటిఫికేషన్ షెడ్యూల్‌ను ప్రభుత్వంతో సంప్రదించిన తర్వాత విడుదల చేస్తామని అదే ఉత్తర్వులో పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో లేదని, తాము ప్రకటించనున్న ఎన్నికల తేదీకి నాలుగు వారాల ముందు నుంచి కోడ్ అమలులోకి వస్తుందని ప్రొసీడింగ్స్‌లో పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టిందని, గతంలో రోజూ 10 వేలకుపైగా నమోదైన కేసులు ఇటీవల 2 వేలకు తగ్గాయని, మొదటిసారిగా కేసులు వెయ్యి లోపు మాత్రమే ఉన్నాయన్నారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ ఈనెల 30వతేదీ వరకు సెలవులో ఉన్నప్పటికీ దాన్ని రద్దు చేసుకుని హుటాహుటిన ప్రొసీడింగ్స్ జారీ చేశారు. మరోవైపు గురువారం ఆయన గవర్నర్‌ను కలవనున్నట్లు తెలిసింది. ఆకస్మిక ప్రణాళిక రూపొందించండి.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఫిబ్రవరిలో నిర్వహించ తలపెట్టిన గ్రామ పంచాయతీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అకస్మిక (కంటింజెన్స్) ప్రణాళికలు రూపొందించాలంటూ ప్రొసీడింగ్స్‌లో కలెక్టర్లకు నిమ్మగడ్డ సూచించారు. కరోనా పరిస్థితులలోనూ బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగడంతో పాటు తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారని ప్రస్తావించారు. కరోనా సెకండ్ వేవ్ వచ్చే ప్రమాదం ఉన్నందున ఎన్నికల నిర్వహణకు ఇది సరైన సమయం కాదంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి 28న తనకు లేఖ అందజేశారని అయితే రాజకీయ పార్టీలతో జరిపిన సంప్రదింపుల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఎన్నికల నిర్వహణకు అత్యధికులు మొగ్గు చూపారన్నారు. గ్రామాల్లో కరోనా కట్టడిలో స్థానిక ప్రభుత్వాల అవసరం, ఆర్థిక సంఘం నుంచి నిధుల విడుదలకు ఇబ్బంది లేకుండా పంచాయతీ ఎన్నికల నిర్వహణ అత్యవసరమన్నారు. కరోనా నేపధ్యంలో ఎలాంటి ప్రమాదకర పరిస్థితులకు అవకాశం లేకుండా ఎన్నికలు జరిపేందుకు వైద్య ఆరోగ్య శాఖ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని సూచించారు. సున్నిత ప్రాంతాల్లో ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు డీజీపీ తగిన చర్యలు చేపట్టాలన్నారు. -
‘స్థానిక’ ఎన్నికలకు సన్నద్ధమవ్వండి
సాక్షి, అమరావతి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలకు అతి త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉందని.. ఇందుకు యంత్రాంగాన్ని సర్వసన్నద్ధంగా ఉంచాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ ఆదేశించారు. విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఓటర్ల జాబితాలు, బ్యాలెట్ బాక ్స్ల వంటి ఎన్నికల సామగ్రిని పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచుకోవాలని కమిషనర్ సూచించారు. ప్రతి గ్రామానికి, ప్రాదేశిక నియోజకవర్గాలకు సంబంధించి 70 కాపీల వరకు ఓటర్ల జాబితాల అవసరం ఉంటుందని, ఆ మేరకు సిద్ధం చేసుకోవాలని సూచించారు. విడతల వారీగా ఎన్నికలు జరిపినప్పటికీ, రాష్ట్రంలో సరిపడినన్ని బ్యాలెట్ బాక్స్‌లు అందుబాటులో లేని కారణంగా కేరళ నుంచి రప్పిస్తున్నట్లు వివరించారు. పోలింగ్ బూత్ గుర్తింపు, సిబ్బంది నియామకంలో ఎక్కడా పొరపాట్లకు తావివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. కాన్ఫరెన్స్‌లో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి ఏవీ సత్య రమేష్ పాల్గొనగా.. వివిధ జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీలు, జెడ్పీ సీఈవోలు, జిల్లా పంచాయతీ అధికారులు, ఆర్డీవోలు, ఎన్నికల విధుల్లో ఉండే ఇతర అధికారులు హాజరయ్యారు. పరీక్షలకు ఆటంకం లేకుండా ఎన్నికల తేదీలు మార్చి, ఏప్రిల్ నెలల్లో విద్యార్థులకు వార్షిక పరీక్షలు జరగనున్నందున వాటికి ఆటంకం కలగకుండా ఎన్నికల తేదీలు ఖరారు చేసే అంశంపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్‌కుమార్ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. డీజీపీ గౌతమ్ సవాంగ్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, విద్యా శాఖ, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో వేర్వేరుగా భేటీ అయ్యారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో ఏయే తేదీల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో పరీక్షలు ఉన్నాయో విద్యా శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాలేజీలు, స్కూళ్లలో పోలింగ్‌తో పాటు ఎన్నికల కౌంటింగ్ వల్ల విద్యార్థులకు ఆటంకం కలిగే పరిస్థితి ఉంటే.. అలాంటి విద్యా సంస్థలను ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎన్నికల నిర్వహణకు నిధుల విడుదలలో ఇబ్బందులు లేకుండా చూడాలని ఆర్థిక శాఖ అధికారులను కోరారు. -
లెక్కలు చెప్పాల్సిందే..
సాక్షి, హైదరాబాద్: గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్లు దాఖలు చేసిన వారంతా తమ ఖర్చుకు సంబంధించిన లెక్కలు సమర్పించాల్సిందే. నామినేషన్లు దాఖలు చేసిన వారంతా గెలుపోటములు, విరమణ, ఏకగ్రీవ ఎన్నికవంటి వాటితో సంబంధం లేకుండా తాము చేసిన వ్యయాన్ని చూపించాలి. కొత్త పంచాయతీరాజ్ చట్టంలోని నియమ నిబంధనలకు అనుగుణంగా 45 రోజుల నిర్ణీత గడువులోగా లెక్కలు చూపకపోతే ఆ అభ్యర్థులు పంచాయతీరాజ్ ఎన్నికల్లో మూడేళ్లపాటు పోటీ చేయకుండా అనర్హత వేటు వేస్తారు. గెలుపొందిన వారి విషయానికొస్తే వారు తమ స్థానాన్ని కోల్పోవడంతో పాటు మూడేళ్లపాటు పోటీచేయకుండా అనర్హులుగా ప్రకటిస్తారు. ఈ ఏడాది జనవరి 21, 25, 30 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు జరగడంతో పాటు ఆ మూడురోజుల్లోనే ఫలితాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఈ మూడు విడతల్లో ఫలితాలు వెలువడిన నాటి నుంచి 45రోజుల్లోగా నామినేషన్లు సమర్పించిన వారంతా తాము చేసిన వ్యయంపై తుది రిటర్న్స్‌ను సంబంధిత మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో)కి సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) శనివారం ఆదేశించింది. అభ్యర్థులు సమర్పించిన వ్యయ వివరాలను ఎంపీడీవోలు తమ కార్యాలయంలోని నోటీస్ బోర్డులో ప్రదర్శించాల్సి ఉంటుంది. అభ్యర్థులు చేసిన వ్యయానికి సంబంధించిన పత్రాలను జిరాక్స్ ఖర్చులను చెల్లించడం ద్వారా ఎవరైనా ఎంపీడీవో కార్యాలయం నుంచి ఆ వివరాలు పొందవచ్చు. అభ్యర్థుల ఖర్చుపై, వారు సమర్పించిన రిటర్న్స్‌పై అభ్యంతరాలుంటే, సరైన ఆధారాలతో జిల్లాల పర్యటనలకు వ్యయ పరిశీలకులు వచ్చినపుడు వారి దృష్టికి తీసుకురావచ్చు. మొదటి విడతకు 6వ తేదీలోగా గత నెల 20న తొలివిడత పంచాయతీ ఫలితాలు వెలువడినందున, అభ్యర్థులు ఈ నెల 6లోగా రిటర్న్స్ దాఖలు చేయాలని ఎస్ఈసీ కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్ తెలిపారు. రెండో విడతకు సంబంధించి ఈనెల 10లోగా, మూడో విడతకు సంబంధించి ఈనెల 15లోగా నామినేషన్ దాఖలు చేసిన వారంతా లెక్కలు సమర్పించాలని సూచించారు. -
2న గ్రామ పంచాయతీల తొలి సమావేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మూడు విడతలుగా నిర్వహించిన గ్రామపంచాయతీ ఎన్నికలు బుధవారంతో ముగిశాయి. ఈ నెల 21, 25, 30 తేదీల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో (హైదరాబాద్ జిల్లా మినహా) జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలుపొం దిన సర్పంచ్‌లు, వార్డు మెంబర్లకు ఫిబ్రవరి 2ను అపాయింట్మెంట్ డేగా నిర్ణయిస్తూ పంచాయతీ రాజ్ శాఖ నోటిఫికేషన్ జారీచేసింది. శనివారం (ఫిబ్రవరి 2న) కొత్త గ్రామపంచాయతీలు కొలువుదీరనున్నాయి. ఈ సందర్భంగా కొత్త గ్రామపంచాయతీల తొలి సమావేశం జరగనుంది. అదే రోజున సర్పంచ్‌లు, వార్డు సభ్యులు పదవీ ప్రమాణం చేసి బాధ్యతలు చేపడతారు. ఆ రోజు నుంచి వారి పదవీ కాలం ఐదేళ్ల పాటు కొనసాగనుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) నోటిఫికేషన్లకు అనుగుణంగా మూడు దశలుగా ఈ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. వివిధ కారణాలతో అంతకు ముందు, ఈ నెల 30న ఎన్నికలు జరగని పంచాయతీలు, ఇంకా గడువు ముగియని పంచాయతీలకు పంచాయతీరాజ్‌శాఖ విడిగా అపాయింటెడ్ డేను ప్రకటించనుంది. ఈ మేరకు పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్ నీతూకుమారి ప్రసాద్ నోటిఫికేషన్ జారీ చేశారు. స్థానిక సంస్థల ప్రతినిధులకు ముఖ్యంగా గ్రామస్థాయిల్లోని పంచాయతీ సర్పంచ్‌లకు కొత్త పంచాయతీరాజ్ చట్టంతో సహా గ్రామస్థాయిలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం తదితర కార్యక్రమాల గురించి సమగ్ర అవగాహన కల్పించి, క్షేత్రస్థాయిలో అభివృద్ధిలో భాగస్వాములను చేయాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల నేపథ్యంలో ఈ శిక్షణ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఏర్పడింది. 11 నుంచి సర్పంచ్‌లకు శిక్షణ.. రాష్ట్రవ్యాప్తంగా గెలుపొందిన సర్పంచ్‌లకు ఫిబ్రవరి 11 నుంచి మార్చి 1 వరకు ఆయా జిల్లాల వారీగా విభజించి మూడు విడతలుగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఒక్కో విడతలో రెండు బ్యాచ్‌లుగా వంద మందికి శిక్షణ ఇస్తారు. తొలి విడత శిక్షణను ఫిబ్రవరి 11 నుంచి 15 వరకు, రెండో విడత శిక్షణను ఫిబ్రవరి 18 నుంచి 22 వరకు, మూడో విడత శిక్షణను ఫిబ్రవరి 25 నుంచి మార్చి 1 వరకు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. సంబంధిత జిల్లా కేంద్రాల్లో ఈ శిక్షణ కార్యక్రమం ఉంటుంది. ముందుగా శిక్షకులకు శిక్షణ (ట్రైనింగ్ టు ట్రైనర్స్) కోసం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఏర్పాట్లు చేసింది. కొత్త పంచాయతీరాజ్ చట్టంపై అవగాహన.. తాజాగా ఎన్నికైన సర్పంచ్‌లకు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన కొత్త పంచాయతీరాజ్ చట్టం పట్ల అవగాహన కల్పించేందుకు ఈ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శిక్షణ అనంతరం వారి పనితీరుకు అనుగుణంగా సర్పంచ్‌లకు గ్రేడింగ్‌లు ఇస్తారు. -
ఐదు వార్డుల్లో రీపోలింగ్
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల గుర్తుల కేటాయిం పులో జరిగిన పొరపాటు కారణంగా ఒక పంచాయతీ సర్పంచ్ ఎన్నిక, దాని పరిధిలోని ఐదు వార్డులకు రీపోలింగ్ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) ఆదేశించింది. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం జల్లపల్లి గ్రామ పంచాయతీకి రెండోదశ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఎన్నికలు జరగాల్సి ఉండగా, అభ్యర్థులకు ఎన్నికల గుర్తులను పొరపాటుగా కేటా యించడంతో రీపోలింగ్ జరగనుంది. దీంతో మూడో విడతలో భాగంగా ఈ నెల 30న జల్లపల్లి సర్పంచ్ స్థానానికి 3, 4, 5, 6, 7, 8 వార్డు మెంబర్ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. 30న సర్పంచ్, వార్డు సభ్యుల ఫలితాలు ప్రకటిం చాక ఉప సర్పంచ్ ఎన్నికను నిర్వహించాలని ఎస్ఈసీ కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్ సూచిం చారు. మిర్యాలగూడ మండలం ముల్కలచెరు వు గ్రామ పంచాయతీలోని ఐదో వార్డు స్థానానికి రిజర్వేషన్ ఖరారులో పొరపాటు చోటుచేసుకుం ది. దీంతో ఈ నెల 25న జరిగిన ఎన్నిక ప్రక్రియను రద్దు చేసి, ఫిబ్రవరి 8కి ఎస్ఈసీ రీషెడ్యూ ల్ చేసింది. 8న ఐదో వార్డులో ఫలితాన్ని ప్రకటిం చాక ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించాలంది. సోమవారం శివ్వారం ఫలితం ప్రకటన.. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం శివ్వారం పంచాయతీ సర్పంచ్ స్థానానికి సోమవారం ఉదయం 11.30కి ఫలితాన్ని ప్రకటించాలని ఎస్ఈసీ సూచించింది. ఆ తర్వాత ఉప సర్పంచ్ ఎన్నికను నిర్వహించాలని, ఒకవేళ అనివార్య కారణాల వల్ల ఇది జరగకపోతే మరుసటిరోజు ఈ ఎన్నికను నిర్వహించవచ్చని పేర్కొంది. -
రెండో విడతా గులాబీదే
సాక్షి, హైదరాబాద్: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి సత్తా చాటింది. తొలివిడతలో సింహభాగం పంచాయతీలను కైవసం చేసుకున్న గులాబీ పార్టీ రెండో విడతలోనూ అదేజోరును ప్రదర్శించింది. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 4,135 గ్రామ పంచాయతీలకు గాను 4,130 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో ఐదు పంచాయతీలకు నామినేషన్లు రాకపోవడంతో అక్కడ ఎన్నికలు నిర్వహించలేదు. ఎన్నికలు జరిగిన వాటిలో టీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు 2,865 గ్రామ పంచాయతీలను కైవసం చేసుకున్నారు. 770 పంచాయతీలను కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. టీడీపీ 39 పంచాయతీల్లో, 43 పంచాయతీల్లో బీజేపీ, 12 పంచాయతీల్లో సీపీఐ, 22 పంచాయతీల్లో సీపీఎం పార్టీలు పాగా వేశాయి. మరో 379 గ్రామ పంచాయతీల్లో స్వతంత్రులు విజేతలుగా నిలిచారు. నామినేషన్లు రాని కారణంగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో రెండు గ్రామ పంచాయతీలు ఆదిలాబాద్, ఖమ్మం, జయశంకర్భూపాలపల్లిలో ఒక్కో పంచాయతీకి ఎన్నికలు జరగలేదు. ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఒక్కో గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక్కోవార్డు స్థానాల లెక్కింపుపై అస్పష్టత నెలకొనడంతో వాటి ఫలితాలు నిలిపివేశారు. ఈనెల 30న తుది విడత ఎన్నికలతో పాటు ఈరెండు వార్డుల ఎన్నికలు నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. ‘యాదాద్రి భువనగిరి’లో 93% పోలింగ్ గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికల్లో 88.26 శాతం పోలింగ్ నమోదైంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 93.71 శాతం ఓటింగ్ నమోదైంది. సూర్యాపేట జిల్లాలో 92.82 శాతం, మెదక్ 92.52 శాతం, సిద్దిపేట 92.34 శాతం, నల్లగొండ జిల్లాలో 92.01 శాతం, ఖమ్మం 91.91 శాతం, మహబూబాబాద్ 91.05 శాతం, జనగామ 90.52 శాతం, నాగర్‌కర్నూల్ 90.17 శాతం, కామారెడ్డి జిల్లాలో 90.04 శాతం ఓటింగ్ నమోదైంది. జగిత్యాల జిల్లాలో అత్యల్పంగా 80.23 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగ్గా... మొత్తం 37,76,797 మంది తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. వీరిలో 19,08,889 మంది మహిళలు, 18,67,898 మంది పురుషులున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రూ.33 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతులిచ్చింది. -
16 మంది వెలి
బయ్యారం: గ్రామ పంచాయతీ ఎన్నికలు పల్లెల్లో చిచ్చురేపుతున్నాయి. తమ పార్టీ అభ్యర్థి ఓటమికి పరోక్షంగా కారణమయ్యారనే నెపంతో మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కాచనపల్లికి చెందిన కాంగ్రెస్ శ్రేణులను న్యూడెమోక్రసీ నాయకులు వెలివేశారు. దీంతో కాంగ్రెస్ నాయకులు శుక్రవారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడిన కాచనపల్లిలో సర్పంచ్ అభ్యర్థులుగా టీఆర్ఎస్ పార్టీ నుంచి ముడిగ వజ్జయ్య, కాంగ్రెస్ నుంచి భూక్యా రమేశ్, న్యూడెమోక్రసీ పార్టీ నుంచి కొట్టెం వెంకటేశ్వర్లు పోటీ చేశారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ బలపర్చిన ముడిగ వజ్జయ్య న్యూడెమోక్రసీ పార్టీ బలపర్చిన అభ్యర్థి వెంకటేశ్వర్లుపై విజయం సాధించారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన రమేశ్, వజ్జయ్యకు మద్దతు ఇవ్వడం వల్లనే తమ పార్టీ అభ్యర్థి ఓటమిపాలయ్యాడని ఆరోపిస్తూ న్యూడెమోక్రసీ సర్పంచ్ అభ్యర్థి కొట్టెం వెంకటేశ్వర్లుతో పాటు కొట్టెం రామారావు, సీతారాములు, రమేశ్ తదితరులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలైన కొట్టెం పాపారావు, కొట్టెం చిన్నవెంకన్న, కొట్టెం లక్ష్మయ్య, కృష్ణ, రాందాస్, పాపారావుతో పాటు పలువురిని వెలివేశారు. ఇతరులతో మాట్లాడిన, తాగునీరు పట్టుకున్న, తమ పశువులను తోలుకెళ్లినా రూ.15 వేల జరిమానా విధిస్తామని తీర్మానించారని బాధితులు వాపోయారు. కాగా ఈ విషయంపై కాచనపల్లికి చెందిన 16 కుటుంబాల వారు బయ్యారం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
ముగిసిన రెండో విడత పోలింగ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. దాదాపు 85 శాతానికి పైగా పోలింగ్ నమోదు అయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఉదయం ఏడు గంటలకే ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంటకు ముగిసింది. అయితే నిర్ణీత సమయంలోపు లైన్లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు.. మరో గంట తరువాత కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఆ వెంటనే ఫలితాలు ప్రకటించనున్నారు. మూడు విడతల్లో జరగనున్న ఈ ఎన్నికల్లో గత సోమవారం తొలి విడత పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. నేడు రెండు విడతల పోలింగ్ జరగగా ఈనెల 30వ తేదీన మూడో విడత పోలింగ్ జరగనుంది. జిల్లాల వారిగా నమోదైన పోలింగ్ శాతం ఖమ్మం 73.35 శాతం నల్లగొండ 65 శాతం సూర్యపేట 77 శాతం పెద్దపల్లి 67.30 శాతం రంగారెడ్డి 65.3 శాతం కరీంనగర్ 64 శాతం యాదాద్రి 63 శాతం కామరెడ్డి 81.78 శాతం నిజామాబాద్ 69.38 శాతం వనపర్తి 80 శాతం నాగర్ కర్నూల్ 76 శాతం జోగులాంబ గద్వాల 78 శాతం వరంగల్ అర్బన్ జిల్లా 87 శాతం జనగామ 90 శాతం భూపాల్ పల్లి 83 శాతం -
రెండో విడత పంచాయతీ ఎన్నికలు పోలింగ్
-
రెండో విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్టానికి సంబంధించి రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు శుక్రవారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమయ్యాయి. మొత్తంగా రెండో దశలో 4135 సర్పంచ్ స్థానాలకు 783 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 3,342 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. 10,668 మంది సర్పంచ్ అభ్యర్థులుగా బరిలోకి దిగారు. 26, 191 వార్డులకు 63,480 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగగా..రెండు గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. -
రెండో విడత ‘పంచాయతీ’ నేడే
సాక్షి, హైదరాబాద్: రెండోవిడత గ్రామ పంచాయతీ ఎన్నికలు శుక్రవారం(నేడు) జరగనున్నాయి. మండల, గ్రామస్థాయిల్లో ఎన్నికల వ్యయపరిశీలకులు, మైక్రో అబ్జర్వర్లు, పోలీసు సోదాలు, నిఘా కొనసాగుతున్నా కిందిస్థాయిలో డబ్బు, మద్యం పంపిణీ యథేచ్ఛగా సాగుతున్నట్టు వార్తలొస్తున్నాయి. బుధవారం వరకు దాదాపు రూ. రెండున్నర కోట్ల విలువైన నగదు, మద్యం, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్(ఎస్ఈసీ)కు పోలీసు శాఖ నివేదికలు సమర్పించిన విషయం తెలిసిందే. అయితే, పోలీసులకు పట్టుబడిన డబ్బు, మద్యం నామమాత్రమేనని, రెండోవిడత ఎన్నికల నేపథ్యంలో ప్రలోభాల పర్వం కొనసాగుతున్నట్టుగా గ్రామస్థాయిల నుంచి సమాచారం వస్తోంది. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ఉంటుంది. మధ్యాహ్నం రెండు గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతోంది. ఈ ప్రక్రియ ముగియగానే ఫలితాలను ప్రకటిస్తారు. ఆ వెంటనే ఉపసర్పంచ్ ఎన్నిక ఉంటుంది. అనివార్య కారణాలతో ఉప సర్పంచ్ ఎన్నిక జరగకపోతే, మరుసటిరోజు దానిని నిర్వహించాల్సి ఉంటుందని ఎస్ఈసీ ఇదివరకే తెలియజేసింది. ఎన్నికల విధుల నిర్వహణకు పెద్దసంఖ్యలో అధికారులు, సిబ్బందితోపాటు బం దోబస్తు కోసం 20 వేల మందికిపైగా పోలీసుల సేవలను వినియోగించుకుంటున్నారు. రెండోవిడత ఎన్నికల్లో భాగంగా 29,964 కేంద్రాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నట్టు, 673 చోట్ల వెబ్ కాస్టింగ్ కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినట్టు ఎస్ఈసీ వెల్లడించింది. ఓటింగ్ స్లిప్పులు అందనివారు టీపోల్ యాప్‌తో తమ ఓటరు స్లిప్పులను డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని కూడా కమిషన్ కల్పించింది. 26,191 వార్డులకు ఎన్నికలు... మూడు విడతలుగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం జరగనున్న రెండోదశలో మొత్తం 4,135 సర్పంచ్‌స్థానాలకు 783 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 36,602 వార్డు మెంబర్ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 10,317 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. వీటిని మినహాయించాక మొత్తం 3,342 సర్పంచ్ స్థానాలకు 10,668 మంది, 26,191 వార్డులకు 63,480 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. రెండో విడతలో భాగంగా కోర్టు కేసులు, ఇతరత్రా కారణాలతో ఐదు పంచాయతీల్లో, 94 వార్డుల్లో ఎన్నికలు జరగడంలేదు. మూడో విడతలో573 సర్పంచ్‌లు ఏకగ్రీవం ఈ నెల 30న జరగనున్న మూడోదశ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 373 సర్పంచ్ అభ్యర్థులు, 8,956 మంది వార్డుమెంబర్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎస్ఈసీ తెలిపింది. ఈ ఎన్నికల్లో భాగంగా 4,116 గ్రామపంచాయతీలకు ఎన్నికలు నోటిఫై చేయగా 573 ఏకగ్రీవాలు కావడం, పది చోట్లా కోర్టు కేసులు, ఇతరత్రా కారణాలతో ఎన్నికలు జరగడంలేదు. ఈ నెల 22న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిశాక మొత్తం 3,529 సర్పంచ్ స్థానాలకు 11,667 అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మూడో విడతలో మొత్తం 36,729 వార్డు మెంబర్ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా, వాటిలో 8,956 వార్డులు ఏకగ్రీవం కాగా, వివిధ కారణాలతో 185 చోట్ల ఎన్నికలు జరగడం లేదు. దీంతో మొత్తం 27,583 వార్డు మెంబర్ స్థానాలకు 67,516 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. -
‘పంచాయతీ’ పోరులో రూ.కోటి నగదు స్వాధీనం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మూడు విడతలుగా జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఇప్పటివరకు రూ.కోటి 78 లక్షల మేర నగదు, రూ.36 లక్షలకు పైగా విలువైన మద్యం, ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో బుధవారం ఒక్కరోజే వనపర్తి జిల్లాలో రూ.20 లక్షల నగదుతో పాటు, వివిధ జిల్లాల్లో మొత్తం రూ.3.85 లక్షల విలువైన మద్యాన్ని (1500 లీటర్లకు పైగా మద్యం) పట్టుకున్నారు. పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక ఇప్పటిదాక అధికారులు, పోలీసులు జరిపిన తనిఖీల్లో ఈ మేరకు నగదుతో పాటు వివిధ వస్తువులు దొరికినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ)కు డీజీపీ మహేందర్‌రెడ్డి నివేదికలు పంపించారు. ఈ నివేదికల ప్రకారం ఇప్పటివరకు 289 ఫిర్యాదులు నమోదుచేసి, వాటిలో 288 ఎఫ్ఐఆర్లు దాఖలు చేశారు. 139 కేసుల్లో చర్యలు తీసుకున్నట్లుగా వెల్లడైంది. రాజకీయపార్టీలు, అభ్యర్థుల మధ్య సంబంధాలపై ఆరా తీయగా మొత్తం 40 వరకు బయటపడ్డాయని, వాటిలో జగిత్యాల జిల్లాలో అత్యధికంగా 14, మెదక్ జిల్లాలో 4, నిర్మల్, భద్రాద్రి, నల్లగొండ, సూర్యాపేట, పెద్దపల్లి జిల్లాల్లో ఒక్కో ఉదంతం బయటపడినట్లు ఈ నివేదికను బట్టి తెలుస్తోంది. -
ఊరూ గులాబీదే
సాక్షి, హైదరాబాద్: పల్లెపోరులోనూ గులాబీ జెండా రెపరెపలాడింది. ఊరిలోనూ కారు జోరు కొనసాగింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్.. గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ సత్తా చాటుతోంది. తొలివిడత ఎన్నికల్లో ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. సోమవారం 4,470 పంచాయతీలకు (ఏకగ్రీవంతో కలిపి) ఎన్నికలు జరిగాయి. కడపటి వార్తలు అందేసరికి టీఆర్ఎస్ ఏకంగా 2,769 పంచాయతీలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ 917 స్థానాల్లో విజయం సాధించగా.. బీజేపీ 66, టీడీపీ 29, సీపీఎం 33, సీపీఐ 14 చోట్ల గెలుపొందాయి. ఇతరులు 642 పంచాయతీల్లో పాగా వేశారు. ప్రశాంతంగా పోలింగ్... తొలివిడత పంచాయతీ పోరు ప్రశాంతంగా ముగిసింది. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు పక్కా ఏర్పాట్లు చేశారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమై మధ్యాహ్నం ఒంటిగంటకు ముగిసింది. తొలివిడత పంచాయతీల పరిధిలో మొత్తం 48,46,443 మంది ఓటర్లున్నారు. వీరిలో 41,56,414 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో 85.76శాతం ఓటింగ్ నమోదైంది. ఓటేసినవారిలో మహిళలు 20,36,782 మంది, పురుషులు 21,19,624 మంది, ఇతరులు 8 మంది ఉన్నారు. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 95.32శాతం పోలింగ్ నమోదు కాగా, ఆ తర్వాతి స్థానాల్లో ఖమ్మం(93.92%), రంగారెడ్డి (92.67%), సూర్యాపేట(92.45%), నల్లగొండ(91.28%) జిల్లాలున్నాయి. తక్కువ పోలింగ్ జరిగిన జిల్లాల్లో రాజన్న సిరిసిల్ల(78.47%), నిజామాబాద్(78.56%), మహబూబ్‌నగర్(81.15%), కామారెడ్డి(81.29%), జగిత్యాల(81.80%) ఉన్నాయి. 9 జిల్లాల్లో నో పోలింగ్... వాస్తవానికి తొలివిడతలో 4,479 చోట్ల ఎన్నికలు జరగాల్సి ఉండగా..9 పంచాయతీల్లో నామినేషన్లు రాలేదు. దీంతో అక్కడ ఎన్నికలు నిర్వహించలేదు. వీటిలో మంచిర్యాల జిల్లాలో రెండు, భద్రాద్రి కొత్తగుడెం జిల్లాలో రెండు, నాగర్ కర్నూల్ జిల్లాలో ఐదు గ్రామ పంచాయతీలున్నాయి. ఇక 769 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 3,701 పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలు జరగ్గా.. 12,202 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వార్డు సభ్యుల కేటగిరీలో 192 స్థానాలకు నామినేషన్లు రాలేదు. 10,654 వార్డు స్థానాలు ఏకగ్రీవం కాగా.. మిగిలిన 28,976 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఆయా చోట్ల 70,094 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. -
ప్రశాంతంగా ముగిసిన తొలి విడత పోలింగ్
-
ప్రశాంతంగా ముగిసిన తొలి విడత పోలింగ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. దాదాపు 75 శాతానికి పైగా పోలింగ్ నమోదు అయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఉదయం ఏడు గంటలకే ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంటకు ముగిసింది. అయితే నిర్ణీత సమయంలోపు లైన్లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు.. మరో గంట తరువాత కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఆ వెంటనే ఫలితాలు ప్రకటించనున్నారు. మూడు విడతల్లో జరగనున్న ఈ ఎన్నికల్లో సోమవారం తొలి విడత పోలింగ్ జరుగుతుంది. మిగతా రెండు విడతల పోలింగ్ ఈనెల 25, 30 తేదీల్లో జరగనుంది. -
పంచాయతీ ఎన్నికల్లో.. అత్తాకోడళ్ల పోరు
నిడమనూరు (నాగార్జునసాగర్) : మండలంలోని బంకాపురంలో వరుసకు అత్తా కోడలు అయిన ఉన్నం కౌసల్య, ఉన్నం శోభ ఎన్నికల బరిలో నిలిచారు. బంకాపురం సర్పంచ్ స్థానం జనరల్ మహిళకు కేయించారు. ఇక్కడ గత సర్పంచ్‌గా పనిచేసిన ఉన్నం శోభ తిరిగి పోటీ చేస్తుండగా ఆమె అత్త అయిన ఉన్నం కౌసల్య కొత్తగా బరిలో నిలిచారు. ఉన్నం శోభ భర్త కాంగ్రెస్ పార్టీకి చెందగా, కౌసల్య భర్త ఉన్నం వెంకటేశ్వర్లు టీఆర్ఎస్ నాయకుడు. ఉన్నం చిన వెంకటేశ్వర్లు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరారు. జనరల్ మహిళ కావడంతో తన సతీమణిని రంగంలోకి దింపి గెలుపుకోసం పట్టుదలగా ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల బరిలో బాబాయి, అబ్బాయి త్రిపురారం : త్రిపురారం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పదవి కోసం సొంత బాబాయి, అబ్బాయి పోటీపడుతున్నారు. ఇంటి పేరుతో పాటు వారి పేర్లు కూడా ఒక్కటే కావడం విశే షం. తెలంగాణ ఉద్యమకారుడిగా పేరు న్న అనుముల శ్రీనివాస్‌రెడ్డి టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. త్రిపురారం సొసైటీ మాజీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అనుముల శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థిగా బరిలో నిలిచారు. వీరిద్దరు సొంత బా బాయి, కుమారుడు వరస అవుతారు. వీరితో పాటు చల్లబట్ల వెంకట్రామ్రెడ్డి స్వ తంత్య్ర అభ్యర్థిగా, మరో ముగ్గురు సర్పంచ్ స్థానానికి పోటీ చేస్తున్నారు. కాగా సొంత బాబాయి, అబ్బాయి ఎన్నికల బరిలో నిలవడంతో ఎవ రు గెలుస్తారోననే ఉత్కంఠ నెలకొంది. -
అభ్యర్థులకు గుర్తుల గుబులు
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల గుర్తులు అభ్యర్థులకు గుబులు పుట్టిస్తున్నాయి. ఓటర్లు సులభంగా గుర్తుపట్టడానికి అనువుగా లేని, దగ్గర పోలికలు గల గుర్తులు ఉండడంతో అయోమయానికి గురవుతున్నారు. ఫోర్క్, చం చా, గ్యాస్ స్టౌ, గ్యాస్ సిలిండర్,బ్యాట్, విమానం వంటి దగ్గరి పోలికలున్న గుర్తులను కేటా యించారు. దాంతో ఓటర్లకు వాటిని ఎలా వివరించాలో తెలియక అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారు. బ్యాలెట్æలో ఊరు, పేరు, ఫొటో ఉండకపోవడం, తికమకపెట్టేలా గుర్తులు ఉండడంతో ఆందోళన చెందుతున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్ని కల్లో కొందరు అభ్యర్థుల గెలుపు, ఓటములను ‘ట్రక్కు’ గుర్తు తారుమారు చేసిన విషయం తెలి సిందే. పంచాయతీ ఎన్నికల్లోనూ తికమకపెట్టే గుర్తులతో తమకు చిక్కులు వస్తాయేమోనని అభ్యర్థులు భయపడుతున్నారు. సర్పంచ్ స్థానాలకు పోటీ చేసేవారికి వరుసగా ఉంగరం, కత్తెర, బ్యాట్, కప్పుసాసర్, విమానం, పుట్‌బాల్, షటిల్‌కాక్, కుర్చి, వంకాయ, బ్లాక్ బోర్డు, కొబ్బరికాయ, హ్యాండ్‌బ్యాగ్, మామిడికాయ, సీసా, బకెట్, బుట్ట, దువ్వెన, అరటిపండు, మంచం, పలక, టేబుల్æ, బ్యాటరీ లైట్, బ్రష్, గొడ్డలి, గాలిబుడగ, బిస్కెట్, వేణువు, ఫోర్క్, చంచా ఇలా 30 రకాల గుర్తులు నిర్ణయించారు. పోటీలో ఉన్న ఏ అభ్యర్థికీ ఓటు వేయడం ఇష్టం లేకపోతే ‘నోటా’కు వేసుకోవచ్చు. వార్డులకు ఇలా... వార్డు స్థానాలకు వరుసగా జగ్గు, గౌను, గ్యాస్‌స్టౌ, స్టూల్æ, గ్యాస్ సిలిండర్, గాజు గ్లాసు, బీరువా, విజిల్æ, కుండ, డిష్ యాంటీనా, గరాట, మూ కు డు, కేటిల్æ, విల్లుబాణం, పోస్టల్æ కవర్, హాకీస్టిక్, బంతి, నెక్‌టై, కటింగ్ ప్లేయర్, పోస్ట్‌డబ్బా ఇలా 19 రకాల గుర్తులతో పాటు నోటా కూడా ఉంటుంది. ఓటర్లు గుర్తించే, సులువుగా అర్థమయ్యే గుర్తులెన్నో ఉన్నాయి. అలాంటి వన్నీ వదిలేసి క్లిష్టమైనవి గుర్తులుగా పెట్టడంతో ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఈసారి ఎన్నికల్లో సర్పంచ్‌గా పోటీచేసే అభ్యర్థులకు మొదటిస్థానంలో ఉంగరం గుర్తు ఉంది. అది చూడగానే అందరికీ సులువుగా అర్ధం అవుతుంది. ఏడోస్థానంలో ఉన్న షటిల్ కాక్ గుర్తు దక్కే అభ్యర్థికి దానిని ప్రచారం చేసుకోవడం ఇబ్బందిగా మారింది. బ్యాలెట్ పేపర్లో మూడోస్థానంలో ఉన్న బ్యాట్, ఐదో స్థానంలో ఉన్న విమానం గుర్తులు దగ్గరి పోలికలతో ఉన్నాయి. వీటి విషయంలో వృద్ధులు పొరబడే అవకాశాలున్నాయి. బ్యాలెట్æ పేపర్లో 29వ స్థానంలో ఉన్న ఫోర్కు, 30వ స్థానంలో ఉన్న చంచా గుర్తులు దాదాపు ఒకేలా ఉన్నాయి. దాంతో ఒకదానికి బ దులు మరొకదానికి ఓటు వేసే అవకాశం లేకపోలేదు. వార్డు సభ్యుల ఎన్నికకు ఉపయోగించే బ్యాలెట్లో మూడోస్థానంలో గ్యాస్‌పొయ్యి, ఐదో స్థానంలో గ్యాస్ సిలిండర్ గుర్తులున్నాయి. పొరపాటున గ్యాస్‌పొయ్యికి పడే ఓట్లు సిలిండర్‌కు పడే అవకాశం ఉంది. -
తొలి పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలి సారి జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం నుంచే ఓటు హక్కును వినియోగించుకోవడానికి ప్రజలు పోలీంగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కొనసాగనుంది. అనంతరం మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మూడు విడతల్లో జరగనున్న ఈ ఎన్నికల్లో సోమవారం తొలి విడత పోలింగ్ జరుగుతుంది. మిగతా రెండు విడతల పోలింగ్ ఈనెల 25, 30 తేదీల్లో జరగనుంది. మొదటిదశలో మొత్తం 4479 గ్రామ పంచాయతీలకు పోలింగ్ ఉంది. అయితే, అందులో 769 పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కోర్టు కేసుల కారణంగా 9 పంచాయతీల్లో ఎన్నికలు జరగటం లేదు. మరోవైపు వార్డు సభ్యుల పరంగా కూడా మొత్తం 39,822 వార్డులకు ఎన్నికలు జరగాలి. అందులో కోర్టు కేసులు, రిజర్వేషన్ల వివాదంతో 192 వార్డుల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. 10,654 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో మిగిలిన 28,976 వార్డులకు 70,094 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. మొదట వార్డు సభ్యులకు వచ్చిన ఓట్లు, ఆ తర్వాత సర్పంచ్ అభ్యర్థికి వచ్చిన ఓట్లు లెక్కిస్తారు. పోలింగ్ విధుల్లో 1,48,033 మంది సిబ్బందిని నియమించింది రాష్ట్ర ఎన్నికల సంఘం. 26వేల మంది పోలీసులతో బందోబస్తు చేపట్టింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓట్లు వేసే వారికి మధ్య వేలి మీద సిరా గుర్తు వేయనున్నారు. -
తీర్పు నేడే
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): మొదటి విడత పంచాయతీ సమరానికి సమయం రానే వచ్చింది. జిల్లాలో మొత్తం 719 గ్రామ పంచాయతీలు, 6,366 వార్డులు ఉండగా మూడు విడుతల్లో ఎన్నికలు జరుగనున్నాయి. నేడు మొదటి విడతగా 203 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈనెల 1వ తేదీన నోటిఫికేషన్ జారీ అవ్వగా 7 నుంచి 9వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించారు. 203 పంచాయతీల్లో ఎన్నికలు జిల్లాలో మొదటి విడుత ఎన్నికలు సోమవారం జరుగుతాయి. 10 మండలాల్లో మొత్తం 249 పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇందులో 46 పంచాయతీలు ఎప్పటికే ఏకగ్రీవం కాగా మిగిలిన 203 పంచాయతీలకు సోమవారం ఎన్నికలను నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కృష్ణా, మాగనూర్, మక్తల్, నర్వ, ఊట్కూర్, నారాయణపేట, దామరగిద్ద, ధన్వాడ, మరికల్, కోయిలకొండలోని 203 పంచాయతీలు, 2,274 వార్డులో ఎన్నికలు జరగనున్నాయి. 46 గ్రామాలు ఏకగ్రీవం తొలి విడుతలో 46 పంచాయతీలు ఏకగ్రీవం అ య్యాయి. ఈనెల 7 నుంచి 9వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించారు. 13వ తేదీవరకు ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. ఇందులో 46 పంచాయతీలకు కేవలం ఒక్క నామినేషన్ మాత్రమే దాఖలవ్వడంతో ఈ పంచాయతీలు ఏకగ్రీవం అయినట్లు అధికారులు ప్రకటించారు. ఇందులో అత్యధికంగా కోయిల్‌కొండలో 12 పంచాయతీలు, మరికల్లో ఎనిమిది, నారాయణపేటలో ఆరు, దామరగిద్దలో ఐదు, కృష్ణా, నర్వలో 4, మాగనూర్‌లో 3, మక్తల్‌లో 2, ఊట్కూర్, ధన్వాడలో ఒకటి చొప్పున మొత్తం 46 పంచాయతీల పాలకవర్గాలు ఏకగ్రీవం అయ్యాయి. పోలింగ్‌కు 5,518 మంది సిబ్బంది తొలి విడుతకు మొత్తం 5518 మంది అధికారులను గుర్తించారు. ఇందులో 2,274 పీఓలు, అదనంగా 228 మంది పీఓలను గుర్తించారు. 2,742 ఏపీలు అదనంగా 274 మందిని ఏపీఓలను గుర్తించారు. వీరు నామినేషన్ల స్వీకరణ ఇప్పటికే పూర్తి చేశారు. ఇక పోలింగ్ నిర్వహణ, కౌంటింగ్, ఉప సర్పంచ్ ఎన్నిక వరకు ఈ అధికారులు విధులు నిర్వహిస్తారు. ఉదయం 7 నుంచి మొదలు.. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు నిర్వహించనున్నారు. మూడు విడుతల్లో ఈ మాదిరిగానే ఎన్నికల నిర్వహణ జరుగుతుంది. ఎన్నికలు పూర్తయిన గంట తరువాత (మధ్యాహ్నం 2గంటలకు) నుంచి ఆయా గ్రామ, వార్డు సభ్యుల ఓట్లను లెక్కిస్తారు. ముందుగా వార్డు సభ్యుల ఓట్లను లెక్కిస్తారు. ఆ తరువాత సర్పంచ్ ఓట్లను లెక్కిస్తారు. ఈ ఎన్నికల్లో రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఒకటి వార్డు మెంబర్‌కు, మరొకటి సర్పంచ్‌కి ఓటు వేయాల్సి ఉంటుంది. పోలింగ్ జరిగే రోజునే ఉప సర్పంచ్ ఎన్నిక కూడా నిర్వహించనున్నారు. బ్యాలెట్ పద్ధతిన పోలింగ్ పంచాయతీ ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిన నిర్వహించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరుపాలని మొదలు అనుకున్నప్పటికీ బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. దానికి అనుగునంగానే ఈ సారి బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు జరుగుతాయి. ఇందులో గులాబీ రంగ బ్యాలెట్ సర్పంచ్‌కు, తెలుపు రంగు బ్యాలెట్ వార్డు సభ్యులకు కేటాయించారు. ఇందులో సర్పంచ్‌కు 30, వార్డు çసభ్యులకు 20 గుర్తులను కేటాయించారు. నేడే ఫలితాలు నేటి పోలింగ్ ముగిసిన వెంటనే మధ్యా«హ్నం 2 గంటల నుంచి ఓట్లను లెక్కిస్తారు. ముందుగా వార్డు సభ్యులకు చెందిన ఓట్లను లెక్కిస్తారు. అనంతరం సర్పంచ్ అభ్యర్థుల ఓట్లను లెక్కిస్తారు. ఓట్లను లెక్కించేందుకు అధికారులు పంచాయతీల వారిగా అన్ని ఏర్పాట్లు చేశారు. అందుకు ఉపయోగించే సామాగ్రి అందుబాటులో ఉంచారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా అందుకు అవసరమైన సామాగ్రిని సరఫరా చేశారు. గుండు సూది, క్యాండిల్, రబ్బర్‌బ్యాండ్ లాంటి వస్తువులను సైతం అందుబాటులో ఉంచారు. ఉప సర్పంచ్‌లు సైతం ముందుగా వార్డు సభ్యుల ఓట్లను లెక్కిస్తారు. దీంతో ఎవరెవరు గెలిచారో.. ఓడారో తెలిసి పోతుంది. ఎవరి ప్యానెల్‌కు ఎక్కువ సభ్యులు గెలిచారో తేలనుంది. ఆ వెంటనే అసలు రాజకీయం మొదలవుతుంది. ఉప సర్పంచ్ పదవికి పోటీ పెరిగి పోతుంది. ముందుగా అనుకున్న ప్యానెల్ గెలిస్తే అప్పటికే అనుకున్న అభ్యర్థికి ఉప సర్పంచ్‌గా అవకాశం వస్తుంది. అనుకున్న అభ్యర్థి ఓడిపోతే గెలిచిన అభ్యర్థుల్లో ఎవ్వరిని ఉప సర్పంచ్‌గా ఎన్నుకోవాలో పార్టీలు రాజకీయ వ్యుహాలను íసిద్ధం చేసుకుని పెట్టుకున్నారు. సర్పంచ్ జనరల్ అయితే ఉప సర్పంచ్ నాన్ జనరల్‌కు ఇవ్వాలని, సర్పంచ్ రిజర్వు అయితే ఉప సర్పంచ్ జనరల్‌కు ఇవ్వాలనే పోటీ నెలకుంటుంది. పోలింగ్‌లో పాల్గొన్న సిబ్బంది ఉప సర్పంచ్ ఎన్నికల నిర్వహించాల్సి ఉంటుంది. ఉప సర్పంచి ఎన్నిక పూర్తి అయితేనే సంపూర్ణంగా అధికారులు పని పూర్తి అయినట్లు. ఇంకులో స్వల్ప మార్పు పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసిన అభ్యర్థి వేలికి వేసే ఇంకును ఎడమ చేతి చూపుడు వేలుకు కాకుండా ఎడమ చేతి మధ్య వేలుకు ఇంకు పెడుతారు. ఎందుకంటే డిసెంబర్ 7వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఓటర్లకు ఎడమ చేతి చూపుడు వేలికి ఇంకు పెట్టారు. దీంతో అ ఇంకు ఇప్పటి దాక ఉండవచ్చనే కారణంతో ఎన్నికల సంఘం ఈ ఎన్నికల్లో ఎడమ చేతి మధ్య వేలికి ఇంకు పెట్టేందుకు నిర్ణయం తీసుకుంది. -
ఎన్నికల్లో ఓడిపోవాలని.. ఏం చేశారో తెలుసా?
రాజాపేట (ఆలేరు) : ఓ వార్డు అభ్యర్థి ఇంటిముందు గుర్తుతెలియని వ్యక్తులు పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, కోడిగుడ్డు, వేపకొమ్మలు పెట్టడంతో భయాందోళనకు గురవుతున్న సంఘటన మండలంలోని రఘునాథపురంలో చోటుచేసుకుంది. బాధితుడు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన బింగి నాగేష్ పంచాయతీ ఎన్నికల్లో నాలుగో వార్డులో పోటీలో ఉన్నాడు. కాగా రాత్రి ఎన్నికల ప్ర చారం ముగించి శుక్రవారం తెల్లవారుజాము న లేచి చూసేసరికి ఇంటిముందు పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, వేపకొమ్మలు, కోడిగుడ్డుతో పూజలు చేసినట్లు కనిపించడంతో కుటుంబ సభ్యులంతా భయాందోళనకు గురయ్యారు. ఈ విషయం కాలనీవాసులకు తెలవడంతోవారంతా ఆందోళన చెందుతున్నారు. -
ఎన్నికలను బహిష్కరించిన ‘కొయ్యలగూడెం’
చౌటుప్పల్ (మునుగోడు) : చేనేత వస్త్రాల తయారీకి పెట్టిన పేరుగా నిలిచిన మండలంలోని కొయ్యలగూడెం గ్రామం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రజలంతా కులమతాలు, వర్గ విభేదాలకు తావు ఇవ్వకుండా ఏకతాటిపై నిలిచారు. అందరు కలిసి తీసుకున్న నిర్ణయానికి కట్టుపడ్డారు. గతేడాది జరిగిన నూతన గ్రామపంచాయతీల విభజన సమయంలో కొయ్యలగూడెం గ్రామానికి అ న్యాయం జరిగిందని.. గ్రామపంచాయతీ ఎన్ని కలను బహిష్కరించాలని ఈనెల 7న నిర్ణయిం చారు. ఏ ఒక్కరూ కూడా పంచాయతీ ఎన్నికల్లో పాల్గొనకుండా ప్రభుత్వానికి తమ నిరసనను తెలి యపర్చాలని తీర్మాణించారు. అధికారులు నచ్చజెప్పినా తలొగ్గకుండా పంతాన్ని నెరవేర్చుకున్నారు. చౌటుప్పల్ మండల కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొయ్యలగూడెంలో ఆ గ్రామంతో పాటు ఎల్లంబావి, జ్యోతినగర్, గజ్జెలోనిబావి గ్రామాలు ఉండేవి. పంచాయితీ పరిధిలో 2011 జనాభా లెక్కల ప్రకారంగా 4600 జనాభా, 2837 మంది ఓటర్లు ఉండేవారు. గతేడాది ఈ గ్రామపంచాయతీ నుంచి ఎల్లంబావి, జ్యోతినగర్‌ను వేరు చేశారు. 1287 మంది జనాభా, 976 మంది ఓటర్లతో కలిపి నూతనంగా ఎల్లంబావి పేరిట గ్రామపంచాయతీని ఏర్పాటైంది. ముందుగా అధికారులు చేసిన మార్కింగ్ ప్రకారంగా కాకుండా అకస్మాత్తుగా మరో మార్కింగ్‌తో విభజించి గెజిట్‌ను పూర్తిచేశారు. ఇక అప్పటి నుంచి గ్రామస్తులు తమకు జరిగిన అన్యాయం గురించి అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. రోజులు గడుస్తున్నాయో తప్ప ఫలితం మాత్రం దక్కలేదు. విభజనతో ఆగమైన కొయ్యలగూడెం.. విభజనతో కొయ్యలగూడెం గ్రామం పూర్వపు తన ఆనవాళ్లను కోల్పోయింది. గతేడాది మార్చిలో జరిగిన ప్రక్రియలో ఎల్లంబావికి 13–57, 701–705, 438, 441, 473, 708 సర్వే నంబర్లే కేటాయించాలి. కానీ ఆ తర్వాత జరిగిన తతంగంతో అధనంగా 10, 694, 695, 696, 697, 698, 699, 700 సర్వే నంబర్లను కేటాయించారు. 1,287 మంది జనాభా ఉన్న ఎల్లంబావికి 650ఎకరాలను కేటాయించారు. 2,313 మంది జనాభా కలిగిన కొయ్యలగూడెం గ్రామానికి మాత్రం 700 ఎకరాల రెవెన్యూని మాత్రమే కేటాయించారు. దీంతో కొయ్యలగూడెం గ్రామంలోనికి వెళ్లే ప్రధాన రహదారి, కొన్నేళ్లుగా వాడుకలో ఉన్న శ్మశాన వాటిక కూడా ఎల్లంబావి పరిధిలోకి వెళ్లింది. విఫలమైన అధికారుల ప్రయత్నాలు ఎన్నికల్లో గ్రామస్తులతో నామినేషన్లు వేయించేందుకు అధికార యంత్రాంగం తీవ్ర ప్రయత్నాలు చేసింది. ఎవరికి ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తామని కొంత మందికి బరోసా ఇచ్చారు. అందులో భాగంగా డి.నాగారం క్లస్టర్ వద్ద ఏసీపీ బాపురెడ్డి, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ చిల్లా సాయిలు, సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. ఏదో జరుగుతుందని పసిగట్టిన కొయ్యలగూడెం గ్రామస్తులు ఎవరూ నామినేషన్లు వేయకుండా గస్తీ నిర్వహించారు. క్లస్టర్ వద్ద కాపుకాశారు. సాయంత్రం 5 గంటల వరకు ఇదే పరిస్థితి నెలకొనడంతో గ్రామం నుంచి ఎలాంటి నామినేషన్ దాఖలవ్వలేదు. ప్రయత్నాలు విఫలమవ్వడంతో అధికారులు వెనుదిరిగారు. బహిష్కరించాలని నిర్ణయం.. తమకు జరిగిన అన్యాయంపై సుమారు 7 నెలలుగా గ్రామస్తులు పోరాడుతూనే ఉన్నారు. అయినా అటు ప్రభుత్వం, ఇటు అధికారులు, మరో వైపు ప్రజాప్రనిధులు కనీసం స్పందించలేదు. దీంతో తమ నిరసన తీవ్రస్థాయిలో ఉండాలని గ్రామస్తులంతా భావించారు. అందులో భాగంగా ఈనెల 7న సమావేశమై పంచాయతీ ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించారు. ఆ మాటకు ప్రజలంతా కట్టుబడ్డారు. -
పంచాయతీ ఎన్నికలు.. ‘సోషల్’ పోరు మొదలైంది
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల బరిలో ఉన్న అభ్యర్థులు వినూత్న ప్రచారానికి తెరలేపారు. సోషల్ మీడియా వేదికగా ప్రచారాన్ని సాగిస్తున్నారు. కొందరు అభ్యర్థులు ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను కలిసి ఓట్లు అభ్యర్థిస్తుండగా, మరికొందరు వాట్సప్, ఫేస్బుక్ ద్వారా వారికి కేటాయించిన గుర్తులతో ఫొటోలు ఆపోలోడ్ చే స్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. వాట్సప్‌లో ప్రత్యేకంగా గ్రామ సభ్యులతో ఒక గ్రూప్ తయారు చేసి ఓట్లు వేయాలని కోరుతున్నారు. సర్పంచ్, వార్డులకు బరిలో ఉన్న అభ్యర్థులు పోటాపోటీగా మేనిఫెస్టోలను విడుదల చేస్తున్నారు. తాము గెలిస్తే గ్రామంలో చేసే అభివృద్ధి కార్యక్రమాలను సోషల్ మీడియాలో పేర్కొన్నారు. గతంలో సర్పంచ్ చేసిన పనులు.. తాము గెలిస్తే చేసే అభివృద్ధిని వివరిస్తున్నారు. గ్రామానికి రోడ్లు, భూ ములకు పట్టాలు, పొలాలకు సబంధించిన విత్తనాలు, ఎరువులు, తక్కువ ధరకు ఇప్పించడం. డబుల్ బెడ్రూం ఇళ్లు, ఆలయాలు, పాఠశాలల అభివృద్ధి తదితర కార్యక్రమాలు చేపడుతామని హమీలిస్తున్నారు. గెలుపు వ్యూహాలూ ఇందులోనే... తమకు అనుకూలంగా ఉన్న ఓ పది మంది కీలక నాయకులతో వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేసి సర్పంచ్ నుంచి వార్డు సభ్యుల గెలుపు వరకు ఇందులోనే చర్చలు జరుపుతున్నారు. వ్యూహాలు రచిస్తున్నారు. అంతే కాకుండా ప్రత్యర్థుల వద్ద అసమ్మతితో ఉన్న నాయకులకు ఈ వాట్సప్‌లో చేర్చి వారి వద్ద సమాచారాన్ని తీసుకుంటున్నారు. దీంతో ప్రత్యర్థులను వాట్సప్ వేదికగా చేసుకుని ఎన్నికల్లో ఓడించేందుకు సిద్ధమవుతున్నారు. ఫేస్బుక్లో అభ్యర్థి ఫోటోలను అప్లోడ్ చేసి గెలిపించాలని వేడుకుంటూ ప్రచారం చేస్తున్నారు. ఓటు వేయడానికి రావాలని.. గ్రామంలో ఓటు ఉండి వేరేప్రాంతంలో నివసిస్తున్న వారిని ఓటు వేసేందుకు రావాలని, సర్పంచ్, వార్డు సభ్యులుగా బరిలో ఉన్న అభ్యర్థులు కోరుతున్నారు. వేరే ప్రాంతంలో ఉన్న వారికి ఫోన్ చేసి ఓటింగ్ రోజున గ్రామానికి వచ్చి తమకే ఓటు వేయాలని.. రానుపోను చార్జీలు కూడా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. మరికొందరు సెల్‌ఫోన్ బిల్లులు, విద్యుత్ బిల్లు, కులాయి బిల్లు, డిష్ బిల్లులు, ఇంటి అద్దె తదితర వాటిని చెల్లిస్తూ ఓటర్లను మచ్చిక చేసుకునే పనిలో నిమగ్నయ్యారు. -
25 ఏళ్లుగా ఏకగ్రీవమే..
చందంపేట : కృష్ణమ్మ ఒడ్డున ఉన్న ఓ తండా ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది. తండా అభివృద్ధికి స్థానికులు 25 ఏళ్లుగా ఏకతాటిపై నిలుస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యులను ఏకగ్రీవం చేసుకుంటూ ప్రభుత్వ నజరానాతో అభివృద్ధికి బాటలు వేసుకుంటున్నారు చిన్నమునిగల్తండా వాసులు. నల్లగొండ జిల్లాలోనే మారుమూలన ఉండే ఈ తండా నాగార్జునసాగర్ ప్రాజెక్టులో ఏలేశ్వరం వద్ద ఉన్న భూములను కోల్పోవడంతో పునరావాసం కింద పెద్దమునిగల్ గ్రామం పక్కనే ఉన్న ఓ స్థలాన్ని చిన్నమునిగల్గా ఏర్పాటు చేశారు. 25 ఏళ్లుగా ఈ తండాలో సర్పంచ్, వార్డులు ఏకగ్రీవమవుతున్నాయి. గతంలో చిన్నమునిగల్ గ్రామపంచాయతీలో గతంలో బుగ్గతండా, వైజాక్‌కాలనీ ఉండేవి. ప్రస్తుతం 500 జనాభా పైబడిన తండాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేయడంతో బుగ్గతండా, వైజాక్‌కాలనీ నూతన గ్రామపంచాయతీలుగా ఏర్పడ్డాయి. ప్రస్తుతం 250 ఓట్లతో చినమునిగల్ గ్రామపంచాయతీగా ఉంది. ఇప్పుడు కూడా పంచా యతీ ఏకగ్రీవమయ్యింది. అప్పటి నుంచి రాజేశ్వర్, మైసానమ్మ, పాపానాయక్, మకట్‌లాల్ ఏకగ్రీవ సర్పంచ్‌లుగా పని చేశారు. ఈ సారి కేతావత్ జంకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏకగ్రీవానికే తండావాసుల మొగ్గు.. గత ఎన్నికల్లో మకట్‌లాల్ ఏకగ్రీవం కావడంలో రూ.10లక్షల నజరానా అందడంతో గ్రామంలో సీ సీ రోడ్ల కోసం ఉపయోగపడ్డాయని గ్రామానికి చెందిన దేవరకొండ నగరపంచాయతీ మాజీ చై ర్మన్ మంజ్యానాయక్, వ్యాపారవేత్త రూప్లానా యక్ తండా వాసులకు వివరించారు. దీంతో ఈ సారి కూడా ఏకగ్రీవం వైపే మొగ్గు చూపారు. ప్యా రిస్‌లో ఎంబీఏ చేసిన మంజ్యానాయక్ కుమారు డు ఈ సారి ఏకగ్రీవ ఉప సర్పంచ్‌గా ఎన్నికై గ్రామ అభివృద్ధిగా కృషి చేస్తానని పేర్కొంటున్నాడు. ఏకగ్రీవం అయితేనే అభివృద్ధి సాధ్యం అందరి ప్రోత్సాహంతో నేను ఈ సారి సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యా ను. గతంలో నాలుగుసార్లు మా గ్రామపంచాయతీ ఏకగ్రీవమైంది. నన్ను ఎ న్నుకున్నందుకు గ్రామస్తులకు కృతజ్ఞతలు. గ్రామాభివృద్ధి కోసం నా శాయశక్తులా కృషి చేస్తా. – కేతావత్ జంకు, సర్పంచ్, చిన్నమునిగల్ గ్రామాభివృద్ధే ధ్యేయం మారుమూల గ్రామమైన చిన్నమునిగల్ను అభివృద్ధి చేయడానికి ప్యారి స్లో ఎంబీఏ చేసిన నేను ఈ సారి బరిలో నిలబడ్డా. తండావారంతా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అందరికీ మంచి జరగాలన్నదే నా ఉద్దేశం. ప్రజలకు అందుబాటులో వారి సమస్యలు పరిష్కరిస్తా. – కేతావత్ లాలునాయక్, ఉప సర్పంచ్, చిన్నమునిగల్ -
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నియమావళి ప్రకారం పోలింగ్‌కు 44 గంటల ముందే మీడియా ప్రచార, ప్రసార కార్యక్రమాలను ముగించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. మూడు దశల్లో జరిగే పోలింగ్ సందర్భంగా ఈ నెల 19, 23, 28 తేదీల్లో సాయంత్రం 5 గంటల్లోపు టీవీ చానెల్స్, రేడియో తదితర ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలు అభ్యర్థుల ఎన్నికల సంబంధిత ప్రచార కార్యక్రమాల ప్రసారం ముగించాలని, ఒకవేళ ప్రసారం కొనసాగిస్తే ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని పేర్కొంది. ప్రచారం చేసే మీడియా సంస్థలపై చట్టరీత్యా చర్యలు ఉంటాయని తెలిపింది. -
బరిలో 10,668 మంది సర్పంచ్ అభ్యర్థులు
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీ రెండో విడత (ఈ నెల 25న) ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ పూర్తయ్యాక మొత్తం 3,342 సర్పంచ్ స్థానాలకు 10,668 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. అలాగే మొత్తం 26,191 వార్డు మెంబర్ స్థానాలకు 63,480 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. రెండో విడతలో భాగంగా 4,135 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు నోటిఫై చేయగా, 788 సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, 5 పంచాయతీలకు నామినేషన్లు దాఖలు కాలేదు. దీంతో 3,342 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) తెలి పింది. రెండో విడత ఎన్నికల్లో మొత్తం 36,602 వార్డు సభ్యులకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు ఎస్ఈసీ నోటిఫై చేయగా అందులో 10,317 వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వివిధ జిల్లాల్లోని 94 వార్డు మెంబర్ స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు. దీంతో ఈ విడతలో మొత్తం 26,191 వార్డులకు జరుగుతున్న ఎన్నికల్లో 63,480 అభ్యర్థులు పోటీలో ఉన్నట్టుగా ఎస్ఈసీ ప్రకటించింది. మూడో విడతకు ముగిసిన నామినేషన్లు.. మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల దాఖలు శుక్రవారం (18న)తో ముగిసింది. ఈ విడతలో 4,116 సర్పంచ్ స్థానాలు, 36,729 వార్డు మెంబర్ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. శుక్రవారం వరకు దాఖలైన సర్పంచ్, వార్డు అభ్యర్థుల నామినేషన్లను శనివారం పరిశీలించేందుకు అధికారు లు ఏర్పాట్లు చేశారు. బుధవారం (23న) సాయం త్రం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువుంటుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తారు. ఈ నెల 30న మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి. నేటి సాయంత్రం ‘తొలి’ ప్రచారం బంద్ 21న జరగనున్న తొలి విడత ఎన్నికల ప్రచారాన్ని శనివారం సాయంత్రం 5 గంటల్లోపు ముగించాలని ఎస్ఈసీ ఆదేశించింది. మొదటి, రెండు, మూడో విడత ఎన్నికలు పూర్తి కావడానికి 44 గంటల ముం దు ప్రచారాలు నిలిపివేయాలని ఎస్ఈసీ కార్యదర్శి అశోక్‌కుమార్ ఒక ప్రకటనలో ఆదేశించారు. -
వామపక్షాలు..‘ఉనికి’ పాట్లు
సాక్షి, హైదరాబాద్: క్షేత్రస్థాయిలో పార్టీ పట్టును, శ్రేణులను కాపాడుకునే ప్రయత్నాలతో పాటు తమ ఉనికిని చాటుకునే ప్రయత్నాల్లో ఉభయ కమ్యూనిస్టుపార్టీలు నిమగ్నమమయ్యాయి. ప్రస్తుత గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈ పార్టీలకు పట్టున్న గ్రామాలు, కొన్ని దశాబ్దాల పాటు సంప్రదాయంగా మద్దతునిస్తున్న స్థానాలను కాపాడుకునే యత్నాలు చేపడుతున్నాయి.రాష్ట్రంలో వామపక్షాలకు ప్రధానంగా ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో బలం ఉండేది. ఇవి కాకుండా వరంగల్, కరీంనగర్ తదితర జిల్లాల్లో కూడా వాటికి కొంతమేర మద్దతు లభించేది.మారిన రాజకీయ పరిస్థితుల్లో అదంతా గత వైభవంగానే మిగిలిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో... ఇటీవల శాసనసభ ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం పక్షాలు ఘోరపరాజయం పాలై, కనీసం చెరో సీటైనా గెలుచుకోలేకపోయాయి.వాటికి పట్టున్న నియోజకవర్గాల్లో సైతం పోలైన ఓట్లు గణనీయంగా తగ్గిపోయాయి. ఈ పక్షాలు తమ వైఖరికి భిన్నంగా ప్రధాన రాజకీయపార్టీలతో పొత్తులు, ఎన్నికల అవగాహనల పేరిట అంటకాగుతున్నాయి. దీంతో ఆ పార్టీల్లోని నేతలు, కార్యకర్తల క్రమశిక్షణారాహిత్యం, ప్రలోభాలకు గురయ్యే మనస్తత్వం వామపక్షాల కేడర్‌లో కూడా ప్రవేశించింది. ఆ ప్రభావం వారి సైద్ధాంతిక, క్రమశిక్షణ నేపథ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. ఫలితంగా కమ్యూనిస్టు పార్టీలు డోలాయమాన పరిస్థితుల్లో పడ్డాయి. ఉన్న కేడరును కాపాడుకోవడం ఆ నాయకత్వానికి పెను సవాలుగా మారింది.వాటి దుస్థితికి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలే అద్దంపట్టాయి. అవీ నిలబడవేమో... పంచాయతీ ఎన్నికలు రాజకీయపార్టీల గుర్తులు లేకుండా జరుగుతున్నా తమకు గట్టి బలం, పట్టు న్న గ్రామాల్లో తమ ఉనికిని చూపేందుకు సీపీఐ. సీపీఎం నాయకత్వాలు గట్టిగా శ్రమించాల్సిన పరి స్థితులు ఏర్పడ్డాయి.తాము గతంలో గెలుచుకున్న పంచాయతీలను నిలబెట్టుకోవడం కూడా ఈ పార్టీ లకు సవాల్‌గానే మారుతోంది. సర్పంచ్ స్థానాల కు వేలంపాటలు, ఏకగ్రీవం పేరిట రాజకీయ ఒత్తి ళ్లు, కిందిస్థాయిలో కేడర్‌కు డబ్బు ప్రభావం ఇతర త్రా ప్రలోభాలు వాటిని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఈ స్థితిలో తాము ఆశించిన స్థాయిలో పంచాయతీలు గెలుచుకోవడం సాధ్యం కాదని ఆ పార్టీ అంతర్గత చర్చల్లో ఇరుపార్టీల నాయకులే అంగీకరిస్తున్నారు. కార్యకర్తలను సంరక్షిం చుకోవడం, పార్టీ మూలాల ను కాపాడుకోవడంపై పార్టీల నేతలు దృష్టి కేంద్రీకరిస్తున్నారు. గత పంచాయతీ ఎన్నికల్లో సీపీఎం మద్దతుదారులు 200కు పైగా సర్పంచ్ స్థానాలు గెలుచుకోగా, సీపీఐ బలపరిచినవారు 150 వరకు పంచాయతీలు, వంద వరకు ఉప సర్పంచ్‌లు, వెయ్యివరకు వార్డుల్లోనూ గెలుపొందారు. ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో ఈ స్థానాలు నిలబెట్టుకోవడం అంత సులభం కాదని వామ పక్షాల రాజకీయాలను అధ్యయనం చేస్తున్న రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. -
‘పంచాయతీ’ రెండో విడత షురూ
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడత నామినేషన్ల దాఖలు ప్రక్రియ శుక్రవారం మొదలైంది. రెండో దశలో 4,135 గ్రామ పంచాయతీలు, 36,602 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్ పదవికి తొలి రోజు 4,850 నామినేషన్లు దాఖలవగా వార్డు సభ్యుల స్థానాలకు 9,198 నామినేషన్లు వచ్చాయి. ఆదివారంతో నామినేషన్ల స్వీకరణ గడువు ముగియనుంది. సోమవారం నామినేషన్ల పరిశీలనకు అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. అసంపూర్తి సమాచారం, అవసరమైన పత్రాలు జత చేయకపోవడం, ఆయా అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలు జోడించని కారణంగా గతంలో పలువురు సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురైన సందర్భాలున్నాయి. ఈ నేపథ్యంలో నామినేషన్ల పరిశీలనకు ప్రాధాన్యత ఏర్పడింది. నామినేషన్ల తిరస్కరణ అవకాశాలను తగ్గించుకునేందుకు వీలుగా నామినేషన్ల పరిశీలనకు అభ్యర్థులు వివిధ డాక్యుమెంట్లు తమ వద్దే ఉంచుకుంటే శ్రేయస్కరమని అధికారులు చెబుతున్నారు. రేపు మధ్యాహ్నం 3 వరకు నామినేషన్ల ఉపసంహరణ... తొలి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన తర్వాత ఆదివారం మధ్యాహ్నం 3 గంటల్లోగా, రెండో విడత ఎన్నికల నామినేషన్లను సోమవారం పరిశీలించాక గురువారం (17న) మధ్యాహ్నం 3 గంటల్లోగా అభ్యర్థులు పోటీ నుంచి ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. ఇందుకోసం ఫారం–7 (అనుబంధం–8)లో అభ్యర్థి తన సంతకంతో లిఖితపూర్వక నోటీసును రిటర్నింగ్ అధికారికి వ్యక్తిగతంగా సమర్పించడం ద్వారా అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవచ్చు. ఈ నోటీసును అభ్యర్థి వ్యక్తిగతంగా సమర్పించలేకుంటే ప్రపోజర్ లేదా ఎన్నికల ఏజెంట్ ద్వారా లిఖితపూర్వకంగా ధ్రువీకరిస్తూ రిటర్నింగ్ అధికారికి పంపించవచ్చు. ఉపసంహరణ నోటీసుతోపాటు అభ్యర్థి గుర్తింపు సరైనదేనని ధ్రువీకరించాక అభ్యర్థి నోటీసుకు రిటర్నింగ్ అధికారి రశీదు ఇవ్వాలి. తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ఉపసంహరణ నోటీసును రిటర్నింగ్ అధికారికి సమర్పించాక దాన్ని రద్దు చేసే అవకాశం ఉండదు. అభ్యర్థుల ఉపసంహరణ నోటీసులు అందిన వెంటనే రిటర్నింగ్ అధికారి గ్రామ పంచాయతీ నోటీస్ బోర్డుపై ఫారం–7(అనుబంధం–9)లో నోటీస్ వివరాలు పబ్లిష్ చేయాలి. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల లోపు ఉపసంహరణ ప్రక్రియ ముగుస్తుంది. తిరస్కరించే నామినేషన్లపై అప్పీలుకు చాన్స్... గ్రామ పంచాయతీ సర్పంచ్/వార్డు మెంబర్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైన పక్షంలో సంబంధిత రెవెన్యూ డివిజనల్/సబ్ కలెక్టర్ వద్ద రిటర్నింగ్ అధికారి నిర్ణయంపై అప్పీలు చేసుకోవచ్చు. నామినేషన్ల పరిశీలన తేదీ మర్నాడు నామినేషన్ల తిరస్కరణపై అప్పీలు దాఖలు చేసుకోవచ్చు. అప్పీలు దాఖలు చేసిన మరుసటి రోజే ఆ అప్పీలును సంబంధిత అధికారి పరిష్కరిస్తారు. 2006 ఎన్నికల నిర్వహణ నియమావళిలోని 13వ నిబంధన ప్రకారం అప్పీలు చేసుకునే వీలు కల్పించారు. -
కూటమి కూలినట్టేనా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజా ఫ్రంట్ కొనసాగింపుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీ ఫలితాలు వెలువడి దాదాపు నెల రోజులు కావస్తున్నా నేటికీ ఈ కూటమి సమీక్ష జరగలేదు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల విశ్లేషణకు ఇంతవరకు భాగస్వామ్య పక్షాలు సమావేశమవ్వలేదు. కనీసం మిత్రపక్షాల నేత లు వ్యక్తిగతంగా కలుసుకుని పరస్పరం అభిప్రాయాలు పంచుకునేందుకు ప్రయత్నించిన దాఖలాలూ లేవు. మరోవైపు పంచాయతీ ఎన్నికలు కూడా సమీపిస్తున్నాయి. కూటమికి నేతృత్వం వహించిన పార్టీగా కాంగ్రెస్ సొంతంగా కొంత ఆలస్యంగానే ఫలితాలపై సమీక్ష నిర్వహించింది. తమ అంచనాలకు భిన్నంగా టీఆర్ఎస్ మెజారిటీ స్థానాల్లో గెలుపొందడంపై స్పష్టమైన కారణాలు, దారి తీసిన పరిస్థితులను మాత్రం పూర్తిస్థాయిలో ఇంకా అంచనా వేయలేకపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఫ్రంట్ వల్ల పార్టీకి నష్టం జరిగిందని, ఒంటరిగా పోటీ చేసుంటే మెరుగైన ఫలితాలొచ్చి ఉండేవని కాంగ్రెస్‌లో ఓ వర్గం వాదిస్తోంది. కూటమిని ఇకముందు కూడా కొనసాగిస్తామని రాష్ట్ర పార్టీ ఇన్చార్జి ఆర్సీ కుంతియా, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ సంకేతాలైతే ఇచ్చారు.. కానీ ఆ దిశగా చర్యలు తీసుకో లేదు. దీంతో భవిష్యత్‌లో ఈ కూటమి కొనసాగుతుందా లేదా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ‘పంచాయతీ’లో సహకారం కరువు.. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజా ఫ్రంట్ మిత్రపక్షాలు పరోక్ష సహకారం కోసం ప్రయత్నించిన దాఖలాలూ లేవు. ఈ ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతున్నా గ్రామ స్థాయి ల్లో పరస్పరం సహకరించుకుంటే మంచి ఫలి తాలు వచ్చే అవకాశమున్నా ఆ దిశగా ఈ పార్టీలు ఏ చర్యా తీసుకోలేదు. కనీసం క్షేత్రస్థాయిలో ఈ పార్టీల మధ్య అవసరమైన మేర అవగాహన కోసం ప్రయత్నాలు కూడా జరగలేదు. లోక్‌సభ ఎన్నికలకు ముందు మళ్లీ కూటమి కుదురుకోవడానికి, పరస్పరం ఇచ్చి పుచ్చుకునే ధోరణికి పంచాయతీ ఎన్నికలు ఒక అవకాశం కాగా దానిని కూడా ఫ్రంట్ వదులుకున్నట్టుగా కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో మిత్రత్వాన్ని పెంపొందించుకునేందుకు ఈ ఎన్నికల్లో కనీ సం సీపీఐ–టీజేఎస్ కూడా సహకరించుకుం టున్న పరిస్థితులు లేవు. దీంతో కూటమి కొనసాగింపు కష్టమేననే చర్చ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో సాగుతోంది. టీడీపీ ఉంటుందా? కూటమిలో టీడీపీని చేర్చుకోవడం, ఎన్నికల ప్రచారాన్ని ఏపీ సీఎం చంద్రబాబు ముందుండి నడిపించడం ప్రతికూలంగా మారిందని ఇప్పటికే భాగస్వామ్యపక్షాలు విశ్లేషించాయి. ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ మళ్లీ ముందుకు రావడానికి బాబు అనుసరించిన వైఖరే కారణమని ఈ పక్షాలు నమ్ముతున్నాయి. ఇకపై కూటమి కొనసాగుతుందా లేదా అన్న అనుమానాలకు తోడు, టీడీపీ పట్ల ఎలాంటి వైఖరి తీసుకుంటాయనే అంశంపై స్పష్టత లోపిం చింది. టీడీపీ వల్ల నష్టం జరగలేదని కొం దరు కాంగ్రెస్ నేతలు అంటున్నారు. కాంగ్రెస్‌లో ఒక గ్రూపు టీడీపీని చేరడాన్ని వ్యతిరేకిస్తోంది. ఇటు టీడీపీని ఫ్రంట్‌లో కొనసాగించడంపై సీపీఐ, టీజేఎస్ అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశాలున్నాయి. దీంతో ఈ అంశంపై కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా తాత్సారం చేస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
సాక్షి, హైదరాబాద్: గ్రామపంచాయతీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ)కమిషనర్ వి.నాగిరెడ్డి హెచ్చరించారు. జీహెచ్ఎంసీ పరిధి, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పంచా యతీ ఎన్నికల కోడ్ వర్తించదని తెలిపారు. ఇప్పటివరకు కోడ్ ఉల్లంఘనకు సంబంధించిన కేసులు నమోదు కాలేదని చెప్పారు. శుక్రవారం ఓ ప్రైవేట్ హోటల్లో పంచాయతీ ఎన్నికల సాధారణ పరిశీలకులు, వ్యయ పరిశీలకులతో ఆయన సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో ఆయా వర్గాలపై ఒత్తిళ్లు తెచ్చి బలవంతంగా ఏకగ్రీవంగా ఎన్నుకునే ప్రయత్నాలు చేయొద్దని సూచించారు. అ లాంటి చర్యలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగితే రీ పోలింగ్ జరిపేలా చర్యలు తీసు కోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇ చ్చినట్లు పేర్కొన్నారు. ప్రతి పంచాయతీలో పోలీసులు అందుబాటులో ఉంటారని, అవసరమైతే అదనపు బలగాలూ అందుబాటులో ఉంటాయ న్నారు. ఎన్నికల్లో నిర్దేశించిన వ్యయ పరిమితిని మించి ఖర్చుచేస్తే చర్యలు తీసుకుంటా మన్నారు. గత ఎన్నికల్లో ఖర్చులు చూపెట్టని వారి ని అనర్హులుగా ప్రకటించినట్లుగానే, ఈసారి కూడా ఎన్నికల ఖర్చు అధికంగా చేస్తే కఠిన చర్య లుంటాయన్నారు. పంచాయతీల్లో ప్రస్తుతం అమలవుతున్న ప్రభుత్వ పథకాలు యథావిధిగా కొనసాగుతాయన్నారు. గ్రామ పంచాయితీలకు సం బంధించిన కొత్త పథకాలు మాత్రం చేపట్టేందుకు వీల్లేదని తెలిపారు. సమావేశంలో పంచాయతీ రాజ్ కమిషనర్ నీతూ ప్రసాద్, రాష్ట్ర ఎన్నికల సం ఘం కార్యదర్శి అశోక్ కుమార్, ఎన్నికల పరిశీలకు లు, ఆడిట్ అధికారులు పాల్గొన్నారు. వీరికి 2018 కొత్త పంచాయతీ చట్టం, ఎన్నికల విధులు, విధానాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వ్యయ పరిశీలకులకు జిల్లాలు కేటాయించినట్లు తెలియజేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై పరిశీలకులకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు.. ఈ నెలలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు వి.నాగిరెడ్డి తెలిపారు. ఎన్నికలపై ఉన్నతస్థాయి సమీక్ష.. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ, వీటితో ముడిపడిన అంశాలపై శుక్రవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా పంచాయతీ ఎన్నికలు జరగనున్న వివిధ ప్రాంతాల్లోని శాంతి భద్రతలు, బడ్జెట్, రవాణా ఏర్పాట్లు, ఎన్నికల నిర్వహణకు పోలింగ్ సిబ్బంది నియామకాలపై చర్చించారు. సమావేశంలో సీఎస్ ఎస్కే జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డి, పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్, అదనపు డీజీపీ జితేందర్, రాష్ట్ర ఎన్నికల సం ఘం కార్యదర్శి అశోక్ కుమార్ పాల్గొన్నారు. -
ఏకగ్రీవం కావాలి!
సాక్షి, హైదరాబాద్: గ్రామపంచాయతీ ఎన్నికలపై టీఆర్ఎస్ గురి పెట్టింది. అన్ని గ్రామపంచాయతీల్లోనూ టీఆర్ఎస్ మద్దతుదారులు గెలిచేలా వ్యూహం రచిస్తోంది. వీలైనన్ని ఎక్కు వ గ్రామపంచాయతీల ఎన్నికలు ఏకగ్రీవమయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ఏకగ్రీవమయ్యే గ్రామపంచాయతీల్లో టీఆర్ఎస్ మద్దతుదారులు సర్పంచ్‌లుగా ఉండేలా వ్యూహం అమ లు చేస్తోంది. గ్రామస్థాయిలోని శ్రేణులకు అవకాశాలు కల్పించే ఎన్నికలు కావడంతో ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలని టీఆర్ఎస్ అధిష్టానం ఆదేశించింది. గ్రామాలవారీగా ముఖ్యకార్యకర్తల సమావేశాలు నిర్వహించి వీలైనంత వరకు ఏకగ్రీవంగా ఎన్నికలయ్యేలా చూడాలనీ, వీలుకాని పరిస్థితుల్లో టీఆర్ఎస్ మద్దతుదారులే గెలిచేలా వ్యూహం అమలు చేయాలని స్పష్టం చేసింది. టీఆర్ఎస్ అధిష్టానం ఆదేశాలతో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జీలు పంచాయతీ ఎన్నికలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ కోసం పని చేసినవారిని గుర్తించి అవకాశాలు ఇవ్వాలని భావిస్తున్నారు. గ్రామాల్లో మంచి పేరున్న వారిని ఎంపిక చేసి ఏకగ్రీవమయ్యేందుకు చర్చలు జరుపుతున్నారు. ఏకగ్రీవ ఎన్నిక జరిగిన గ్రామపంచాయతీకి రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మొత్తంతోపాటు తమ అభివృద్ధి నిధుల నుంచి మరో రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఇచ్చేందుకు ఎమ్మెల్యేలు అంగీకారం తెలుపుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపి క అధికార పార్టీ ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది. పార్టీ తరఫున ఒకరి పేరు చెప్పినా సొంత పార్టీలోని వారి నుంచే మరికొందరు బరిలో ఉండే పరిస్థితి ఉంది. పోటీపడే వారు ఎక్కువగా ఉండడంతో ఎవరికి సర్ది చెప్పాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. కేటీఆర్ తొలి టాస్క్... టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కె.తారకరామారావు నియమితులైన తర్వాత తొలి సారి జరుగుతున్న ఎన్నికలు కావడంతో అధికార పార్టీ వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకుం టోంది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన తర్వాత జరిగిన టీఆర్ఎస్ తొలి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కేటీఆర్ పంచాయతీ ఎన్నికలపై ప్రధానంగా ప్రస్తావించారు. ఏకగ్రీవంగా ఎన్నికయ్యే ప్రతి గ్రామపంచాయతీకి రూ.పది లక్షలు గ్రాంట్ వస్తుంది. వీలైనన్ని గ్రామపంచాయతీల్లో ఏకగ్రీవ ఎన్నికలు జరిగేలా ప్రయత్నించాలి’అని టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గబాధ్యులను దిశానిర్దేశం చేశారు. అప్పటి నుంచి రాష్ట్ర కార్యవర్గ ముఖ్యులు, ఎమ్మెల్యేలు పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ మద్దతుదారుల విజయం కోసం వ్యూహం మొదలుపెట్టారు. పంచాయతీలను ఏకగ్రీవం చేసేందుకు మండలాలవారీగా కసరత్తు ముమ్మరం చేశారు. -
ఇక ప్రకటనే తరువాయి!
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల నిర్వహణకు కసరత్తు పూర్తయింది. రాష్ట్రంలోని 12,751 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఒకట్రెండు రోజుల్లో షెడ్యూల్ ప్రకటించే అవకాశాలున్నాయి. మండల, వార్డు స్థాయిల్లో సర్పంచ్, వార్డుసభ్యుల రిజర్వేషన్లకు సంబంధించిన జిల్లాల వారీ గెజిట్లను సోమవారం పంచాయతీరాజ్ శాఖ అధికారులు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు అందజేశారు. ఈ ఎన్నికల్లో 1,49,73,000 మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఫలితాలు ప్రకటించనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత రోజూ సాయంత్రం 6 గంటల వరకు ప్రచారం నిర్వహించుకునేందుకు అభ్యర్థులను అనుమతించనున్నారు. సర్పంచ్ అభ్యర్థుల కోసం 30, వార్డు సభ్యుల కోసం 20 ఎన్నికల గుర్తులను ఎన్నికల సంఘం సిద్ధం చేసి ఉంచింది. ఒక గుర్తును పోలి మరో గుర్తు లేకుండా చర్యలు తీసుకున్నట్లు అధికారవర్గాలు పేర్కొన్నాయి. గత ఎన్నికల్లో పోటీ చేసి ఎన్నికల వ్యయ లెక్కలను సమర్పించని కారణంగా 12,716 మందిని ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులుగా ఎన్నికల సంఘం తాజాగా ప్రకటించింది. ఈ ఎన్నికల్లో రేషన్ డీలర్లు సైతం పోటీ చేయొచ్చని స్పష్టతనిచ్చింది. బలవంతపు ఏకగ్రీవాలపై చర్యలు ప్రజాస్వామ్యబద్ధంగా సర్పంచ్, వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ఇబ్బంది లేదని, ఈ పదవులను వేలం వేయడం లేదా ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసి ఏకగ్రీవం చేసేందుకు ప్రయత్నిస్తే సంబంధిత జిల్లా కలెక్టర్‌తో విచారణ జరిపించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఎన్నికల సందర్భంగా రాష్ట్ర స్పెషల్ పార్టీ పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేయనుంది. ఎన్నికల ఖర్చులపై స్పష్టత పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయనున్న సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల వ్యయ పరిమితులపై ఎన్నికల సంఘం స్పష్టతనిచ్చింది. 5 వేలకు పైగా జనాభా గల గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థి రూ.2.5 లక్షలు, వార్డు సభ్యుడు రూ.50 వేల వరకు ఖర్చు చేయొచ్చని తెలిపింది. 5 వేల లోపు జనాభా ఉంటే రూ.1.5 లక్షల లోపు, వార్డు సభ్యుడు రూ.30 వేల వరకు మాత్రమే వ్యయం చేయాలని తెలిపింది. ఎన్నికల నిర్వహణకు 95 వేల బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేసింది. -
మహిళా.. ఏలుకో
పురుషులతో సమానంగా అన్నిరంగాల్లో రాణిస్తున్న మహిళలు.. రాజకీయంగా సత్తా చాటడానికి సిద్ధమయ్యారు. ఇంకా చెప్పాలంటే పురుషుల కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేసి ప్రజా ప్రతినిధులు కాబోతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వం మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కేటాయించడంతో సగం స్థానాల్లో వారే బరిలో దిగాల్సిన పరిస్థితి. దానికితోడు జిల్లా జనాభాలో పురుషులతో పోల్చుకుంటే మహిళల సంఖ్య అధికంగా ఉండటంతో మరిన్ని ఎక్కువ స్థానాలు వారికే సొంతమయ్యాయి. దాంతోపాటు చాలా మంది పతులు తమ భార్యలను బరిలోకి దింపుతుండటంతో ఈసారి ఎన్నికల్లో మహిళల ప్రాతినిధ్యం ఎక్కువగా నమోదవుతోంది. సాక్షి, సిద్దిపేట: జిల్లా జనాభాలో పురుషుల కన్నా.. 3526 మంది మహిళలే అధికంగా ఉన్నట్లు అధికారులు లెక్కల్లో తేల్చేశారు. జిల్లాలోని సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్, దుబ్బాక పాత మున్సిపాలిటీలకు తోడు.. ఈ ఏడాది చేర్యాల పట్టణానికి కూడా మున్సిపాలిటీ హోదాను కల్పించారు. ఈ ఐదు మున్సిపాలిటీలు పోగా మిగిలిన 22 మండలాల పరిధిలో కొత్తవీ పాతవీ కలిపి మొత్తం 499 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో మొత్తం 7,95,960 మంది జనాభా ఉన్నారు. వీరిలో 3,96,082 మంది పురుషులు ఉండగా... 3,99,608 మంది మహిళలు ఉన్నారు. అంటే పురుషుల కన్నా మహిళలు 3526 మంది ఎక్కువగా ఉండటం గమనార్హం. రాజ్యాంగంలో పొందుపరిచిన నిబంధనల ప్రకారం మొత్తం స్థానాల్లో మహిళలకు యాభై శాతం కేటాయించాల్సి ఉంది. ఇలా ఎస్సీ, ఎస్టీ, బీసీలతోపాటు జనరల్ స్థానాల్లో కూడా యాభై శాతం మహిళలకే కేటాయిస్తారు. దీంతో మొత్తం 499 పంచాయతీల్లో సంగం అంటే 249 స్థానాలు మహిళలకు కేటాయించారు. జిల్లాలోని రిజర్వేషన్ల కేటాయింపులో జనాభా శాతాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవడంతో పురుషులకన్నా నాలుగు స్థానాలు ఎక్కువగా మహిళలకు కేటాయించారు. దీంతో జిల్లాలో 252 స్థానాలు మహిళలకే కేటాయించారు. ఈ కేటాయింపులు కూడా రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో లాటరీ పద్ధతిన జరిగింది. మహిళలకు 252 గ్రామ పంచాయతీలు స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ అమల్లో ఉండటంతో.. జిల్లాలోని మొత్తం 499 గ్రామ పంచాయతీల్లో సగానికి మించి 252 స్థానాలు మహిళలకు కేటాయిస్తూ రాష్ట్ర పంచాయతీ రాజ్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా చూస్తే మొత్తం గ్రామ పంచాయతీల్లో 18 స్థానాలు ఎస్టీలకు, 93 స్థానాలు ఎస్సీలకు, 143 స్థానాలు బీసీలకు కేటాయించారు. మిగిలిన 245 స్థానాలు జనరల్ రిజర్వేషన్‌గా కేటాయించారు. వీటిల్లో కూడా సగం స్థానాలు మహిళలకు కేటాయించాల్సి ఉంది. కావున ఎస్టీల్లో 10, ఎస్సీల్లో 47, బీసీల్లో 72, జనరల్ స్థానాల్లో 123 మొత్తం 252 మహిళలకు కేటాయించారు. అదేవిధంగా మహిళల కన్నా 4 స్థానాలు తక్కువగా 247 జనరల్ విభాగానికి కేటాయించారు. అయితే కొన్ని గ్రామాల్లో జనరల్ స్థానాలుగా కేటాయించినప్పటికీ అక్కడ ఉన్న నాయకులు పెద్ద పదవుల్లో ఉండటం, ఉద్యోగులుగా పనిచేయడం, ఉత్సాహవంతులైన మహిళలు ఉండే అవకాశం ఉంది. దీంతో పతులకు బదులుగా సతులను పోటీల్లో దింపే అవకాశం ఉంది. ఇలా మహిళలకు కేటాయించిన 252 పంచాయతీలే కాకుండా జనరల్ విభాగంలో కూడా మహిళలు పోటీలో ఉండే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. -
గెలుపే లక్ష్యం
శాసనసభ ఎన్నికల్లో సంగారెడ్డి మినహా మిగతా నాలుగు అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందిన టీఆర్ఎస్.. పంచాయతీ ఎన్నికలపైనా దృష్టి సారించింది. పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే లోక్‌సభ ఎన్నికలు జరగనుండడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడిన క్రియాశీల కార్యకర్తలు, నాయకులకు ప్రాధాన్యత ఇస్తూనే, గెలుపే లక్ష్యంగా సర్పంచ్, వార్డు స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దించేలా వ్యూహం సిద్ధం చేస్తోంది. రిజర్వేషన్ కోటాకు అనుగుణంగా సంబంధిత కేటగిరీలో బలమైన అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యతలను ఎమ్మెల్యేలు తీసుకుంటున్నారు. – సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి గ్రామ పంచాయతీ ఎన్నికలను జనవరి నెలాఖరులోగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు వేగవంతం చేసింది. ఎన్నికల నిర్వహణలో అత్యంత కీలకమైన రిజర్వేషన్ల ఖరారు అంశం కొలిక్కిరాగా, నేడో రేపో గ్రామ పంచాయతీల వారీగా వివరాలు విడుదల చేయనున్నారు. జిల్లాలోని 647 గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాలు, 5,778 వార్డు సభ్యుల ఎన్నిక జరగనుండడంతో గ్రామ స్థాయిలో రాజకీయం వేడెక్కింది. రాజకీయ పార్టీలు, వాటి గుర్తులతో సంబంధం లేకుండా ఎన్నికలు జరుగుతుండడంతో గ్రామాలపై పట్టు నిలపుకొనేందుకు అన్ని రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీ సాధించిన టీఆర్ఎస్.. ఐదేళ్ల పాటు గ్రామ స్థాయిలో పాలన సజావుగా సాగేందుకు తమ పార్టీ మద్దతుదారులు సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాల్లో తమ పార్టీ మద్దతుదారులు ఉండాలని కోరుకుంటోంది. దీంతో గ్రామ పంచాయతీ రాజకీయాలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా దృష్టి సారించారు. జిల్లాలో సంగారెడ్డి మినహా, మిగతా నాలుగు అసెంబ్లీ స్థానాల్లోనూ టీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలే ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో తమకు గ్రామ స్థాయిలో అండగా నిలబడిన వారితో పాటు, తమకు విధేయులుగా ఉండేవారిని బరిలోకి దించా లని టీఆర్ఎస్ శాసనసభ్యులు యోచిస్తున్నారు. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులను ఎంపిక చేయడంతో పాటు, ప్రజాదరణ, ఆర్థిక వనరులు ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలని పార్టీ అధిష్టానం నుంచి ఎమ్మెల్యేలకు ఆదేశాలు అందినట్లు సమాచారం. ఏదేని రిజర్వుడు కేటగిరీలో ప్రజాదరణ ఉండి, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న కార్యకర్తలకు అవసరమైన ఆర్థిక భారం చేయాల్సిందిగా ఎమ్మెల్యేలకు సూచించి నట్లు సమాచారం. ఎంపీలు, ఎమ్మెల్సీలకూ బాధ్యత? ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, ఆర్థిక సాయం, ప్రచారం తదితర అంశాల్లో ఎంపీలు కూడా బాధ్యతలు తీసుకోవాలని టీఆర్ఎస్ అధిష్టానం ఆదేశించినట్లు సమాచారం. గ్రామ స్థాయిలో పదవుల కోసం పార్టీలోనే అంతర్గతంగా నేతలు, కార్యకర్తల నడుమ పోరు తీవ్రంగా ఉండే అవకాశం ఉండడంతో, పార్టీ తరఫున ఒకే వ్యక్తి పోటీలో ఉండేలా చూడాలని నిర్ణయించారు. అదే సమయంలో అవకాశం దక్కని కేడర్ పార్టీని వీడకుండా జాగ్రత్తలు తీసుకోవాలనే వ్యూహంతో ఎమ్మెల్యేలు ఉన్నారు. గ్రామ పంచాయతీల వారీగా రిజర్వేషన్ల వివరాలు అధికారికంగా వెలువడిన వెంటనే, రిజర్వుడు కేటగిరీని అనుసరించి గ్రామాల వారీగా బలమైన అభ్యర్థుల జాబితాను తయారు చేసే పనిలో టీఆర్ఎస్ ముఖ్య నేతలు ఉన్నారు. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ కేడర్‌లో సమన్వయం లోపం తలెత్తితే లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై ప్రభావం ఉంటుందనే కోణంలో పార్టీ ఎమ్మెల్యేలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు, ఎమ్మెల్సీలకు కూడా ప్రచారం, సమన్వయ బాధ్యతలు అప్పగిం చడం ద్వారా మెరుగైన ఫలితాలు రాబట్టాలనే యోచనలో టీఆర్ఎస్ నాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీకి పట్టున్న గ్రామ పంచాయతీల్లో ఎన్నిక ఏకగ్రీవం చేసేందుకు ప్రయత్నించాలని, సాధ్యం కాని పక్షంలో బలమైన అభ్యర్థిని బరిలోకి దించాలని టీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది. -
ఆన్లైన్లో ‘పంచాయతీ’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి రోజురోజుకూ పెరుగుతోంది. వీలైనంత త్వరగా ఈ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశాలుండటంతో వీటి నిర్వహణ, ఇతరత్రా అంశాలపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలు, మండలాల పరిధిలోని సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాల్లో ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళల రిజర్వేషన్లు, అన్–రిజర్వ్డ్ స్థానాలను అధికారికంగా ప్రకటించిన వెంటనే పల్లెల్లో ఆయా స్థానాలకు పోటీచేసే ఆశావహుల తాకిడి ఒక్కసారిగా పెరగనుంది. వెబ్సైట్లో సమాచారం పంచాయతీకి పోటీ చేసే వారి వివరాలు మొదలు, నామినేషన్లు, ఫలితాల వరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) వెబ్సైట్లో తెలుసుకునేందుకు అవసరమైన సమాచారాన్ని పొందుపరుస్తున్నారు. సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు వేసే వారు, ఉపసంహరించుకునేవారు, పోటీ చేస్తున్న వారి వివరాలు ఈ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో తెలుసుకోవచ్చు. ఎస్ఈసీ వెబ్సైట్లో టీ ఈ–పోల్ లాగిన్, అబ్జర్వర్ పోర్టల్, క్యాండిడేట్ పోర్టల్, ఓటర్ పోర్టల్, ఈవీఎం ట్రైనింగ్ మాడ్యూల్ వంటి ఆప్షన్లు ఉన్నాయి. వీటి ద్వారా ఆయా అంశాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలు తెలుసుకునేందుకు అవకాశం ఏర్పడింది. వీటితో పాటు గ్రామపంచాయతీ ఎన్నికల ప్రక్రియ, ఇతర విషయాలపైఅవగాహనతో పాటు ఎప్పటికప్పుడు ఎస్ఈసీకి సంబంధించిన సమాచారాన్ని, వివరాలు తెలుసుకోవచ్చు. పోటీచేసే వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యాండిడేట్ పోర్టల్‌లో సర్పంచ్‌గా పోటీచేసేందుకు అర్హతలు, పాటించాల్సిన నియమ నిబంధనలు, తదితర వివరాలను అందుబాటులోకి తీసుకురానున్నట్టు అధికారులు వెల్లడించారు. ఫలితాల సమాచారం సైతం నామినేషన్ల దాఖలు మొదలు పంచాయతీ ఫలితాలు కూడా ఈ వెబ్సైట్లో అందుబాటులోకి రానుండడంతో రాష్ట్రంలోని ఏ గ్రామంలో ఎవరు గెలిచారో ఎవరైనా తెలుసుకునేందుకు వీలు ఏర్పడనుంది. పోటీచేసే వారికే కాకుండా ఈ ఎన్నికల్లో ఓట్లు వేసే వారికి కూడా ఈ వెబ్సైట్ ద్వారా సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల స్లిప్‌లను డౌన్లోడ్ చేసుకోగలిగినట్టే, గ్రామపంచాయతీ ఎన్నికల్లోనూ ఓటర్లు తమ స్లిప్‌లను డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని అధికారులు కల్పిస్తున్నారు. ఎన్నికల విధులు నిర్వహించే అధికారులకు కూడా ఈ పోర్టల్ ఉపయోగకరంగా ఉంటుంది. అధికారులు పాటించాల్సిన విధివిధానాలు, అభ్యర్థుల ఎన్నికల ప్రచారం, ఇతరత్రా వ్యయ పరిశీలన, అబ్జర్వర్ల నివేదికలు ఎలా సమర్పించాలనే అంశాలను కూడా ఇందులో పొందుపరిచారు. దీంతో ఎన్నికల విధులు నిర్వహించే అధికారుల పని కూడా సులువు అవుతుందని భావిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్సైట్లో ఆయా అంశాలను పొందుపరచడంతో పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అప్డేట్స్, నోటిఫికేషన్స్‌కు సంబంధించిన తాజా సమాచారాన్ని కూడా అధికారులు ఇప్పటికే ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. -
3 లేదా 4లోగా ‘పంచాయతీ’ నోటిఫికేషన్?
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల మూడు లేదా నాలుగు తేదీల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నాయి. గతంతో పోల్చితే బీసీ రిజర్వేషన్లు గణనీయంగా తగ్గిపోవడంపై కొన్ని వర్గాల్లో నిరసనలు వ్యక్తమవుతున్న దృష్ట్యా న్యాయపరంగా ఏవైనా చిక్కులు ఎదురైతే తప్ప అనుకున్న తేదీకే ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటన విడుదల కావొచ్చునని అధికారులు చెబుతున్నారు. ఎన్నికల నిర్వహణకు అనుగుణంగా అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. సర్పంచ్‌లు, వార్డు సభ్యుల రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ శుక్రవారానికల్లా పూర్తయ్యే అవకాశాలున్నాయి. దీంతో శనివారంలోగా పూర్తి జాబితాను అందజేయాలని జిల్లా కలెక్టర్లు, డీపీఓలను పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్ ఇప్పటికే ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల ఖరారుపై జిల్లా, మండల స్థాయిలో కసరత్తు వేగంగా సాగుతోంది. ఇప్పటికే సగానికిపైగా జిల్లాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లు పూర్తయినట్లు సమాచారం. కొన్నిచోట్ల మాత్రమే ఎస్సీ, ఎస్టీ, బీసీ స్థానాల నిర్ధారణలో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో కిందిస్థాయి అధికారులు ఎదుర్కొంటున్న సాంతికేతిక, ఇతరత్రా సమస్యలను ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారానికల్లా రాష్ట్రవ్యాప్తంగా రిజర్వేషన్లకు సంబంధించిన వివరాలు పీఆర్ కమిషనర్‌కు అందే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. వాటికి అనుగుణంగానే జిల్లాల్లో రిజర్వేషన్లపై కలెక్టర్లు గెజిట్లు విడుదల చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. జిల్లాల నుంచి వచ్చిన గెజిట్లను క్రోడీకరించి పీఆర్ ముఖ్యకార్యదర్శి లేదా కమిషనర్ వైపు నుంచి శనివారానికల్లా రాష్ట్ర ఎన్నికల సంఘానికి (ఎస్ఈసీ) రిజర్వేషన్ల జాబితా అందించవచ్చని తెలుస్తోంది. ఈ జాబితాను అన్ని కోణాల్లో పరిశీలించి వాటిపై న్యాయ సలహా తీసుకున్నాక ఎస్ఈసీ కూడా రెండు, మూడు రోజుల వ్యవధిలోనే ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేసేందుకే ఎక్కువ అవకాశాలున్నాయని తెలుస్తోంది. -
బీసీ రిజర్వేషన్ల తగ్గింపుపై బీజేపీ మండిపాటు
సాక్షి, హైదరాబాద్: గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు తగ్గించడం పట్ల బీజేపీ మండిపడింది. గతంలో ఎస్సీ, ఎస్టీలను మోసం చేసిన టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీసీలను కూడా మోసం చేసిందని పేర్కొంది. బుధవారం బీజేపీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ విలేకరులతో మాట్లాడారు. రిజర్వేషన్ల తగ్గింపును ఖండిస్తున్నామని, ప్రభుత్వం జారీ చేసిన పంచాయతీరాజ్ ఆర్డినెన్స్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. బీసీ జనాభా గణన తర్వాతే రిజర్వేషన్లు ఖరారు చేయాలని హైకోర్టు ఆదేశించినా.. బీసీలకు అన్యాయం చేసేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుందన్నారు. రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీలంతా టీఆర్ఎస్ చేస్తున్న మోసాన్ని గమనించాలన్నారు. బీసీ రిజర్వేషన్లు సక్రమంగా లేకపోవడం వల్ల వందల గ్రామపంచాయతీల్లో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. రాజ్యాధికారానికి దూరం చేస్తున్నారు... ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం ఓట్ల కోసం గొర్రెలు, బర్రెలు అంటూ బీసీలను రాజ్యాధికారానికి దూరం చేస్తున్నారని లక్ష్మణ్ దుయ్యబట్టారు. బీసీ రిజర్వేషన్లలో న్యాయం జరిగే వరకు బీజేపీ పోరాటం చేస్తుందన్నారు. రాష్ట్రంలో పాలనను గాలికి వదిలేసి ఫెడరల్ ఫ్రంట్ అంటూ కేసీఆర్ తిరుగుతున్నారని, ఈ ఫ్రంట్లు.. టెంట్లు.. వారి కుటుంబం కోసమేనని విమర్శించారు. గతంలో ఇలాంటి ఫ్రంట్‌లన్నీ విఫలమయ్యాయని, కేసీఆర్ ప్రయత్నాలు కూడా అంతేనన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికలు బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ మ«ధ్యనేనని తెలిపారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల మధ్య ఎంతో వ్యత్యాసం ఉంటుందని, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రావడం మోదీ ప్రధాని కావడం ఖాయమని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో 22 లక్షల ఓట్ల గల్లంతుకు కారణమైన వారిపై చర్యలు చేపట్టే వరకు బీజేపీ పోరాటం చేస్తుందన్నారు. తాము గతంలో చెప్పినట్లు రజాకార్ల రాజ్యం వస్తుందని, అందుకు హైదరాబాద్‌లోని గ్లోబల్ ఆస్పత్రి ఘటనే నిదర్శనమని పేర్కొన్నారు. ఈ ఘటనను ఖండిస్తున్నామన్నారు. ఎమ్మెల్సీ రాంచందర్‌రావు మాట్లాడుతూ, ఓట్ల గల్లంతుపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు చేపట్టాలంటూ ఈ నెల 27న లక్ష్మణ్ నేతృత్వంలో కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కలవనున్నట్లు తెలిపారు. -
తొలివారంలో ‘పంచాయతీ’ నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ కసరత్తు ఊపందుకోవడంతో ఎన్నికల కమిషన్ జనవరి తొలివారంలోనే నోటిఫికేషన్‌ను వెలువరించే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. పంచాయతీ ఎన్నికలకు ఎస్సీ,ఎస్టీ,బీసీ రిజర్వేషన్లు, అన్‌రిజర్వుడ్ స్థానాలు ఖరారైన నేపథ్యంలో జిల్లా, మండల స్థాయిలో సర్పంచ్, వార్డు స్థానాల్లో రిజర్వేషన్లు నిగ్గుతేల్చే ప్రక్రియ కూడా వేగం పుంజుకుంది. ఒకటి రెండ్రోజుల్లోనే జిల్లా కలెక్టర్లు, ఆర్డీవోలు ఈ జాబితాను సిద్ధం చేసి పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్ కార్యాలయానికి సమర్పించేలా చర్యలు చేపట్టారు. రెండ్రోజుల్లోనే గ్రామస్థాయిల్లో రిజర్వేషన్లను ఖరారు చేసి ప్రకటించే అవకాశాలున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. గ్రామస్థాయిల్లో సర్పంచ్, వార్డుల కేటాయింపు ముగిశాక జిల్లాల వారీగా ఈమేరకు గెజిట్లు ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంటుంది. పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ ఈ వివరాలను రెండుమూడ్రోజుల్లో ప్రభుత్వానికి నివేదించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 29లోపు పంచాయతీ రిజర్వేషన్ల వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమర్పించనుంది. దీన్నిబట్టి జనవరి మూడు లేదా నాలుగు తేదీల్లో ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేసేందుకు అవకాశాలున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. సోమవారం ఎస్టీ, ఎస్సీ, బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసిన నేపథ్యంలో ఆయా జిల్లాల్లోని జనాభా పరంగా కేటాయించిన రిజర్వేషన్లలో కొన్ని అంశాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మొత్తం 12,751 గ్రామ పంచాయతీల్లో నల్లగొండ జిల్లా 844 స్థానాలతో తొలిస్థానంలో, మహబూబ్‌నగర్ జిల్లా 721 పంచాయతీలతో రెండో స్థానంలో, సంగారెడ్డి జిల్లా 647 స్థానాలతో మూడో స్థానంలో ఉన్నాయి. నాన్ షెడ్యూల్డ్ ఏరియాల్లో... మహబూబ్‌నగర్ జిల్లాలో అత్యధికంగా బీసీలకు 170 సర్పంచ్ స్థానాలు, నల్లగొండ జిల్లాలో అత్యధికంగా అన్‌రిజర్వుడ్‌కు(జనరల్ కేటగిరీ) 370 స్థానాలు, ఎస్సీలకు 136 స్థానాలు, ఎస్టీలకు అత్యధికంగా ఎస్టీలకు 69 సర్పంచ్ స్థానాలు రిజర్వ్ అయ్యాయి. అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీసీలకు రిజర్వ్ చేసిన పంచాయతీలే లేకపోవడం గమనార్హం. ఈ జిల్లాలో మొత్తం 479 పంచాయతీలు ఉన్నాయి. 25 మినహా అన్నీ షెడ్యూల్డ్ ఏరియాల్లోనే ఉండటంతో ఇతర ప్రాంతాల్లో అన్‌రిజర్వుడ్‌కు 11, ఎస్టీలకు 9, ఎస్సీలకు 5 స్థానాలు రిజర్వ్ చేశారు. దీంతో బీసీలకు ఒక్కటీ రిజర్వ్ కాలేదు. మహిళా రిజర్వేషన్లు అత్యధికంగా ఉన్న జిల్లాలు - బీసీ కేటగిరీలో మహబూబ్‌నగర్ జిల్లా–85, నల్లగొండ–82, సిద్ధిపేట–72, సంగారెడ్డి–69, కామారెడ్డిజిల్లా–66 స్థానాలు రిజర్వ్ అయ్యాయి. - ఎస్సీ కేటగిరీలో నల్లగొండ జిల్లా–68, సంగారెడ్డి–64, ఖమ్మం–60, రంగారెడ్డి–55, మహబూబ్నగర్జిల్లాలో–53 సర్పంచ్ స్థానాలు రిజర్వ్ చేశారు. - ఎస్టీ కేటగిరీలో నల్లగొండ జిల్లా–34, ఖమ్మం–29, మహబూబాబాద్–25, సూర్యాపేట–25, నిర్మల్‌జిల్లాలో–18 స్థానాలు మహిళలకు కేటాయించారు. -
29లోపు ‘పంచాయతీ’ రిజర్వేషన్లు
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కసరత్తు ఊపందుకుంటోంది. ముఖ్యంగా పంచాయతీలు, వార్డుల రిజర్వేషన్ల ఖరారులో జిల్లా, మండల యంత్రాంగాలు నిమగ్నమయ్యాయి. రాష్ట్రస్థాయిలో ఎస్టీ, ఎస్సీ, బీసీ రిజర్వేషన్లపై ఇప్పటికే స్పష్టత వచ్చిన నేపథ్యంలో మండలాల్లో రిజర్వేషన్లకు సంబంధించిన లెక్కలపై అధికారులు దృష్టి కేంద్రీకరించారు. రిజర్వేషన్ల ఖరారుకు అనుసరించాల్సిన విధానం, పాటించాల్సిన ఫార్ములాపై జిల్లా పంచాయతీ అధికారుల (డీపీఓ)కు పంచాయతీరాజ్ కమిషనర్ దిశానిర్దేశం చేసిన నేపథ్యంలో ఈనెల 29లోగా ఈ ప్రక్రియను ముగించేందుకు జిల్లా కలెక్టర్లు, డీపీఓలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడుంటాయన్న దానిపై ఇంకా పూర్తి స్పష్టత ఏర్పడని దృష్ట్యా రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లో పంచాయతీ ఎన్నికల వేడి ఇంకా పుంజుకోవడం లేదు. జిల్లా, మండల స్థాయిల్లో రిజర్వేషన్లను ప్రకటించాక ప్రచారం పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే శాసనసభ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో గ్రామస్థాయిల్లో బరిలో నిలిచేందుకు ఎంత మంది ముందుకు వస్తారన్నది, ఏ మేరకు పోటీ ఏర్పడుతుందనేది వేచి చూడాల్సి ఉంది. ఏకగ్రీవాలకు ఆర్థిక చేయూత.. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఏకగ్రీవ ఎన్నికలూ ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. ఎన్నిక ఏకగ్రీవమైతే మంచిదనే చర్చ కూడా కొన్ని వర్గాల్లో సాగుతోంది. గతంలో మాదిరిగానే ఏకగ్రీవ గ్రామ పంచాయతీలకు ప్రభుత్వపరంగా ప్రోత్సాహకాలు అందనున్నాయి. ఏకగ్రీవమయ్యే పంచాయతీలకు ఆర్థిక చేయూత కింద నిధులు అందుతాయి. ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లోనూ ఐదువేలకు పైబడి జనాభా ఉన్న పంచాయతీలకు రూ.15 లక్షలు, ఐదువేల కంటే తక్కువగా ఉన్న గ్రామాలకు రూ.10 లక్షల చొప్పున నిధులు మంజూరు చేస్తారు. ఈ నిధులను గ్రామీణాభివృద్ధి పనుల కోసం ఆయా పంచాయతీలు వెచ్చించాల్సి ఉంటుంది. తెలంగాణ ఏర్పడ్డాక కొత్త పంచాయతీరాజ్ చట్టంతో పంచాయతీల సంఖ్య 12,751కు పెరిగింది. తక్కువ జనాభా ఉన్న గ్రామాలు, తండాలు పంచాయతీలుగా మారిన నేపథ్యంలో ఏకగ్రీవాల సంఖ్యకూడా గణనీయంగా పెరిగే అవకాశాలున్నాయి. ఉమ్మడి ఏపీలో 2013లో పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో తెలంగాణ పరిధిలో 8,778 పంచాయతీలున్నాయి. ఆ ఎన్నికల్లో తెలంగాణలో 451 పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. ప్రోత్సాహం కింద ఈ పంచాయతీలకు నిధుల విడుదలలో కొంత జాప్యం జరిగినా ప్రకటించిన మేర నిధులు కేటాయించారు. -
నారీమణికి ఎన్ని..
ఆదిలాబాద్‌అర్బన్: స్థానిక సంస్థల ఎన్నికలకు తెరలేవడంతో గ్రామాల్లో వాతావరణం వేడెక్కింది. జనవరి 10లోపు పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రిజర్వేషన్లపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఖరారుకు సమయం దగ్గర పడుతున్న కొద్ది ఏ పంచాయతీలో ఎవరికి రిజర్వేషన్ దక్కుతుందనే ఆసక్తి నెలకొంది. ఎన్నికల ఆదేశాలు, మార్గదర్శకాలు, జీవోలు విడుదల చేయడం, అందుకనుగుణంగా జిల్లా అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేయడం లాంటివి చూస్తుంటే రిజర్వేషన్ల ఖరారుపైనే ఆసక్తి కలుగుతుంది. పంచాయతీ ఎన్నికల కోసం ఈసారి ప్రత్యేకంగా బీసీ ఓటర్ల గణన చేపట్టారు. మరోవైపు సుప్రీం కోర్టు రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని ఆదేశాలు జారీ చేయడంతో రిజర్వేషన్ల అంశం తీవ్ర ప్రాధాన్యతను సంతరించుకుంది. ముఖ్యంగా జిల్లాలో నూతనంగా ఏర్పడిన 226 గ్రామ పంచాయతీల్లో ఆశావహులు మరింత ఆసక్తితో పరిణామాలను గమనిస్తున్నారు. తమ గ్రామంలో తొలిసారిగా సర్పంచు ఎన్నికలు జరుగబోతున్నందున ఇప్పటికే చర్చలు మొదలెట్టారు. కాగా హడావిడి చూస్తుంటే మరో రెండు, మూడు రోజుల్లో రిజర్వేషన్లు ఖరారయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. మహిళలపైనే దృష్టి.. జిల్లా అధికారులు తాజాగా విడుదల చేసిన పంచాయతీ ఓటరు జాబితా ప్రకారం జిల్లాలో 3,36,647 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో బీసీలు 1,33,632 మంది ఓటర్లతో 39.69 శాతం ఉన్నారు. ఎస్టీలు 1,29,152 మంది ఓటర్లతో 38.36 శాతం ఉండగా, ఎస్సీలు 52,076 మంది ఓటర్లతో 15.46 శాతం ఉన్నారు. ఇతర వర్గానికి చెందిన వారు 21,787 మంది ఓటర్లతో 6.47 శాతం ఉన్నారు. జిల్లాలో 467 గ్రామ పంచాయతీలు ఉండగా, వీటి పరిధిలో 3,822 వార్డులు ఉన్నాయి. ఎస్టీలకు 248 పంచాయతీలు రిజర్వు కాగా, వంద శాతం ఎస్టీ జనాభా ఉన్న జీపీలు సైతం ఇందులోనే ఉన్నాయి. 219 జీపీలకే రిజర్వేషన్లు ఖరారు అయ్యే అవకాశాలు కన్పించగా, ఈ పంచాయతీల్లోనే బీసీ, ఎస్సీ, ఇతరుల రిజర్వేషన్ల అంశం తేలనుంది. రిజర్వేషన్ వల్ల ఏ వర్గం లాభపడుతుందోనని ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా మహిళల రిజర్వేషన్ ఆసక్తి కలిగిస్తుంది. స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తే జిల్లాలో 233 సర్పంచు స్థానాలు మహిళలకు దక్కేలా కనిపిస్తున్నాయి. కాగా 2013 సర్పంచు ఎన్నికల్లో 243 పంచాయతీలకు గానూ 126 చోట్ల మహిళలకు అవకాశం దక్కింది. ఈసారి ఎన్ని స్థానాలు సొంతం చేసుకుంటారనేది వేచి చూడాలి. మరో రెండు, మూడు రోజుల్లో రిజర్వేషన్లు.. రిజర్వేషన్ల ఖరారుపై ఉత్కంఠకు మరో రెండు, మూడు రోజుల్లో తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త పంచాయతీ రాజ్ చట్టంలోని మార్గదర్శకాలకు అనుగుణంగా రిజర్వేషన్లు ఖరారు చేయడం, జనవరి 2లోగా పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించడంతో ఏ గ్రామంలో చూసినా రిజర్వేషన్ల ఖరారుపైనే చర్చ జరుగుతోంది. ఎన్నికల రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులను నియమించడం, వారికి శిక్షణ ఇవ్వడంతో ఎన్నికల నిర్వహణపై కొత్త ఉత్సాహం నెలకొంది. కొత్త గ్రామాల్లో ఎన్నికలు జరుగనుండడంతో రిజర్వేషన్ల కోసం రెట్టింపు ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు. -
బీసీలను పాలనకు దూరం చేసే కుట్ర: భట్టి
సాక్షి, హైదరాబాద్: గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించడం వారిని పాలనకు దూరం చేసే కుట్ర అని కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. గ్రామపంచాయతీల్లో 50 శాతానికన్నా ఎక్కువ రిజర్వేషన్లను అమలు చేయాలంటే తగిన ఆధారాలు చూపాలని సుప్రీంకోర్టు చెప్తే ఆ తీర్పును తప్పుగా ప్రచారం చేసి ప్రభుత్వం దుర్మార్గపు విధానాలకు పాల్పడుతోందని బుధవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేశారు. లేదంటే బీసీలతో కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ఉద్యమాన్ని చేపడతామన్నారు. -
రిజర్వేషన్లపై ఉత్కంఠ
నారాయణఖేడ్: కొత్త రిజర్వేషన్ల ప్రకారమే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు పంచాయతీరాజ్ శాఖ సన్నాహాలు చేస్తోంది. సర్పంచ్ల పదవీకాలం ముగియడంతో ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో పాలన కొనసాగుతోంది. వచ్చే జనవరి 10వ తేదీలోగా గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయాలని హైకోర్టు స్పష్టం చేయడంతో పంచాయతీరాజ్‌శాఖ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు ప్రారంభించింది. ఎన్నికలు ముందుకు సాగాలంటే మొదట రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తిచేయాల్సి ఉంటుంది. రిజర్వేషన్లు 50శాతానికి మించకుండా ఉండాలని హైకోర్టు తీర్పు ఇవ్వడం, ఆ తీర్పును ఇటీవల సుప్రీంకోర్టు ధ్రువీకరించడం తెలిసిందే. దీంతో పంచాయతీల రిజర్వేషన్లు ఖరారు చేయడానికి పంచాయతీరాజ్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా ఈనెల 15న కులాల గణన పూర్తిచేసి కులాల వారీగా ఓటర్లను గుర్తించారు. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల వారీగా ఓటర్లను గుర్తించిన అధికారులు బీసీ గణనను ఈనెల 15న పూర్తి చేశారు. ఈమేరకు రిజర్వేషన్లను పరిశీలించిన మీదట కొత్తవి ప్రకటించనున్నారు. 1995 నుంచి రిజర్వేషన్ విధానం అమలులోకి రాగా జనాభా ఆధారంగా మండల యూనిట్‌గా రిజర్వేషన్ ఖరారు చేస్తున్నారు. జనరల్, జనరల్ మహిళ, బీసీ, బీసీ మహిళ, ఎస్సీ, ఎస్సీ మహిళ, ఎస్టీ, ఎస్టీ మహిళ కేటగిరీలు ఉండేలా రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో 1995, 2001, 2006, 2013లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఇప్పటివరకు గ్రామాలన్నింటికీ నాలుగు కేటగిరీల్లో రిజర్వేషన్లు వర్తించాయి. మరో నాలుగు కేటగిరీల్లో రిజర్వేషన్లు అమలు చేయాల్సి ఉండగా ఇప్పుడు అవేమీ వర్తించవు. కొత్త పంచాయతీరాజ్ చట్టం, కొత్త గ్రామాల ఏర్పాటుతో ఈ మార్పు అనివార్యమైంది. ఒక గ్రామానికి జనరల్ మహిళ రిజర్వేషన్ ఉంటే తిరిగి ఆ రిజర్వేషన్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 50శాతం మహిళలకు.. జిల్లాలో ఉన్న పంచాయతీల సంఖ్యను పరిగణనలోకి తీసుకొని అందులో 50శాతం పంచాయతీలను మహిళలకు రిజర్వ్ చేయనున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీల వారీగా పంచాయతీలను రిజర్వు చేయడానికి చర్యలు చేపట్టనున్నారు. కొత్తగా ఏర్పాటైన పంచాయతీల్లో ఎక్కువ శాతం గిరిజన తండాలే ఉండడంతో ఆ పంచాయతీలను ఎస్టీలకు రిజర్వ్ చేస్తారా లేదా జనరల్ స్థానాలుగా పరిగణిస్తారా తేలాల్సి ఉంది. ఎస్టీల జనాభా ఎక్కువ ఉన్న పంచాయతీలను జనరల్ స్థానాలకింద పరిగణిస్తే ఓసీ, బీసీలు ఎక్కువ మంది ఉన్నచోట నష్టం కలిగే అవకాశం ఉంది. పాత రిజర్వేషన్లకు ఇక చెల్లు.. నూతన పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం కొత్త రిజర్వేషన్ల ప్రాతిపదికన ఎన్నికలు జరగనున్నట్లు తెలుస్తోంది. గతంలో ఉన్న రిజర్వేషన్లను పరిగణనలోకి తీసుకునే పరిస్థితులు లేవు. కొత్త రిజర్వేషన్ల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ స్థానాలు కేటాయిస్తూ మహిళలకు కూడా రిజర్వేషన్ నిర్ణయిస్తారు. దీంతో ఆశావహుల్లో కొంత మందికి సంతోషం కలిగినా మరికొంత మందికి నిరాశ తప్పదు. సర్పంచ్ స్థానాలే కాకుండా వార్డు సభ్యుల స్థానాలు సైతం మారనున్నాయి. ఆశావహుల్లో ఉత్కంఠ.. సర్పంచ్ స్థానానికి పోటీచేసి తమ అదృష్టం పరీక్షించుకోవాలనుకునే ఆశావహుల్లో రిజర్వేషన్ల మార్పు తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. గత రిజర్వేషన్ ప్రకారం చూస్తే రిజర్వేషన్ మార్పుపై కొంత అవగాహన వస్తుంది. పెరిగిన పంచాయతీల సంఖ్య దృష్ట్యా కొత్త రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహించాల్సి వస్తున్నందున ఏ పంచాయతీ రిజర్వేషన్ ఏవర్గానికి కేటాయిస్తారో అంతుచిక్కని పరిస్థితులు ఉన్నాయి. తమకు పోటీచేసే అవకాశం వస్తుందా.. రాదా అని ఆశావహులు ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు. కులాల వారీగా ఓటర్ల గణన పూర్తయిన వెంటనే పంచాయతీరాజ్ శాఖ రిజర్వేషన్లకు సంబంధించిన మార్గదర్శకాలను జారీచేస్తే అందరి ఉత్కంఠకు తెరపడనుంది. ఏర్పాట్లలో అధికారులు.. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు జిల్లా అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. వారంలోపు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో అధికారులు అందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. జిల్లాలో 26మండలాలకు గాను 647 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 5,778 వార్డులను విభజించారు. 5,778 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. గతంలో అధికారులకు ఒక విడత ఎన్నికల నిర్వహణకు శిక్షణ ఇవ్వగా బదిలీల కారణంగా మరోమారు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. -
పంచాయతీకి పోవుడే..
సాక్షిప్రతినిధి, ఖమ్మం : గ్రామ పంచాయతీ ఎన్నికలకు మూడు నెలల్లో ముహూర్తం ఖరారు కానుంది. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. ఆగస్టు ఒకటో తేదీతో గ్రామ పంచాయతీ పాలక వర్గాల పదవీ కాలం ముగిసింది. ఈ క్రమంలో ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించి గ్రామ పరిపాలన కొనసాగిస్తోంది. కొత్త శాసనసభ కొలువుదీరాక పంచాయతీ ఎన్నికలు ఉంటాయని, ఈలోపు అవకాశం లేదని రాజకీయ వర్గాలు భావించాయి. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తమవుతున్న క్రమంలో ఊహించని విధంగా పంచాయతీ ఎన్నికల అంశం ముందుకొచ్చింది. దీంతో రాజకీయ పక్షాలు గ్రామ రాజకీయాలపై దృష్టి సారించి.. పంచాయతీ పాలక వర్గాలను కైవసం చేసుకునేందుకు వ్యూహ ప్రతివ్యూహాలు రూపొందించుకునే పనిలో నిమగ్నమయ్యాయి. ప్రభుత్వం ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలని ఆదేశించినా.. అందుకు అనుగుణంగా జిల్లా పంచాయతీ అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేసి ఉంచారు. గ్రామ పంచాయతీ ఎన్నికలను ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలతో కాకుండా బ్యాలెట్ పేపర్ పద్ధతిన నిర్వహించనుండటంతో ఇప్పటికే వివిధ రాష్ట్రాల నుంచి బ్యాలెట్ బాక్సులను అధికారులు తెప్పించి ఉంచారు. కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలతో సహా అన్ని పంచాయతీల్లో పోలింగ్ కేంద్రాల ఏర్పాటు.. వాటి నిర్వహణ, పోలింగ్ కేంద్రాలకు అనువైన భవనాల అన్వేషణ సైతం పూర్తి చేశారు. అయితే శాసనసభ ఎన్నికల పర్వం కొనసాగుతున్న సమయంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి గల సానుకూల, ప్రతికూల అంశాలను అధికారులు పరిశీలించి.. ప్రభుత్వానికి నివేదిక పంపే పనిలో నిమగ్నమయ్యారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి బీసీ ఓటర్ల గణన పూర్తి కావాల్సి ఉంది. 584 జీపీలకు ఎన్నికలు జిల్లాలో మొత్తం 584 గ్రామ పంచాయతీలున్నాయి. గతంలో 427 గ్రామ పంచాయతీలు ఉండగా.. ఇందులో పలు పంచాయతీలు కార్పొరేషన్, మున్సిపాలిటీలలో విలీనమయ్యాయి. కొత్తగా ప్రభుత్వం 167 గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసింది. దీంతో మొత్తం 584 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఇందులో 99 ఏజెన్సీ పంచాయతీలు ఉన్నాయి. వీటికి సంబంధించి గతంలోనే జిల్లా అధికార యంత్రాంగం కసరత్తు పూర్తి చేసింది. అవసరమైన పోలింగ్ సామగ్రి, సిబ్బంది తదితర వివరాలను ఉన్నతాధికారులకు నివేదిక రూపంలో పంపించారు. అన్నీ సిద్ధం.. గ్రామ పంచాయతీ పాలక వర్గాల పదవీ కాలం ముగిసిన సందర్భంలో గతంలోనే అధికారులు ఎన్నికలకు సంబంధించిన కసరత్తు పూర్తి చేశారు. మొత్తం 4,870 పోలింగ్ బాక్సులను సిద్ధంగా ఉంచారు. వీటిలో కర్ణాటక నుంచి 3,100 బాక్సులను తెప్పించారు. అవసరాన్నిబట్టి మరికొన్నింటిని కూడా తెప్పించనున్నారు. జిల్లాలోని 5,338 వార్డుల్లో అంతే మొత్తంలో పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే ఎన్నికల నిర్వహణకు 7,193 మంది సిబ్బంది అవసరం ఉంటుందని అంచనా వేశారు. అలాగే రవాణా నిమిత్తం 298 బస్సులు, 88 జీపులు, కార్లను సిద్ధంగా ఉంచారు. 7,20,045 మంది ఓటర్లు.. జిల్లాలోని 584 గ్రామ పంచాయతీల్లో 7,20,045 మంది ఓటర్లు ఉన్నారు. అర్బన్ ప్రాంతంలో ఎస్టీలు 5,105 మంది, ఎస్సీలు 3,145, బీసీలు 3,07,186, ఇతరులు 1,24,606 మంది.. అంటే మొత్తం 4,40,042 మంది ఉన్నారు. రూరల్ ప్రాంతంలో ఎస్టీలు 1,78,446 మంది, ఎస్సీలు 2,22,093, ఇతరులు 6,01,246 కలిపి మొత్తం జనాభా 10,01,785 మంది ఉన్నారు. 2013లో 760 జీపీలకు ఎన్నికలు 2013లో ఉమ్మడి రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. మొత్తం 763 గ్రామ పంచాయతీలకుగాను 760 జీపీలకు ఎన్నికలు నిర్వహించగా.. వీటిలో అత్యధికంగా టీడీపీ 227 గ్రామ పంచాయతీలను గెలుచుకుంది. 439 గ్రామ పంచాయతీలకు పోటీ చేసిన కాంగ్రెస్ 145 స్థానాలను, 494 స్థానాలకు పోటీ చేసిన వైఎస్సార్ సీపీ 181, 228 స్థానాలకు పోటీ చేసిన సీపీఎం 77, 117 స్థానాలకు పోటీ చేసిన సీపీఐ 46, న్యూడెమోక్రసీ 30 పంచాయతీలను కైవసం చేసుకుంది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధం జిల్లాలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే జిల్లాలో పోలింగ్ బూత్‌లను ఎంపిక చేయడంతోపాటు ఓటర్ల జాబితాను సిద్ధం చేశాం. ఎన్నికలు బ్యాలెట్ విధానంలో జరగాల్సి ఉండటంతో అందుకు అనుగుణంగా సిబ్బందిని సమకూర్చుకోవడంతోపాటు బ్యాలెట్ బాక్సులను సైతం ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించాం. కొత్త పంచాయతీల్లో సైతం పోలింగ్ స్టేషన్లకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. – శ్రీనివాసరెడ్డి, డీపీఓ -
కోర్టుకు చేరిన ‘పంచాయితీ’
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు మెంబర్ పదవులకు ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. రాజ్యాం గంలోని 73వ సవరణ ప్రకారం ఆ పదవులకు ప్రతి ఐదేళ్లకోసారి విధిగా ఎన్నికలు నిర్వహించాలని, ఈ నెలాఖరుతో సర్పంచులు, వార్డు సభ్యుల పదవీ కాలం పూర్తి కాబోతుంటే ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించే ప్రయత్నాలు చేయకుండా ప్రత్యేకాధికారుల పాలన తీసుకొచ్చే చర్యల్ని అడ్డుకోవాలని కోరుతూ రంగారెడ్డి జిల్లా శంషాబాద్ జడ్పీటీసీ సభ్యుడు బూర్కుంట సతీశ్, నార్సింగ్ ఎంపీటీసీ సాయిరాం, చేవెళ్ల మండలం గోపాలపల్లి గ్రామ సర్పంచ్ ఎల్.శ్రీనివాస్‌గౌడ్, నార్సింగ్ గ్రామ వార్డు సభ్యుడు కె.వినోద్‌కుమార్ నార్సింగ్ సంయుక్తంగా ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందులో ప్రతివాదులుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పంచాయతీ/సాధారణ పరిపాలన శాఖల ముఖ్య కార్యదర్శులు, రాష్ట్ర ఎన్నికల సంఘం, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్లను చేర్చారు. కాగా, ఈ కేసు ప్రాధాన్యతను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం ఎదుట పిటిషనర్ తరఫు న్యాయవాది సోమవారం ప్రస్తావించారు. దీనిపై మంగళవారం విచారణ చేపడతామని ధర్మాసనం ప్రకటించింది. ప్రభుత్వం సహకరించడం లేదు.. తెలంగాణలోని 12,751 గ్రామ పంచాయతీలకు ఆగస్టు 1 నుంచి ప్రత్యేకాధికారుల పాలనకు వీలుగా పంచాయతీరాజ్ కమిషనర్ ఈ నెల 13న జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను రద్దు చేయాలని వ్యాజ్యంలో కోరారు. పాలకవర్గ గడువు ముగిసిన ఆరు మాసాల్లోగా ఎన్నికలు నిర్వహించకపోవడం రాజ్యాంగంలోని 243(ఇ)(3), పంచాయతీరాజ్ చట్టంలోని 136 సెక్షన్లను ఉల్లంఘించినట్లేనని తెలిపారు. ఎన్నికలు నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) సిద్ధంగా ఉన్నా ప్రభుత్వం సహకరించడం లేదని పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల తుది జాబితా సిద్ధమైందని, ఎన్నికలకు అయ్యే వ్యయంలో రూ. 120 కోట్లలో రూ.30 కోట్లను కూడా ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. ప్రత్యేకాధికారుల పాలనపై ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే నిలుపుదల చేయాలని, ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని వ్యాజ్యంలో వారు హైకోర్టును కోరారు. -
‘పంచాయతీ’పై అస్పష్టత!
సాక్షి, హైదరాబాద్: గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ జాప్యం జరుగుతోంది. పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం జూలై 31తో ముగుస్తోంది. ఆలోపే కొత్త పాలకవర్గాలను ఏర్పాటు చేసేలా ఎన్నికల నిర్వహణ పూర్తి చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం దీనికి అనుగుణంగా అన్ని రకాలుగా సిద్ధమవుతోంది. అయితే పంచాయతీరాజ్ శాఖ వైఖరి దీనికి విరుద్ధంగా ఉంది. జూన్ 25లోపు గ్రామపంచాయతీల వారీగా రిజర్వేషన్ల వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపిస్తామని పంచాయతీరాజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. మంత్రి జూపల్లి చెప్పిన గడువు దగ్గరపడినా జిల్లాల వారీగా రిజర్వేషన్ల కోటాను నిర్ధారించలేదు. ఏ కేటగిరికి ఎన్ని పంచాయతీలు అనే లెక్కలు తేలలేదు. దీనిపై స్పష్టత వస్తేనే పంచాయతీల వారీగా రిజర్వేషన్లను ఖరారు చేసే అవకాశం ఉంటుంది. పంచాయతీల వారీగా సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ల ఖరారు కోసం కనీసం వారం రోజులు పడుతుంది. మొత్తంగా పంచాయతీరాజ్ శాఖ తీరుతో గడువులోపు ఎన్నికలు జరిగే పరిస్థితి కనిపించడంలేదని స్పష్టమవుతోంది. ఓటర్ల జాబితా, బీసీ ఓటర్ల గణన, రిజర్వేషన్ల నిర్ధారణ వంటి ప్రక్రియల్లోనూ ఇదే తీరుగా వ్యవహరిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించవద్దనే నిబంధనలున్నాయి. ఈ విషయంలో న్యాయపరమైన సమస్యలు రాకుండా అనుసరించే వ్యూ హంపైనా పంచాయతీరాజ్ శాఖ సరిగా స్పందించడంలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా రిజర్వేషన్ల ఖరారుకు అనుసరించే మార్గదర్శకాలను జూన్ 12న ప్రభుత్వం విడుదల చేసింది. అన్ని జిల్లాల కలెక్టర్లకు ఈ మేరకు సర్క్యులర్ జారీ చేసింది. దీని ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఏ కేటగిరీకి ఎన్ని సర్పంచ్ స్థానాలు కేటాయించాలనేది స్పష్టత ఇచ్చింది. పంచాయతీరాజ్ శాఖ, జిల్లాల కలెక్టర్లు జిల్లాల వారీగా రిజర్వేషన్ కోటా ను నిర్ధారించాలని ఆదేశించింది. ఈ ఇప్పటికీ పూర్తి కాలేదు. రాష్ట్రంలో మొత్తం సర్పంచ్ స్థానాలు 12,751 ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. -
సాధా‘రణానికి’ సై..!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల : పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నప్పటికీ... రిజర్వేషన్లు ఖరారు కాకపోవడంతో నీలినీడలు కమ్ముకుంటున్నాయి. అదే సమయంలో ఢిల్లీ నుంచి రాష్ట్ర రాజధాని వరకు ముందస్తు సాధారణ ఎన్నికలపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఈ పరిస్థితుల్లో పంచాయతీల కన్నా ముందే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు నిర్వహిస్తేనే మేలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అధికార, విపక్ష పార్టీల నాయకులు భావిస్తున్నారు. ఈ మేరకు అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్చార్జిలు ‘ముందస్తు’ కోసం ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టారు. ప్రచారంలో ఉన్నట్లు ఈ సంవత్సరం డిసెంబర్‌లోగా శాసనసభ, పార్లమెంటు ఎన్నికలు నిర్వహిస్తే తమకు కలిసి వస్తుందన్న ధీమాతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు. ఈ మేరకు వారు బాహాటంగానే జమిలి ఎన్నికలకు సై అంటుండడం గమనార్హం. కాంగ్రెస్, బీజేపీ నేతలు సైతం గత కొంతకాలంగా ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే భావనతోనే తమకు పట్టున్న ప్రాంతాలపై దృష్టి పెట్టి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాల్లో ఉన్నారు. పంచాయతీ ఎన్నికలు ముందు జరిగితే అధికార పార్టీ కొంత బలహీనపడి, సాధారణ ఎన్నికల నాటికి తమకు కలిసి వస్తుందని విపక్షాలు తొలుత భావించాయి. అయితే గ్రామ స్థాయిలో బలంగా ఉన్న టీఆర్ఎస్కే పంచాయతీ ఎన్నికలతో లాభమని లెక్కలేసుకున్నారు. పంచాయతీలను స్వీప్ చేసినట్లు ప్రచారం జరిగితే మొదటికే మోసం వస్తుందనే నిర్ణయానికి వచ్చిన కాంగ్రెస్, బీజేపీ, టీజేఎస్ వంటి పార్టీలు ముందస్తు ఎన్నికలకే సై అంటున్నాయి. ఈ మేరకు అన్ని నియోజకవర్గాల్లో అధికార, విపక్ష పార్టీల అంతర్గత ప్రచారం మొదలైంది. బీసీ, దళిత, గిరిజన వర్గాల నేతలు కూడా తమ హక్కుల పేరిట జనంలోకి వెళ్లే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. జనంలోకి ప్రజాప్రతినిధులు ఉమ్మడి ఆదిలాబాద్‌లోని నాలుగు జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇటీవలి కాలంలో తరచూ ప్రజలతో మమేకమయ్యేందుకు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు. తమ తమ నియోజకవర్గాల్లో జరిగే పెళ్లిళ్లు, శుభకార్యాలకు ఠంఛనుగా హాజరవుతున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకాన్ని చాలా వరకు తమకు అనుకూలంగా మలుచుకొని సద్విని యోగం చేసుకున్నారు. నియోజకవర్గాల్లోని పెండింగ్ పనులను క్లియర్ చేయించుకునే బిజీలో పడ్డారు. వివాదాస్పద అంశాల జోలికి వెళ్లకుండా రాబోయే ఎన్నికల నాటికి తమ గ్రాఫ్‌ను పెంచుకునే ప్రయత్నాల్లో మునిగారు. మంచిర్యాల జిల్లాలో ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు, ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య పూర్తిగా నియోజకవర్గంపైనే దృష్టి పెట్టి ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తున్నారు. సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఎక్కువ దృష్టి పెడుతూనే పెండింగ్ ప్రాజెక్టు సిర్పూర్ పేపర్ మిల్స్‌ను పునఃప్రారంభం ఎక్కువ దృష్టి పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రాయితీలతో గుజరాత్‌కు చెందిన జేకే మిల్స్ ఎస్పీఎంను టేకోవర్ చేసుకునేలా తన వంతు పాత్ర పోషించారు. ఎన్నికల లోపు జేకే పేపర్‌మిల్స్ నుంచి కీలక ప్రకటన రావచ్చని భావిస్తున్నారు. ఆదిలాబాద్‌లో మంత్రి జోగు రామన్న, నిర్మల్‌లో మరో మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి సైతం సమయం దొరికితే నియోజకవర్గాల్లో గడుపుతున్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లో వివాదాస్పద అంశాలేవీ తెరపైకి రాకుండా ఇప్పటికే అనుచర వర్గానికి స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. ముధోల్‌లో ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి నియోజకవర్గానికే పరిమితమై వచ్చే ఎన్నికల్లో మరోసారి తన సత్తా చాటాలనే ఆలోచనతో ఉన్నారు. ఖానాపూర్, బోథ్, ఆసిఫా బాద్‌లలో ఆదివాసీ సమస్య తీవ్ర రూపం దాల్చడంతో ఎమ్మెల్యేలు సంయమనంతో వ్యవహరిస్తున్నారు. ఈ నియోజకవర్గాల్లో సొంత పార్టీల్లో ఉన్న అసంతృప్తిని చల్లబరుచుకోవడమే పనిగా మారింది. సన్నద్ధమవుతున్న విపక్షాలు కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్రంలో టీఆర్ఎస్ కూడా ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతుండడంతో అన్ని నియోజకవర్గాల్లో ప్రతిపక్షపార్టీలు కూడా తమ కార్యకలాపాలను పెంచాయి. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే టిక్కెట్ల కోసం పోటీపడుతున్న నాయకులు ఎవరికి వారే ఆయా నియోజకవర్గాల్లో తమ బలం పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. డీసీసీ అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి నిర్మల్ నియోజకవర్గంలో విస్తృత స్థాయిలో కార్యక్రమాలు చేపడుతున్నారు. అదే సమయంలో తూర్పున ఐదు నియోజకవర్గాల్లో బస్సు యాత్ర నిర్వహించడం ద్వారా తన సత్తా చాటుకున్నారు. మంచిర్యాలలో మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్‌రావు పల్లె, పట్టణం తేడా లేకుండా తనదైన శైలిలో ప్రజల మధ్యకు వెళుతున్నారు. పార్టీలో గ్రూపులతో సంబంధం లేకుండా వచ్చే ఎన్నికల్లో పార్టీ టిక్కెట్టుతో పోటీ చేయడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఆసిఫాబాద్‌లో ఆత్రం సక్కు, బోథ్‌లో సోయం బాపూరావు ఆదివాసీ అంశాన్ని భుజాన వేసుకొని వచ్చే ఎన్నికల్లో బలమైన పోటీదారులుగా తయారయ్యారు. ఆదిలాబాద్‌లో ముగ్గురు నేతలు టిక్కెట్టు ప్రయత్నాల్లో ఎవరికి వారే గ్రౌండ్ తయారు చేసుకొంటున్నారు. చెన్నూరులో కూడా కాంగ్రెస్ టిక్కెట్టుకు ఇటీవల కాలంలో పోటీ పెరిగింది. బెల్లంపల్లిలో కాంగ్రెస్ యంత్రాంగం పటిష్టంగానే ఉన్నా, ధీటైన నాయకుడి కోసం ఎదురుచూస్తున్నారు. సిర్పూర్లో ముగ్గురు నాయకులు టిక్కెట్టు రేసులో ఉన్నారు. ఇక్కడ స్థానిక, స్థానికేతర నినాదాన్ని తీసుకొస్తున్నారు. అమిత్‌షా, మోదీలపైనే బీజేపీ భారం దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలన్నీ ఒకేసారి నిర్వహించాలన్న ప్రధాని మోదీ నిర్ణయం తమకు అనుకూలంగా మారుతుందని స్థానిక బీజేపీ నాయకులు కూడా భావిస్తున్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో చక్రం తిప్పిన అమిత్‌షా, మోదీ రాష్ట్రంలో కూడా సత్తా చూపుతారన్న ఆశతో ఉన్నారు. అయినా నియోజకవర్గాల్లో పర్యటించే కార్యక్రమాన్ని నేతలు మొదలుపెట్టారు. మంచి ర్యాలలో ముల్కల్ల మల్లారెడ్డి, బెల్లంపల్లిలో కొ య్యల ఏమాజీ పల్లె నిద్ర, పాదయాత్రలతో జనం మధ్యకు వెళుతున్నారు. నిర్మల్, ముథోల్, ఆదిలా బాద్‌లలో కూడా బీజేపీ తన ఉనికిని చాటుకుం టుండడం కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. టీజేఎస్‌లో అయోమయం ముందస్తు ఎన్నికల ప్రచారంతో ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలోని టీజేఎస్ కొంత అయోమయంలో పడింది. పార్టీకి సంస్థాగతంగా యం త్రాంగం తయారు కాని పరిస్థితుల్లో కేవలం ఉద్య మ కార్డుతోనే ఎన్నికలకు పోతే ఎలాంటి ఫలి తాలు వస్తాయోననే మీమాంసలో ఆయా నియోజకవర్గాల నాయకులు ఉన్నారు. కాంగ్రెస్, ఇతర కలిసివచ్చే పార్టీలతో పొత్తు ఉంటే ఫలితాలు వేరేగా ఉంటాయని మంచిర్యాలకు చెందిన ఓ నాయకుడు ‘సాక్షి’తో వ్యాఖ్యానించారు. -
25 నాటికి ‘ఓటర్ల’ సవరణ పూర్తి చేయండి
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల జాబితాలలో మార్పులుచేర్పుల ప్రక్రియను జూన్ 25లోగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో ఎన్నికల సంఘం కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలింగ్ కేంద్రాలు, పోలింగ్ నిర్వహణ సిబ్బంది వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్సైట్లో పొందుపరచాలని సూచించారు. పోలింగ్ సిబ్బంది నియామకాన్ని పూర్తి చేసేందుకు వీలుగా.. సమగ్ర వివరాలను నమోదు చేయాలని ఆదేశించారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్ పాల్గొన్నారు. -
జిల్లా కార్యాలయాల చిరునామా ఏది?
సాక్షి, హైదరాబాద్: గ్రామపంచాయతీ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో ప్రభుత్వ యంత్రాంగంతోపాటు, ప్రజలు, రాజకీయ పార్టీల భాగస్వామ్యం ఉంటుంది. ఓటర్ల జాబితా, వార్డుల విభజన, పోలిం గ్ కేంద్రాల ఏర్పాటు, రిజర్వేషన్ల ఖరారు, పోలింగ్ నిర్వహణలో రాజకీయ పార్టీల పాత్ర తప్పనిసరి. ఎన్నికల నిర్వహణ అధికారులు ప్రతిదశలోనూ రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తారు. ముసాయిదా జాబితాలను అందజేసి అభ్యంతరాలను, సూచనలను స్వీకరిస్తారు. తుది జాబితాలను అధికారులు మళ్లీ రాజకీయ పార్టీలకు అందజేస్తారు. ఎన్నికల ప్రక్రియలో ఇదంతా కచ్చితంగా జరగాల్సిన ప్రక్రియ. ఇక్కడే అధికారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాజకీయ పార్టీలకు వివరాలు ఇచ్చే విషయంలో అధికారులు ఆందోళన చెందుతున్నారు. గ్రామపంచాయతీ ఎన్నికల వివరాలన్నీ గ్రామ, మండల, జిల్లాల వారీగా రూపొందిస్తారు. రాజకీయ పార్టీల జిల్లాల కార్యాలయాలలో వీటిని అందజేస్తారు. అయితే అధికార టీఆర్ఎస్కు జిల్లాల్లో కార్యాలయాలు లేకపోవడంతో వివరాలు ఎక్కడ ఇవ్వాలో అధికారులకు తెలి యడంలేదు. టీఆర్ఎస్కు మిగిలిన పార్టీల తరహాలో జిల్లా కమిటీలు లేవు. రెండేళ్ల క్రితమే వీటిని రద్దు చేశారు. రెండేళ్ల క్రితం కేవలం అధ్యక్షుడు మాత్రమే ఉండేవారు. జిల్లా పార్టీ కార్యాలయాలు ఉండేవి. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ఉమ్మడి జిల్లాల కార్యాలయాలను ఎక్కువ జిల్లాల్లో తీసివేశారు. దీంతో ఓటర్ల జాబితా, ఇతర వివరాలను ఎక్కడ, ఎవరికి అందజేయాలో అధికారులకు తెలియడంలేదు. అడ్రస్ కోసం అధికార పార్టీ ముఖ్యనేతలను, ఉమ్మడి జిల్లాల మాజీ అధ్యక్షులను సంప్రదిస్తున్నారు. వివరాలు ఎక్కడ ఇవ్వాలనే విషయంలో వారి నుంచి కూడా స్పష్టత లేక, అధికార పార్టీ నేతలకు సైతం పూర్తి వివరాలు అందడం లేదు. ఈ వ్యవహారం పంచాయతీరాజ్ శాఖ అధికారులకు చాలా ఇబ్బందికరంగా మారింది. -
ఎమ్మెల్యేల్లో ‘పంచాయతీ’ గుబులు
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం జరుగుతున్న కసరత్తు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లను పరిగెత్తిస్తోంది. పంచాయతీ ఎన్నికలతో తమ నియోజకవర్గాల్లో కొత్త తలనొప్పులను ఇప్పుడెందుకు రుద్దుతున్నారని వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణ ఎన్నికలకు ముందు స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగితే అధికార పార్టీకి ఇబ్బందికరంగా ఉంటుందని అంటున్నారు. అధికారం వచ్చిన తర్వాత స్థానిక ఎన్నికలు ఉంటే బాగుండేదని అంటున్నారు. సాధారణ ఎన్నికలకు ముందు స్థానిక ఎన్నికలుంటే ఎమ్మెల్యేలపై అన్ని భారాల పడ్తాయని, ఫలితాల ప్రభావమూ ఉంటుందని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు. ప్రత్యేకంగా గ్రామాల్లో ప్రస్తుతమున్న ప్రత్యేక పరిస్థితులు అధికార పార్టీ ఎమ్మెల్యేలను బెంబేలెత్తిస్తున్నాయి. తెలంగాణలోని ఎక్కువ గ్రామాల్లో ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలోనే నాయకులు, కార్యకర్తలు కేంద్రీకృతమయ్యారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింతర్వాత కాంగ్రెస్, టీడీపీ, ఇతర పార్టీల్లో ఉన్న నాయకులంతా అధికార పార్టీలోనే చేరారు. ఏ నియోజకవర్గంలో చూసినా సర్పంచ్ స్థానానికి ఒక్కొక్క గ్రామంలో కనీసం ఐదారుగురు ముఖ్య నేతలు, సీనియర్లు, ఆసక్తి ఉన్నవారి మధ్య పోటీ ఉంది. గ్రామాల్లో నాయకుల మధ్య వ్యక్తిగత వైషమ్యాలు, అభ్యర్థుల పోటీలో అధికారిక అభ్యర్థిని ప్రకటించడం, వీరి ఆర్థిక భారాన్ని మోయడం, వీరి గెలుపోటముల వంటి అన్ని అంశాలు సమస్యగానే ఉంటాయని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు. గ్రామాల్లో ఆధిపత్య పోరు... టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింతర్వాత అన్ని పార్టీల నేతలు ఆ పార్టీలోనే చేరిపోయారు. ఒకే పార్టీలో వీరు ఉన్నప్పటికీ ఏ ఇద్దరు నేతల మధ్య సయోధ్య లేదు. పేరుకు అధికార పార్టీలోనే ఉన్నా, గ్రామాల్లో వీరు ఎవరికి వారే అన్నట్టుగా తమ వర్గాలను, గ్రూపులను నడిపించుకుంటున్నారు. పార్టీ ఎమ్మెల్యేగా ఆ గ్రామానికి వెళ్లినప్పుడు పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నా ఎవరికివారే గ్రామస్థాయిలో వర్గానికి నాయకత్వం వహిస్తున్నారు. ఒక్కొక్క గ్రామంలో కనీసం మూడు గ్రూపులుంటున్నాయి. కొన్ని గ్రామాల్లోనైతే ఐదారు గ్రూపులు కూడా ఉన్నాయని చెబుతున్నారు. వీరిలో ఏ ఒక్కరిని అభ్యర్థిగా ప్రకటించినా, మిగతా వర్గాలు వ్యతిరేకమయ్యే ప్రమాదముందని ఆందోళన చెందుతున్నారు. గ్రామ స్థాయి నేతల మధ్య వైషమ్యాలు సాధారణ ఎన్నికలపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయని భయపడుతున్నారు. సాధారణ ఎన్నికలకు ఎక్కువ సమయం ఉంటే అవకాశం రాని వారికి మరో ప్రత్యామ్నాయం చూపించే మార్గం ఉంటుందని, ఎన్నికలు దగ్గరకు వచ్చిన తర్వాత అయితే గ్రామ స్థాయి నాయకులు పెద్దగా పట్టించుకోకపోవచ్చునంటున్నారు. ఎమ్మెల్యే స్థానాలకే ఎన్నికలు జరుగుతున్నప్పుడు తమతో అవసరం ఉండదా అని గ్రామాల నాయకులు ధైర్యంగా ఉంటారని, అదే అధికారంలోకి వచ్చిన తర్వాత అయితే కొంచెం భయంతోనో, భక్తితోనే పార్టీకి పనిచేసే అవకాశం ఉంటుందంటున్నారు. గ్రామం అంతా టీఆర్ఎస్లోనే ఉంటే, ఏక కాలంలో అందరినీ సంతృప్తి పర్చడం సాధ్యంకాదంటున్నారు. పార్టీలో ఎక్కువ మంది నాయకులు ఉన్నప్పుడు పార్టీ అభ్యర్థిని అధికారికంగా ఎంపిక చేయడం, ఆ తరువాత అందరినీ కాపాడుకోవడం కత్తిమీద సాములాగానే ఉంటుందని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు. ఆర్థిక భారం ఎలా? పార్టీ అభ్యర్థిని నిర్ణయించడం ఒక సమస్య అయితే, వారి ఆర్థిక అంశాలు అంతకన్నా ఎక్కువగా ఎమ్మెల్యేలను భయపెడుతున్నాయి, వార్డు సభ్యులు, సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగితే ఖర్చు గురించి చెప్పుకునే పరిస్థితి ఉండదంటున్నారు. ఎన్నికల కమిషన్ ఎన్ని పరిమితులు విధించినా, ఎంత నిఘా పెంచినా ఖర్చును ఆపే పరిస్థితి ఉండదంటున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రతీ ఓటు కీలకమే కావడంతో అంతూపొంతు లేకుండా జరిగే వ్యయాలు ఎవరు మోయాలని ఎమ్మెల్యేలు భయపడుతున్నారు. స్థానికంగా అభ్యర్థులు ఖర్చులు భరించినా, ఎమ్మెల్యేగా, వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా తమ నుంచి ఆర్థిక సహాయాన్ని ప్రతీ ఊరి నుంచి కచ్చితంగా ఆశిస్తారని ఎమ్మెల్యేలు అంటున్నారు. ఒక్కొక్క ఊరికి రూ.యాబైవేలు, రూ.లక్షకు తగ్గకుండా ఇవ్వాల్సి వస్తుందని చెబుతున్నారు. ఒక్కొక్క నియోజకవర్గానికి సగటున 100 గ్రామ పంచాయతీలు ఉన్నాయని, దీనిని బట్టి ఎమ్మెల్యేగా తమపై ఖర్చును లెక్కబెట్టి, ఆందోళన చెందుతున్నారు. కొంచెం పెద్ద గ్రామ పంచాయతీలు అయితే అంతకన్నా ఎక్కువగానే ఆర్థికంగా సహాయం చేయాల్సిన పరిస్థితి తప్పదేమోనని ఎమ్మెల్యేలు భయపడుతున్నారు. ఇవన్నీ లెక్క గడితే వచ్చే ఎన్నికల్లో తమకు అయ్యే ఖర్చులో సగం అయినా ఇప్పుడు భరించాల్సి వస్తుందని లెక్కలు గడుతున్నారు. ఇంత చేసినా గెలుపోటములు తమ ఎన్నికలపై ప్రభావాన్ని చూపిస్తాయని అంటున్నారు. ఈ తలనొప్పులన్నీ ఎన్నికలకు ముందు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. సాధారణ ఎన్నికలయ్యేదాకా పంచాయతీ ఎన్నికలు వాయిదా పడితే బాగుండునని ఎమ్మెల్యేలు కోరుకుంటున్నారు. -
స్థానిక’ ఖర్చుకు పాత లెక్కే!
సాక్షి, హైదరాబాద్: త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం మార్గదర్శకాలను సిద్ధం చేస్తోంది. ఈసారి కూడా గత ఎన్నికల తరహాలోనే ప్రచార వ్యయ పరిమితి ఉండనుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. అంటే.. జెడ్పీటీసీ సభ్యుడిగా పోటీచేసే అభ్యర్థులకు గరిష్టంగా రూ.2 లక్షలు, ఎంపీటీసీ అభ్యర్థులకు రూ.లక్ష వ్యయ పరిమితి ఉంటుంది. అదే సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థుల విషయంలో రెండు వ్యయ పరిమితులు ఉన్నాయి. పది వేల కంటే ఎక్కువ జనాభా ఉండే మేజర్ గ్రామ పంచాయతీ అయితే సర్పంచ్ అభ్యర్థికి రూ.80 వేలు, వార్డు మెంబర్ అభ్యర్థికి రూ.10 వేలు.. సాధారణ గ్రామ పంచాయతీ అయితే సర్పంచ్ అభ్యర్థికి రూ.40 వేలు, వార్డు మెంబర్ అభ్యర్థికి రూ.6 వేలు గరిష్ట వ్యయ పరిమితి ఉంటుంది. అయితే ప్రభుత్వం ఇటీవల పది వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామాలను మున్సిపాలిటీలుగా మార్చిన నేపథ్యంలో.. రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా సాధారణ గ్రామ పంచాయతీలే ఉండనున్నాయి. ‘లెక్క’చెప్పకుంటే తిప్పలే.. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కచ్చితంగా తమ ఎన్నికల ఖర్చు లెక్కలు చెప్పాల్సి ఉంటుంది. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వేటు పడే అవకాశం ఉంటుంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం... ఎన్నికల్లో పోటీ చేసిన వారు ఎన్నిక ముగిసిన 40 రోజుల్లోపు ఎన్నికల ఖర్చు వివరాలను అధికారులకు సమర్పించాలి. ఆ గడువులోపు వివరాలను సమర్పించని వారికి రాష్ట్ర ఎన్నికల సంఘం షార్ట్ నోటీసు జారీ చేస్తుంది. అంటే మరో 20 రోజుల గడువు ఇచ్చి.. వివరాలు సమర్పించాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తుంది. ఈ నోటీసు కూడా స్పందించని వారిపై.. మూడేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేస్తుంది. ఇలా గతంలో కార్పొరేటర్, కౌన్సిలర్, జెడ్పీటీసీ సభ్యుడు, ఎంపీటీసీ సభ్యుడు, సర్పంచ్, వార్డు మెంబర్ ఎన్నికల్లో పోటీ చేసి ఎన్నికల ఖర్చు వివరాలను చెప్పని 13,329 మందిపై రాష్ట్ర ఎన్నికల సంఘం వేటు వేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2013 జూలైలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయి. అప్పుడు తెలంగాణలోని 8,778 సర్పంచ్, 88,682 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇక 2014 మార్చిలో తెలంగాణలోని 438 జెడ్పీటీసీ, 6,441 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఆయా ఎన్నికల్లో పోటీ చేసి ఖర్చు వివరాలు చెప్పని వారిపై వేటు పడింది. మూడేళ్ల క్రితమే వేటు పడిన వారు ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత ఉంటుంది. అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం గత జనవరిలో మూడు వేల మందిపై అనర్హత వేటు వేసింది. వారు త్వరలో జరిగే పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోల్పోయినట్టే. అనర్హత వేటుపడ్డ అభ్యర్థుల సంఖ్య వార్డు మెంబర్ 8,528 సర్పంచ్ 1,265 ఎంపీటీసీ 1,279 జెడ్పీటీసీ 291 కార్పొరేటర్/కౌన్సిలర్ 2,166 -
ఒక్కో పంచాయతీకి రూ. 10 లక్షలు
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికలను జూలైలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం...ఎప్పటిలాగే ఏకగ్రీవ గ్రామ పంచాయతీలకు ఆర్థిక చేయూత అందించే కార్యక్రమాన్ని కొనసాగించనుంది. ఎన్నికలు ఏకగ్రీవంగా పూర్తయ్యే గ్రామాలకు నిధులు ఇవ్వనుంది. ఐదు వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న పంచాయతీలకు రూ. 15 లక్షల చొప్పున, ఐదు వేల కంటే తక్కువ జనాభా ఉన్న పంచాయతీలకు రూ. 10 లక్షల చొప్పున నిధులు మంజూరు చేయనుంది. గ్రామాభివృద్ధి కోసం పంచాయతీలు ఈ నిధులను ఖర్చు చేయాల్సి ఉంటుంది. 2013లో ఉమ్మడి ఏపీలో పంచాయతీ ఎన్నికలు జరగ్గా అప్పుడు తెలంగాణలో 8,778 పంచాయతీలు ఉండేవి. గత ఎన్నికల్లో తెలంగాణలో 451 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఆలస్యం గా అయినా రాష్ట్ర ప్రభుత్వం వాటికి నిధులు విడుదల చేసింది. జూలైలో జరగనున్న పంచాయతీ ఎన్నికల విషయంలోనూ నిధుల మంజూరు నిబంధనను ప్రభుత్వం అమలు చేయనుంది. కొత్త పంచాయతీరాజ్ చట్టంతో వాటి సంఖ్య పెరిగింది. రాష్ట్రంలో 12,751 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. చిన్న ఆవాసాలు, తండాలు పంచాయతీలుగా మారడంతో వచ్చే ఎన్నికల్లో ఏకగ్రీవ పంచాయతీల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మరోవైపు అన్ని గ్రామాల్లో బీసీ ఓటర్ల గణన ముమ్మరంగా సాగుతోంది. గురువారం లోగా జిల్లాలవారీగా రిజర్వుడు గ్రామ పంచాయతీల సంఖ్యను అధికారులు నిర్ధారించి జూన్ 10లోగా రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. ఆపై రిజర్వేషన్ల జాబితాను ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమర్పిస్తే ఎన్నికల సంఘం పోలింగ్ నిర్వహణకు షెడ్యూల్ విడుదల చేయనుంది. నేడు కలెక్టర్లతో సమావేశం.. గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో రాష్ట్ర ఎన్నికల సంఘం నిమగ్నమైంది. షెడ్యూల్ ప్రకారం జూలైలోనే ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధ మవుతోంది. దీనిపై అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, జిల్లా ప్రజాపరిషత్ సీఈవోలు, జిల్లా పంచాయతీ అధికారులతో బుధవారం హైదరాబాద్‌లో సమావేశం నిర్వహిస్తోంది. పోలింగ్ ప్రక్రియ, శాంతి భద్రతల నిర్వహణ తదితర అంశాలను సమావేశంలో చర్చించనున్నారు. -
పోరుకు సై!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: స్థానిక పోరుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ముమ్మరం చేసింది. ఈ ఏడాది ఆగస్టు 2వ తేదీతో గ్రామపంచాయతీ పాలకమండళ్ల పదవీ కాలం ముగియనుంది. నిర్దేశిత గడువులోగా స్థానిక ఎన్నికలను నిర్వహించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన రాష్ట్ర ప్రభుత్వం జూలై నెలలో ఎన్నికలు నిర్వహణకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల తుదిజాబితాను విడుదల చేయడంతో పాటు బీసీ ఓటర్ల గణన, పోలింగ్ స్టేషన్ల గుర్తింపు తదితర అంశాలపై దృష్టి సారించింది. జూన్ 1న స్థానిక రిజర్వేషన్లపై స్పష్టమైన ప్రకటన జారీ చేయాలని అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. దీంతో గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల వేడి రగులుతోంది. కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం సర్పంచ్‌లకు ప్రత్యేక అధికారాలు కల్పించిన నేపథ్యంలో బరిలోకి దిగేందుకు చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు. అంతేకాదు వచ్చే ఏడాది సాధారణ ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీ సానుభూతిపరులను గెలిపించుకునేందుకు అన్ని పార్టీలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. అలాగే ఎమ్మెల్యేలందరూ కూడా నియోజకవర్గాల్లో తిష్ట వేసి ‘గ్రౌండ్’ సిద్ధం చేస్తుం డగా.. విపక్ష పార్టీలు కూడా తమ తమ సత్తా చాటేందుకు సమాయత్తమవుతున్నాయి. పోరుకు గ్రీన్ సిగ్నల్.. గ్రామపంచాయతీ తోపాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీల పాలకమండళ్ల కాలపరిమితి ముగియనుండడంతో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో గతంలో మొత్తం 1,148 గ్రామ పంచాయితీలు ఉండగా.. కొత్తగా ఏర్పాటుచేసిన జీపీలతో కలుపుకుని వీటి సంఖ్య 1,684కు చేరింది. అదే వి ధంగా వార్డుల విషయానికొస్తే గతంలో 12,148 ఉండగా.. ప్రస్తుతం 15,361 కి చేరాయి. ఉమ్మడి జిల్లాలో 19,36,445 మంది ఓటర్లు ఉన్నారు. ఈ సారి రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పరిపాలన విషయంలో అనేక మార్పులు చేర్పులు తీసుకొచ్చింది. అభివృద్ధి కార్యక్రమాల విషయంలో స్థానిక పాలకమండళ్లకే పూర్తి అధికారాలు కేటాయించింది. తద్వారా ఈసారి బరిలో నిలిచేందుకు చాలా మం ది ఉత్సుకతతో ఉన్నారు. అదే విధంగా జిల్లాలు, మండలాలు, గ్రామాల పునర్విభజన తర్వాత తొలిసారిగా ఎన్నికలు నిర్వహిస్తుండటంతో అన్ని వర్గాల్లో ఆసక్తి నెలకొంది. పంచాయితీలు, వార్డుల రిజర్వేషన్లను జూన్1న ప్రకటించాలని అధికార యంత్రాంగం కసరత్తు చేస్తుండటంతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. కొత్త చట్టం ప్రకారం ఈసారి ఖరారయ్యే రిజర్వేషన్లు పదేళ్ల పాటు కొనసానుండటంతో పోటీ చేయాలని భావిస్తున్న అభ్యర్థులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. స్థానికంలో సత్తా చాటితేనే... స్థానిక పోరులో సత్తా చాటేందుకు అధికార టీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. తద్వారా విపక్ష పార్టీలను సాధారణ ఎన్నికలకు ముందే బలహీనపర్చాలని యోచిస్తోంది. అందుకు అనుగుణంగా సామ, భేద, దండోపాయాలను ఉపయోగిస్తోంది. అంతేకాదు స్థానిక ఎన్నికలను ఎమ్మెల్యేలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. స్థానికంలో సత్తా చాటితేనే సాధారణ ఎన్నికల్లో టిక్కెట్ కేటాయించనున్నట్లు పార్టీ అధిష్టానం చెప్పినట్లు ప్రచారం సాగుతోంది. దీంతో తమ తమ నియోజకవర్గంలోని అత్యధిక స్థానాలు గెలుపొందాలని వారు ఉవ్విళ్లూరుతున్నారు. ఇలా ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారడంతో ఎమ్మెల్యేలు తీవ్రంగా కష్టపడుతున్నారు. ఎన్నికల వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలనే అంటిపెట్టుకొని తిరుగుతున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ నే విపక్ష పార్టీలకు చెందిన వారిని టీఆర్ఎస్లోకి చేర్చుకుంటున్నారు. అంతేకాదు ప్రభుత్వం చేపడుతున్న పథకాలు రైతుబంధు వంటి వాటి ద్వారా జనానికి మరింత చేరువవుతున్నారు. ఉ మ్మడి జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలకు గాను దాదాపు ఎనిమిది చోట్ల అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. అలాగే విపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల కూడా సాధ్యమైనంత మేర ఎక్కువ స్థానాలను కైవసం చేసుకునేందుకు అన్ని రకాల వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. సత్తా చాటుతామంటున్న కాంగ్రెస్.. వచ్చే ఏడాది సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఫైనల్స్‌గా భావిస్తున్న తరుణంలో స్థానిక ఎన్నికల్లో సత్తా చాటేందుకు విపక్ష పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ తమ కదలికలను ముమ్మరం చేసింది. ఎక్కడిక్కడ గ్రామాల్లో కమిటీలను ఏర్పాటు చేస్తూ స్థానిక పోరుకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు ప్రాంతంలో బలంగా ఉన్నామని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికల్లో సత్తా చూపాలని యోచిస్తోంది. ఉమ్మడి జిల్లాలో కల్వకుర్తి, వనపర్తి, అలంపూర్, గద్వాల, కొడంగల్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం ఉంది. తాము ప్రాతినిధ్యం వహిస్తున్న చోట్ల మెజార్టీ స్థానాలు దక్కించుకోవాలని ఎమ్మెల్యేలు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. అదే విధంగా మిగతా చోట్ల ఇన్‌చార్జీలుగా వ్యవహరిస్తున్న పార్టీ నేతలు కూడా తమ సానుభూతిపరులకు మద్దతుగా నిలవాలని యోచిస్తున్నారు. ఫలితంగా ఎక్కువ మొత్తంలో స్థానిక సీట్లు సాధించి వచ్చే ఎన్నికల్లో తమ బెర్త్‌ను సుస్థిరం చేసుకోవాలని భావిçస్తున్నారు. మిగతా పక్షాలు సైతం.. స్థానిక ఎన్నికల్లో మిగతా విపక్షాలైన బీజేపీ, వైఎస్సార్సీపీ, తెలంగాణ జన సమితి, కమ్యూని స్టు పార్టీలు కూడా తమ తమ సత్తా చాటాలని భావిస్తున్నాయి. స్థానిక ఎన్నికల్లో గెలిస్తే కేడర్ బలపడుతుందని ఆయా పార్టీలు భావించి వ్యూహాలు రచిస్తున్నాయి. ఒక మోస్తరు సంస్థాగతంగా నిర్మితమైన బీజేపీ కూడా ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. పార్టీ అనుబంధ శాఖలను అప్రమత్తం చేసింది. అందుకు అనుగుణంగా చాపకింద నీరు లా చర్యలు చేపడుతోంది. అదే విధంగా వైఎస్సార్సీపీ కూడా గత ఎన్నికల మాదిరిగానే మంచి ఫలితాలు రాబట్టాలని యోచిస్తోంది. అందుకో సం పాలమూరు ప్రాంతంలోని పార్టీ యంత్రాగమంతా శక్తిమేర ప్రయత్నిస్తోంది. నేతలంతా తమ తమ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ తమ పట్టును నిలుపుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవలి కాలంలో ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో కొత్తగా రాజకీయ రూపాంతం చెంది న తెలంగాణ జన సమితి(టీజేఎస్) కూడా స్థానిక పోరు సమర శంఖం పూరిస్తోంది. పోరులో తలపడేందుకు పకడ్బందీగా అభ్యర్థులను ఎంచుకుంటోంది. అలాగే వివిధ పోరాటాలతో నిత్యం జనం మధ్య ఉండే కమ్యూనిస్టు పార్టీలు కూడా తమ తమ సత్తాను చాటాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇలా అన్ని పార్టీలు రంగంలో దిగడంతో రిజర్వేషన్లు ఖరారు కాకముందే స్థానిక సంస్థల సందడి నెలకొందని చెప్పాలి. -
జూన్ 3 వరకు బీసీ ఓటర్ల గణన!
సాక్షి, హైదరాబాద్: గ్రామపంచాయతీ ఎన్నికల్లో కీలకమైన బీసీ ఓటర్ల గణన ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతోంది. ఈ నెల 18న మొదలైన ఈ ప్రక్రియ జూన్ 3 వరకు జరిగే అవకాశముంది. అనంతరం గ్రామపంచాయతీల రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. బీసీ ఓటర్ల గణాంకాల ఆధారంగా అధికారులు రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. బీసీ ఓటర్ల గణన, రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియలు పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. గ్రామపంచాయతీల వారీగా రిజర్వేషన్లను ఖరారు చేసిన తర్వాత పంచాయతీరాజ్ శాఖ దీన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనుంది. అనంతరం ప్రభుత్వం ఈ జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందజేస్తుంది. రిజర్వేషన్ల జాబితా అందిన తర్వాత ఎన్నికల సంఘం గ్రామపంచాయతీల ఎన్నికల పోలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేస్తుంది. ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని రకాలుగా సిద్ధమైంది. నమూనా షెడ్యూల్‌ను నిర్ణయించి ఈ మేరకు ఇతర శాఖలను సిద్ధం చేస్తోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం రూపొందించిన నమూనా షెడ్యూల్ ఒకటి సోమవారం సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేసింది. ఇది కేవలం నమూనా కోసం తయారు చేసింది మాత్రమేనని.. అసలైన షెడ్యూల్ ఖరారు కాలేదని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్ ‘సాక్షి’కి తెలిపారు. -
పోలింగ్ రోజే ఉపసర్పంచ్ ఎన్నిక
సాక్షి, హైదరాబాద్: కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలుచేసేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది. జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామపంచాయతీ ఎన్నికల ఓటర్ల జాబితా, ఎన్నికల ప్రక్రియలకు కొత్త చట్టంలోని నిబంధనలను వర్తింపజేస్తూ ప్రభుత్వం శనివారం 4 ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్, జిల్లా ప్రజాపరిషత్ వైస్ చైర్పర్సన్, మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడు, మండల ప్రజాపరిషత్ ఉపాధ్యక్షుడు, కో ఆప్షన్ సభ్యుడు, ఉప సర్పంచ్ ఎన్నికల నిర్వహణ విషయంలో కొత్త చట్టం లోని నిబంధనలు అమల్లోకి తెస్తున్నట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. ఏ ఎన్నిక విషయంలోనూ మార్పులు లేకుండా నిబంధనలు ఉన్నాయి. గ్రామపంచాయతీ ఎన్నికలు జరిగిన రోజే ఉపసర్పంచ్ ఎన్నిక నిర్వహించాలి. ఫలితాలు వెల్లడించిన తర్వాత సమావేశం నిర్వహించి ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. మొత్తం వార్డు సభ్యులో సగం మంది హాజరు కావాలి. సమావేశం మొదలైన గంటలోపు కోరం సరిపడా సభ్యులు పాల్గొనాల్సి ఉంటుంది. -
పంచాయతీ ఎన్నికలకు సిద్ధం కండి
విజయనగరం మున్సిపాలిటీ: రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీల ఎన్నికలకు సిద్ధంకావాలని జిల్లా పంచాయతీ అధికారి బలివాడ సత్యనారాయణ ఆదేశించారు. బుధవారం తన కార్యాలయంలో విజయనగరం, బొబ్బిలి డివిజన్ల పరిధిలో గల డీఎల్పీఓలు, ఈఓపీఆర్డీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామ పంచాయతీల పదవీకాలం జూలై నెలతో ముగియనున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం నూతన పాలకవర్గాల ఎన్నికల నిర్వహణకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలంటూ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఇందులో భాగంగా వచ్చే నెల 15న జిల్లాలోని 920 గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఓటర్ల జాబితాను సిద్ధం చేసి పంచాయతీ కార్యాలయంలో ప్రచురించాల్సి ఉందన్నారు. ప్రస్తుతం అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సిద్ధం చేసిన ఓటర్ల జాబితా ఆధారంగా గ్రామ పంచాయతీల వారీగా నూతన ఓటర్ల జాబితాను తయారు చేయాలని సూచించారు. మండలాల వారీగా ఓటర్ల జాబితాను సంబంధిత తహసీల్దార్ల వద్ద నుంచి ఈఓపీఆర్డీలు సేకరించి వాటిని గ్రామ పంచాయతీ కార్యదర్శులకు అందజేయాలన్నారు. పంచాయతీ ఓటర్ల జాబితాలో ఎటువంటి తొలగింపులు, చేర్పులకు అవకాశం ఉండదన్నారు. జిల్లాలో వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను సక్రమ వరుసలో ఈ నెల 20 నాటికి సిద్ధం చేయాలని సూచించారు. వాటిలో తప్పుఒప్పులను సరిచూసిన తర్వాత నిర్ధేశిత సమయానికి తుది ఓటర్ల జాబితా ప్రచురిస్తామని చెప్పారు. బకాయిలు వసూలు చేయాలి.. ఈనెల 15 నాటికి 2017–17 ఆర్థిక సంవత్సరంలో బకాయి ఉన్న రూ. 15 కోట్ల పన్నును వసూలు చేసి వివరాలను ఆన్లైన్లో పొందుపరచాలని జిల్లా పంచాయతీ అధికారి బలివాడ సత్యనారాయణ సూచించారు. ఆర్థిక సంవత్సరంలో రూ. 15 కోట్ల డిమాండ్ ఉండగా... ఇప్పటి వరకు 8 కోట్ల రూపాయలు మాత్రమే వసూలైందన్నారు. మిగిలిన బకాయిలను పది రోజుల్లో వసూలు చేయాలని కోరారు. అదేవిధంగా వీధి దీపాలు, రక్షిత మంచినీటి పథకాలకు సంబంధించి విద్యుత్ బిల్లులను సకాలంలో చెల్లించాలని సూచించారు. అనధికారిక లే అవుట్లను గుర్తించి వాటి ద్వారా గ్రామ పంచాయతీలకు రావాల్సిన ఆదాయాన్ని సమకూర్చాలన్నారు. తాగునీటి ఎద్దడినివారణకు చర్యలు.. ప్రస్తుత వేసవి నేపథ్యంలో గ్రామాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని డీపీఓ సత్యనారాయణ ఆదేశించారు. గ్రామల్లో ఉన్న పీడబ్ల్యూ, ఎంపీడబ్ల్యూ పథకాలు పాడైతే మరమ్మతులు చేపట్టాలని సూచించారు. అదేవిధంగా అన్ని గ్రామాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో విజయనగరం డివిజనల్ పంచాయతీ అధికారి ఎ.మోహనరావు , ఈఓపీఆర్డీలు పాల్గొన్నారు. -
‘పంచాయతీ’ పైనే చర్చ
ఫిబ్రవరిలోనే గ్రామ పంచాయతీ ఎన్నికలన్న సీఎం కేసీఆర్ ప్రకటనతో పల్లెల్లో రాజకీయం వేడెక్కింది. ఎక్కడ చూసినా పంచాయతీ ఎన్నికలపైనే చర్చించుకుంటున్నారు. పంచాయతీ వ్యవస్థలో సమూల మార్పులు చేస్తామని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నాటి నుంచే ఎన్నికలపై చర్చ మొదలైంది. పరోక్ష ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుండటంతో చర్చ జోరుగా సాగుతోంది. సాక్షి, మహబూబాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికలపై రకరకాల చర్చ నడుస్తోంది. పరోక్ష ఎన్నికలతో పైసలున్నోళ్లే పోటీకి దిగుతారని కొందరు, సామాన్యులకు పంచాయతీ పదవుల కల అందని ద్రాక్షేనని మరికొందరు అనుకుంటున్నారు. మరోవైపు ఏ గ్రామానికి ఏ రిజర్వేషన్ వస్తుంది? ఏ రిజర్వేషన్ వస్తే ఎవరిని రంగంలోకి దింపాలంటూ రాజకీయ పార్టీలు సైతం లెక్కలేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆశావహులు ప్రజలకు దగ్గరవుతూ అంతర్గతంగా చర్చిస్తున్నారు. పార్టీలు మారడం, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నాయో ఆరా తీస్తున్నారు. గ్రామ కూడళ్లలో, టీ కొట్ల వద్ద.. ఏ ఇద్దరు కలిసినా పంచాయతీ ఎన్నికల గురించే మాట్లాడుకుంటున్నారు. ప్రత్యక్ష ఎన్నికలు అనుకూలమా, పరోక్ష ఎన్నికలు అనుకూలమా అనే దానిపై కూడా ఆశావహులు ఆరా తీస్తున్నారు. అంచనాల్లో రాజకీయ పార్టీలు వచ్చే నెలలోనే పంచాయతీ ఎన్నికలు అని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో అధికార టీఆర్ఎస్ పార్టీతో పాటు విపక్ష పార్టీలైనా కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, వైఎస్సార్సీపీ, వామపక్షాలు సైతం బిజీబిజీ అయ్యాయి. 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు పంచాయతీ ఎన్నికలు ప్రీఫైనల్‌గా అందరూ భావిస్తుండడంతో, ఇవి ఎవరికి లాభిస్తాయోనని లోతుగా ఆరా తీస్తున్నారు. పార్టీల గుర్తులపైనే ఎన్నికలు నిర్వహించేలా చట్టంలో మార్పులు చేస్తున్నామన్న ప్రభుత్వ కసరత్తుతో పార్టీలు సైతం అంచనాల్లో తలమునకలవుతున్నాయి. జిల్లాలోని మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాలతోపాటు పాక్షికంగా ఉన్న ఇల్లందు, పాలకుర్తి, ములుగు నియోజకవర్గాల్లోనూ అంతా అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఉండడంతో, పంచాయతీ ఎన్నికలపై కొంత ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. ఇటు కాంగ్రెస్, బీజేపీలు సైతం పంచాయతీ ఎన్నికల కసరత్తులో నిమగ్నమయ్యాయి. ఎన్నికలకు సిద్ధమవుతున్న అధికార యంత్రాంగం ఫిబ్రవరిలోనే పంచాయతీ ఎన్నికలని సీఎం ప్రకటించడం, ప్రగతి భవన్లో జిల్లా పంచాయతీ అధికారులతో సీఎం సమీక్ష సమావేశమైన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతోంది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 231 గ్రామపంచాయతీలు ఉండగా, 500 జనాభా దాటిన మరో 216 పంచాయతీల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రభుత్వం రేపో, మాపో ఆమోదముద్ర వేస్తే కొత్త పంచాయతీలు ఆవిర్భవించనున్నాయి. పాత, కొత్త పంచాయతీలకు కలుపుకొని ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో, అధికారులు ఇందుకు సమాయత్తమవుతున్నారు. కాగా, ఇంకా గ్రామపంచాయతీల రిజర్వేషన్లు కూడా ఖరారు కాలేదు. పరోక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తే, రిజర్వేషన్లు ఎలా ఉంటాయనే దానిపై ఆసక్తి నెలకొంది. మహబూబాబాద్ మున్సిపాలిటీలో పరిసర 5 గ్రామపంచాయతీలను విలీనం చేసేందుకు కూడా ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. వీటికి ప్రభుత్వం ఆమోదముద్ర వేయకపోవడంతో వీటిపై కూడా సందిగ్ధం నెలకొంది. దీనికితోడు తొర్రూరు, మరిపెడ, డోర్నకల్లను కూడా నగర పంచాయతీలుగా మార్చేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కానీ, వీటిపై ఇంతవరకు ఎలాంటి ఆదేశాలు వెలువడలేదు. వీటన్నింటి దృష్ట్యా ఎన్నికల నిర్వహణకు ఇంకా మరికొంత సమయం పడుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. -
లెక్కచెప్పండి..?
♦ పంచాయతీ ఎన్నికల్లో వ్యయం చూపని అభ్యర్థులు ♦ ఎన్నికల కమిషన్ సీరియస్ ♦జిల్లాలో 2,951మందికి షోకాజ్ నోటీసులు ♦ రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని ఆదేశం ♦ లేకుంటే భవిష్యత్‌లో పోటీకి అనర్హులే... సారంగాపూర్(జగిత్యాల): జూలై 2013లో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీచేసి వ్యయాలకు సంబంధించిన లెక్కలు చూపని వారిపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. ఈమేరకు అభ్యర్థులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు అందిన 20 రోజుల్లో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎదుట స్వయంగా హాజరై ఎన్నికల వ్యయవివరాలు అందించాలని ఆదేశించింది.ఇప్పటివరకు వివరాలు అందించడంలో ఎందుకు జాప్యం జరిగిందనే విషయంపైనా రాతపూర్వకంగా సంజాయిషీ సమర్పించాలని పేర్కొంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలువురు ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు తమ ఖర్చుల వివరాలు అందజేయడంలో విఫలమయ్యారని అప్పటి జిల్లా కలెక్టర్ ఎన్నికల కమిషన్‌కు నివేదిక అందించారు. ఈమేరకు పంచాయతీరాజ్ కమిషనర్ నోటీస్‌నంబర్316/55 సెక్షన్–పీఆర్–2017 (2785) ద్వారా ఎన్నికల వ్యయం సమర్పించని వారి వివరాలు, నిబంధనలను విడుదల చేసింది. ఎన్నికల నియమావళి, పంచాయతీరాజ్ సెక్షన్ 230–డి తెలంగాణ పంచాయతీరాజ్ యాక్ట్ చట్టం 1994 ప్రకారం నోటీసులు అందిన 20 రోజుల్లో ఎన్నికల్లో వ్యయవివరాలు అందించకపోతే రానున్న మూడు సంవత్సరాల్లో అభ్యర్థులు స్థానిక సంస్థల్లో పోటీచేయడానికి అర్హత ఉండదని పేర్కొంది. లెక్కలు చూపనివారు.. 2,951మంది జగిత్యాల జిల్లా పరిధిలో 2013–14 గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీచేసి ఖర్చు వివరాలను అందజేయని వారు 2,951 మంది ఉన్నారు. ఇందులో విజయం పొందినవారు, ఓడిపోయినవారూ ఉన్నారు. సారంగాపూర్, బీర్పూర్ మండలాల్లో సర్పంచ్, వార్డుస్థానాలకు పోటీచేసిన వారిలో 328 మంది అభ్యర్థులు ఎన్నికల లెక్కల వివరాలు సమర్పించలేదు. జగిత్యాలలో 18మంది, కొడిమ్యాల 317, మల్యాల 245, మెట్పల్లి 151, రాయికల్ 468, ధర్మపురి 323, మల్లాపూర్ 252, కోరుట్ల 164, పెగడపల్లి 369, వెల్గటూర్ 316 మంది అభ్యర్థులు ఎన్నికల్లో ఖర్చుచేసిన వివరాలను రాతపూర్వకంగా జిల్లా కలెక్టర్‌ను స్వయంగా కలిసి సంజాయిషీ ఇచ్చి, వివరాలు అందజేయాలని ఆదేశించారు. ఎంపీడీవో కార్యాలయాలకు నోటీసులు జిల్లాలో ఎన్నికల వ్యయం సమర్పించని అభ్యర్థులకు ఎంపిడీవో కార్యాలయాల ద్వారా నోటీసులు అందజేస్తున్నారు. నోటీసులు అందుకున్న వారు ఈ విషయంపై హైరానా పడిపోతున్నారు. వచ్చేఎన్నికల్లో పోటీచేయాలని ఉత్సాహం ఉన్న వారు లెక్కలు తయారుచేయడంలో నిమగ్నమయ్యారు. ఈ విషయంపై డీపీవో రాజన్న వివరణ ఇస్తూ..వారం రోజుల్లో వివరాలు అందించాలని సూచించారు. -
వైఎస్ఆర్ సీపీ విజయం
సర్పంచ్‌గా గెలిచిన నరాల సంజీవరెడ్డి ఎర్రుపాలెం : చొప్పకట్ల పాలెం గ్రామ పంచాయతీ శనివారం ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరపున పోటీ చేసిన నరాల సంజీవరెడ్డి విజయం సాధించారు. ఆయన కాంగ్రెస్ అభ్యర్థి బొగ్గుల శ్రీనివాసరెడ్డిపై 10 ఓట్ల మెజార్టీ పొందారు. గ్రామంలో మొత్తం 1,184 మంది ఓటర్లు ఉండగా 1,100 ఓట్లు పోలయ్యాయి. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్ జరిగింది. మధ్యాహ్నం 2గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. నరాల సంజీవరెడ్డికి 421 ఓట్లు రాగా,్ద బొగ్గుల శ్రీనివాసరెడ్డికి 411 ఓట్లు వచ్చాయి. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బొగ్గుల కృష్ణారెడ్డికి 268 ఓట్లు వచ్చాయి. జడ్పీటీసీ అంకసాల శ్రీనివాసరావు సమక్షంలో ఎంపీడీఓ పి విజయ, ఎన్నికల అధికారి వి ప్రసాదరావు సమక్షంలో నరాల సంజీవరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఉత్కంఠ భరితంగా జరిగిన సర్పంచ్ ఎన్నికల పోరులో నరాల సంజీవరెడ్డి గెలుపుతో పార్టీ కార్యకర్తలు, నాయకులు సంబురాలు జరుపుకున్నారు. వైఎస్ జగన్, పొంగులేటి శ్రీనన్న జిందాబాద్, వైఎస్సార్సీపీ వర్దిల్లాలి అంటూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. శీన్నన్నకు అంకితం సంజీవరెడ్డి విజయూన్ని వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అంకితం చేస్తున్నట్లు పార్టీ రాష్ట్ర కార్యదర్శి అయిలూరి వెంకటేశ్వరరెడ్డి ప్రకటించారు. ఆయన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన మంచి పనులతో ఆయనను అన్ని వర్గాల ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారన్నారని చెప్పారు. సమావేశంలో జడ్పీటీసీ, మండల కన్వీనర్ అంకసాల శ్రీనివాసరావు, జిల్లాకార్యదర్శి లక్కిరెడ్డి నర్సిరెడ్డి, మండల మహిళా కన్వీనర్ వేమిరెడ్డి త్రివేణి, డివిజన్ నాయకలు వెమిరెడ్డి లక్ష్మారెడ్డి, మామునూరు సర్పంచ్ గూడూరు రమణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
నేడు లెక్కింపు
- అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ - గెలుపోటములపై గ్రామాల్లో జోరుగా బెట్టింగ్ - అవాంఛనీయ - సంఘటనలు జరగకుండా హోం శాఖ చర్యలు రెండు విడతలుగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు నేడు(శుక్రవారం) జరగనుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దాయాదుల సమరం, అత్తాకోడళ్ల పోటీ కి గ్రామ పంచాయతీ ఎన్నికలు వేదికగా నిలిచిన విషయం తెలిసిందే. సాక్షి, బెంగళూరు : రాష్ట్ర వ్యాప్తంగా రెండు విడతలుగా జరిగిన ఈ ఎన్నికల్లో మొత్తం 5,735 గ్రామ పంచాయతీల్లో 84,854 స్థానాలకు అభ్యర్థులు పోటీపడ్డారు. మొదటి విడతలో 82. 54శాతం ఓటింగ్ నమోదు కాగా, రెండో విడతలో 80. 38శాతం ఓటింగ్ నమోదైంది. శుక్రవారం ఉదయం 8గంటలకు ఆయా తాలూకాల్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుండగా, సాయంత్రం 5గంటలకు ఫలి తాలను వెల్లడించాలని అధికారులు భావిస్తున్నారు. అయితే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఈవీఎంలు కాకుం డా బ్యాలెట్ పత్రాలను ఉపయోగించడంతో కౌంటింగ్ ప్రక్రియ అనుకున్న సమయం కన్నా కాస్తంత ఆలస్యం అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇదే సందర్భంలో గెలుపు, ఓటములపై గ్రామాల్లో జోరుగా బెట్టింగ్ సైతం సాగుతోంది. కొన్ని గ్రామాల్లో బెట్టింగ్ వేలు, లక్షలు సైతం దాటి కోట్ల రూపాయల్లోకి చేరడం గమనార్హం. ఇక పార్టీ గుర్తులపై ఈ ఎన్నికలు జరగక పోయినప్పటికీ, అన్ని ప్రముఖ రాజకీయ పార్టీలు అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల కంటే ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికలను భావిస్తున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు ఆయా పార్టీల భవితవ్యాన్ని నిర్దేశించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయనే వార్తల మధ్య ప్రముఖ పార్టీల నేతల్లో సైతం గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై తీవ్ర కుతూహలం నెలకొందనే చెప్పవచ్చు. కట్టుదిట్టమైన భద్రత కౌంటింగ్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా హోం శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టంది. దాదాపు 22వేల మంది పోలీసులు భద్రతను పర్యవేక్షించనున్నారు. ఇదే సందర్భంలో ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు విజయోత్సవాలు నిర్వహించే సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చో టుచేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు హోం శాఖ ఉన్నత అధికారులు వెల్లడించారు. అంతేకాక సమస్యాత్మకంగా గుర్తించిన ప్రాంతాల్లో విజయోత్సవాలకు అనుమతి సైతం ఇవ్వలేదని అధికారులు తెలిపారు. -
రేపే గ్రామ పంచాయతీ ఎన్నికలు
జిల్లా వ్యాప్తంగా 195 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు బహిరంగ ప్రచారానికి తెర అభ్యర్థులకు టెన్షన్...టెన్షన్ జిల్లాలో భారీ పోలీసు బందోబస్తు సాక్షి, బళ్లారి : ఇక గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరిగేందుకు కేవలం ఒక రోజు మాత్రమే గడువు ఉంది. జిల్లా వ్యాప్తంగా జూన్ 2వ తేదిన గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గత 15 రోజులుగా అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం చేశారు. బళ్లారి జిల్లా వ్యాప్తంగా సిరుగుప్ప, బళ్లారి, సండూరు, హగరిబొమ్మనహళ్లి, కూడ్లిగి, కంప్లి, హొస్పేట, బళ్లారి గ్రామీణ నియోజకవర్గాల పరిధిలోని 196 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనుండగా, అందులో బళ్లారి తాలూకాలోని కప్పగల్ గ్రామ పంచాయతీ మొత్తం 19 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో 195 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. 196 గ్రామ పంచాయతీలకు 3691 గ్రామ పంచాయతీ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉండగా, ఇందులో 464 మందిని జిల్లా వ్యాప్తంగా ఆయా గ్రామ పంచాయతీల్లో ఏకగ్రీవంగా సభ్యులను ఎన్నుకున్నారు. మిగిలిన 3215 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనుండటంతో మొత్తం దాదాపు 8వేలకు పైగా సభ్యులు పోటీ పడుతున్నారు. వేలాది మంది గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తుండటంతో ఏ గ్రామంలో చూసినా ఎన్నికల హడావుడి కనిపిస్తోంది. వారం, పది రోజులుగా ఎన్నికల ప్రచారంలో ముని గిపోయిన అభ్యర్థులకు రేపు ఎన్నికలు జరగనుండటంతో టెన్షన్ మొదలైంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీలకతీతంగా జరుగుతున్నప్పటికీ బీజేపీ, కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆయా పార్టీలకు చెందిన ముఖ్య నేతలు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొని తమ తమ పార్టీలకు చెందిన మద్దతుదారులను గెలి పించాలని విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎన్నికల ప్రచారం చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ బీజేపీ శ్రేణులు విస్తృతం గా ప్రచారం చేస్తూ, తమ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లుకు విన్నవించడం జరిగింది. అభ్యర్థుల తమ అదృష్టాన్ని ఓటరు తీర్పు ఇచ్చేందుకు మరి కొన్ని గం టలే గడువు ఉండటంతో బహిరంగ ప్ర చారానికి తెరపడటంతో, ఇక ఇంటింటా ఒక రోజు ప్రచారం చేయడానికి సన్నద్దం అయ్యారు. ఓటర్లకు ఎరవేసేందుకు కూ డా అభ్యర్థులు పూనుకుంటున్నారు. ఓట రుకు డబ్బులు, మద్యం పంపిణీ చేస్తున్నారు. కొన్ని గ్రామ పంచాయతీల్లో పో టీ హోరా హోరీగా ఉండటంతో ఒక్కో వార్డు మెంబరు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఖర్చు చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. బడా నేతలు పోటీ చేస్తున్న పంచాయతీల్లో ఒక్కొ ఓటరుకు అసెంబ్లీ ఎన్నికల్లో పంపిణీ చేసినట్లుగా రూ.500 నుంచి రూ.1000లు పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. జిల్లా వ్యాప్తంగా మద్యం ఏరులై పారుతోంది. ఇది ఇలా ఉండగా గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.బళ్లారి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనుకుని ఉండటంతో సరిహద్దు ప్రాంతాలైన సిరుగుప్ప, బళ్లారి తాలూకాలో గట్టి బందోబస్తుతో పాటు ఆయా చెక్‌పోస్టుల వద్ద మరింత భద్రతను పెంచారు. ఎస్పీ ఆర్ చేతన్ నేతృత్వంలో జిల్లా వ్యాప్తంగా పోలీసు బందోబస్తును పట్టిష్టం చేశారు. సోమవారం సాయంత్రం కల్లా ఎన్నికల అధికారులు, సిబ్బంది ఆయా గ్రామ పంచాయతీలకు వెళ్లేందుకు సిద్దం చేసినట్లు ఎన్నికల అధికారి తెలిపారు. -
నేడు మొదటి దశ పోలింగ్
సాక్షి, బెంగళూరు: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం 15 జిల్లాల్లో మొదటి దశ పోలింగ్ జరగనుంది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లన్నింటినీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ పూర్తి చేసింది. మొదటి దశ ఎన్నికల్లో మైసూరు, బెళగావి రెవెన్యూ డివిజన్లలోని మైసూరు, చిక్కమగళూరు, దక్షిణ కన్నడ, హాసన్, కొడగు, మండ్యా, బెళగావి, హావేరి, ఉత్తర కర్ణాటక, ధార్వాడ, గదగ్, చామరాజనగర, ఉడిపి, బాగల్‌కోటే, విజయపుర జిల్లాల్లోని 3,156 గ్రామం పంచాయతీల్లో 43,579 స్థానాలు ఉన్నాయి. ఇందులో 554 స్థానాలకు నామినేషన్లు ఎవరూ వేయలేదు. అంతేకాకుండా 4,460 స్థానాల్లో ఏకగ్రీవ ఎంపిక జరిగింది. దీంతో మిగిలిన స్థానాలకు 1,20,663 మంది పోటీ పడుతున్నారు. మొదటి దశ ఎన్నికల కోసం 16,965 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. శాంతియుత వాతావరణంలో మొదటిదశ ఎన్నికలను నిర్వహించేందుకు మొత్తం 20,225 మంది భద్రతా బలగాలను వినియోగించనున్నారు. రిజర్వ్ బలగాలను కూడా అందుబాటులో ఉంచినట్లు ఎన్నికల కమిషనర్ శ్రీనివాసాచారి తెలిపారు. -
ఏం సాధించాం?
రెండేళ్ల పాలనలో సాధించిన ప్రగతిపై సీఎంతో కేపీసీసీ చీఫ్ చర్చ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు వ్యూహ రచన బెంగళూరు: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న తరుణంలో గ్రామ పంచాయితీ ఎన్నికల నగారా సైతం మోగడంతో కాంగ్రెస్ పార్టీలో ‘రెండేళ్లలో ఏం చేయగలిగాం’? అన్న విషయంపై అంతర్మధనం మొదలైంది. గ్రామ పంచాయితీ ఎన్నికల కోసం ప్రజల ముందుకు ఎలా వెళ్లాలో చర్చించేందుకు గాను ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జి.పరమేశ్వర్ సమావేశమయ్యారు. బుధవారమిక్కడి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కృష్ణాలో సిద్ధరామయ్యతో పరమేశ్వర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రెండేళ్లలో ప్రభుత్వం చేపట్టిన పనులతో పాటు గ్రామ పంచాయితీ ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలి, మంత్రి మండలి విస్తరణ, బీబీఎంపీ ఎన్నికలు, రాష్ట్రంలో కాంగ్రెస్ సభ్యత్వ నమోదు తదితర అంశాలపై సిద్ధరామయ్యతో సుదీర్ఘంగా చర్చించారు. ‘గ్రామ పంచాయితీ ఎన్నికల నగారా మోగిన వేళ ప్రజలకు ఏం చెప్పి ఓట్లు అడగాలి, అసలు ఈ రెండేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం చేపట్టిన కార్యక్రమాలేమిటి?’ అని కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను సూటిగా ప్రశ్నించినట్లు సమాచారం. ఇక అనంతరం మంగళవారం రోజున నగరంలోని రేస్‌కోర్సు రోడ్‌లోని కేపీసీసీ కార్యాలయంలో నిర్వహించిన కేపీసీసీ పదాధికారుల సమావేశానికి సంబంధించిన అంశాలను సైతం పరమేశ్వర్, సిద్ధుకు తెలియజేశారు. ప్రభుత్వ పనితీరుపై క్షేత్రస్థాయి కార్యకర్తల్లో ఉన్న అసంతృప్తి మంగళవారం నాటి సమావేశంలో బయటపడిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని పరమేశ్వర్ , సిద్ధరామయ్య ముందు ఉంచారు. ‘మంత్రులంతా తమ తమ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పనిచేస్తున్నారు తప్పితే పార్టీ ప్రయోజనాలను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ కారణంగానే ప్రజల్లో ప్రభుత్వం పై మంచి అభిప్రాయం కూడా లేకుండా పోతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ సభ్యత్వ నమోదులో కూడా మంత్రులు చురుగ్గా పాల్గొనలేదు. ఇదిలాగే కొనసాగితే పార్టీతో పాటు ప్రభుత్వానికి కూడా నష్టం తప్పదు. మంత్రుల తీరును మార్చేందుకు మీరు కలగజేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గ్రామ పంచాయితీ ఎన్నికల నగారా మోగిన ఈ తరుణంలో క్షేత్రస్థాయి కార్యకర్తల అవసరం పార్టీకి ఎంతైనా ఉంది’ అని కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పేర్కొన్నట్లు సమాచారం. ఇక పరమేశ్వర్ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందిస్తూ...‘క్షేత్రస్థాయి నుంచి కార్యకర్తలను కలుపుకు పోయేందుకు సమావేశాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన ప్రస్తుత తరుణంలో ప్రభుత్వం తరఫున ఏమీ చేసేందుకు వీలుకాదు. అందువల్ల ఎన్నికలకు సంబంధించిన ఏ కార్యక్రమమైనా సరే పార్టీ తరఫునే చేపట్టండి. పార్టీలోని అందరి సహకారం ఈ కార్యక్రమాలకు అందేలా చూసుకోవాల్సిన బాధ్యత పార్టీ సీనియర్ నాయకులందరి పైనా ఉంది’ అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పరమేశ్వర్‌కు బదులిచ్చినట్లు కేపీసీసీ వర్గాల ద్వారా తెలుస్తోంది. -
‘ప్రోత్సాహకం’ ఏమైంది?
చేవెళ్ల: గ్రామ సర్పంచ్ ఏకగ్రీవమైతే నిధులొస్తాయని, గ్రామం అభివృద్ధి చెందుతుందని భావించిన ప్రజలకు నిరాశే మిగిలింది. ఏకగ్రీవ పంచాయతీలకు ఇచ్చే ప్రోత్సాహక నిధులు(ఇన్సెంటివ్స్) విడుదల చేయడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. ఎన్నికల్లో రిజర్వేషన్లకు అనుగుణంగా పాలకవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ప్రభుత్వం గతంలో రూ.ఐదు లక్షలు ఇచ్చేది. 2013 జూలైలో జరిగిన ఎన్నికలకు ముందు ఈ నిధులను రూ.ఏడు లక్షలకు పెంచారు. అయితే ఆ డబ్బుల విడుదల విషయంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. గ్రామ పంచాయతీ ఎన్నికల అనంతరం పురపాలక, ప్రాదేశిక, సార్వత్రిక ఎన్నికలు వరుసగా జరగడం.. రాష్ట్ర విభజన నేపథ్యంలో పలు గ్రాంట్లనుంచి నిధులు విడుదలకాక ఏ మాత్రం అభివృద్ధి చేయలేకపోయామని ఏకగ్రీవ సర్పంచులు పేర్కొంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 688 గ్రామపంచాయతీలున్నాయి. గత సంవత్సరం జూలైలో జరిగిన పంచాయతీ ఎన్నికలలో జిల్లాలో 31 పంచాయతీల పాలక మండళ్లు ఏకగ్రీవం అయ్యాయి. ఇందులో కేవలం చేవెళ్ల రెవిన్యూ డివిజన్ పరిధిలోనే 15 పంచాయతీలు ఉన్నాయి. చేవెళ్ల మండలం ఇబ్రహీంపల్లి, షాబాద్ మండలం అంతారం గ్రామపంచాయతీ సర్పంచ్, వార్డు నంబర్లందరినీ గ్రామప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చేవెళ్ల మండలం ఎనికెపల్లి పంచాయతీకి సర్పంచ్ పదవి ఏకగ్రీవంకాగా, పలు వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఏకగ్రీవ పంచాయతీలకు త్వరగా నిధులు మంజూరయ్యేలా చూడాలని ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ప్రజలు నూతన కలెక్టర్ ఎన్ .శ్రీధర్‌ను కోరుతున్నారు. ఎకగ్రీవమైతే రూ.ఏడు లక్షలు వస్తాయని, గ్రామం అభివృద్ధి చెందుతుందని భావించి ప్రజలు మంచి నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వం వారి ఆశలపై నీళ్లు చల్లుతోందని చేవెళ్ల నియోజకవర్గంలోని ఏకగ్రీవ సర్పంచులు ఎన్ను జంగారెడ్డి (ఇబ్రహీంపల్లి), దర్శనాల జంగమ్మ (అంతారం), వన ం లతామహేందర్రెడ్డి (ఎనికెపల్లి) ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో తాగునీటి సమస్య అధికంగా ఉందని, సీసీ రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు ఏర్పాటు చేయాల్సి ఉందని వారంతా వాపోతున్నారు. సర్పంచ్ ఏకగ్రీవం.. మాకూ ఇవ్వాలి మా గ్రామస్తులంతా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనివార్య కారణాలవల్ల కొన్ని వార్డులకు మాత్రం ఎన్నికలు జరిగాయి. సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైనందున తమ పంచాయతీకీ ప్రోత్సాహక నిధులను కేటాయించాలి. గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేసుకునే వీలు కలుగుతుంది. - వనం లతామహేందర్రెడ్డి, సర్పంచ్, ఎనికెపల్లి, చేవెళ్ల మండలం వెంటనే నిధులు విడుదల చేయాలి ఎన్నికల సమయంలో ఏకగ్రీవమైన గ్రామపంచాయతీలకు ప్రోత్సాహకంగా నిధులను ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. పాలకవర్గం ఏర్పడి ఏడాదైంది. ఇప్పటికీ పైసా ఇవ్వలే. ఇదే విషయాన్ని పలుమార్లు మండల స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు కల్పించుకుని వెంటనే నిధులను మంజూరు చేయించాలి. - దర్శనాల జంగమ్మ, సర్పంచ్, అంతారం, షాబాద్ మండలం -
పల్లె పోరు ప్రశాంతం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: పల్లె పోరు ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని 22 గ్రామ పంచాయతీలకు ఆదివారం ఎన్నికలు నిర్వహించారు. గతేడాది జిల్లాలోని 650 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా నగర శివారు పంచాయతీలను జీహెచ్ఎంసీలో విలీనం చేసే క్రమంలో భాగంగా వీటి ఎన్నికలు నిలిపివేశారు. తాజాగా న్యాయస్థానం ఆదేశాలమేరకు పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. అయితే ఏడాది ఆలస్యంగా ఎన్నికలు నిర్వహించినప్పటికీ ఓటర్లు మాత్రం పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో 22 పంచాయతీల పరిధిలో కేవలం 63.9శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. ఆదివారం ఎన్నికలు జరిగిన పంచాయతీలన్నీ మహానగరానికి చేరువలో ఉన్నవే. ఈ గ్రామాల్లో ఓటర్లంతా చైతన్యవంతులైనప్పటికీ పంచాయతీ ఎన్నికలకు మాత్రం ఓటు వేసేందుకు ఉత్సాహం చూపలేదు. కుత్బుల్లాపూర్ మండలం నిజాంపేట పంచాయతీలో అత్యల్పంగా 27.8శాతం ఓటింగ్ నమోదు కావడం గమనార్హం. అయితే రాజేంద్రనగర్ మండలం వట్టినాగులపల్లిలో అధికంగా 87.9% ఓటింగ్ నమోదైంది. ఆ తర్వాత ఖానాపూర్‌లో 87.8%, మంచిరేవుల పంచాయతీలో 87శాతం ఓట్లు పోలయ్యాయి. ఈ పంచాయతీల పరిధిలో ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. తొలి రెండు గంటల్లో 26.44శాతం ఓట్లు పోలవ్వగా, 11గంటల ప్రాంతంలో పోలింగ్ 51.25శాతంకు చేరింది. ఓటింగ్ పూర్తయ్యే సమయానికి 63.9శాతానికి చేరింది. -
రెండు విడతల్లో ప్రాదేశిక ఎన్నికలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రాదేశిక ఎన్నికల పోలింగ్ తేదీలు దాదాపు ఖరారయ్యాయి. జిల్లాలో రెండు విడతలుగా ఈ ఎన్నికలు నిర్వహించాలని యంత్రాంగం ఇదివరకే నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే తేదీలు ఖరారుచేసి నోటిఫికేషన్ విడుదల చేసిన అనంతరం ఆకస్మికంగా 22 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటన చేసింది. దీంతో ఈ రెండు ఎన్నికలు సజావుగా నిర్వహించాలనే ఉద్దేశంతో యంత్రాంగం కొన్ని మార్పులు చేపట్టింది. ఏప్రిల్ 6న తొలివిడత ఎన్నికల్లో భాగంగా వికారాబాద్, రాజేంద్రనగర్, మల్కాజిగిరి రెవెన్యూ డివిజన్లలోని 15 మండలాలు, అదేవిధంగా ఏప్రిల్ 11న రెండో విడతలో సరూర్‌నగర్, చేవెళ్ల రెవెన్యూ డివిజన్ పరిధిలోని 17 మండలాల్లోని ప్రాదేశిక స్థానాలకు ఎన్నికలు నిర్వహించేలా జిల్లా యంత్రాంగం ప్రణాళిక రూపొందించింది. ఈ వివరాలను ఎన్నికల సంఘానికి నివేదించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఎన్నికలు నిర్వహించినప్పటికీ ఫలితాలు మాత్రం సార్వత్రిక ఎన్నికల తర్వాతే ప్రకటించనున్నట్లు సమాచారం. దీంతో ప్రాదేశిక ఎన్నికలు పూర్తయిన అనంతరం బ్యాలెట్ బాక్సులను సంబంధిత ఆర్డీఓ కార్యాలయాల్లో భద్రపర్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.