పురుషులతో సమానంగా అన్నిరంగాల్లో రాణిస్తున్న మహిళలు.. రాజకీయంగా సత్తా చాటడానికి సిద్ధమయ్యారు. ఇంకా చెప్పాలంటే పురుషుల కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేసి ప్రజా ప్రతినిధులు కాబోతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వం మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కేటాయించడంతో సగం స్థానాల్లో వారే బరిలో దిగాల్సిన పరిస్థితి. దానికితోడు జిల్లా జనాభాలో పురుషులతో పోల్చుకుంటే మహిళల సంఖ్య అధికంగా ఉండటంతో మరిన్ని ఎక్కువ స్థానాలు వారికే సొంతమయ్యాయి. దాంతోపాటు చాలా మంది పతులు తమ భార్యలను బరిలోకి దింపుతుండటంతో ఈసారి ఎన్నికల్లో మహిళల ప్రాతినిధ్యం ఎక్కువగా నమోదవుతోంది.
సాక్షి, సిద్దిపేట: జిల్లా జనాభాలో పురుషుల కన్నా.. 3526 మంది మహిళలే అధికంగా ఉన్నట్లు అధికారులు లెక్కల్లో తేల్చేశారు. జిల్లాలోని సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్, దుబ్బాక పాత మున్సిపాలిటీలకు తోడు.. ఈ ఏడాది చేర్యాల పట్టణానికి కూడా మున్సిపాలిటీ హోదాను కల్పించారు. ఈ ఐదు మున్సిపాలిటీలు పోగా మిగిలిన 22 మండలాల పరిధిలో కొత్తవీ పాతవీ కలిపి మొత్తం 499 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో మొత్తం 7,95,960 మంది జనాభా ఉన్నారు. వీరిలో 3,96,082 మంది పురుషులు ఉండగా... 3,99,608 మంది మహిళలు ఉన్నారు. అంటే పురుషుల కన్నా మహిళలు 3526 మంది ఎక్కువగా ఉండటం గమనార్హం.
రాజ్యాంగంలో పొందుపరిచిన నిబంధనల ప్రకారం మొత్తం స్థానాల్లో మహిళలకు యాభై శాతం కేటాయించాల్సి ఉంది. ఇలా ఎస్సీ, ఎస్టీ, బీసీలతోపాటు జనరల్ స్థానాల్లో కూడా యాభై శాతం మహిళలకే కేటాయిస్తారు. దీంతో మొత్తం 499 పంచాయతీల్లో సంగం అంటే 249 స్థానాలు మహిళలకు కేటాయించారు. జిల్లాలోని రిజర్వేషన్ల కేటాయింపులో జనాభా శాతాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవడంతో పురుషులకన్నా నాలుగు స్థానాలు ఎక్కువగా మహిళలకు కేటాయించారు. దీంతో జిల్లాలో 252 స్థానాలు మహిళలకే కేటాయించారు. ఈ కేటాయింపులు కూడా రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో లాటరీ పద్ధతిన జరిగింది.
మహిళలకు 252 గ్రామ పంచాయతీలు
స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ అమల్లో ఉండటంతో.. జిల్లాలోని మొత్తం 499 గ్రామ పంచాయతీల్లో సగానికి మించి 252 స్థానాలు మహిళలకు కేటాయిస్తూ రాష్ట్ర పంచాయతీ రాజ్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా చూస్తే మొత్తం గ్రామ పంచాయతీల్లో 18 స్థానాలు ఎస్టీలకు, 93 స్థానాలు ఎస్సీలకు, 143 స్థానాలు బీసీలకు కేటాయించారు. మిగిలిన 245 స్థానాలు జనరల్ రిజర్వేషన్‌గా కేటాయించారు. వీటిల్లో కూడా సగం స్థానాలు మహిళలకు కేటాయించాల్సి ఉంది. కావున ఎస్టీల్లో 10, ఎస్సీల్లో 47, బీసీల్లో 72, జనరల్ స్థానాల్లో 123 మొత్తం 252 మహిళలకు కేటాయించారు.
అదేవిధంగా మహిళల కన్నా 4 స్థానాలు తక్కువగా 247 జనరల్ విభాగానికి కేటాయించారు. అయితే కొన్ని గ్రామాల్లో జనరల్ స్థానాలుగా కేటాయించినప్పటికీ అక్కడ ఉన్న నాయకులు పెద్ద పదవుల్లో ఉండటం, ఉద్యోగులుగా పనిచేయడం, ఉత్సాహవంతులైన మహిళలు ఉండే అవకాశం ఉంది. దీంతో పతులకు బదులుగా సతులను పోటీల్లో దింపే అవకాశం ఉంది. ఇలా మహిళలకు కేటాయించిన 252 పంచాయతీలే కాకుండా జనరల్ విభాగంలో కూడా మహిళలు పోటీలో ఉండే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment