సిద్దిపేట జిల్లా దుంపలపల్లిలో 30 ఏళ్ల కిందట మావోయిస్టుల ఏర్పాటు
ఆ గదులు శిథిలావస్థకు చేరడంతో కూల్చేయాలని విద్యాశాఖ నిర్ణయం
అడ్డుకున్న గ్రామస్తులు.. వాటి ఎదుటే నాలుగు గదుల నిర్మాణం
సిద్దిపేట జిల్లా దుంపలపల్లిలో 30 ఏళ్ల కిందట ఏర్పాటు చేసిన మావోయిస్టులు.. ప్రస్తుతం ఈ పాఠశాలలో 64 మంది విద్యార్థుల విద్యాభ్యాసం
గదులు శిథిలావస్థకు చేరడంతో కూల్చేయాలని విద్యాశాఖ నిర్ణయం.. అడ్డుకున్న గ్రామస్తులు.. వాటి ఎదుట కొత్తగా నాలుగు గదుల నిర్మాణం
సాక్షి, సిద్దిపేట: ఎదురు కాల్పుల్లో మావోయిస్టులు మృతి అన్న వార్తలు విన్నప్పుడల్లా ఆ ఊరి ప్రజలు ఉలిక్కిపడతారు. 30 ఏళ్ల కిందట బాలకార్మికులుగా మగ్గిపోతున్న తమ బిడ్డల కోసం బడి కట్టించిన ఆ అన్నలను తలుచుకుని కలవరపడుతుంటారు. తెలంగాణలో నక్సల్స్ ప్రభావం తీవ్రంగా ఉన్న రోజుల్లో నక్సల్స్ సిద్దిపే ట జిల్లా దుబ్బాక మండలం దుంపలపల్లిలో పేద పిల్లల కోసం పాఠశాలను నిర్మించారు. ఇప్పుడున్న ప్రభుత్వ పాఠశాల అదే.
గ్రామస్తుల విజ్ఞప్తితో..
1991 వరకు ఈ గ్రామంలో పాఠశాల పూరి గుడిసెలో కొనసాగింది. ఆ సమయంలో దుంపలపల్లికి వచ్చిన పీపుల్స్‌వార్ నాగన్న దళానికి పాఠశాల భవనం నిర్మించాలని గ్రామస్తులు విన్నవించారు. దీంతో మూడు గదులను నిర్మించాలని నక్సల్స్ నేతలు నాగన్న, నగేష్, రామన్న, జనార్దన్‌లు నిర్ణయించారు. 1991లో పనులు ప్రారంభించి, 1995 నాటికి పూర్తిచేసి అందుబాటులోకి తెచ్చారు. అప్పట్లో ఈ బడి నిర్మాణానికి సుమారు రూ.5 లక్షల వరకు వెచ్చించినట్లు తెలిసింది. బడి నిర్మాణానికి గ్రామస్తులంతా శ్రమదానం చేశారు.
కూల్చివేతను అడ్డుకున్న స్థానికులు
నక్సలైట్లు నిర్మించిన పాఠశాల శిథిలావస్థకు చేరటంతో వాటి స్థానంలో కొత్త భవనం నిర్మించాలని విద్యాశాఖ నిర్ణయించింది. మన ఊరు–మన బడి పథకంలో భాగంగా జీ ప్లస్ 1లో నాలుగు గదుల నిర్మాణానికి ఏడాదిన్నర క్రితం రూ.51 లక్షలు మంజూరు చేశారు. దీంతో పాత గదులను కూల్చివేసేందుకు అధికారులు ప్రయత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. ఈ గదులు నక్సల్స్‌కు గుర్తుగా ఉండాలని వాదించినట్లు తెలిసింది. దీంతో వెనక్కు తగ్గిన అధికారులు.. పాత బడి ఎదురుగా కొత్త పాఠశాల నిర్మాణం ఇటీవల ప్రారంభమైంది. ఈ పాఠశాలలో ప్రస్తుతం 1 నుంచి 5వ తరగతి వరకు బోధన సాగుతోంది. ఈ స్కూళ్లో ఇప్పటివరకు 943 మంది చదువుకున్నారు. ప్రస్తుతం 64 మంది (బాలురు 36, బాలికలు 28) విద్యార్థులు ఉన్నారు.
కూల్చవద్దు అంటున్న స్థానికులు
పాత భవనం కూల్చివేసి వాటి స్థానంలో నాలుగు తరగతి గదులు నిర్మించాలని మన ఊరు–మన బడి పథకంలో నిర్ణయించారు. పనులు ప్రారంభించే సమయంలో పాత గదులు కూల్చవద్దని స్థానికులు అడ్డుకున్నారు. ఎందుకని అడిగితే అప్పట్లో నక్సలైట్‌లు ఆ గదులను నిర్మించారని చెప్పారు. – నాగేశ్వర్ రావు, ప్రధానోపాధ్యాయుడు
Comments
Please login to add a commentAdd a comment