
హుస్నాబాద్‌లోని జెడ్పీహెచ్‌ఎస్‌లో విద్యార్థుల పర్యవేక్షణకు ప్రత్యేక యాప్
విద్యార్థి బడికి హాజరు కాకుంటే వెంటనే తల్లిదండ్రులకు మెసేజ్
ప్రోగ్రెస్ రిపోర్టులు, సెలవులు, సిలబస్ వంటివి కూడా అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు
సాక్షి, సిద్దిపేట: విద్యార్థి బడికి గైర్హాజరైతే వెంటనే తల్లిదండ్రులకు మెసేజ్ వెళుతుంది.. విద్యార్థికి ఆ రోజు ఇచ్చే అసైన్‌మెంట్లు/హోంవర్క్ వివరాలు కూడా యాప్‌లో వచ్చేస్తాయి.. అంతేకాదు పరీక్షల్లో వచ్చిన మార్కులు, ప్రోగ్రెస్ రిపోర్ట్, సెలవులు, సిలబస్ వంటి వివరాలూ తల్లిదండ్రులకు ఎప్పటికప్పుడు చేరుతాయి.
ఇదేదో ప్రైవేట్ స్కూల్‌లో అమలవుతున్న ఆధునిక విధానం కాదు.. సిద్దిపేట జిల్లాలో హుస్నాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రత్యేకత. మంత్రి పొన్నం ప్రభాకర్, కలెక్టర్ మనుచౌదరి ప్రత్యేక చొరవ తీసుకుని ఓ ప్రైవేట్ కంపెనీ రూపొందించిన యాప్‌లో ఈ పాఠశాలకు ప్రత్యేక లాగిన్ అందించారు.
విద్యార్థులపై మంచి పర్యవేక్షణతో..
ఈ పాఠశాలలో 364 మంది విద్యార్థులున్నారు. రోజూ ఉదయం 9 గంటలకే యాప్‌లో, రిజిస్టర్‌లో విద్యార్థుల అటెండెన్స్ తీసుకుంటారు. పాఠశాలకు గైర్హాజరైన విద్యార్థి తల్లిదండ్రుల ఫోన్‌కు వెంటనే ఎస్సెమ్మెస్ వెళుతుంది. అలాగే విద్యార్థులకు రోజువారీగా ఇచ్చే అసైన్‌మెంట్లను క్లాస్ టీచర్లు యాప్‌లో అప్‌లోడ్ చేస్తారు.
ఈ వివరాలు తల్లిదండ్రులకు చేరుతాయి. దీనితో పిల్లలు స్కూల్‌కు వెళ్తున్నామని డుమ్మాకొట్టే చాన్స్ ఉండదు. హోంవర్క్/రీడింగ్ లేదంటూ ఇళ్లలో చెప్పి తప్పించుకోవడానికీ వీలుండదని టీచర్లు చెబుతున్నారు. ఈ యాప్‌తో విద్యార్థులపై పర్యవేక్షణ సులువైందని అంటున్నారు.
త్వరలో విద్యార్థి ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా..
విద్యార్థుల ప్రోగ్రెస్ రిపోర్ట్, లీవ్ అనుమతులు, నెలవారీ సిలబస్, పేరెంట్స్ ఫీడ్ బ్యాక్, పరీక్షల టైం టేబుల్, హాలిడేస్ లిస్ట్ వంటివి సైతం యాప్ ద్వారానే అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిద్వారా తల్లిదండ్రులు తమ పిల్లల పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ప్రతి విద్యార్థికి సంబంధించి కనీస సామర్థ్యాలు సాధించే దిశగా విద్యార్థి సూచిక (స్టూడెంట్ ప్రొఫైల్) ఉంటుంది. సబ్జెక్టుల వారీగా వెనుకబడిన తీరు, పురోగతి సాధిస్తున్న అంశాలను ఇందులో పొందుపర్చనున్నారు.
హాజరుశాతం పెరిగింది
యాప్ ద్వారానే విద్యార్థుల అటెండెన్స్ తీసుకుంటున్నాం. విద్యార్థి స్కూల్‌కు గైర్హాజరైతే వెంటనే పేరెంట్స్‌కు సమాచారం వెళ్తుంది. పర్యవేక్షణ పెరగడంతో విద్యార్థుల హాజరుశాతం పెరిగింది. ప్రోగ్రెస్ రిపోర్ట్, ఫీడ్ బ్యాక్ వంటివి కూడా త్వరలో అందుబాటులోకి తీసుకువస్తాం. – వాసుదేవరెడ్డి ప్రధాన ఉపాధ్యాయుడు, జెడ్పీ ఉన్నత పాఠశాల, హుస్నాబాద్
పిల్లలు గైర్హాజరైతే వెంటనే మెసేజ్ వస్తుంది
మా పిల్లలు ప్రభుత్వ స్కూల్‌లోనే చదువుతున్నారు. వాళ్లు స్కూల్‌కు వెళ్లకుంటే నా ఫోన్‌కు మెసేజ్ వస్తుంది. ఇలా తల్లిదండ్రులకు విద్యార్థుల సమాచారం తెలపడం బాగుంది. టీచర్లు అసైన్‌మెంట్లను యాప్‌లో పెడుతుండటంతో.. పిల్లలు ఇంటికి వచ్చాక వారిని దగ్గరుండి చదివిస్తున్నాం. – ముక్కెర రమేశ్, విద్యార్థి తండ్రి
Comments
Please login to add a commentAdd a comment