సాక్షి, హైదరాబాద్: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి సత్తా చాటింది. తొలివిడతలో సింహభాగం పంచాయతీలను కైవసం చేసుకున్న గులాబీ పార్టీ రెండో విడతలోనూ అదేజోరును ప్రదర్శించింది. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 4,135 గ్రామ పంచాయతీలకు గాను 4,130 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో ఐదు పంచాయతీలకు నామినేషన్లు రాకపోవడంతో అక్కడ ఎన్నికలు నిర్వహించలేదు. ఎన్నికలు జరిగిన వాటిలో టీఆర్‌ఎస్ పార్టీ మద్దతుదారులు 2,865 గ్రామ పంచాయతీలను కైవసం చేసుకున్నారు. 770 పంచాయతీలను కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది.
టీడీపీ 39 పంచాయతీల్లో, 43 పంచాయతీల్లో బీజేపీ, 12 పంచాయతీల్లో సీపీఐ, 22 పంచాయతీల్లో సీపీఎం పార్టీలు పాగా వేశాయి. మరో 379 గ్రామ పంచాయతీల్లో స్వతంత్రులు విజేతలుగా నిలిచారు. నామినేషన్లు రాని కారణంగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో రెండు గ్రామ పంచాయతీలు ఆదిలాబాద్, ఖమ్మం, జయశంకర్‌భూపాలపల్లిలో ఒక్కో పంచాయతీకి ఎన్నికలు జరగలేదు. ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఒక్కో గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక్కోవార్డు స్థానాల లెక్కింపుపై అస్పష్టత నెలకొనడంతో వాటి ఫలితాలు నిలిపివేశారు. ఈనెల 30న తుది విడత ఎన్నికలతో పాటు ఈరెండు వార్డుల ఎన్నికలు నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది.
‘యాదాద్రి భువనగిరి’లో 93% పోలింగ్
గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికల్లో 88.26 శాతం పోలింగ్ నమోదైంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 93.71 శాతం ఓటింగ్ నమోదైంది. సూర్యాపేట జిల్లాలో 92.82 శాతం, మెదక్ 92.52 శాతం, సిద్దిపేట 92.34 శాతం, నల్లగొండ జిల్లాలో 92.01 శాతం, ఖమ్మం 91.91 శాతం, మహబూబాబాద్ 91.05 శాతం, జనగామ 90.52 శాతం, నాగర్‌కర్నూల్ 90.17 శాతం, కామారెడ్డి జిల్లాలో 90.04 శాతం ఓటింగ్ నమోదైంది. జగిత్యాల జిల్లాలో అత్యల్పంగా 80.23 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగ్గా... మొత్తం 37,76,797 మంది తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. వీరిలో 19,08,889 మంది మహిళలు, 18,67,898 మంది పురుషులున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రూ.33 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతులిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment