సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం జరుగుతున్న కసరత్తు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లను పరిగెత్తిస్తోంది. పంచాయతీ ఎన్నికలతో తమ నియోజకవర్గాల్లో కొత్త తలనొప్పులను ఇప్పుడెందుకు రుద్దుతున్నారని వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణ ఎన్నికలకు ముందు స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగితే అధికార పార్టీకి ఇబ్బందికరంగా ఉంటుందని అంటున్నారు. అధికారం వచ్చిన తర్వాత స్థానిక ఎన్నికలు ఉంటే బాగుండేదని అంటున్నారు.
సాధారణ ఎన్నికలకు ముందు స్థానిక ఎన్నికలుంటే ఎమ్మెల్యేలపై అన్ని భారాల పడ్తాయని, ఫలితాల ప్రభావమూ ఉంటుందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు. ప్రత్యేకంగా గ్రామాల్లో ప్రస్తుతమున్న ప్రత్యేక పరిస్థితులు అధికార పార్టీ ఎమ్మెల్యేలను బెంబేలెత్తిస్తున్నాయి. తెలంగాణలోని ఎక్కువ గ్రామాల్లో ఇప్పుడు టీఆర్‌ఎస్ పార్టీలోనే నాయకులు, కార్యకర్తలు కేంద్రీకృతమయ్యారు.
టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చింతర్వాత కాంగ్రెస్, టీడీపీ, ఇతర పార్టీల్లో ఉన్న నాయకులంతా అధికార పార్టీలోనే చేరారు. ఏ నియోజకవర్గంలో చూసినా సర్పంచ్ స్థానానికి ఒక్కొక్క గ్రామంలో కనీసం ఐదారుగురు ముఖ్య నేతలు, సీనియర్లు, ఆసక్తి ఉన్నవారి మధ్య పోటీ ఉంది. గ్రామాల్లో నాయకుల మధ్య వ్యక్తిగత వైషమ్యాలు, అభ్యర్థుల పోటీలో అధికారిక అభ్యర్థిని ప్రకటించడం, వీరి ఆర్థిక భారాన్ని మోయడం, వీరి గెలుపోటముల వంటి అన్ని అంశాలు సమస్యగానే ఉంటాయని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు.
గ్రామాల్లో ఆధిపత్య పోరు...
టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చింతర్వాత అన్ని పార్టీల నేతలు ఆ పార్టీలోనే చేరిపోయారు. ఒకే పార్టీలో వీరు ఉన్నప్పటికీ ఏ ఇద్దరు నేతల మధ్య సయోధ్య లేదు. పేరుకు అధికార పార్టీలోనే ఉన్నా, గ్రామాల్లో వీరు ఎవరికి వారే అన్నట్టుగా తమ వర్గాలను, గ్రూపులను నడిపించుకుంటున్నారు. పార్టీ ఎమ్మెల్యేగా ఆ గ్రామానికి వెళ్లినప్పుడు పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నా ఎవరికివారే గ్రామస్థాయిలో వర్గానికి నాయకత్వం వహిస్తున్నారు.
ఒక్కొక్క గ్రామంలో కనీసం మూడు గ్రూపులుంటున్నాయి. కొన్ని గ్రామాల్లోనైతే ఐదారు గ్రూపులు కూడా ఉన్నాయని చెబుతున్నారు. వీరిలో ఏ ఒక్కరిని అభ్యర్థిగా ప్రకటించినా, మిగతా వర్గాలు వ్యతిరేకమయ్యే ప్రమాదముందని ఆందోళన చెందుతున్నారు. గ్రామ స్థాయి నేతల మధ్య వైషమ్యాలు సాధారణ ఎన్నికలపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయని భయపడుతున్నారు.
సాధారణ ఎన్నికలకు ఎక్కువ సమయం ఉంటే అవకాశం రాని వారికి మరో ప్రత్యామ్నాయం చూపించే మార్గం ఉంటుందని, ఎన్నికలు దగ్గరకు వచ్చిన తర్వాత అయితే గ్రామ స్థాయి నాయకులు పెద్దగా పట్టించుకోకపోవచ్చునంటున్నారు. ఎమ్మెల్యే స్థానాలకే ఎన్నికలు జరుగుతున్నప్పుడు తమతో అవసరం ఉండదా అని గ్రామాల నాయకులు ధైర్యంగా ఉంటారని, అదే అధికారంలోకి వచ్చిన తర్వాత అయితే కొంచెం భయంతోనో, భక్తితోనే పార్టీకి పనిచేసే అవకాశం ఉంటుందంటున్నారు.
గ్రామం అంతా టీఆర్‌ఎస్‌లోనే ఉంటే, ఏక కాలంలో అందరినీ సంతృప్తి పర్చడం సాధ్యంకాదంటున్నారు. పార్టీలో ఎక్కువ మంది నాయకులు ఉన్నప్పుడు పార్టీ అభ్యర్థిని అధికారికంగా ఎంపిక చేయడం, ఆ తరువాత అందరినీ కాపాడుకోవడం కత్తిమీద సాములాగానే ఉంటుందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు.
ఆర్థిక భారం ఎలా?
పార్టీ అభ్యర్థిని నిర్ణయించడం ఒక సమస్య అయితే, వారి ఆర్థిక అంశాలు అంతకన్నా ఎక్కువగా ఎమ్మెల్యేలను భయపెడుతున్నాయి, వార్డు సభ్యులు, సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగితే ఖర్చు గురించి చెప్పుకునే పరిస్థితి ఉండదంటున్నారు. ఎన్నికల కమిషన్ ఎన్ని పరిమితులు విధించినా, ఎంత నిఘా పెంచినా ఖర్చును ఆపే పరిస్థితి ఉండదంటున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రతీ ఓటు కీలకమే కావడంతో అంతూపొంతు లేకుండా జరిగే వ్యయాలు ఎవరు మోయాలని ఎమ్మెల్యేలు భయపడుతున్నారు.
స్థానికంగా అభ్యర్థులు ఖర్చులు భరించినా, ఎమ్మెల్యేగా, వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా తమ నుంచి ఆర్థిక సహాయాన్ని ప్రతీ ఊరి నుంచి కచ్చితంగా ఆశిస్తారని ఎమ్మెల్యేలు అంటున్నారు. ఒక్కొక్క ఊరికి రూ.యాబైవేలు, రూ.లక్షకు తగ్గకుండా ఇవ్వాల్సి వస్తుందని చెబుతున్నారు. ఒక్కొక్క నియోజకవర్గానికి సగటున 100 గ్రామ పంచాయతీలు ఉన్నాయని, దీనిని బట్టి ఎమ్మెల్యేగా తమపై ఖర్చును లెక్కబెట్టి, ఆందోళన చెందుతున్నారు.
కొంచెం పెద్ద గ్రామ పంచాయతీలు అయితే అంతకన్నా ఎక్కువగానే ఆర్థికంగా సహాయం చేయాల్సిన పరిస్థితి తప్పదేమోనని ఎమ్మెల్యేలు భయపడుతున్నారు. ఇవన్నీ లెక్క గడితే వచ్చే ఎన్నికల్లో తమకు అయ్యే ఖర్చులో సగం అయినా ఇప్పుడు భరించాల్సి వస్తుందని లెక్కలు గడుతున్నారు. ఇంత చేసినా గెలుపోటములు తమ ఎన్నికలపై ప్రభావాన్ని చూపిస్తాయని అంటున్నారు. ఈ తలనొప్పులన్నీ ఎన్నికలకు ముందు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. సాధారణ ఎన్నికలయ్యేదాకా పంచాయతీ ఎన్నికలు వాయిదా పడితే బాగుండునని ఎమ్మెల్యేలు కోరుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment