పోరుకు సై! | Gram Panchayat Elections In Telangana | Sakshi
Sakshi News home page

పోరుకు సై!

Published Sun, May 27 2018 10:21 AM | Last Updated on Tue, Oct 30 2018 5:17 PM

Gram Panchayat Elections In Telangana - Sakshi

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌:  స్థానిక పోరుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ముమ్మరం చేసింది. ఈ ఏడాది ఆగస్టు 2వ తేదీతో గ్రామపంచాయతీ పాలకమండళ్ల పదవీ కాలం ముగియనుంది. నిర్దేశిత గడువులోగా స్థానిక ఎన్నికలను నిర్వహించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన రాష్ట్ర ప్రభుత్వం జూలై నెలలో ఎన్నికలు నిర్వహణకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల తుదిజాబితాను విడుదల చేయడంతో పాటు బీసీ ఓటర్ల గణన, పోలింగ్‌ స్టేషన్ల గుర్తింపు తదితర అంశాలపై దృష్టి సారించింది. జూన్‌ 1న స్థానిక రిజర్వేషన్లపై స్పష్టమైన ప్రకటన జారీ చేయాలని అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది.

 దీంతో గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల వేడి రగులుతోంది. కొత్త పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం సర్పంచ్‌లకు ప్రత్యేక అధికారాలు కల్పించిన నేపథ్యంలో బరిలోకి దిగేందుకు చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు. అంతేకాదు వచ్చే ఏడాది సాధారణ ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీ సానుభూతిపరులను గెలిపించుకునేందుకు అన్ని పార్టీలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. అలాగే ఎమ్మెల్యేలందరూ కూడా నియోజకవర్గాల్లో తిష్ట వేసి ‘గ్రౌండ్‌’ సిద్ధం చేస్తుం డగా.. విపక్ష పార్టీలు కూడా తమ తమ సత్తా చాటేందుకు సమాయత్తమవుతున్నాయి.  

పోరుకు గ్రీన్‌ సిగ్నల్‌.. 
గ్రామపంచాయతీ తోపాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీల పాలకమండళ్ల కాలపరిమితి ముగియనుండడంతో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో గతంలో మొత్తం 1,148 గ్రామ పంచాయితీలు ఉండగా.. కొత్తగా ఏర్పాటుచేసిన జీపీలతో కలుపుకుని వీటి సంఖ్య 1,684కు చేరింది. అదే వి ధంగా వార్డుల విషయానికొస్తే గతంలో 12,148 ఉండగా.. ప్రస్తుతం 15,361 కి చేరాయి. ఉమ్మడి జిల్లాలో 19,36,445 మంది ఓటర్లు ఉన్నారు. ఈ సారి రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పరిపాలన విషయంలో అనేక మార్పులు చేర్పులు తీసుకొచ్చింది. 

అభివృద్ధి కార్యక్రమాల విషయంలో స్థానిక పాలకమండళ్లకే పూర్తి అధికారాలు కేటాయించింది. తద్వారా ఈసారి బరిలో నిలిచేందుకు చాలా మం ది ఉత్సుకతతో ఉన్నారు. అదే విధంగా జిల్లాలు, మండలాలు, గ్రామాల పునర్విభజన తర్వాత తొలిసారిగా ఎన్నికలు నిర్వహిస్తుండటంతో అన్ని వర్గాల్లో ఆసక్తి నెలకొంది. పంచాయితీలు, వార్డుల రిజర్వేషన్లను జూన్‌1న ప్రకటించాలని అధికార యంత్రాంగం కసరత్తు చేస్తుండటంతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. కొత్త చట్టం ప్రకారం ఈసారి ఖరారయ్యే రిజర్వేషన్లు పదేళ్ల పాటు కొనసానుండటంతో పోటీ చేయాలని భావిస్తున్న అభ్యర్థులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  

స్థానికంలో సత్తా చాటితేనే... 
స్థానిక పోరులో సత్తా చాటేందుకు అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. తద్వారా విపక్ష పార్టీలను సాధారణ ఎన్నికలకు ముందే బలహీనపర్చాలని యోచిస్తోంది. అందుకు అనుగుణంగా సామ, భేద, దండోపాయాలను ఉపయోగిస్తోంది. అంతేకాదు స్థానిక ఎన్నికలను ఎమ్మెల్యేలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. స్థానికంలో సత్తా చాటితేనే సాధారణ ఎన్నికల్లో టిక్కెట్‌ కేటాయించనున్నట్లు పార్టీ అధిష్టానం చెప్పినట్లు ప్రచారం సాగుతోంది. దీంతో తమ తమ నియోజకవర్గంలోని అత్యధిక స్థానాలు గెలుపొందాలని వారు ఉవ్విళ్లూరుతున్నారు. ఇలా ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారడంతో ఎమ్మెల్యేలు తీవ్రంగా కష్టపడుతున్నారు.

 ఎన్నికల వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలనే అంటిపెట్టుకొని తిరుగుతున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ నే విపక్ష పార్టీలకు చెందిన వారిని టీఆర్‌ఎస్‌లోకి చేర్చుకుంటున్నారు. అంతేకాదు ప్రభుత్వం చేపడుతున్న పథకాలు రైతుబంధు వంటి వాటి ద్వారా జనానికి మరింత చేరువవుతున్నారు. ఉ మ్మడి జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలకు గాను దాదాపు ఎనిమిది చోట్ల అధికార టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఉన్నారు. అలాగే విపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల కూడా సాధ్యమైనంత మేర ఎక్కువ స్థానాలను కైవసం చేసుకునేందుకు అన్ని రకాల వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. 

సత్తా చాటుతామంటున్న కాంగ్రెస్‌.. 
వచ్చే ఏడాది సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఫైనల్స్‌గా భావిస్తున్న తరుణంలో స్థానిక ఎన్నికల్లో సత్తా చాటేందుకు విపక్ష పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ తమ కదలికలను ముమ్మరం చేసింది. ఎక్కడిక్కడ గ్రామాల్లో కమిటీలను ఏర్పాటు చేస్తూ స్థానిక పోరుకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు ప్రాంతంలో బలంగా ఉన్నామని భావిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ స్థానిక ఎన్నికల్లో సత్తా చూపాలని యోచిస్తోంది. ఉమ్మడి జిల్లాలో కల్వకుర్తి, వనపర్తి, అలంపూర్, గద్వాల, కొడంగల్‌ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీకి ప్రాతినిధ్యం ఉంది. తాము ప్రాతినిధ్యం వహిస్తున్న చోట్ల మెజార్టీ స్థానాలు దక్కించుకోవాలని ఎమ్మెల్యేలు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. అదే విధంగా మిగతా చోట్ల ఇన్‌చార్జీలుగా వ్యవహరిస్తున్న పార్టీ నేతలు కూడా తమ సానుభూతిపరులకు మద్దతుగా నిలవాలని యోచిస్తున్నారు. ఫలితంగా ఎక్కువ మొత్తంలో స్థానిక సీట్లు సాధించి వచ్చే ఎన్నికల్లో తమ బెర్త్‌ను సుస్థిరం చేసుకోవాలని భావిçస్తున్నారు.  

మిగతా పక్షాలు సైతం.. 
స్థానిక ఎన్నికల్లో మిగతా విపక్షాలైన బీజేపీ, వైఎస్సార్‌సీపీ, తెలంగాణ జన సమితి, కమ్యూని స్టు పార్టీలు కూడా తమ తమ సత్తా చాటాలని భావిస్తున్నాయి. స్థానిక ఎన్నికల్లో గెలిస్తే కేడర్‌ బలపడుతుందని ఆయా పార్టీలు భావించి వ్యూహాలు రచిస్తున్నాయి. ఒక మోస్తరు సంస్థాగతంగా నిర్మితమైన బీజేపీ కూడా ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. పార్టీ అనుబంధ శాఖలను అప్రమత్తం చేసింది. అందుకు అనుగుణంగా చాపకింద నీరు లా చర్యలు చేపడుతోంది. అదే విధంగా వైఎస్సార్‌సీపీ కూడా గత ఎన్నికల మాదిరిగానే మంచి ఫలితాలు రాబట్టాలని యోచిస్తోంది. అందుకో సం పాలమూరు ప్రాంతంలోని పార్టీ యంత్రాగమంతా శక్తిమేర ప్రయత్నిస్తోంది. 

నేతలంతా తమ తమ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ తమ పట్టును నిలుపుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవలి కాలంలో ప్రొఫెసర్‌ కోదండరాం నేతృత్వంలో కొత్తగా రాజకీయ రూపాంతం చెంది న తెలంగాణ జన సమితి(టీజేఎస్‌) కూడా స్థానిక పోరు సమర శంఖం పూరిస్తోంది. పోరులో తలపడేందుకు పకడ్బందీగా అభ్యర్థులను ఎంచుకుంటోంది. అలాగే వివిధ పోరాటాలతో నిత్యం జనం మధ్య ఉండే కమ్యూనిస్టు పార్టీలు కూడా తమ తమ సత్తాను చాటాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇలా అన్ని పార్టీలు రంగంలో దిగడంతో రిజర్వేషన్లు ఖరారు కాకముందే స్థానిక సంస్థల సందడి నెలకొందని చెప్పాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement