టీడీపీ ఎమ్మెల్యేల ధర్నా
సాక్షి, హైదరాబాద్: శాసనసభ నుంచి ఒకరోజు సస్పెన్షన్‌కు గురైన టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రవేశ ద్వారం వద్ద ధర్నా నిర్వహించారు. టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు, ఉప నాయకుడు రేవంత్‌రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, జి.సాయన్న, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మాగంటి గోపీనాథ్, ఎ.గాంధీ, మాధవరం కృష్ణారావు, ప్రకాశ్‌గౌడ్, రాజేశ్వర్ రెడ్డి ద్వారానికి అడ్డుగా కూర్చొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతకుముందు స్పీకర్ చాంబర్ వద్ద బైఠాయించేందుకు ఎర్రబెల్లి విఫల ప్రయత్నం చేశారు. చాంబర్‌కు వెళ్లే దారిలో ఉన్న సెక్యూరిటీని తోసుకుంటూ ఆవేశంగా వెళ్లిన ఎర్రబెల్లి.. ప్రధాన ద్వారం వద్ద నేలపై బైఠాయించారు. అయితే మిగతా టీడీపీ ఎమ్మెల్యేలెవరు ఆయనకు తోడుగా అక్కడకు రాలేదు. రెండు, మూడు నిముషాల వ్యవధిలోనే ఎర్రబెల్లిని మార్షల్స్ అక్కడి నుంచి తీసుకెళ్లి అసెంబ్లీ ప్రధానద్వారం మెట్లపై వదిలి వెళ్లారు.
అనంతరం ఎమ్మెల్యేలతో కలిసి అక్కడే ధర్నా కొనసాగించారు. రైతు ఆత్మహత్యలను పట్టించుకోని ప్రభుత్వం గద్దె దిగాలని నినాదాలు చేశారు. ఈ సమయంలో సమయంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ బయటకు వెళ్తూ.. ప్రజలు, రైతులు మిమ్మల్ని బర్తరఫ్ చేశారంటూ వారిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మరోవైపు ఇటీవలే టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాసయాదవ్ కూడా వారి పక్క నుంచే బయటకు వెళ్లిపోయారు. సస్పెండ్ అయిన వారి జాబితాలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య పేరు లేకపోయినా.. మిగతా పార్టీ సభ్యులతోపాటే సభ నుంచి బయటకు వచ్చిన ఆయన ధర్నాలో పాల్గొనకుండా వెళ్లిపోయారు. నిరసన తెలుపుతున్న టీడీపీ ఎమ్మెల్యేలకు బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి మద్దతు తెలిపారు. అసెంబ్లీ సోమవారానికి వాయిదా పడ్డాక టీడీపీ ఎమ్మెల్యేలు తమ నిరసనను విరమించుకున్నారు. అంతకుముందు ఉదయం 9 గంటలకు టీడీపీ ఎమ్మెల్యేలు గన్‌పార్క్ అమరవీరుల స్థూపం వద్ద ధర్నా నిర్వహించారు.
గజ్వేల్‌కు ఎమ్మెల్యేల బృందం
ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం చేసేందుకు టీడీపీ ఎమ్మెల్యేల బృందం మెదక్ జిల్లా గజ్వేల్‌కు వెళ్లింది. ఎర్రబె ల్లి సారథ్యంలో మధ్యాహ్నం మూడు గంటలకు నేతలు అసెంబ్లీ నుంచి వాహనాల్లో గజ్వేల్‌కు వెళ్లారు బాధిత కుటుంబాలకు రూ.50వేల చొప్పున ఆర్థికసాయాన్ని అందజేశారు.
పోచారం క్షమాపణ చెప్పాల్సిందే: ఎర్రబెల్లి
రైతు ఆత్మహత్యలపై బాధ్యతారహితంగా మాట్లాడిన వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అసెంబ్లీలో క్షమాపణ చెప్పాల్సిందేనని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు. శుక్రవారం అసెంబ్లీ ఆవరణలో మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. రైతుఆత్మహత్యలపై చర్చ జరిపిం చాలని పట్టుబడితే టీడీపీ సభ్యులను సభ నుంచి బయటికి గెంటేశారని ఆరోపించారు. ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తూ.. సభను ఇష్టానుసారం నడిపిస్తోందన్నారు. తెలంగాణలో ఇప్పటివరకు 378 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పపడ్డారరన్నారు. సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజవర్గంలోనే అత్యధిక ఆత్మహత్యలు చోటుచేసుకున్నాయన్నారు. బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారమివ్వాలని డిమాండ్ చేశారు.