టీఆర్‌ఎస్‌లో కొత్త సమస్య!
- మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య పెరుగుతున్న గ్యాప్
- నియోజకవర్గ సమస్యలపై ఎమ్మెల్యేల్లో ఆందోళన
- మంత్రులు తమను పట్టించుకోవడం లేదని ఆరోపణ
హైదరాబాద్: అధికార టీఆర్ఎస్‌లో కొత్త సమస్య మొదలైంది. కొత్త నాయకులు, పాత నేతల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. పేరుకు ఎమ్మెల్యేలమే అయినా నియోజకవర్గ సమస్యలు పరిష్కరించలేకపోతున్నామని చాలామంది టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు తమను అసలు పట్టించుకోవడం లేదనే ఫీలింగ్ చాలామంది ఎమ్మెల్యేల్లో కనిపిస్తోంది. జిల్లాల్లో పార్టీని బలోపేతం చేయలని కేసీఆర్ అంటున్నా కొందరు మంత్రులు ఈ దిశగా సహకరించడం లేదని ఎమ్మెల్యేలంటున్నారు.
జిల్లా పర్యటనల సందర్భంగా మంత్రులు, పార్టీ నాయకులు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో కచ్చితంగా సమావేశం కావాలని సీఎం కేసీఆర్ స్పష్టంగా చెప్పారు. కాని మంత్రులు మాత్రం షెడ్యూల్ బిజీగా ఉందని చెప్పి తప్పించుకుంటున్నారని చాలా మంది ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. పనులేమైనా ఉంటే సెక్రటేరియట్‌కు వచ్చి కలవమని చెప్తున్నారని అంటున్నారు. సచివాలయం వెళ్లినా అక్కడా తమకు మంత్రుల దర్శన భాగ్యం కలగడం లేదని, సమీక్షల్లో బిజీగా ఉన్నామని సమాధానం వస్తోందని మండిపడుతున్నారు.
మంత్రుల తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలు - ఈ వ్యవహారాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. కాని కొందరు స్ధానిక పరిస్థితుల కారణంగా చాలామంది బయటపడటం లేదనే మాటలు వినిపిస్తున్నాయి.
మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య సమన్వయ లోపంలో మరో ఆసక్తికర ట్విస్టు కనిపిస్తోంది. టీఆర్‌ఎస్ ఒరిజినల్ నాయకులకన్నా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలోకి వచ్చి మంత్రులైన తలసాని, తుమ్మల నాగేశ్వరరావు వంటి నేతలే తమ సమస్యలను సావధానంగా వింటున్నారని చాలా మంది టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలంటున్నారు. తమతో పార్టీలో మొదటినుంచి పనిచేసిన కొందరు నేతలు ఇప్పుడు మంత్రులైన తరువాత పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు.