నేడు మొదటి దశ పోలింగ్
సాక్షి, బెంగళూరు: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం 15 జిల్లాల్లో మొదటి దశ పోలింగ్ జరగనుంది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లన్నింటినీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ పూర్తి చేసింది. మొదటి దశ ఎన్నికల్లో మైసూరు, బెళగావి రెవెన్యూ డివిజన్లలోని మైసూరు, చిక్కమగళూరు, దక్షిణ కన్నడ, హాసన్, కొడగు, మండ్యా, బెళగావి, హావేరి, ఉత్తర కర్ణాటక, ధార్వాడ, గదగ్, చామరాజనగర, ఉడిపి, బాగల్‌కోటే, విజయపుర జిల్లాల్లోని 3,156 గ్రామం పంచాయతీల్లో 43,579 స్థానాలు ఉన్నాయి.
ఇందులో 554 స్థానాలకు నామినేషన్లు ఎవరూ వేయలేదు. అంతేకాకుండా 4,460 స్థానాల్లో ఏకగ్రీవ ఎంపిక జరిగింది. దీంతో మిగిలిన స్థానాలకు 1,20,663 మంది పోటీ పడుతున్నారు. మొదటి దశ ఎన్నికల కోసం 16,965 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. శాంతియుత వాతావరణంలో మొదటిదశ ఎన్నికలను నిర్వహించేందుకు మొత్తం 20,225 మంది భద్రతా బలగాలను వినియోగించనున్నారు. రిజర్వ్ బలగాలను కూడా అందుబాటులో ఉంచినట్లు ఎన్నికల కమిషనర్ శ్రీనివాసాచారి తెలిపారు.