![There were no irregularities in the counting of votes in the panchayat elections - Sakshi](/styles/webp/s3/article_images/2021/03/13/ap.jpg.webp?itok=EnD1Nny2)
సాక్షి, అమరావతి: గ్రామ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఎటువంటి అక్రమాలు, అవకతవకలు జరగలేదని రాష్ట్ర ఎన్నికల కమిషన్ శుక్రవారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సమయంలో కరెంట్ నిలిపివేసి ఫలితాలను తారుమారు చేశారని, నిబంధనలకు విరుద్ధంగా పలుచోట్ల రీకౌంటింగ్ నిర్వహించారని ఫిర్యాదులు రావడంతో అన్ని జిల్లాల కలెక్టర్లు, పంచాయతీ రాజ్‌శాఖ కమిషనర్ నుంచి నివేదికలు తెప్పించుకున్నట్టు కమిషన్ తెలిపింది.
కొన్ని చిన్న సంఘటనలు జరిగినప్పటికీ, వాటిలో తీవ్రంగా పరిగణించాల్సినవి ఏమీ లేవని పేర్కొంది. ఎక్కడా కూడా కరెంట్ నిలిపివేసి ఫలితాలను మార్చినట్టు నిర్ధారణ కాలేదని తెలిపింది. గుంటూరు జిల్లాలో నాలుగు పంచాయతీల్లో ఎక్కువ ఓట్ల తేడా ఉన్నా, రీ కౌంటింగ్ నిర్వహించినట్టు తెలిసిందని, వాటిపై జిల్లా కలెక్టరు నుంచి సమగ్ర నివేదిక తెప్పించుకున్నానని, రీకౌంటింగ్‌లో ఎటువంటి అవకతవకలు జరిగినట్లు నిర్ధారణ కాలేదని వెల్లడించింది. ఓట్ల లెక్కింపుపై వచ్చిన ఆరోపణలు పూర్తి నిరాధారమైనవని రాష్ట్ర ఎన్నికల కమిషన్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment