సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మూడు విడతలుగా నిర్వహించిన గ్రామపంచాయతీ ఎన్నికలు బుధవారంతో ముగిశాయి. ఈ నెల 21, 25, 30 తేదీల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో (హైదరాబాద్ జిల్లా మినహా) జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలుపొం దిన సర్పంచ్‌లు, వార్డు మెంబర్లకు ఫిబ్రవరి 2ను అపాయింట్‌మెంట్ డేగా నిర్ణయిస్తూ పంచాయతీ రాజ్ శాఖ నోటిఫికేషన్ జారీచేసింది. శనివారం (ఫిబ్రవరి 2న) కొత్త గ్రామపంచాయతీలు కొలువుదీరనున్నాయి. ఈ సందర్భంగా కొత్త గ్రామపంచాయతీల తొలి సమావేశం జరగనుంది. అదే రోజున సర్పంచ్‌లు, వార్డు సభ్యులు పదవీ ప్రమాణం చేసి బాధ్యతలు చేపడతారు. ఆ రోజు నుంచి వారి పదవీ కాలం ఐదేళ్ల పాటు కొనసాగనుంది.
రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) నోటిఫికేషన్లకు అనుగుణంగా మూడు దశలుగా ఈ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. వివిధ కారణాలతో అంతకు ముందు, ఈ నెల 30న ఎన్నికలు జరగని పంచాయతీలు, ఇంకా గడువు ముగియని పంచాయతీలకు పంచాయతీరాజ్‌శాఖ విడిగా అపాయింటెడ్ డేను ప్రకటించనుంది. ఈ మేరకు పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్ నీతూకుమారి ప్రసాద్ నోటిఫికేషన్ జారీ చేశారు. స్థానిక సంస్థల ప్రతినిధులకు ముఖ్యంగా గ్రామస్థాయిల్లోని పంచాయతీ సర్పంచ్‌లకు కొత్త పంచాయతీరాజ్ చట్టంతో సహా గ్రామస్థాయిలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం తదితర కార్యక్రమాల గురించి సమగ్ర అవగాహన కల్పించి, క్షేత్రస్థాయిలో అభివృద్ధిలో భాగస్వాములను చేయాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల నేపథ్యంలో ఈ శిక్షణ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఏర్పడింది.
11 నుంచి సర్పంచ్‌లకు శిక్షణ..
రాష్ట్రవ్యాప్తంగా గెలుపొందిన సర్పంచ్‌లకు ఫిబ్రవరి 11 నుంచి మార్చి 1 వరకు ఆయా జిల్లాల వారీగా విభజించి మూడు విడతలుగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఒక్కో విడతలో రెండు బ్యాచ్‌లుగా వంద మందికి శిక్షణ ఇస్తారు. తొలి విడత శిక్షణను ఫిబ్రవరి 11 నుంచి 15 వరకు, రెండో విడత శిక్షణను ఫిబ్రవరి 18 నుంచి 22 వరకు, మూడో విడత శిక్షణను ఫిబ్రవరి 25 నుంచి మార్చి 1 వరకు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. సంబంధిత జిల్లా కేంద్రాల్లో ఈ శిక్షణ కార్యక్రమం ఉంటుంది. ముందుగా శిక్షకులకు శిక్షణ (ట్రైనింగ్ టు ట్రైనర్స్) కోసం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఏర్పాట్లు చేసింది.
కొత్త పంచాయతీరాజ్ చట్టంపై అవగాహన..
తాజాగా ఎన్నికైన సర్పంచ్‌లకు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన కొత్త పంచాయతీరాజ్ చట్టం పట్ల అవగాహన కల్పించేందుకు ఈ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శిక్షణ అనంతరం వారి పనితీరుకు అనుగుణంగా సర్పంచ్‌లకు గ్రేడింగ్‌లు ఇస్తారు.
Comments
Please login to add a commentAdd a comment