సాక్షి, అమరావతి : రాష్ట్రవ్యాప్తంగా 484 మండలాల పరిధిలో మొత్తం 1,033 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు జరగనున్న ఉప ఎన్నికల్లో సగానికి పైగా స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఆయా గ్రామాల్లో మొత్తం 66 సర్పంచ్ స్థానాలతోపాటు 1,064 వార్డు సభ్యులకు ఉప ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నోటిఫికేషన్ జారీచేసిన విషయం తెలిసిందే. పదో తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగగా, సోమవారం సాయంత్రం మూడు గంటలకు నామినేషన్ల ఉప సంహరణ ప్రక్రియ ముగిసింది.
అన్ని జిల్లాల నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయానికి అందిన సమాచారం మేరకు.. సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగే మొత్తం 66 గ్రామాల్లో 32 చోట్ల ఎన్నిక ఏకగ్రీవం కాగా, రెండుచోట్ల అభ్యర్థులెవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. కేవలం 32చోట్ల మాత్రమే సర్పంచ్ స్థానాలకు ఈ నెల 19న పోలింగ్ జరగనుంది. మరోవైపు 1,064 వార్డు సభ్యులకు ఉప ఎన్నికలు జరుగుతుండగా.. 757 స్థానాలు ఏకగ్రీవం కాగా, 261 చోట్ల 19న పోలింగ్ జరగనుంది. 46 వార్డు సభ్యుల స్థానాలకు ఒక్కరు కూడా నామినేషన్లు దాఖలు చేయనందున ఆయా స్థానాల్లో ఎన్నికలు నిలిచిపోయాయి.
మూడురెట్లు పెరిగిన ఏకగ్రీవాలు..
రెండున్నర ఏళ్ల క్రితం... అంటే 2021 జనవరి, ఫిబ్రవరిలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అప్పట్లో సర్పంచ్ స్థానాల్లో కేవలం 17 శాతం, వార్డు సభ్యుల స్థానాల్లో 36 శాతం ఏకగ్రీవమయ్యాయి. కానీ, ఇప్పుడు రెండున్నర ఏళ్ల తర్వాత ఉప ఎన్నికలు జరుగుతున్నప్పటికీ.. అప్పటికంటే సర్పంచ్ స్థానాల్లో దాదాపు మూడు రెట్లు ఏకగ్రీవాలు పెరగగా, వార్డు సభ్యుల స్థానాల్లో ఏకగ్రీవాలు రెట్టింపు కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment