
సాక్షి, హైదరాబాద్: గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్లు దాఖలు చేసిన వారంతా తమ ఖర్చుకు సంబంధించిన లెక్కలు సమర్పించాల్సిందే. నామినేషన్లు దాఖలు చేసిన వారంతా గెలుపోటములు, విరమణ, ఏకగ్రీవ ఎన్నికవంటి వాటితో సంబంధం లేకుండా తాము చేసిన వ్యయాన్ని చూపించాలి. కొత్త పంచాయతీరాజ్ చట్టంలోని నియమ నిబంధనలకు అనుగుణంగా 45 రోజుల నిర్ణీత గడువులోగా లెక్కలు చూపకపోతే ఆ అభ్యర్థులు పంచాయతీరాజ్ ఎన్నికల్లో మూడేళ్లపాటు పోటీ చేయకుండా అనర్హత వేటు వేస్తారు. గెలుపొందిన వారి విషయానికొస్తే వారు తమ స్థానాన్ని కోల్పోవడంతో పాటు మూడేళ్లపాటు పోటీచేయకుండా అనర్హులుగా ప్రకటిస్తారు.
ఈ ఏడాది జనవరి 21, 25, 30 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు జరగడంతో పాటు ఆ మూడురోజుల్లోనే ఫలితాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఈ మూడు విడతల్లో ఫలితాలు వెలువడిన నాటి నుంచి 45రోజుల్లోగా నామినేషన్లు సమర్పించిన వారంతా తాము చేసిన వ్యయంపై తుది రిటర్న్స్‌ను సంబంధిత మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో)కి సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) శనివారం ఆదేశించింది. అభ్యర్థులు సమర్పించిన వ్యయ వివరాలను ఎంపీడీవోలు తమ కార్యాలయంలోని నోటీస్ బోర్డులో ప్రదర్శించాల్సి ఉంటుంది. అభ్యర్థులు చేసిన వ్యయానికి సంబంధించిన పత్రాలను జిరాక్స్ ఖర్చులను చెల్లించడం ద్వారా ఎవరైనా ఎంపీడీవో కార్యాలయం నుంచి ఆ వివరాలు పొందవచ్చు. అభ్యర్థుల ఖర్చుపై, వారు సమర్పించిన రిటర్న్స్‌పై అభ్యంతరాలుంటే, సరైన ఆధారాలతో జిల్లాల పర్యటనలకు వ్యయ పరిశీలకులు వచ్చినపుడు వారి దృష్టికి తీసుకురావచ్చు.
మొదటి విడతకు 6వ తేదీలోగా
గత నెల 20న తొలివిడత పంచాయతీ ఫలితాలు వెలువడినందున, అభ్యర్థులు ఈ నెల 6లోగా రిటర్న్స్ దాఖలు చేయాలని ఎస్‌ఈసీ కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్ తెలిపారు. రెండో విడతకు సంబంధించి ఈనెల 10లోగా, మూడో విడతకు సంబంధించి ఈనెల 15లోగా నామినేషన్ దాఖలు చేసిన వారంతా లెక్కలు సమర్పించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment