‘ప్రోత్సాహకం’ ఏమైంది?
చేవెళ్ల: గ్రామ సర్పంచ్ ఏకగ్రీవమైతే నిధులొస్తాయని, గ్రామం అభివృద్ధి చెందుతుందని భావించిన ప్రజలకు నిరాశే మిగిలింది. ఏకగ్రీవ పంచాయతీలకు ఇచ్చే ప్రోత్సాహక నిధులు(ఇన్సెంటివ్స్) విడుదల చేయడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. ఎన్నికల్లో రిజర్వేషన్లకు అనుగుణంగా పాలకవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ప్రభుత్వం గతంలో రూ.ఐదు లక్షలు ఇచ్చేది. 2013 జూలైలో జరిగిన ఎన్నికలకు ముందు ఈ నిధులను రూ.ఏడు లక్షలకు పెంచారు.
అయితే ఆ డబ్బుల విడుదల విషయంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. గ్రామ పంచాయతీ ఎన్నికల అనంతరం పురపాలక, ప్రాదేశిక, సార్వత్రిక ఎన్నికలు వరుసగా జరగడం.. రాష్ట్ర విభజన నేపథ్యంలో పలు గ్రాంట్లనుంచి నిధులు విడుదలకాక ఏ మాత్రం అభివృద్ధి చేయలేకపోయామని ఏకగ్రీవ సర్పంచులు పేర్కొంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 688 గ్రామపంచాయతీలున్నాయి.
గత సంవత్సరం జూలైలో జరిగిన పంచాయతీ ఎన్నికలలో జిల్లాలో 31 పంచాయతీల పాలక మండళ్లు ఏకగ్రీవం అయ్యాయి. ఇందులో కేవలం చేవెళ్ల రెవిన్యూ డివిజన్ పరిధిలోనే 15 పంచాయతీలు ఉన్నాయి. చేవెళ్ల మండలం ఇబ్రహీంపల్లి, షాబాద్ మండలం అంతారం గ్రామపంచాయతీ సర్పంచ్, వార్డు నంబర్లందరినీ గ్రామప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చేవెళ్ల మండలం ఎనికెపల్లి పంచాయతీకి సర్పంచ్ పదవి ఏకగ్రీవంకాగా, పలు వార్డులకు ఎన్నికలు జరిగాయి.
ఏకగ్రీవ పంచాయతీలకు త్వరగా నిధులు మంజూరయ్యేలా చూడాలని ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ప్రజలు నూతన కలెక్టర్ ఎన్ .శ్రీధర్‌ను కోరుతున్నారు. ఎకగ్రీవమైతే రూ.ఏడు లక్షలు వస్తాయని, గ్రామం అభివృద్ధి చెందుతుందని భావించి ప్రజలు మంచి నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వం వారి ఆశలపై నీళ్లు చల్లుతోందని చేవెళ్ల నియోజకవర్గంలోని ఏకగ్రీవ సర్పంచులు ఎన్ను జంగారెడ్డి (ఇబ్రహీంపల్లి), దర్శనాల జంగమ్మ (అంతారం), వన ం లతామహేందర్‌రెడ్డి (ఎనికెపల్లి) ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో తాగునీటి సమస్య అధికంగా ఉందని, సీసీ రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు ఏర్పాటు చేయాల్సి ఉందని వారంతా వాపోతున్నారు.
సర్పంచ్ ఏకగ్రీవం.. మాకూ ఇవ్వాలి
మా గ్రామస్తులంతా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనివార్య కారణాలవల్ల కొన్ని వార్డులకు మాత్రం ఎన్నికలు జరిగాయి. సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైనందున తమ పంచాయతీకీ ప్రోత్సాహక నిధులను కేటాయించాలి. గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేసుకునే వీలు కలుగుతుంది.
- వనం లతామహేందర్‌రెడ్డి, సర్పంచ్, ఎనికెపల్లి, చేవెళ్ల మండలం
వెంటనే నిధులు విడుదల చేయాలి
ఎన్నికల సమయంలో ఏకగ్రీవమైన గ్రామపంచాయతీలకు ప్రోత్సాహకంగా నిధులను ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. పాలకవర్గం ఏర్పడి ఏడాదైంది. ఇప్పటికీ పైసా ఇవ్వలే. ఇదే విషయాన్ని పలుమార్లు మండల స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు కల్పించుకుని వెంటనే నిధులను మంజూరు చేయించాలి.
- దర్శనాల జంగమ్మ, సర్పంచ్, అంతారం, షాబాద్ మండలం