N. Sridhar
-
అక్టోబర్ మొదటి వారంలో బోనస్
సాక్షి, హైదరాబాద్: దసరా కానుకగా లాభాల బోనస్‌ను కార్మికులు, ఉద్యోగుల ఖాతాల్లో అక్టోబర్ మొదటి వారంలో జమ చేస్తామని గురువారం సింగరేణి బొగ్గు గనుల సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ తెలిపారు. 2018–19లో సంస్థ సాధించిన రూ.1,763 కోట్ల లాభాల్లో 28 శాతం (రూ.493 కోట్ల)ను కారి్మకులకు బోనస్‌గా ప్రకటించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఓ ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు. సీఎం చేసిన ప్రకటనపై సింగరేణివ్యాప్తంగా హర్షాతిరేకాలు వెల్లువెత్తుతున్నాయని, కారి్మకులు సంబరాలు జరుపుకుంటున్నారన్నారు. బోనస్ చెల్లించడానికి తగు ఏర్పాట్లు చేయాలని సింగరేణి ఆర్థిక, పర్సనల్ విభాగాలను ఆదేశించామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2009–2014 వరకు పంచిన లాభాల బోనస్ రూ.314 కోట్లు మాత్రమేనని, తెలంగాణ వచ్చిన తర్వాత 2014–2019 వరకు భారీగా రూ.1,267 కోట్లను పంపిణీ చేశామన్నారు. ముఖ్యంగా సీఎం సింగరేణి కారి్మకులపై ప్రత్యేక అభిమానంతో గత ఐదేళ్ల కాలంలో ప్రతీ ఏడాది లాభాల బోనస్‌ను పెంచుతున్నారన్నారు. -
సింగరేణి కార్మికులకు సీఎం వరాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణి కార్మికులకు వరాల జల్లు కురిపించారు. సింగరేణి కార్మికుల లాభాల వాటాను ప్రతీ ఏటా పెంచుతూ వస్తున్న సీఎం కేసీఆర్.. ఈ ఏడాది కూడా వారికి శుభవార్త చెప్పారు. 2017-18సంవత్సరానికి గాను కార్మికులకు 2 శాతం లాభాల వాటాను పెంచారు. దీంతో గత ఏడాది 25శాతం లాభాల వాటా అందుకున్న కార్మికులు.. ఈ ఏడాది 27 శాతం వాటా అందుకోబోతున్నారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకెఎస్) గౌరవ అధ్యక్షురాలు, ఎంపీ కవిత నేతృత్వంలో కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్, టీబీజీకేఎస్ నాయకులు ప్రగతి భవన్ లో సీఎంతో సుమారు 45 నిమిషాలపాటు పలు అంశాలపై చర్చించారు. అనంతరం కార్మికుల లాభాల వాటా పెంచినందుకు సీఎంకు కవిత కృతజ్ఞతలు తెలిపారు. తాజాగా ప్రకటించిన లాభాల వాటాను ఏయే తేదీల్లో కార్మికుల ఖాతాల్లో డిపాజిట్ చేయబోతున్నారన్న దానికి సంబంధించి స్పష్టమైన వివరాలేవి వెల్లడి కాలేదు. సీఎం నుంచి సింగరేణి సీఎండీ శ్రీధర్‌కు ఆదేశాలు జారీ అయిన వెంటనే ఆ వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే డిపెండెంట్ ఉద్యోగాలకు బదులు సింగరేణిలో కారుణ్య నియామకాలు కొనసాగుతున్నాయి. మెడికల్ అన్‌ఫిట్ అయ్యే కార్మికుల స్థానంలో వారి వారసులకు ఉద్యోగ అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, ఈటల రాజేందర్, ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
‘గూడెం’లో సీఎండీ శ్రీధర్
రుద్రంపూర్(ఖమ్మం) :సింగరేణి సీఎండీగా బాధ్యతలు చేపట్టిన ఎన్.శ్రీధర్ గురువారం మొదటి సారిగా కొత్తగూడెం ఏరియాలో పర్యటించారు. ఆయనకు అధికారులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా గౌతంఖని ఓపెన్‌కాస్టు, పీవీకే ఎయిర్‌షాఫ్ట్ మైన్లను సందర్శించారు. జీకే ఓసీ వ్యూ పాయింట్ నుంచి ఓబీ బ్లాస్టింగ్, బొగ్గు బ్లాస్టింగ్, బొగ్గు రవాణా ప్రక్రియను పరిశీలించారు. ఏరియా సీజీఎం మాదాసి మల్లేష్, జీకే ఓసీ పీఓ శాలెం రాజు ఓసీ పనితీరు, చరిత్రను సీఎండీకి వివరించారు. అనంతరం ఓసీకి చెందిన ఓవర్‌బర్డెన్ వద్ద సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన జామాయిల్ ప్లాంటేషన్, క్వారీలోని ఓబీ డంపింగ్, లోడింగ్ పనులను చూశారు. బొగ్గు వెలికితీసే విధానాన్ని, బొగ్గు పొరల మందాన్ని, వాటి గ్రేడ్లను పీఓను అడిగి తెలుసుకున్నారు. తర్వాత ఆర్‌సీహెచ్‌పీ వద్ద వ్యాగెన్‌లో బొగ్గు లోడింగ్, రోజుకు ఎన్ని వ్యాగన్లు రవాణా చేస్తున్నారు తదితర విషయాలను ఆర్‌సీహెచ్‌పీ డీవైఎస్ఈ ముత్యాల నాయుడు తెలిపారు. ఇటీవల రూ.6కోట్ల వ్యయంతో చేపట్టిన ఎయిర్‌షాఫ్ట్ వైండింగ్ ఇంజిన్‌ను సీఎండీ పరిశీలించగా గని లోపల బొగ్గు వివరాలు, ఉత్పత్తి ప్రక్రియను గని ఏజెంట్ వివరించారు. వైండింగ్ ఇంజిన్ ఆపరేటింగ్, దాని ఉపయోగాలను సీజీఎంను అడిగి తెలుసుకున్నారు. సీఎండీ వెంట డెరైక్టర్లు బి.రమేష్ కుమార్(ఆపరేషన్స్), మనోహర్‌బాబు(పీఅండ్‌పీ), గనుల మేనేజర్లు ఆర్.నారాయణరావు, బచ్చ రవీందర్, ప్రభాకర్‌రావు, సెక్యూరిటీ అధికారులు ఉన్నారు. -
సింగరేణి సీఎండీగా శ్రీధర్
సాక్షి, హైదరాబాద్: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్‌గా ఐఏఎస్ అధికారి ఎన్.శ్రీధర్ నియామకానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రెండుమూడు రోజుల్లో ఆయనను సింగరేణి సీఎండీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు తెలిసింది. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న శ్రీధర్ గతంలో అనంతపురం, వరంగల్, కృష్ణా జిల్లాల కలెక్టర్‌గా పనిచేశారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో ఆయన కార్యాలయం లో కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. కరీంనగర్ జిల్లా మెట్పల్లి ప్రాంతానికి చెందిన శ్రీధర్ 1997 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఇదివరకు సింగరేణి సీఎండీగా ఉన్న సుతీర్థ భట్టాచార్య కోల్ ఇండియా సీఎండీగా ఎంపిక కావడంతో.. ఆయన స్థానంలో శ్రీధర్‌ను ప్రభుత్వం నియమించాలని నిర్ణయించి, ఆ మేరకు కేంద్ర ప్రభుత్వానికి సమాచారాన్ని అందించడం, అందుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ఆయన నియామకం ఓకే అయింది. -
డంపింగ్ యార్డులకు స్థలాలు గుర్తించండి
మోమిన్‌పేట: ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డు ఏర్పాటుకు స్థలాన్ని తప్పనిసరిగా గుర్తించాలని కలెక్టర్ ఎన్. శ్రీధర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఆయా శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ‘మన ఊరు- మన ప్రణాళిక’లో గుర్తించిన ప్రాధాన్యతా అవసరాలను ఆన్లైన్లో పొందుపర్చాలన్నారు. తాగునీరు, మురుగు కాల్వలు, సీసీ రోడ్ల నిర్మాణం వంటి వాటిపై అంచనాల తో నివేదికలు తయారు చేయాల ని ఆయన తెలిపారు. ప్రతి గ్రామంలో చెత్తను వేసేందుకు డంపింగ్ యార్డు, శ్మశానవాటిక, సృ్మతి వనం ఏర్పాటుకు తప్పనిసరిగా స్థలాలను పరిశీలించాలన్నారు. గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని ప్రత్యేకాధికారి రమణారెడ్డిని ఆదేశించారు. గ్రామ స్థాయిలో ఓ కమిటీని ఏర్పాటు చేసి 2 నెలల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయాలన్నారు. ఫీల్డ్అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, గ్రామ ప్రత్యేకాధికారితో కమిటీ వేసి ప్రతి గ్రామాన్ని పర్యవేక్షించాలని ఏపీఓ అంజిరెడ్డిని ఆదేశించారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ఆమ్రపాలి, ఎంపీడీఓ కె.సువిధ, తహసీల్దార్ రవీందర్, వైద్యాధికారి సాయి బాబా, వ్యవసాయాధికారి నీరజ పాల్గొన్నారు. -
1నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రక్షణశాఖలో ఉద్యోగావకాశాలు విరివిగా ఉన్నాయని కలెక్టర్ ఎన్.శ్రీధర్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఆగస్టు1 నుంచి తలపెట్టనున్న ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలోని పది జిల్లాల నుంచి అర్హులందరినీ ఆహ్వానిస్తున్నామన్నారు. ఈ ర్యాలీ ద్వారా నాలుగు విభాగాల్లో దాదాపు 1500 పోస్టులు భర్తీ చేయనున్నట్లు చెప్పారు. ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ఏర్పాట్లపై శుక్రవారం కలెక్టరేట్లో ఆర్మీ రిక్రూట్మెంట్ డెరైక్టర్ కల్నల్ యోగేష్ మొదిలియార్తో కలిసి కలెక్టర్ విలేకరుల సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు 1 నుంచి 10వ తేదీ వరకు హకీంపేట క్రీడా పాఠశాలలో నిర్వహించే ఈ ర్యాలీలో సోల్జర్ టెక్నికల్, సోల్జర్ జనరల్ డ్యూటీ, సోల్జర్ క్లర్క్, స్టోర్‌కీపర్ టెక్నికల్, సోల్జర్ ట్రేడ్స్‌మెన్ కేటగిరీల్లోని ఖాళీలను భర్తీ చేయనున్నట్లు చెప్పారు. కేటగిరీల వారీగా అర్హత, సమర్పించాల్సిన ధ్రువపత్రాలు, తదితర వివరాలన్నీ తెలంగాణ వెబ్సైట్లో, ఆర్మీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచామన్నారు. మధ్యవర్తులను నమ్మొద్దు ఆర్మీ ఉద్యోగాల ప్రక్రియ పూర్తి పారదర్శకతతో చేపడతామని, ఇందులో ఎలాంటి పైరవీలకు తావులేద ని కలెక్టర్ స్పష్టం చేశారు. ఉద్యోగాలిస్తామని మధ్యవర్తులెవరైనా చెబితే నమ్మొద్దన్నారు. వారిపై ఫిర్యాదుచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ర్యాలీలో పాల్గొనే అభ్యర్థులు అర్హత ధ్రువపత్రాలతో హాజరు కావాలని, సర్టిఫికెట్ల పరిశీలన, దేహదారుఢ్య పరీక్ష, రాత పరీక్షలకు ఒక్కో కేటగిరీకి కనీసం రెండు రోజుల సమయం పడుతుందన్నారు. దీంతో హాజరయ్యే అభ్యర్థులు రెండు రోజులపాటు ఇక్కడే ఉండాల్సి వస్తుందని, అభ్యర్థులకు వసతి సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎంవీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పనితీరును మెరుగుపర్చుకోండి
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లా అధికారులు తమ పనితీరు మెరుగుపరుచుకోవాలని, అంకితభావంతో పనిచేయాలని కలెక్టర్ ఎన్.శ్రీధర్ ఆదేశించారు. మూడు కేటగిరీలుగా విభజించుకుని పనితీరుపై స్వయం మదింపు చేసుకోవాలని సూచించారు. పాఠశాలలు, ప్రాథమిక వైద్య, ఆరోగ్యకేంద్రాలు, హాస్టళ్లను తరచూ తనిఖీ చేయడం ద్వారా విధినిర్వహణలో నిబద్ధతను అలవర్చుకోవాలన్నారు. గురువారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారుల పనితీరును ఆయన సమీక్షించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించేవారిని ఉపేక్షించే ప్రసక్తేలేదని, యంత్రాంగమంతా సమష్టిగా పనిచేసినప్పుడే సత్ఫలితాలు వస్తాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మన జిల్లా కీలకమని, అందుకనుగుణంగా అధికారులు వ్యవహరించాలన్నారు. ప్రతి అధికారీ క్షేత్రస్థాయిలో పర్యటించి లక్ష్యాలను ఎప్పటికప్పుడు సమీక్షించాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్లు చంపాలాల్, ఎంవీ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పీహెచ్‌సీల తనిఖీ గురువారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను మండల ప్రత్యేకాధికారులు ఆకస్మిక తనిఖీ చేశారని కలెక్టర్ తెలిపారు. ఆస్పత్రులకు హాజరుకాని సిబ్బంది, ఆస్పత్రుల నిర్వహణపై తనకు నివేదికలు పంపాలని ఆయన ఆదేశించారు. ప్రభుత్వ భూముల పరిరక్షణ బాధ్యత మీదే శివారు మండలాల్లో విలువైన ప్రభుత్వ భూములను కాపాడాలని రెవెన్యూ అధికారులను జిల్లా కలెక్టర్ ఎన్.శ్రీధర్ ఆదేశించారు. గురువారం ఆయా మండలాల తహసీల్దార్లు, ఆర్డీఓలతో ఆయన వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. పారిశ్రామిక, ప్రజావసరాల కోసం వివిధ సంస్థలకు బదలాయించిన భూమిలో ప్రైవేటు సంస్థలకు ఏ మేర కేటాయించారు? నిరుపయోగంగా ఉన్న స్థలమెంత? అనే అంశంపై క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి సమగ్ర నివేదిక రూపొందించాలని ఆదేశించారు. పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చేవారికి ఇచ్చేందుకు క్లియర్ టైటిల్ భూములను గుర్తించాలని సూచించారు. ప్రభుత్వ భూములను కాపాడే బాధ్యత ఆర్డీవో, తహసీల్దార్లదేనని స్పష్టం చేశారు. రేపు జిల్లాకు సఫాయి కర్మచారి కమిషన్ సభ్యుడి రాక ఈ నెల 28న కేంద్ర సఫాయి కర్మచారి కమిషన్ సభ్యుడు విజయ్‌కుమార్ జిల్లాకు వస్తున్నట్లు కలెక్టర్ శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఉదయం 11:30 గంటలకు సఫాయి కర్మచారుల సంక్షేమంపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిస్తారని ఆయన వివరించారు. -
విద్యా ప్రమాణాలు పెంచండి
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలు పెంచడానికి అనువుగా మౌలిక సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ ఎన్.శ్రీధర్ అధికారులను ఆదేశించారు. ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థులకు మెరుగైన విద్యనందించడం ద్వారా ఉన్నతస్థాయిలో మంచి ఫలితాలు సాధ్యపడతాయన్నారు. శుక్రవారం తన ఛాంబర్లో విద్యాశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 10వ తరగతి ఫలితాల్లో మెరుగైన ఉత్తీర్ణతాశాతం సాధించేందుకు ఇప్పటినుంచే ప్రణాళిక తయారు చేయాలని పేర్కొన్నారు. ప్రతి పాఠశాలలో కనీస సౌకర్యాలు కల్పించాలని, మంచినీరు, శౌచాలయాలను ఏర్పాటు చేయాలన్నారు. కస్తూర్బా పాఠశాల భవనాలు, మోడల్ పాఠశాల భవన నిర్మాణాలు వెంటనే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అసంపూర్తి పనులపై సమగ్ర నివేదిక అందజేయాలని సూచించారు. సమావేశంలో డీఈఓ సోమిరెడ్డి, ఆర్వీఎం పీఓ కిషన్‌రావు, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ వెంకటరమణ, వయోజన విద్య ఉపసంచాలకులు నారాయణరెడ్డి పాల్గొన్నారు. -
‘ప్రోత్సాహకం’ ఏమైంది?
చేవెళ్ల: గ్రామ సర్పంచ్ ఏకగ్రీవమైతే నిధులొస్తాయని, గ్రామం అభివృద్ధి చెందుతుందని భావించిన ప్రజలకు నిరాశే మిగిలింది. ఏకగ్రీవ పంచాయతీలకు ఇచ్చే ప్రోత్సాహక నిధులు(ఇన్సెంటివ్స్) విడుదల చేయడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. ఎన్నికల్లో రిజర్వేషన్లకు అనుగుణంగా పాలకవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ప్రభుత్వం గతంలో రూ.ఐదు లక్షలు ఇచ్చేది. 2013 జూలైలో జరిగిన ఎన్నికలకు ముందు ఈ నిధులను రూ.ఏడు లక్షలకు పెంచారు. అయితే ఆ డబ్బుల విడుదల విషయంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. గ్రామ పంచాయతీ ఎన్నికల అనంతరం పురపాలక, ప్రాదేశిక, సార్వత్రిక ఎన్నికలు వరుసగా జరగడం.. రాష్ట్ర విభజన నేపథ్యంలో పలు గ్రాంట్లనుంచి నిధులు విడుదలకాక ఏ మాత్రం అభివృద్ధి చేయలేకపోయామని ఏకగ్రీవ సర్పంచులు పేర్కొంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 688 గ్రామపంచాయతీలున్నాయి. గత సంవత్సరం జూలైలో జరిగిన పంచాయతీ ఎన్నికలలో జిల్లాలో 31 పంచాయతీల పాలక మండళ్లు ఏకగ్రీవం అయ్యాయి. ఇందులో కేవలం చేవెళ్ల రెవిన్యూ డివిజన్ పరిధిలోనే 15 పంచాయతీలు ఉన్నాయి. చేవెళ్ల మండలం ఇబ్రహీంపల్లి, షాబాద్ మండలం అంతారం గ్రామపంచాయతీ సర్పంచ్, వార్డు నంబర్లందరినీ గ్రామప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చేవెళ్ల మండలం ఎనికెపల్లి పంచాయతీకి సర్పంచ్ పదవి ఏకగ్రీవంకాగా, పలు వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఏకగ్రీవ పంచాయతీలకు త్వరగా నిధులు మంజూరయ్యేలా చూడాలని ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ప్రజలు నూతన కలెక్టర్ ఎన్ .శ్రీధర్‌ను కోరుతున్నారు. ఎకగ్రీవమైతే రూ.ఏడు లక్షలు వస్తాయని, గ్రామం అభివృద్ధి చెందుతుందని భావించి ప్రజలు మంచి నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వం వారి ఆశలపై నీళ్లు చల్లుతోందని చేవెళ్ల నియోజకవర్గంలోని ఏకగ్రీవ సర్పంచులు ఎన్ను జంగారెడ్డి (ఇబ్రహీంపల్లి), దర్శనాల జంగమ్మ (అంతారం), వన ం లతామహేందర్రెడ్డి (ఎనికెపల్లి) ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో తాగునీటి సమస్య అధికంగా ఉందని, సీసీ రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు ఏర్పాటు చేయాల్సి ఉందని వారంతా వాపోతున్నారు. సర్పంచ్ ఏకగ్రీవం.. మాకూ ఇవ్వాలి మా గ్రామస్తులంతా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనివార్య కారణాలవల్ల కొన్ని వార్డులకు మాత్రం ఎన్నికలు జరిగాయి. సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైనందున తమ పంచాయతీకీ ప్రోత్సాహక నిధులను కేటాయించాలి. గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేసుకునే వీలు కలుగుతుంది. - వనం లతామహేందర్రెడ్డి, సర్పంచ్, ఎనికెపల్లి, చేవెళ్ల మండలం వెంటనే నిధులు విడుదల చేయాలి ఎన్నికల సమయంలో ఏకగ్రీవమైన గ్రామపంచాయతీలకు ప్రోత్సాహకంగా నిధులను ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. పాలకవర్గం ఏర్పడి ఏడాదైంది. ఇప్పటికీ పైసా ఇవ్వలే. ఇదే విషయాన్ని పలుమార్లు మండల స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు కల్పించుకుని వెంటనే నిధులను మంజూరు చేయించాలి. - దర్శనాల జంగమ్మ, సర్పంచ్, అంతారం, షాబాద్ మండలం -
కొత్త కలెక్టర్ హల్చల్
తాండూరు టౌన్: సంక్షేమానికి, అభివృద్ధికే తొలి ప్రాధాన్యమిస్తామని చెప్పిన కొత్త కలెక్టర్ ఎన్.శ్రీధర్.. ఆ దిశగా క్షేత్ర స్థాయిలో స్థితిగతుల తీరుతెన్నులను పరిశీలించేందుకు శ్రీకారం చుట్టారు. గురువారం ఆయన తాండూరులో ఆకస్మికంగా పర్యటించారు. జిల్లా ప్రభుత్వాస్పత్రిని తనిఖీ చేశారు. ఆయన పర్యటన పూర్తిగా గోప్యంగా ఉంచడంతో నియోజకవర్గ స్థాయి అధికారుల్లో వణుకు పుట్టించింది. ఎక్కువ సమయం ఆయన జిల్లా ఆస్పత్రిలో గడిపారు. వార్డుల్లో అణువణువూ క్షుణ్ణంగా పరిశీలించారు. నవజాత శిశు సంరక్షణ కేంద్రాన్ని (ఎస్ఎన్సీయూ) పరిశీలించారు. శిశు మరణాలు తదితర వివరాలను ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటరమణప్పను అడిగారు. ప్రసూతి, జనరల్ వార్డుల్లో కలియదిరిగారు. రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అక్షయ పిల్లల ఆరోగ్య పునరుజ్జీవన కేంద్రాన్ని పరిశీలించారు. వ్యాధిగ్రస్తులైన చిన్నారులకు వైద్య సేవలందిస్తూ తల్లికి కూలిడబ్బులను కూడా అందజేస్తున్న ఈ పథకంపై విస్తృత ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని వైద్యులకు కలెక్టర్ శ్రీధర్ సూచించారు. రోగులకు ఉచితంగా అందజేస్తున్న భోజన తయారీ కేందాన్ని తనిఖీ చేశారు. నాణ్యతలో రాజీ పడొద్దని, శుభ్రమైన, రుచికరమైన భోజనాన్ని రోగులకు అందివ్వాలని నిర్వాహకులను ఆదేశించారు. ఆరోగ్యశ్రీ ఆపరేషన్లపై ఆరోగ్యమిత్రతో మాట్లాడారు. నిరుపేద లకు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు పూర్తిస్థాయిలో అందేలా చూడాలని చెప్పారు. అనంతరం ఆయన సీటీస్కాన్ సెంటర్‌ను పరిశీలించారు. పలు ఆపరేషన్ థియేటర్లను తనిఖీ చేసిన ఆయన పూర్తిస్థాయిలో అన్ని రకాల పరికరాలు, సౌకర్యాలు ఉన్నప్పటికీ వైద్యుల కొరతపై అసంతృప్తి వ్యక్తంచేశారు. వార్డుల్లో పర్యటిస్తూ రోగులతో వైద్య సేవలపై మాట్లాడారు. ఆస్పత్రికి ఏయే ప్రాంతాల నుంచి రోగులు వస్తుంటారని, అవుట్ పేషెం ట్లు, ఇన్ పేషెంట్లు, ఆపరేషన్ల వివరాలను సూపరింటెండెంట్ వెంకటరమణప్ప, వైద్యులు జగదీశ్వర్‌రెడ్డి, జయప్రసాద్, రాజవర్ధన్, సతీష్, బాల్రాజులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్యం అందుతున్న తీరును పరిశీ లించేందుకే ముందుగా రిమోట్ ప్రాంతాలను సందర్శిస్తున్నానన్నారు. జిల్లా ఆస్పత్రిలో అన్ని సౌకర్యాలు ఉన్నాయని, వైద్యుల పోస్టులను వెంటనే భర్తీ చేస్తామని ఆయన తెలిపారు. ఆస్పత్రి అభివృద్ధి కమిటీని సమావేశపరిచి చేపట్టాల్సిన అన్ని పనులను చక్కదిద్దుతానని చెప్పారు. ఔట్ సోర్సింగ్ విధానంలో విధులు నిర్వర్తిస్తున్నవారిని పొడి గించడమే కాకుండా ఉద్యోగ భద్రత కల్పించాలని జిల్లా ఆస్పత్రి సిబ్బంది, మున్సిపల్ కార్మికులు కలెక్టర్‌కు విన్నవించారు. త్వరలోనే ఆ విషయమై నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. -
బాబూ.. చిట్టీ!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: తహసీల్దార్ల వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. అడ్డం తిరిగిన తహసీల్దార్లను దారికి తెచ్చుకునే దిశగా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. విధుల్లో చేరినవారికి భవిష్యత్‌లో మంచి పోస్టింగ్‌లు ఇస్తామని బుజ్జగింపుల పర్వానికి శ్రీకారం చుట్టింది. ఒకవైపు బుజ్జగిస్తూనే మరోవైపు న్యాయపర చర్యలకు రంగం సిద్ధం చేస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా పోస్టింగ్‌లు ఇవ్వడాన్ని నిరసిస్తూ 12 మంది తహసీల్దార్లు విధుల్లో చేరేందుకు ససేమిరా అన్నారు. వీరిలో ఐదుగురు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించి కలెక్టర్ జారీచేసిన పోస్టింగ్ ఉత్తర్వులు రద్దు చేయించారు. ఎన్నికలకు ముందు పనిచేసిన మండలాల్లోనే పోస్టింగ్‌లు ఇవ్వాలని ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది. స్థానచలనం జరిగిన తహసీల్దార్లు మెట్టు దిగకపోవడంతో జిల్లాలో రెవెన్యూ పాలనా వ్యవస్థ స్తంభించింది. కౌంటర్ అఫిడవిట్! ప్రభుత్వ పెద్దల అండదండలు, ప్రజాప్రతినిధుల సిఫార్సులతో బదిలీల ప్రక్రియ పూర్తిచేసిన జిల్లా యంత్రాంగానికి తహసీల్దార్ల తిరుగుబాటుతో దిమ్మతిరిగింది. కొత్త మండలాల్లో రిపోర్ట్ చేయకపోవడం, ట్రిబ్యునల్‌ను ఆశ్రయించి ఉత్తర్వులను రద్దు చేయించడంతో దిక్కుతోచని స్థితిలో పడింది. ఈ నేపథ్యంలో కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఎన్.శ్రీధర్.. తహసీల్దార్ల విషయం లో ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై అధికారులతో సమీక్షించారు. విధుల్లో చేరేలా తహసీల్దార్లకు నచ్చజెప్పాలని, స్వల్పకాలంలో మంచి పోస్టింగ్‌లు ఇస్తామని భరోసా ఇవ్వడం ద్వారా డ్యూటీకి రిపో ర్టు చేసేలా చూడాలని రెవెన్యూ ఉన్నతాధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఒకవేళ సముదాయించినా పంతం వీడకపోతే న్యాయపరంగా నడుచుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ట్రిబ్యునల్ తీర్పును సవాల్ చేస్తూ కౌంటర్ దాఖలు చేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం న్యాయ నిపుణులతో డీఆర్ఓ వెంకటేశ్వర్లు చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు బదిలీల ప్రక్రియ జరిగిందని, రంగారెడ్డి జిల్లాలో మాత్రమే పాత మండలాల్లో పోస్టింగ్‌లు ఇవ్వాలని నిర్దేశించడం సరికాదనే వాదనను వినిపిం చాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇదిలావుండగా, బదిలీల వ్యవహారం లో జిల్లా యంత్రాంగం తీరుపై గుర్రుగా ఉన్న 12 మంది తహసీల్దార్లు ఉన్నతాధికారుల బుజ్జగింపులతో డైలమాలో పడ్డారు. బెట్టు కొనసాగిస్తే కొరివితో తలగోక్కున్నట్లే అవుతుందనే ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే ట్రిబ్యునల్‌లో జిల్లా యంత్రాంగం దాఖలుచేసే కౌంటర్ అఫిడవిట్ పరి శీలించిన అనంతరం.. భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవాలని భావిస్తున్నారు. బదిలీల వ్యవహారంలో ప్రభు త్వతీరును తప్పుపడుతున్న తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం.. అవసరమైతే రాష్ట్రస్థాయి నేతలతో చర్చించి ఆందోళనకు దిగాలని యోచిస్తోంది. -
అభివృద్ధిలో అసమానతలు తొలగిస్తా
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ప్రభుత్వ భూముల పరిరక్షణకు పెద్దపీట వేస్తానని, పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య ఉన్న అభివృద్ధి అంతరాలను రూపుమాపుతానని జిల్లా కలెక్టర్ ఎన్.శ్రీధర్ స్పష్టం చేశారు. మూడు ప్రాంతాల్లో కలెక్టర్‌గా పనిచేసిన అనుభవం రంగారెడ్డి జిల్లా అభివృద్ధిలో ఉపయోగపడుతుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఐఏఎస్ కెరీర్లో ప్రజలకు నేరుగా సేవ చేసే భాగ్యం కలెక్టర్ పోస్టుతోనే సాధ్యమని, మరోసారి ప్రభుత్వం ఈ అవకాశం ఇవ్వడం తన అదృష్టమని అన్నారు. కలెక్టర్ చెప్పిన మరికొన్ని విషయాలు ఆయన మాటల్లోనే.. విలువైన అసైన్డ్, సీలింగ్ భూములు అక్రమార్కుల గుప్పిట్లోకి వెళ్లకుండా చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ భూముల పరిరక్షణకు కార్యాచరణ రూపొందిస్తాం. శివార్లలోని భూములపై నిఘాను ముమ్మరం చేయడమేగాకుండా... ల్యాండ్ బ్యాంక్ పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తాం. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా భూములు కాపాడుకోవడం అనివార్యం. తెలంగాణలో కీలకమైన పెట్టుబడులకు అనువైన ప్రాంతం రంగారెడ్డి జిల్లా. ఐటీఐఆర్ ప్రాజెక్టు, ఇతర పరిశ్రమల స్థాపనకు అనువైన కేంద్రంగా జిల్లాను మలచాల్సిన అవసరముంది. పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారిస్తాం. అసమానతలకు ఫుల్స్టాప్ గ్రామీణ, పట్టణ ప్రాంతాలతో మిళితమైన జిల్లాలో అభివృద్ధిలో భారీ వ్యత్యాసం ఉంది. అభివృద్ధిలో వెనుకబడిన పశ్చిమ ప్రాంతాన్ని శివార్లకు దీటుగా తయారుచేసేందుకు ప్రణాళిక రూపొందిస్తాం. ఉద్యాన తోటల పెంపకం, అభివృద్ధి, అధికార వికేంద్రీకరణ ద్వారా వికారాబాద్, తాండూరు ప్రాంతాలను ప్రగతిపథంలో పయనింపజేస్తాం. హార్టికల్చర్, డెయిరీ విస్తృతి ద్వారా రైతాంగాన్ని ప్రోత్సహిస్తాం. విద్యాప్రమాణాలు మెరుగుపరుస్తా సర్కారు బడుల్లో విద్యాప్రమాణాలు పెంపొందించడం ద్వారా ఉత్తీర్ణత శాతాన్ని పెంచుతాం. ప్రభుత్వ ఉద్యోగులు సమయ పాలన పాటించాల్సిందే. ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తేలేదు. ప్రభుత్వ సేవలు ప్రజలకు అందించేందుకు సమష్టిగా కృషి చేస్తాం. మూడు వారాల్లో జిల్లాల్లో సమస్యలపై అధ్యయనం చేస్తా. క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకునేందుకు విస్తృతంగా పర్యటించి ప్రాధాన్యతాక్రమంలో సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత నిస్తాం. -
అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: తహసీల్దార్ల బదిలీ వ్యవహారంలో తాజాగా కొత్త పంచాయితీకి తెరలేచింది. ఇటీవల జరిగిన తహసీల్దార్ల బదిలీ ప్రక్రియలో కొందరు ఉన్నత స్థాయి నేతలు, ఉద్యోగ సంఘ నేతలతో జిల్లా యంత్రాంగంపై ఒత్తిడి తీసుకువచ్చి కీలకమైన ప్రాంతాల్లో అనుకున్న చోటకు బదిలీ చేసుకున్నారు. అనంతరం హుటాహుటిన ఆయా స్థానాల్లో విధుల్లోకి చేరారు. అయితే ఈ వ్యవహారంతో భంగపడ్డ మరికొందరు తహసీల్దార్లు కోర్టును ఆశ్రయించగా.. సోమవారం బదిలీ ఉత్తర్వులను రద్దు చేయాలని పేర్కొంటూ.. ఎన్నికలకు ముందు పనిచేసిన చోటనే తిరిగి పోస్టింగ్ ఇవ్వాలని ట్రైబ్యునల్ స్పష్టం చేసింది. దీంతో అసలు కథ ఆరంభమైంది. బదిలీ ప్రక్రియలో భారీ మొత్తాన్ని ఖర్చుచేసి అనుకున్న చోటుకు బదిలీ చేయించుకున్న తహసీల్దార్లకు తాజా పరిణామం మింగుపడకుండా చేస్తోంది. సీటు పాయె.. శ్రమ వృథా అయ్యే..! రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన క్రమంలో పాలనా వ్యవహారాలపై దృష్టి సారించిన నేపథ్యంలో బదిలీల వైపు అడుగులు వేసింది. ఈ నేపథ్యంలో ముందుగా తహసీల్దార్లు ఆపై క్యాడర్ అధికారులను బదిలీ చేయాలని భావించింది. ఇందులో భాగంగా ఆరుగురు డిప్యూటీ కలెక్టర్లతోపాటు 33 మంది తహసీల్దార్లను బదిలీ చేసింది. అయితే ఎన్నికలకు ముందు పనిచేసిన అధికారులకు తిరిగి అవే పోస్టులు కట్టబెడుతూ కొన్నిచోట్ల ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో మాత్రం కొత్తగా వేరే చోట పోస్టింగ్ ఇచ్చారు. ఈ పరిస్థితిని సానుకూలంగా మార్చుకున్న కొందరు అధికారులు ఓ మంత్రి అండదండలు.. ఓ ఉద్యోగ సంఘ నేతల ఆశీస్సులతో నగర శివారు మండలాల్లో అనుకున్న చోట పోస్టింగ్ ఇప్పించుకున్నారు. వెనువెంటనే ఆయా స్థానాల్లో బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో తమకు పాతస్థానాలు కేటాయించాలని కోరుతూ ఐదుగురు తహసీల్దార్లు ట్రైబ్యునల్‌ను ఆశ్రయిం చారు. దీంతో సోమవారం ఆ బదిలీలను రద్దు చేయడంతో పాటు ఆ ఐదుగురు తహసీల్దార్లకు గతంలో పనిచేసిన స్థానాల్లోనే పోస్టింగ్ ఇవ్వాలంటూ ఆదేశించింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఇటీవల నిర్వహించిన బదిలీలన్నీ రద్దు కానున్నాయి. దీంతో ఎన్నో ‘వ్యయ’ప్రయాసలకోర్చి కీలకమైన చోట పోస్టింగులిప్పించుకున్న తహసీల్దార్లకు తాజా పరిస్థితులు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఇంత కష్టపడి కోరిన చోట సీటు దక్కించుకున్నప్పటికీ.. కనీసం పక్షం రోజులైనా పనిచేయలేకపోవడంపై వారు సన్నిహితులతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతా కొత్తగా.. తాజాగా జిల్లా పాలనలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. మంగళవారం జిల్లా కలెక్టర్ బదిలీ కావడం.. కొత్త కలెక్టర్‌గా ఎన్.శ్రీధర్ బాధ్యతలు స్వీకరించడం అంతా నిమిషాల వ్యవధిలో జరిగిపోయింది. దీంతో తహసీల్దార్ల బదిలీ ప్రక్రియలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయోననే అంశం అధికారుల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. -
కొత్త కలెక్టర్ ఎన్.శ్రీధర్
ప్రభుత్వ భూముల పరిరక్షణకు పెద్దపీట వేస్తా. జిల్లాను పెట్టుబడులకు అనువైన కేంద్రంగా మలుస్తా. పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య ఉన్న అభివృద్ధి అంతరాలను రూపుమాపుతా. జిల్లాను హార్టికల్చర్ హాబ్‌గా మార్చడం, విద్యాప్రమాణాలు పెంపొందించడం నా ముందున్న ప్రథమ ప్రాధాన్యాలు. - కలెక్టర్ ఎన్.శ్రీధర్ సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లా పాలనలో మంగళవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. కొత్త కలెక్టర్‌గా నియమితులైన నడిమట్ల శ్రీధర్ తనకు ఉత్తర్వులు అందిన అరగంట వ్యవధిలోనే బాధ్యతలు స్వీకరించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. సాధారణంగా ఇటువంటి కీలక పోస్టులో చేరే అధికారులు ఒకట్రెండు రోజులు సమయం తీసుకోవడం ఆనవాయితీ. రెవెన్యూపరంగా ముఖ్యమైన జిల్లా కావడంతో తక్షణమే విధుల్లో చేరాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఉత్తర్వులు అందుకున్నదే తడువు ఎన్ .శ్రీధర్ కలెక్టర్ సీట్లో వాలిపోయారు. కాగా, బదిలీ అయిన బి.శ్రీధర్‌కు ప్రభుత్వం ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. ఆయనను ఏపీ రాష్ట్ర కేడర్‌కు పంపే అవకాశముంది. రాష్ట్ర విభజన అనంతరం శ్రీధర్ బదిలీ అనివార్యమని తెలిసినప్పటికీ, అఖిల భారత సర్వీసు అధికారుల కేటాయింపుపై కేంద్రం ఇంకా మార్గదర్శకాలు జారీ చేయలేదు. ఈ నేపథ్యంలో కలెక్టర్లు, జేసీలు, ఎస్పీలకు స్థానచలనం కల్పించకూడదని ఇరురాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. అయితే, ఐఏఎస్ వర్గాలు హాట్‌సీటుగా భావించే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ పోస్టుపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేసింది. వివిధ మార్గాల్లో ఒత్తిళ్లు వచ్చినప్పటికీ, సమర్థుడు, సీనియర్ అధికారిగా పేరున్న ఎన్.శ్రీధర్ ైవె పు మొగ్గు చూపింది. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం ఉత్తర్వులు జారీచేసిన సీఎస్ రాజీవ్‌శర్మ తక్షణమే విధుల్లో చేరాలని ఆదేశించారు. దీంతో వడివడిగా కలెక్టరేట్‌కు వచ్చిన ఆయనకు బాధ్యతలు అప్పగించిన బి.శ్రీధర్ విధుల నుంచి రిలీవ్ అయ్యారు. గత ఏడాది జూలై 2న జిల్లా కలెక్టర్‌గా నియమితులైన శ్రీధర్ సమర్థవంతంగా పనిచేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు సహా సాధారణ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించడం ద్వారా ప్రశంసలందుకున్నారు.