1నుంచి ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ | army recruitment rally from 1st | Sakshi
Sakshi News home page

1నుంచి ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ

Published Sat, Jul 12 2014 12:04 AM | Last Updated on Wed, Mar 28 2018 11:05 AM

army recruitment rally from 1st

 సాక్షి, రంగారెడ్డి జిల్లా: రక్షణశాఖలో ఉద్యోగావకాశాలు విరివిగా ఉన్నాయని కలెక్టర్ ఎన్.శ్రీధర్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఆగస్టు1 నుంచి తలపెట్టనున్న ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలోని పది జిల్లాల నుంచి అర్హులందరినీ ఆహ్వానిస్తున్నామన్నారు. ఈ ర్యాలీ ద్వారా నాలుగు విభాగాల్లో దాదాపు 1500 పోస్టులు భర్తీ చేయనున్నట్లు చెప్పారు.

ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ ఏర్పాట్లపై శుక్రవారం కలెక్టరేట్లో ఆర్మీ రిక్రూట్‌మెంట్ డెరైక్టర్ కల్నల్ యోగేష్ మొదిలియార్‌తో కలిసి కలెక్టర్ విలేకరుల సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు 1 నుంచి 10వ తేదీ వరకు హకీంపేట క్రీడా పాఠశాలలో నిర్వహించే ఈ ర్యాలీలో సోల్జర్ టెక్నికల్, సోల్జర్ జనరల్ డ్యూటీ, సోల్జర్ క్లర్క్, స్టోర్‌కీపర్ టెక్నికల్, సోల్జర్ ట్రేడ్స్‌మెన్ కేటగిరీల్లోని ఖాళీలను భర్తీ చేయనున్నట్లు చెప్పారు. కేటగిరీల వారీగా అర్హత, సమర్పించాల్సిన ధ్రువపత్రాలు, తదితర వివరాలన్నీ తెలంగాణ వెబ్‌సైట్లో, ఆర్మీ వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచామన్నారు.

 మధ్యవర్తులను నమ్మొద్దు
 ఆర్మీ ఉద్యోగాల ప్రక్రియ పూర్తి పారదర్శకతతో చేపడతామని, ఇందులో ఎలాంటి పైరవీలకు తావులేద ని కలెక్టర్ స్పష్టం చేశారు. ఉద్యోగాలిస్తామని మధ్యవర్తులెవరైనా చెబితే నమ్మొద్దన్నారు. వారిపై ఫిర్యాదుచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ర్యాలీలో పాల్గొనే అభ్యర్థులు అర్హత ధ్రువపత్రాలతో హాజరు కావాలని, సర్టిఫికెట్ల పరిశీలన, దేహదారుఢ్య పరీక్ష, రాత పరీక్షలకు ఒక్కో కేటగిరీకి కనీసం రెండు రోజుల సమయం పడుతుందన్నారు. దీంతో హాజరయ్యే అభ్యర్థులు రెండు రోజులపాటు ఇక్కడే ఉండాల్సి వస్తుందని, అభ్యర్థులకు వసతి సౌకర్యం కల్పిస్తామని చెప్పారు.   సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎంవీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement