కొత్త కలెక్టర్ హల్‌చల్ | collector sridhar sudden visit to tandur | Sakshi
Sakshi News home page

కొత్త కలెక్టర్ హల్‌చల్

Published Fri, Jun 20 2014 12:05 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM

కొత్త కలెక్టర్ హల్‌చల్ - Sakshi

కొత్త కలెక్టర్ హల్‌చల్

తాండూరు టౌన్: సంక్షేమానికి, అభివృద్ధికే తొలి ప్రాధాన్యమిస్తామని చెప్పిన కొత్త కలెక్టర్ ఎన్.శ్రీధర్.. ఆ దిశగా క్షేత్ర స్థాయిలో స్థితిగతుల తీరుతెన్నులను పరిశీలించేందుకు శ్రీకారం చుట్టారు. గురువారం ఆయన తాండూరులో ఆకస్మికంగా పర్యటించారు. జిల్లా ప్రభుత్వాస్పత్రిని తనిఖీ చేశారు. ఆయన పర్యటన పూర్తిగా గోప్యంగా ఉంచడంతో నియోజకవర్గ స్థాయి అధికారుల్లో వణుకు పుట్టించింది. ఎక్కువ సమయం ఆయన జిల్లా ఆస్పత్రిలో గడిపారు. వార్డుల్లో అణువణువూ క్షుణ్ణంగా పరిశీలించారు. నవజాత శిశు సంరక్షణ కేంద్రాన్ని (ఎస్‌ఎన్‌సీయూ) పరిశీలించారు. శిశు మరణాలు తదితర వివరాలను ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటరమణప్పను అడిగారు. ప్రసూతి, జనరల్ వార్డుల్లో కలియదిరిగారు.
 
రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అక్షయ పిల్లల ఆరోగ్య పునరుజ్జీవన కేంద్రాన్ని పరిశీలించారు. వ్యాధిగ్రస్తులైన చిన్నారులకు వైద్య సేవలందిస్తూ తల్లికి కూలిడబ్బులను కూడా అందజేస్తున్న ఈ పథకంపై విస్తృత ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని వైద్యులకు కలెక్టర్ శ్రీధర్ సూచించారు. రోగులకు ఉచితంగా అందజేస్తున్న భోజన తయారీ కేందాన్ని తనిఖీ చేశారు. నాణ్యతలో రాజీ పడొద్దని, శుభ్రమైన, రుచికరమైన భోజనాన్ని రోగులకు అందివ్వాలని నిర్వాహకులను ఆదేశించారు. ఆరోగ్యశ్రీ ఆపరేషన్లపై ఆరోగ్యమిత్రతో మాట్లాడారు. నిరుపేద లకు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు పూర్తిస్థాయిలో అందేలా చూడాలని చెప్పారు.
 
అనంతరం ఆయన సీటీస్కాన్ సెంటర్‌ను పరిశీలించారు. పలు ఆపరేషన్ థియేటర్లను తనిఖీ చేసిన ఆయన పూర్తిస్థాయిలో అన్ని రకాల పరికరాలు, సౌకర్యాలు ఉన్నప్పటికీ వైద్యుల కొరతపై అసంతృప్తి వ్యక్తంచేశారు. వార్డుల్లో పర్యటిస్తూ రోగులతో వైద్య సేవలపై మాట్లాడారు. ఆస్పత్రికి ఏయే ప్రాంతాల నుంచి రోగులు వస్తుంటారని, అవుట్ పేషెం ట్లు, ఇన్ పేషెంట్లు, ఆపరేషన్ల వివరాలను సూపరింటెండెంట్ వెంకటరమణప్ప, వైద్యులు జగదీశ్వర్‌రెడ్డి, జయప్రసాద్, రాజవర్ధన్, సతీష్, బాల్‌రాజులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్యం అందుతున్న తీరును పరిశీ లించేందుకే ముందుగా రిమోట్ ప్రాంతాలను సందర్శిస్తున్నానన్నారు.
 
జిల్లా ఆస్పత్రిలో అన్ని సౌకర్యాలు ఉన్నాయని, వైద్యుల పోస్టులను వెంటనే భర్తీ చేస్తామని ఆయన తెలిపారు. ఆస్పత్రి అభివృద్ధి కమిటీని సమావేశపరిచి చేపట్టాల్సిన అన్ని పనులను చక్కదిద్దుతానని చెప్పారు. ఔట్ సోర్సింగ్ విధానంలో విధులు నిర్వర్తిస్తున్నవారిని పొడి గించడమే కాకుండా ఉద్యోగ భద్రత కల్పించాలని జిల్లా ఆస్పత్రి సిబ్బంది, మున్సిపల్ కార్మికులు కలెక్టర్‌కు విన్నవించారు. త్వరలోనే ఆ విషయమై నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement