సాక్షి, అమరావతి: దేశ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా వైద్య, ఆరోగ్య రంగంలో నియామకాలతోపాటు పెద్ద ఎత్తున మౌలిక వసతులను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చింది. గత నాలుగేళ్లుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది కొరత అనే మాటకు తావు లేకుండా చర్యలు తీసుకోవడం మొదలు నాడు–నేడు ద్వారా వసతులతో తీర్చిదిద్దింది. కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణంతోపాటు ఫ్యామిలీ డాక్టర్ విధానం లాంటి విప్లవాత్మక చర్యలతో ఆరోగ్య రంగం ముఖ చిత్రాన్నే మార్చేసింది.
కొరతకు చెక్
రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా 2019 నుంచి ఇప్పటివరకు ఏకంగా 48,639 వైద్య సిబ్బంది పోస్టులను వైఎస్సార్ సీపీ ప్రభుత్వం భర్తీ చేయడం గమనార్హం. పదవీ విరమణ తదితర కారణాలతో ఖాళీ అయ్యే పోస్టులను ఎప్పటికప్పుడు గుర్తించి భర్తీ చేసేలా అత్యవసర అనుమతులు ఇచ్చింది. కేవలం వైద్య శాఖలో పోస్టుల భర్తీ కోసమే ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేస్తున్నారు.
నాడు–నేడుతో మహర్దశ
టీడీపీ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ రూ.16 వేల కోట్లకు పైగా నిధులను కేటాయించారు. నాడు–నేడు కార్యక్రమంతోపాటు 2,500 మంది జనాభాకు ఒకటి చొప్పున 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు ఏర్పాటు చేశారు.
1,142 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇప్పటికే సొంత భవనాలున్న వాటికి మరమ్మతులు చేయడంతో పాటు పాత భవనాల స్థానంలో కొత్తవి నిర్మిస్తున్నారు. 882 చోట్ల పనులు పూర్తి కావటంతో ఆస్పత్రులు అధునాతనంగా తయారయ్యాయి. 121 సీహెచ్‌సీలు, 42 ఏరియా ఆస్పత్రులు, రెండు ఎంసీహెచ్ ఆస్పత్రులను అభివృద్ధి చేశారు. రూ.50 కోట్లతో ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం రీసెర్చ్ సెంటర్ నిర్మాణం దాదాపు పూర్తయింది.
ఈ ఏడాదే 5 కొత్త వైద్య కళాశాలలు
వైద్య సదుపాయాలను బలోపేతం చేయడంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ రూ.8,480 కోట్లతో 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటును చేపట్టారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఐదు కళాశాలల్లో ఎంబీబీఎస్ అడ్మిషన్లు కల్పించాలని నిర్దేశించుకోగా ఇప్పటికే నంద్యాల, ఏలూరు, మచిలీపట్నం, విజయనగరం కళాశాలలకు అనుమతులు వచ్చాయి. రాజమండ్రి వైద్య కళాశాలకు త్వరలో అనుమతి రానుంది. తద్వారా ఒక్కో చోట 150 సీట్లు చొప్పున మొత్తం 750 సీట్లు పెరగనున్నాయి.
2024–25లో పులివెందుల, పాడేరు, ఆదోని కళాశాలలు అందుబాటులోకి రానుండగా ఆ తర్వాత ఏడాది మిగిలిన తొమ్మిది కళాశాలలను ప్రారంభించేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. మరోవైపు ఇప్పటికే ఉన్న కళాశాలలు, ఆస్పత్రులను రూ.3,820 కోట్లతో బలోపేతం చేస్తోంది. వీటన్నింటి ఫలితంగా 627 పీజీ సీట్లు పెరిగాయి. తద్వారా రాష్ట్రంలో స్పెషలిస్ట్ వైద్యుల సంఖ్య పెరగనుంది.
ప్రజారోగ్యానికి రక్ష
వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేయడం ద్వారా ప్రజారోగ్యానికి రక్షణ కల్పిస్తున్నారు. గత నాలుగేళ్లలో ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా పథకాల కోసం ప్రభుత్వం రూ.8,302.47 కోట్లు ఖర్చు చేసింది. ఆరోగ్యశ్రీ ద్వారా 36,19,741 మంది, ఆసరా ద్వారా 16,20,584 మంది లబ్ధి పొందారు.
రూ.5 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న కుటుంబాలన్నింటినీ పథకం పరిధిలోకి తేవడంతో 1.4 కోట్లకు పైగా కుటుంబాలకు ఆరోగ్యశ్రీ వర్తిస్తోంది. 2014–19 మధ్య ఆరోగ్యశ్రీలో కేవలం 1059 ప్రొసీజర్స్ మాత్రమే అందుబాటులో ఉండగా ఇప్పుడు 3,255కి పెరిగాయి. ఆరోగ్య ఆసరా ద్వారా శస్త్ర చికిత్స అనంతరం వైద్యులు సూచించిన మేరకు రోగి కోలుకునే సమయంలో రోజుకు రూ.225 లేదా నెలకు గరిష్టంగా రూ.ఐదు వేల వరకు ప్రభుత్వం సాయం అందిస్తోంది.
108 సేవలకు పూర్వ వైభవం
దివంగత వైఎస్సార్ ప్రారంభించిన 108 అంబులెన్స్ సేవలను గత సర్కారు నిర్వీర్యం చేసింది. సీఎం జగన్ అధికారంలోకి రాగానే మండలానికి ఒక్కొక్కటి చొప్పున 104, 108 వాహనాలను సమకూర్చారు. 768 అంబులెన్స్‌లతో 2020లో సేవలను విస్తరించారు. తాజాగా మరో 146 అంబులెన్స్‌లను కొనుగోలు చేస్తున్నారు. రోజుకు సగటున 3,300 మంది అంబులెన్స్ సేవలను ప్రస్తుతం వినియోగించుకుంటున్నారు.
104 ఎంఎంయూలను తొలుత మండలానికి ఒకటి చొప్పున 676 వాహనాలను సమకూర్చారు. ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలులోకి రావడంతో 104 ఎంఎంయూలు మరో 256 వాహనాలను అందుబాటులోకి తెచ్చారు. గత ఏడాది ఏప్రిల్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 500 కొత్త వాహనాలతో ‘డాక్టర్ వైఎస్సార్ తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్’ సేవలను విస్తరించారు. రోజుకు సగటున 631 మంది బాలింతలను క్షేమంగా ఇళ్లకు చేరుస్తున్నారు.
పల్లెల్లోనే వైద్యం
గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సంరక్షణ లక్ష్యంగా దేశంలో ఎక్కడా లేని విధంగా ఫ్యామిలీ డాక్టర్ విధానానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు నెలకు రెండు సార్లు గ్రామాలను సందర్శిస్తున్నారు. 104 మొబైల్ మెడికల్ యూనిట్(ఎంఎంయూ)తో పాటు వెళ్లి వైద్య సేవలు అందిస్తున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఓపీ సేవలు అందిస్తున్నారు.
మంచానికి పరిమితం అయిన వృద్ధులు, వికలాంగులు, ఆరోగ్యశ్రీ రోగులను మధ్యాహ్నం నుంచి పరామర్శిస్తూ ఇంటి వద్దే వైద్య సేవలు అందిస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలను సందర్శిస్తూ చిన్నారులు, విద్యార్థుల ఆరోగ్యంపై వాకబు చేస్తున్నారు. ఇప్పటి వరకూ వైద్యులు గ్రామాలకు వెళ్లి 1,17,08,895 మందికి వైద్య సేవలు అందించారు.
Comments
Please login to add a commentAdd a comment