సాక్షి, అమరావతి : గ్రామస్థాయిలోనే అన్నిరకాల వైద్య సేవలను అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు వ్యయ, ప్రయాసలను తగ్గిస్తోంది. ఇందులో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) స్థాయిలోనే వైద్యశాఖ దంత వైద్యసేవలు అందిస్తోంది.
ఏపీ వైద్య విధాన పరిషత్ (ఏపీవీవీపీ) పరిధిలోని ఆస్పత్రుల్లో 245 దంత వైద్య విభాగాలు పనిచేస్తున్నాయి. ప్రజలకు దంత వైద్యసేవలను చేరువ చేసేందుకు ఏపీవీవీపీ ఆస్పత్రుల్లోని దంత వైద్యులకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,142 పీహెచ్‌సీలను అనుసంధానించారు. ఈ క్రమంలో దంత వైద్యులు నెలలో ఒకసారి ప్రతి పీహెచ్‌సీనీ సందర్శిస్తూ అక్కడే డెంటల్ క్లినిక్‌లు నిర్వహిస్తున్నారు.
2.14 లక్షల మందికి సేవలు..
నిజానికి.. రెండేళ్ల క్రితం పీహెచ్‌సీల్లో డెంటల్ క్లినిక్స్ నిర్వహణను ప్రారంభించారు. ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పీహెచ్‌సీల్లో 35,151 డెంటల్ క్లినిక్‌లను నిర్వహించారు. వీటిల్లో 2,14,410 మంది పీహెచ్‌సీల్లో దంత వైద్యసేవలు అందుకున్నారు. పీహెచ్‌సీలకు వెళ్లే దంత వైద్యులు అక్కడే ప్రజలకు ఓరల్ స్క్రీనింగ్ చేస్తున్నారు. చిన్నపాటి దంత సమస్యలకు పీహెచ్‌సీలోనే చికిత్స అందిస్తున్నారు. మెరుగైన వైద్యం అవసరం ఉంటే దగ్గర్లోని సీహెచ్‌సీ, ఏరియా, జిల్లా ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారు.
ప్రాథమిక దశలోనే సమస్యల గుర్తింపు
చాలావరకూ ప్రజలు చిన్నచిన్న దంత సమస్యలను నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇవి దీర్ఘకాలం పెద్ద సమస్యలుగా మారుతుంటాయి. ప్రాథమిక దశలోనే దంత సమస్యలను గుర్తించి నివారించడానికి చర్యలు చేపడుతున్నాం. ఇందులో భాగంగా పీహెచ్‌సీ స్థాయిలోనే డెంటల్ క్లినిక్‌లు నిర్వహిస్తున్నాం. తద్వారా ప్రజలు సులువుగా వైద్యులను సంప్రదించడానికి వీలుంటుంది. ఓరల్ స్క్రీనింగ్‌పై పీహెచ్‌సీ వైద్యులకు ఇప్పటికే శిక్షణ ఇప్పించాం. దీంతో ఫ్యామిలీ డాక్టర్ విధానంలో గ్రామాలకు వెళ్తున్న పీహెచ్‌సీ వైద్యులు ఓరల్ స్క్రీనింగ్ చేస్తున్నారు.
– జె. నివాస్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్
ప్రాథమిక దశలోనే క్యాన్సర్ గుర్తింపునకు..
మరోవైపు.. ప్రాథమిక దశలోనే నోటి క్యాన్సర్ గుర్తించడానికి వైద్యశాఖ చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా వైఎస్సార్ జిల్లా కడప, విజయవాడ డెంటల్ కళాశాలలు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలోని బోధనాస్పత్రుల్లోని దంత వి భాగాలకు అధునాతన వెల్‌స్కోప్ పరికరాలను సమకూర్చారు. వీటిద్వారా నోటి క్యాన్సర్ అనుమానిత లక్షణాలున్న వారికి పరీక్షలు నిర్వహించి వ్యాధిని నిర్ధారిస్తున్నారు.
ఇలా ఈ ఏడాది జనవరి నుంచి మే నెల మధ్య ఐదుచోట్ల 1,676 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా 61 మందిలో నోటి క్యాన్సర్ నిర్ధారణ అయింది. బాధితులకు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రభుత్వమే ఉచితంగా వైద్యం అందిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment