బాబూ.. చిట్టీ!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: తహసీల్దార్ల వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. అడ్డం తిరిగిన తహసీల్దార్లను దారికి తెచ్చుకునే దిశగా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. విధుల్లో చేరినవారికి భవిష్యత్‌లో మంచి పోస్టింగ్‌లు ఇస్తామని బుజ్జగింపుల పర్వానికి శ్రీకారం చుట్టింది. ఒకవైపు బుజ్జగిస్తూనే మరోవైపు న్యాయపర చర్యలకు రంగం సిద్ధం చేస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా పోస్టింగ్‌లు ఇవ్వడాన్ని నిరసిస్తూ 12 మంది తహసీల్దార్లు విధుల్లో చేరేందుకు ససేమిరా అన్నారు.
వీరిలో ఐదుగురు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించి కలెక్టర్ జారీచేసిన పోస్టింగ్ ఉత్తర్వులు రద్దు చేయించారు. ఎన్నికలకు ముందు పనిచేసిన మండలాల్లోనే పోస్టింగ్‌లు ఇవ్వాలని ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది. స్థానచలనం జరిగిన తహసీల్దార్లు మెట్టు దిగకపోవడంతో జిల్లాలో రెవెన్యూ పాలనా వ్యవస్థ స్తంభించింది.
కౌంటర్ అఫిడవిట్!
ప్రభుత్వ పెద్దల అండదండలు, ప్రజాప్రతినిధుల సిఫార్సులతో బదిలీల ప్రక్రియ పూర్తిచేసిన జిల్లా యంత్రాంగానికి తహసీల్దార్ల తిరుగుబాటుతో దిమ్మతిరిగింది. కొత్త మండలాల్లో రిపోర్ట్ చేయకపోవడం, ట్రిబ్యునల్‌ను ఆశ్రయించి ఉత్తర్వులను రద్దు చేయించడంతో దిక్కుతోచని స్థితిలో పడింది. ఈ నేపథ్యంలో కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఎన్.శ్రీధర్.. తహసీల్దార్ల విషయం లో ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై అధికారులతో సమీక్షించారు. విధుల్లో చేరేలా తహసీల్దార్లకు నచ్చజెప్పాలని, స్వల్పకాలంలో మంచి పోస్టింగ్‌లు ఇస్తామని భరోసా ఇవ్వడం ద్వారా డ్యూటీకి రిపో ర్టు చేసేలా చూడాలని రెవెన్యూ ఉన్నతాధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
ఒకవేళ సముదాయించినా పంతం వీడకపోతే న్యాయపరంగా నడుచుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ట్రిబ్యునల్ తీర్పును సవాల్ చేస్తూ కౌంటర్ దాఖలు చేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం న్యాయ నిపుణులతో డీఆర్‌ఓ వెంకటేశ్వర్లు చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు బదిలీల ప్రక్రియ జరిగిందని, రంగారెడ్డి జిల్లాలో మాత్రమే పాత మండలాల్లో పోస్టింగ్‌లు ఇవ్వాలని నిర్దేశించడం సరికాదనే వాదనను వినిపిం చాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఇదిలావుండగా, బదిలీల వ్యవహారం లో జిల్లా యంత్రాంగం తీరుపై గుర్రుగా ఉన్న 12 మంది తహసీల్దార్లు ఉన్నతాధికారుల బుజ్జగింపులతో డైలమాలో పడ్డారు. బెట్టు కొనసాగిస్తే కొరివితో తలగోక్కున్నట్లే అవుతుందనే ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే ట్రిబ్యునల్‌లో జిల్లా యంత్రాంగం దాఖలుచేసే కౌంటర్ అఫిడవిట్ పరి శీలించిన అనంతరం.. భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవాలని భావిస్తున్నారు. బదిలీల వ్యవహారంలో ప్రభు త్వతీరును తప్పుపడుతున్న తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం.. అవసరమైతే రాష్ట్రస్థాయి నేతలతో చర్చించి ఆందోళనకు దిగాలని యోచిస్తోంది.