పనితీరును మెరుగుపర్చుకోండి
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లా అధికారులు తమ పనితీరు మెరుగుపరుచుకోవాలని, అంకితభావంతో పనిచేయాలని కలెక్టర్ ఎన్.శ్రీధర్ ఆదేశించారు. మూడు కేటగిరీలుగా విభజించుకుని పనితీరుపై స్వయం మదింపు చేసుకోవాలని సూచించారు. పాఠశాలలు, ప్రాథమిక వైద్య, ఆరోగ్యకేంద్రాలు, హాస్టళ్లను తరచూ తనిఖీ చేయడం ద్వారా విధినిర్వహణలో నిబద్ధతను అలవర్చుకోవాలన్నారు.
గురువారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారుల పనితీరును ఆయన సమీక్షించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించేవారిని ఉపేక్షించే ప్రసక్తేలేదని, యంత్రాంగమంతా సమష్టిగా పనిచేసినప్పుడే సత్ఫలితాలు వస్తాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మన జిల్లా కీలకమని, అందుకనుగుణంగా అధికారులు వ్యవహరించాలన్నారు. ప్రతి అధికారీ క్షేత్రస్థాయిలో పర్యటించి లక్ష్యాలను ఎప్పటికప్పుడు సమీక్షించాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్లు చంపాలాల్, ఎంవీ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
పీహెచ్‌సీల తనిఖీ
గురువారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను మండల ప్రత్యేకాధికారులు ఆకస్మిక తనిఖీ చేశారని కలెక్టర్ తెలిపారు. ఆస్పత్రులకు హాజరుకాని సిబ్బంది, ఆస్పత్రుల నిర్వహణపై తనకు నివేదికలు పంపాలని ఆయన ఆదేశించారు.
ప్రభుత్వ భూముల పరిరక్షణ బాధ్యత మీదే
శివారు మండలాల్లో విలువైన ప్రభుత్వ భూములను కాపాడాలని రెవెన్యూ అధికారులను జిల్లా కలెక్టర్ ఎన్.శ్రీధర్ ఆదేశించారు. గురువారం ఆయా మండలాల తహసీల్దార్లు, ఆర్డీఓలతో ఆయన వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. పారిశ్రామిక, ప్రజావసరాల కోసం వివిధ సంస్థలకు బదలాయించిన భూమిలో ప్రైవేటు సంస్థలకు ఏ మేర కేటాయించారు? నిరుపయోగంగా ఉన్న స్థలమెంత? అనే అంశంపై క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి సమగ్ర నివేదిక రూపొందించాలని ఆదేశించారు. పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చేవారికి ఇచ్చేందుకు క్లియర్ టైటిల్ భూములను గుర్తించాలని సూచించారు. ప్రభుత్వ భూములను కాపాడే బాధ్యత ఆర్డీవో, తహసీల్దార్లదేనని స్పష్టం చేశారు.
రేపు జిల్లాకు సఫాయి కర్మచారి కమిషన్ సభ్యుడి రాక
ఈ నెల 28న కేంద్ర సఫాయి కర్మచారి కమిషన్ సభ్యుడు విజయ్‌కుమార్ జిల్లాకు వస్తున్నట్లు కలెక్టర్ శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఉదయం 11:30 గంటలకు సఫాయి కర్మచారుల సంక్షేమంపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిస్తారని ఆయన వివరించారు.