hostels
-
హాస్టళ్లు, గురుకులాల్లో కామన్ డైట్ ప్లాన్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
-
విద్యార్థులకు తగ్గట్టు టాయిలెట్లు ఉండాలి
సాక్షి, హైదరాబాద్: సర్కార్ వసతి గృహాల్లో ఉంటూ చదువుకుంటున్న వారంతా పేద కుటుంబాలకు చెందిన చిన్నారులని, వారి కోసం మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేసింది. వసతి గృహాల్లో పరుపులు, బెడ్షీట్లు, టవల్స్ అందించాలని, పాఠశాలల్లో కూడా విద్యార్థుల సంఖ్యకు తగినట్లు టాయిలెట్లు, బాత్రూమ్లు నిర్మించాలని సూచించింది. వీటన్నింటిపై జనవరి 22లోగా స్థాయీనివేదిక అందజేయాలంటూ విచారణను వాయిదా వేసింది.ప్రభుత్వ పాఠశాలల్లో అందించే మధ్యాహ్న భోజనంలో నాణ్యతాప్రమాణాలు పాటించడం లేదని, ప్రైవేట్ బడుల్లో ఫీజు నియంత్రణకు కమిటీని నియమించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హెల్ప్ ది పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు కీతినీడి అఖిల్ శ్రీ గురు తేజ 2023లో హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాస్‌రావు ధర్మాసనం గురువారం మరోసారి విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపిస్తూ.. రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థులు ఖైదీలుగా ఉంటున్నారన్నారు. వారికి అందించే సౌకర్యాల విషయంలో ప్రభుత్వాలు చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని చెప్పారు. విద్యార్థులకు కల్పించాల్సిన వసతులపై ఆయన ఓ చార్ట్‌ను ధర్మాసనానికి సమర్పించారు. దీనికి ధర్మాసనం న్యాయవాదిని అభినందిస్తూ, వీటిని వీలైనంత త్వరగా కల్పించేలా చూడాలని అడిషనల్ అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) ఇమ్రాన్‌ఖాన్‌కు సూచించింది. ప్రభుత్వ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో పిల్లలకు సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఏఏజీ చెప్పారు. ధర్మాసనం పేర్కొన్న అంశాలివీ... » ప్రభుత్వ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలల్లోని విద్యార్థులకు పరుపులు, దుప్పట్లు, బెడ్షీట్లు, దిండు, దోమతెర, కాటన్ టవల్స్ అందించాలి. » విద్యార్థులకు శుద్ధి చేసిన తాగునీటిని మాత్రమే సరఫరా చేయాలి. » నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ గైడ్‌లైన్స్ ప్రకారం మెనూ ఇవ్వాలి. » విద్యార్థులకు సైకియాట్రిస్ట్/కౌన్సిలర్ అందుబాటులో ఉండాలి. -
ఆహార నాణ్యతపై టాస్క్‌ఫోర్స్!
సాక్షి, హైదరాబాద్: విద్యా సంస్థలు, హాస్టళ్లు, ఆస్పత్రుల్లో పంపిణీ చేస్తున్న ఆహారం నాణ్యత పట్ల కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభు త్వం నిర్ణయించింది.ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ర్థుల కోసం అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం మొదలు... సంక్షేమ గురుకుల విద్యాసంస్థలు, వసతిగృహాలు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాల యాలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభు త్వ వైద్య కళాశాలల్లో అందించే ఆహారం నాణ్య తపై నిఘా, పర్యవేక్షణ కోసం టాస్క్‌ఫోర్స్ కమి టీని ఏర్పాటు చేసింది. ఎస్సీ అభివృద్ధి శాఖతోపాటు గిరిజన, బీసీ, మైనార్టీ, మహిళా శిశు సంక్షేమ శాఖలు, వైద్యారోగ్య శాఖ పరిధి లోకి వచ్చే అన్ని విద్యా సంస్థల్లో అందించే ఆహా రం నాణ్యతను పర్యవేక్షించే బాధ్యతను ఈ కమి టీకి అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీలో సభ్యులుగా ఫుడ్ సేఫ్టీ కమిషనర్ లేదా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, సంబంధిత విద్యా సంస్థ ఉన్నతాధికారి/ అదనపు సంచాలకుడు, విద్యా సంస్థ జిల్లా స్థాయి అధికారి (డీఎస్‌డబ్ల్యూఓ/ డీటీడబ్ల్యూఓ/డీబీసీడబ్ల్యూఓ/ డీఈఓ) తదితరులుంటారు. ఈ కమిటీ నిర్దేశించిన విద్యా సంస్థలను సందర్శించి ఆహార భద్రత చర్యల ను పరి శీలించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఏదైనా సంస్థలో లోటుపాట్లను గుర్తిస్తే వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడంతోపాటు బాధ్యులపై చర్యల కోసం సిఫార్సు చేయాలని సూచించింది.విద్యా సంస్థల్లో ఫుడ్ సేఫ్టీ కమిటీలు, పర్యవేక్షక అధికారిటాస్క్ఫోర్స్ మాత్రమేకాకుండా విద్యా సంస్థల స్థాయిలో ఫుడ్ సేఫ్టీ కమిటీలను, పర్యవేక్షక అధికారిని సైతం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాటికి సంబంధించిన మార్గదర్శ కాలను జారీ చేసింది. విద్యా సంస్థల్లో మెరుగైన, బలవర్థకమైన, నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు ఈ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొంది. కలుషిత ఆహారంతో కలిగే అనా రోగ్య సమస్యలు, తదుపరి పరిణామాల నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ కమిటీలు కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.» ఫుడ్ సేఫ్టీ కమిటీలో విద్యా సంస్థ ప్రధానోపా« ద్యాయుడు/ ప్రిన్సిపల్/ వార్డెన్‌తోపాటు మరో ఇద్దరు సిబ్బంది సభ్యులుగా ఉంటారు.» ఈ కమిటీ సభ్యులు ప్రతిరోజు భోజనం తయారు చేసే ముందు స్టోర్ రూమ్, వంట గదిని తనిఖీ చేయాలి. తర్వాత వంటగది నిబంధనలకు అనుగుణంగా నాణ్యత, ప్రమాణాలు పాటిస్తున్నట్టు నిర్ధారించాలి.» వంట వండిన తర్వాత ఆహార నాణ్యతను కమిటీ సభ్యులు రుచి చూసి పరిశీలించిన తర్వాతే విద్యార్థు లకు అందించాలి. ప్రతిరోజు ఈ బాధ్యతలను విధిగా పూర్తి చేయాలి.» త్వరలో నోడల్ డిపార్టుమెంట్ యాప్‌ను తయారు చేస్తుంది. అప్పటి నుంచి తనిఖీలకు సంబంధించిన ఫోటోలను, ఇతర సమాచా రాన్ని యాప్‌లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.» ఇక జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రతి విద్యాసంస్థకు ప్రత్యేకంగా ఒక పర్యవేక్షక అధికారికి నియమి స్తారు. ఈ పర్యవేక్షక అధికారి ప్రతిరోజు భోజనం వండే ముందు, తర్వాత తనిఖీ చేస్తారు. అక్కడి పరిస్థితిని చిత్రాలు తీసి జిల్లా కలెక్టర్/ సంబంధిత ఉన్నతాధికారికి సమర్పిస్తారు.» వీటన్నింటికి సంబంధించి తక్షణమే చర్యలు తీసు కోవాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. విద్యార్థులతో కలిసి కలెక్టర్ భోజనంమల్హర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్‌శర్మ మల్హర్ మండలం మల్లారం కస్తూర్భా గాంధీ పాఠశాలను గురువారం ఆక స్మికంగా తనిఖీ చేశారు. బియ్యం, నిత్యావసర సరకుల నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి అల్పాహారం, భోజన సదుపాయాల నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. వసతి గృహాలు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో ఆహార నాణ్యత పరిశీలనకు ప్రతీ శుక్రవారం తహసీల్దార్, ఎంపీడీవోలు విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. -
తెలంగాణ వ్యాప్తంగా హాస్టళ్లలో అక్రమాలపై ఏసీబీ సోదాలు
-
చెల్లెలి హాస్టల్ కష్టాలు చూసి...‘జోలో’ స్నేహా చౌదరి సక్సెస్ స్టోరీ
టెక్నాలజీని అందిపుచ్చుకోవడం, ప్రత్యామ్నాయాల అన్వేషణ, క్లిష్ట సమస్యల పరిష్కారం ఇలాంటి విషయాల్లో మహిళలు ముందుంటారు. రంగం ఏదైనా సరే.. బుర్రలో ఆలోచన వచ్చిందంటే.. దానివైపు దృష్టి పెట్టారంటే.. ‘తగ్గెదేలే’ అన్నట్టు దూసుకుపోతారు. అలాంటి వారిలో కోజికోడ్‌కు చెందిన స్నేహా చౌదరి ముందు వరసలో ఉంటారు. ఇంతకీ స్నేహ సక్సెస్ జర్నీ ఏంటి? తెలుసుకుందాం రండి! స్నేహ బెంగళూరులోని RV కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ నుండి ఇంజనీరింగ్ పట్టాను, కోజికోడ్‌లో ఐఐఎం పూర్తి చేశారు. డెలాయిట్, ఒరాకిల్ వంటి ప్రముఖ గ్లోబల్ కంపెనీలలో స్ట్రాటజీ అండ్ ఆపరేషన్స్ కన్సల్టెంట్‌గా 10 సంవత్సరాల అనుభవం ఉంది. కానీ వీటికి భిన్నంగా, ప్రత్యేకంగా నిలవాలని భావించారు. వృత్తి జీవితంలో ఎదురైన సవాళ్లతోపాటు, వ్యాపార కుటుంబం నుండి వచ్చిన స్నేహ తానే ఒక సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. జోలో స్టే (ZoloStay) అనే సంస్థను స్థాపించారు. అయితే దీని వెనుక పెద్ద కథేఉంది. స్నేహ సోదరి ఉద్యోగం కోసం బెంగళూరు వెళ్లినపుడు వర్కింగ్ విమెన్ హాస్టల్స్, పేయింగ్ గెస్ట్ వసతులు వెతుక్కోవడంలో కొన్ని సవాళ్లు ఎదురైనాయి. వాటి తీరుపై ఒక అవగాహన వచ్చింది. వీటితోపాటు ఆల్‌లైన్ ద్వారా ఆయా సేవలను చేరుకోవడం ఎలా అనే దానిపై ఎదురైన ఇబ్బందులే దీనికి నాంది పలికాయి. ‘‘నిజాయితీగా ఉండటం అనేది సాధికారతకు కీలకమైన అంశం. ప్రత్యేకించి మహిళా ఉద్యోగుల్లో తప్పులను ఎత్తి చూపడం కంటే వారితో మాట్లాడుతూ, దాన్నుంచి నేర్చుకోవాలి. సహోద్యోగులతో అభిప్రాయాలను పంచుకోవడం అంటే వృత్తిపరమైన అభివృద్ధిని మెరుగుపరచే మార్గాల అన్వేషణే’’- స్నేహ చౌదరి . అలా మహిళలకు ఫుడ్ అండ్ వసతికి సంబంధించిన ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్ జో స్టేస్‌ను ప్రారంభించారు. రుచికరమైన , ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు, సరసమైన ధరలో, సౌకర్యవంతైన సరసమైన వసతిని అందించే లక్ష్యంతో, ఇషా చౌల్క్దహరి, డా. నిఖిల్ సిక్రి, అఖిల్ సిక్రి భాగస్వామ్యంతో 2015లో జోలో స్టేకు శ్రీకారం చుట్టారు. 40 మంది మహిళల సమక్షంలో అధికారికంగా ప్రారంభమై, అంచెలంచెలుగా విస్తరించి కో-లివింగ్ స్పేస్ బ్రాండ్‌గా ఖ్యాతి గడించింది. బెంగళూరు ప్రధాన కేంద్రంగా గురుగ్రామ్, హైదరాబాద్, కోటా, చెన్నై, ముంబైతో సహా భారతదేశంలోని 10+ నగరాల్లో విశేష సేవలందిస్తోంది. రూ.800 కోట్లకు పైగా టర్నోవర్‌తో ప్రస్తుతం జోస్టేస్ అతిపెద్ద కో-లివింగ్ స్టార్టప్‌లలో ఒకటిగా నిలిచింది. అటు స్నేహ కూడా దేశంలోని ప్రముఖ మహిళా పారిశ్రామికవేత్తలలో ఒకరిగా అవతరించారు. అలాగే డెవిల్ ఈజ్ ఇన్ డిటైల్ మాటకు నిలువెత్తు సాక్ష్యంగా edtech స్టార్టప్‌ను కూడా స్థాపించారు. దృఢ సంకల్పం , కృషి ఉంటే సాధించలేదని ఏమీలేదు అంటారు స్నేహ. అంతేకాదు కమ్యూనిటీ క్రియేషన్ ఆలోచనను ప్రోత్సహిస్తూ వీరి హాస్టల్స్‌లో ఉండే వారి మధ్య ,జోలో ప్రీమియర్ లీగ్ ద్వారా చెస్,క్యారమ్ ఛాంపియన్‌షిప్‌లు నిర్వహిస్తుంది. ఇంకా పుట్టినరోజులు, పండుగలు ,ఇంటిరీయర్ డెకరేషన్, హౌస్ కీపింగ్, రిపేర్లు, మెయింటెనెన్స్, ఫుడ్ సర్వీస్, వైఫై, DTH వంటి సర్వీసులు కూడా అందిస్తుంది. లాక్-ఇన్లు, డిపాజిట్లు, బ్రోకరేజీలు లాంటి సమస్యలేవీ జోలో ఉండవు. అంతా ఆన్లైనే. ‘జోలో దియా’ ఆవిష్కారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం 'మహిళల్లో పెట్టుబడి పెట్టండి: ప్రగతిని వేగవంతం చేయండి',థీమ్ ఆధారంగా పూర్తిగా మహిళలచే నిర్వహించే ఒక పీజీ జోలోదియాను స్టార్ట్ చేసింది. మహిళలు తమ కలలు , ఆకాంక్షలను నిర్భయంగా కొనసాగిస్తూ, సాధికారత సాగిస్తారనే తమ నమ్మకానికి జోలో దియా నిదర్శనంగా నిలుస్తోందని జోలోస్టేస్ సహ వ్యవస్థాపకురాలు స్నేహా చౌదరి పేర్కొన్నారు. 2015లో కేవలం నెలకు రూ. 5000 ప్రారంభమై బెంగళూరు, హైదరాబాద్, అత్యంత ఖరీదైన ఏరియాలో కార్ పార్కింగ్, రూఫ్‌టాప్ రెస్టారెంట్ ,జిమ్ లాంటి సౌకర్యాలతో ఉండే ప్రైవేట్ గదులు నెలకు రూ. 36వేలకు చార్జ్ చేసే స్థాయికి చేరింది. -
‘ఈనాడు’ అవాస్తవ ఆరోపణలు
సాక్షి, అమరావతి: ఏజెన్సీలోని మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గర్భిణుల వసతి గృహాల నిర్వహణపై గురువారం ఈనాడు పత్రికలో ప్రచురించిన కథనం పూర్తిగా అవాస్తవమని వైద్య, ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. వసతి గృహాలకు గర్భిణులు ప్రసవ సమయానికి 7 రోజుల ముందు చేరుకుంటారని.. వారికి రోజుకు రూ.300 ఖర్చుతో ఉచిత ఆహారాన్ని అందిస్తున్నామని తెలిపింది. సాలూరు పరిసర ప్రాంతాల్లోని గర్భిణుల కోసం సాలూరులో వసతి గృహం ఏర్పాటు చేశారని, ఇందులో సేవలందించేందుకు ఏఎన్ఎంలను నియమించారని పేర్కొంది. పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో గుమ్మ లక్ష్మీపురంలోనూ ఓ వసతి గృహం ఉందన్నారు. ఈ రెండింటి నిర్వహణ కోసం 2022–23 ఆర్థిక సంవత్సరంలో రూ.2,50,500 నిధులు అందించామని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ రూ.3,75,000 అందించామని తెలిపింది. రాష్ట్రంలో గర్భిణుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో జనని శిశు సురక్షా కార్యక్రమం కింద గర్భిణులకు ఉచిత వైద్య సేవలు, మందులు, వైద్య పరీక్షలు, రక్త మార్పిడి, ఆహారం, రిఫరల్, రవాణా ఖర్చుల నిమిత్తం అన్ని ప్రభుత్వ వైద్యశాలలకు రూ.29.09 కోట్లు విడుదల చేశామని తెలిపింది. దీంతోపాటు గర్భిణులకు 108 అంబులెన్స్‌లు, వైఎస్సార్ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాల ద్వారా ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నామని పేర్కొంది. -
సంక్షేమ హాస్టళ్లు ఇక మరింత క్షేమం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని సంక్షేమ వసతి గృహాలు(హాస్టల్స్)లో విద్యార్థులు మరింత క్షేమంగా ఉండేలా ప్రభుత్వం పటిష్ట కార్యాచరణ చేపట్టింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు సన్నాహక సమావేశాలు నిర్వహించి రాష్ట్రంలో 3,783 హాస్టళ్లు, రెసిడెన్షియల్ హాస్టళ్లలో తీసుకోవాల్సిన పటిష్ట చర్యలపై యంత్రాంగాన్ని సన్నద్ధం చేశారు. హాస్టళ్లలో ఐదు అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం ‘సమగ్ర ప్రామాణిక ఆపరేటివ్ విధానం (ఎస్ఓపీ)ని అమలులోకి తెచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఈబీసీ, వికలాంగుల, జువైనల్ సంక్షేమ శాఖలకు చెందిన వసతి గృహాలు, గురుకుల విద్యాలయాల్లో విద్యార్థుల భద్రత, నాణ్యమైన విద్య, ఆహారం, ఆరోగ్యం, సౌకర్యాలపై ప్రధానంగా దృష్టి సారించింది. అవసరమైన మార్గదర్శకాలను అన్ని సంక్షేమ శాఖలకు ప్రభుత్వం విడుదల చేసింది. గ్రామ, మండల, డివిజన్, జిల్లా, రాష్ట్ర స్థాయిలోని సంబంధిత అధికారులు ప్రత్యక్షంగా హాస్టళ్లను పర్యవేక్షించేలా క్యాలెండర్ (టైమ్ టేబుల్)ను నిర్దేశించింది. వసతి గృహాల్లో విద్యార్థులకు రక్షణ, భద్రతాపరమైన చర్యలు తీసుకోవడంలోను అప్రమత్తం చేసింది. సురక్షితమైన ఆహారం, నీరుతోపాటు ఆరోగ్యం, వ్యక్తిగత శుభ్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. హాస్టళ్ల పరిసరాల్లో అవాంఛనీయ ఘటనలు జరిగే అవకాశాలున్న పక్షంలో వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. మార్గదర్శకాలు ఇవీ.. ► వసతి గృహాలకు నిరంతరం అందుబాటులో ఉండేలా సిబ్బంది స్టాఫ్ క్వార్టర్స్‌లో ఉండాలి. ఒకవేళ క్వార్టర్స్ అందుబాటులో లేకపోతే సమీపంలోనే నివాసం ఉండాలి. ► అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించడానికి సంబంధిత ఉద్యోగులు పూర్తి చిరునామాలు, ప్రత్యామ్నాయ ఫోన్ నంబర్లను హాస్టల్ రిజిస్టర్, నోటీస్ బోర్డుల్లో ఉంచాలి. ► జాబ్ చార్ట్‌లోని విధుల పట్ల అలక్ష్యం వహించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ► క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి అధికారుల వరకు కచ్చితంగా హాస్టళ్లను నిరంతరం పర్యవేక్షించాలి. ► అధికారులు, ప్రజాప్రతినిధులు, నిపుణులు, వ్యవస్థాపకులు ఎవరైనా హాస్టళ్లను సందర్శించినప్పుడు వారి వివరాలు, చర్చించిన అంశాలను విజిటర్స్ రిజిస్టర్లో నమోదు చేయాలి. ► విద్యార్థులకు భోజన మెనూ, సౌకర్యాలు, కిచెన్ గార్డెన్, మరుగుదొడ్ల నిర్వహణ, సురక్షితమైన మంచినీరు, మెస్ కమిటీ, పేరెంట్స్ కమిటీ వంటి కీలక విషయాల్లో ప్రత్యేక దృష్టి సారించాలి. ► ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను సక్రమంగా వినియోగించుకుని ప్రతి నెల రెండో శనివారం ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు నిర్వహించాలి. ► వారానికి ఒకసారి వైద్య ఆరోగ్య సిబ్బంది స్వయంగా హాస్టల్ విద్యార్థులు ప్రతి ఒక్కరిని పరీక్షించి వారికి అవసరమైన వైద్య సేవలు అందించాల్సి ఉంటుంది. -
భయాందోళనలో హాస్టళ్ల విద్యార్థులు
-
మైసమ్మగూడలో నీట మునిగిన హాస్టల్స్
-
ఉన్నతప్రమాణాలు..మరింత ప్రశాంతత
సాక్షి, హైదరాబాద్: మరింత ప్రశాంతతకు, ఉన్నత విద్యా ప్రమాణాలకు ఉస్మానియా విశ్వవిద్యాలయం వేదిక కాబోతోందని వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ డి.రవీందర్ తెలిపారు. యూనివర్సిటీలు ప్రశాంత వాతావరణంలో ఉండేలా దేశవ్యాప్తంగా క్లోజ్డ్ క్యాంపస్‌ల ఏర్పాటు జరుగుతోందని చెప్పారు. ఇందులో భాగంగా ఓయూకు ప్రభుత్వం రూ.16 కోట్లు మంజూరు చేసిందని, బయటి వ్యక్తులు క్యాంపస్ నుంచి ప్రయాణించకుండా బైపాస్ రోడ్డు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. దీనివల్ల కేవలం విద్యార్థులే ప్రాంగణంలో తిరుగుతారన్నారు. ఓయూలో మహిళా విద్యార్థినుల సంఖ్య పెరుగుతోందని, క్లోజ్డ్ క్యాంపస్ ఏర్పాటు వల్ల వారికి మరింత పటిష్టమైన భద్రత చేకూరుతుందని చెప్పారు. మరోవైపు వర్సిటీలో మౌలిక వసతుల కల్పనకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నట్టు వివరించారు. రెండేళ్లుగా మౌలిక వసతులకు రూ.145 కోట్లు ఖర్చు చేశామన్నారు. శుక్రవారం యూనివర్సిటీ ప్రాంగణంలో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. హాస్టళ్లు.. సరికొత్త క్లాస్‌రూమ్‌లు సైఫాబాద్‌లోని యూనివర్సిటీ కాలేజీలో 300 మందికి సరిపడా బాలుర హాస్టల్ నిర్మాణం. నిజాం కాలేజీలో 284 మంది బాలికల కోసం హాస్టల్ ఏర్పాటు. సెంటినరీ హాస్టల్‌ను 500 మందికి సరిపడేలా నిర్మాణం. ఓయూ ప్రాంగణంలో స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్టుల ఏర్పాటు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో సరికొత్త క్లాస్ రూంల ఏర్పాటుకు శ్రీకారం. పరిశోధనలకు వీలు కల్పించేలా పూర్తి స్థాయి సాంకేతిక విద్యా విధానం అందుబాటులోకి తెచ్చేందుకు వ్యూహరచన. కార్పొరేట్ సంస్థల సామాజిక బాధ్యతలో భాగంగా పలు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ఓయూకు నిధులు సమకూరాయి. అమెరికాలోని 12 నగరాలను ప్రొఫెసర్ రవీంద్ర సందర్శించారు. అక్కడ పూర్వ విద్యార్థులతో భేటీ అయ్యారు. ఓయూలో వారి అనుభవాలు వివరించేందుకు అంగీకారం కుదిరింది. మారుతున్న విద్యా విధానంలో భాగంగా ఈ ఏడాది నుంచి ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీసెస్ అమలు. ఇందులో భాగంగా వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారు వర్సిటీ విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించేందుకు అనుమతి. ఈ ఏడాది నుంచి నిరంతర పరీక్షా విధానం అమలు. ఎప్పటికప్పుడు మధ్యంతర పరీక్షలు నిర్వహిస్తారు. ప్రిన్సిపల్స్, ప్రొఫెసర్లతో సమీక్ష ఉస్మానియా యూనివర్సిటీ: నిరంతర పరీక్షా విధానంపై ప్రొఫెసర్ రవీందర్ వివిధ కాలేజీల ప్రిన్సిపల్స్, ప్రొఫెసర్లతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు డిగ్రీ, పీజీ, డిప్లొమా, ఇతర కోర్సులకు ఇంటర్నల్ పరీక్షలు, ప్రాక్టికల్స్‌తో పాటు ప్రతి ఆరు నెలలకు ఒక సెమిస్టర్ పరీక్షను నిర్వహిస్తున్నారు. యూజీసీ ప్రవేశ పెట్టిన కొత్త నిబంధనల ప్రకారం సెమిస్టర్ పరీక్షలతో పాటు 15 రోజులకు ఒకసారి పరీక్షలను నిర్వహించేందుకు వర్సిటీ సమాయత్తం అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ల అభిప్రాయాలు, అభ్యంతరాలు, సందేహాలను వీసీ తెలుసుకున్నారు. -
సామాన్యులకు మరో షాక్.. పీజీ హాస్టళ్లపై జీఎస్టీ, ఇక బాదుడు షురూ!
శివాజీనగర(బెంగళూరు): ఇప్పటికే పలు రకాల భారాలతో అయ్యో అంటున్న సామాన్య ప్రజలకు మరో భారం పొంచి ఉంది. ప్రైవేటు హాస్టళ్లు (పీజీ)ల బాడుగ ఫీజుకు జీఎస్టీ సెగ తగలనుంది. విద్యార్థులు, బ్యాచిలర్లు, ఒంటరి ఉద్యోగులకు ఆదరువుగా పీజీలు ఉండడం తెలిసిందే. నగరంలో వేలాది మంది పీజీల్లో వసతి పొందుతూ వృత్తి ఉద్యోగాలను, చదువులను కొనసాగిస్తున్నారు. కొత్త జీఎస్టీ నియమాల ప్రకారం రోజు బాడుగ రూ. వెయ్యి కంటే తక్కువ అయితే 12 శాతం జీఎస్టీ, వెయ్యి కంటే ఎక్కువైతే 18 శాతం జీఎస్టీ విధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ధారించింది. బెంగళూరులోని జీఎస్టీ పీఠం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. ఫలితంగా బాడుగల్ని పెంచడం తప్పదని బెంగళూరు పీజీ యజమానుల క్షేమాభివృద్ధి సంఘం వెల్లడించింది. జీఎస్టీని వసతిదారుల నుంచే వసూలు చేస్తామని తెలిపింది. ఇప్పటికే బెంగళూరులో పీజీల బాడుగ ఎక్కువగా ఉందని వసతిదారులు చెబుతున్నారు. చదవండి సైకో టెక్కీ.. ప్రియురాలిపై ఉన్మాదం.. -
ఎస్సీ హాస్టల్ ఉద్యోగుల వేతన సమస్యకు చెక్.. 411 మందికి గుడ్‌న్యూస్
సాక్షి, అమరావతి: పోస్ట్ మెట్రిక్ ఎస్సీ హాస్టళ్లలో ఔట్ సోర్సింగ్ విధానంలో పని చేస్తున్న ఉద్యోగులు ఏళ్ల తరబడిగా ఎదుర్కొంటున్న వేతన సమస్యను రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున పరిష్కరించారు. ఇకపై వారు వేతనాలు సకాలంలో అందుకొనేలా ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్(ఆప్కాస్)కు వారి సేవలను అనుసంధానం చేసారు. వివరాల ప్రకారం.. రాష్ట్రంలో ఉన్న 160 పోస్ట్ మెట్రిక్ ఎస్సీ హాస్టళ్లలో వంటపని, పారిశుద్ధ్యం ఉద్యోగులుగా పని చేస్తున్న వారిలో 411 మందికి ప్రైవేటు సంస్థల ద్వారా వేతనాలను చెల్లించేవారు. అయితే, ఈ విధానంలో ఆ ఉద్యోగులకు వేతనాలు అందడం ఆలస్యం అవుతుండటంతో ఉద్యోగులు విధుల నుంచి తప్పుకుంటున్న కారణంగా విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది. అందుకే తమ వేతనాలు అందరితో పాటుగా సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని వారు అధికారులకు తెలిపారు. కాగా, ఈ సమస్య మంత్రి మేరుగు నాగార్జున దృష్టికి రావడంతో వారి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం థర్డ్ పార్టీ విధానంలో పని చేస్తున్న ఈ ఉద్యోగుల సేవలను ప్రీ మెట్రిక్ ఎస్సీ హాస్టళ్లలో ఇదివరకే మంజూరైన పోస్టుల స్థానంలో ఉపయోగించుకోవాలన్నారు. అలాగే, వారి వేతనాలను ఆప్కాస్ ద్వారా ఆలస్యం లేకుండా ప్రతినెలా అందరితో పాటుగా చెల్లించాలిని అధికారులు ప్రతిపాదించగా మంత్రి.. ముఖ్యమంత్రి వైఎస్ జగనమోహన్‌రెడ్డి దృష్టి తీసుకెళ్లారు. అనంతరం, ఈ ప్రతిపాదనపై సీఎం జగన్ ఆమోదముద్ర వేసారు. దీంతో, ఈ ఉద్యోగులు ఇప్పటి వరకూ వేతనాల కోసం పడుతున్న ఇబ్బందులు పూర్తిగా తొలగిపోయాయి. అదే విధంగా పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలో ఉద్యోగులు లేని కారణంగా విద్యార్థులు ఇబ్బంది పడే దుస్థితికి కూడా తెరపడింది. ప్రస్తుతం ఆప్కాస్కు అనుసంధానం చేసిన 411 మంది పోస్ట్ మెట్రిక్ ఎస్సీ హాస్టల్ ఉద్యోగులలో 37 మందిని శ్రీకాకుళం, 52 మందిని విజయనగరం, 17 మందిని విశాఖపట్నం, 120 మందిని తూర్పుగోదావరి, 82 మందిని కృష్ణా,62 మందిని ప్రకాశం, 41 మందిని అనంతపురం జిల్లాలకు చెందిన హాస్టళ్లకు కేటాయిస్తూ సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా తమ సమస్యను పరిష్కరించడంలో తమ కష్టాలు తీర్చిన సీఎం జగన్‌కు, చొరవ చూపిన మంత్రి మేరుగు నాగార్జునకు ఉద్యోగులు తమ ధన్యవాదాలు తెలిపారు. -
విద్యార్థులకు సీఎం వైఎస్ జగన్ మరో శుభవార్త
-
హైదరాబాద్‌లో విచ్చలవిడిగా హాస్టళ్లు, లాడ్జీలు.. పోలీసుల ప్రత్యేక యాప్
సాక్షి, హైదరాబాద్: ఎక్కడో నేరం చేసిన వాళ్లు నగరానికి వచ్చి తలదాచుకుంటున్నారు.. ఇక్కడ నేరం చేయడానికి వచ్చినవాళ్లూ కొన్నాళ్లు మకాం వేస్తున్నారు.. ఇలాంటి వారికి సిటీలో ఉన్న కొన్ని లాడ్జీలు, హాస్టళ్లు ఆశ్రయం కల్పిస్తున్నాయి. మరోపక్క ఏ హాస్టల్లో ఎవరు ఉంటున్నారు? వాళ్లు ఎక్కడి వాళ్లు, ఇంతకు ముందు ఎక్కడ ఉన్నారు? ఇలా ఏ విషయమూ పోలీసులకు తెలియట్లేదు. ఇలాంటి సమస్యలకు పరిష్కారంగా ఎస్సార్‌నగర్ ఠాణా అధికారులు ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఆ పోలీసుస్టేషన్ ఇన్స్పెక్టర్ కె.సైదులు ఆలోచన, కృషి ఫలితంగా కొన్ని రోజుల్లోనే ఇది అందుబాటులోకి రానుంది. గూగుల్ ద్వారా అందుబాటులోకి.. ప్రస్తుతం తుది మెరుగులు దిద్ది ఈ యాప్‌ను గూగుల్ ద్వారా అందుబాటులోకి తీసుకురావడానికి ఎస్సార్‌నగర్ పోలీసులు ఏర్పాట్లు చేశారు. పోలీసు విభాగం అధీనంలో పని చేసే దీన్ని హాస్టళ్లు, లాడ్జీల నిర్వాహకులు తమ స్మార్ట్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలి. అందులో ఉన్న కేటగిరీల ఆధారంగా బాయ్స్, మెన్స్, ఉమెన్స్ హాస్టల్స్, లాడ్జీలను ఎంచుకుంటారు. బస చేస్తున్న వ్యక్తి పేరు, ఆధార్, ఫోన్ నంబర్లతో పాటు ఎక్కడ నుంచి వచ్చాడు? ఎందుకు వచ్చాడు? ఏం చేస్తుంటాడు? గతంలో ఎక్కడ ఉండేవాడు? ప్రస్తుతం ఏ రూమ్‌లో ఉంటున్నాడు? తదితర వివరాలన్నీ నమోదు చేస్తారు. వీటితో పాటు అతడి ఫొటో, ఆధార్కార్డునూ క్యాప్చర్ చేసి అదే యాప్ ద్వారా సర్వర్‌లో నిక్షిప్తం చేస్తారు. ప్రతీ హాస్టల్, లాడ్జీ యజమాని ఈ వివరాలన్నీ యాప్‌తో సేకరించడం కచి్చతం చేస్తున్నారు. ఇది కేవలం ఒత్తిడి చేయడం ద్వారా కాకుండా యజమానులు, నిర్వాహకులకు వారంతట వారుగా వినియోగించేలా ఎస్సార్‌నగర్ పోలీసులు యోచించారు. ఓటీపీతో ఫోన్ నంబర్ వెరిఫికేషన్.. బస చేసిన వ్యక్తి ఫోన్ నంబర్ యాప్‌లో ఎంటర్ చేసిన వెంటనే దానికి ఓటీపీ వెళ్తుంది. ఇది కూడా పొందుపరిస్తేనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యేలా యాప్‌ను డిజైన్ చేస్తున్నారు. ఫలితంగా నకిలీ ఫోన్ నంబర్లకు అడ్డుకట్ట వేయొచ్చు. ఈ యాప్‌నకు సంబంధించిన సర్వర్‌లో వాంటెడ్ వ్యక్తులు, పదేపదే నేరాలు చేసే వారి వివరాలతో కూడిన డేటాబేస్‌ను అనుసంధానించనున్నారు. ఎవరైనా బస చేయడానికి వస్తే... ఆ వివరాలు పొందుపరిచిన వెంటనే యాప్ దానంతట అదే అలర్ట్ ఇచ్చేలా సాఫ్ట్వేర్ డిజైన్ చేస్తున్నారు. విస్తరిస్తేనే పూర్తి స్థాయి ఫలితాలు... ఈ యాప్ ఎస్సార్‌నగర్ పోలీసుల చొరవతో రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతానికి ఆ ఠాణా పరిధిలోని హాస్టళ్లు, లాడ్జీల్లో ఉంటున్న వారి వివరాలు తెలుసుకోవడానికి, బస చేసిన వ్యక్తి పూర్వాపరాలు గుర్తించడానికి, ఆ పరిధిలో వాంటెడ్ వ్యక్తులకు చెక్ చెప్పడానికి ఉపకరించనుంది. దీనివల్ల పూర్తి స్థాయి ఫలితాలు రావాలంటే మరింత విస్తరించాల్సిన అవసరం ఉంది. ప్రాథమికంగా రాజధానిలోని మూడు కమిషనరేట్లకు ఆపై రాష్ట్ర వ్యాప్తంగా ఈ యాప్ అమలును కచ్చితం చేయడంతో పాటు ప్రోత్సహించాల్సిన అవసరముంది. -
గంటసేపట్లో పునరుద్ధరించండి
సాక్షి, హైదరాబాద్: దసరా సెలవుల కారణం చెప్పి ఉస్మానియా వర్సిటీలోని హాస్టళ్లలో విద్యుత్, నీటి సరఫరాను ఆపడం సరికాదని.. గంటసేపట్లో పునరుద్ధ రించాలని అధికారులను హైకోర్టు ఆదే శించింది. అలా చేయని పక్షంలో రిజి స్ట్రార్ తమ ముందు హాజరుకావాల్సి ఉంటుందని హెచ్చరించింది. వర్సిటీ అధికారులు దసరా సెలవులను తొలుత అక్టోబర్ 3 నుంచి 10 వరకు పేర్కొ న్నారు. తర్వాత 26 వరకు పొడిగిండంతో పాటు విద్యుత్, నీటి సరఫరా నిలి పేశారు. వీటిని పునరుద్ధరించేలా ఆదే శాలివ్వాలని కోరుతూ ఎల్ఎల్బీ విద్యా ర్థులు నెరెళ్ల మహేశ్‌గౌడ్‌తో పాటు మరో నలుగురు హైకోర్టును ఆశ్రయించి లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కె.లక్ష్మణ్ శుక్రవారం విచా రణ చేపట్టారు. పిటిషన్ తరఫున న్యాయవాది గౌరారం రాజశేఖర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఎల్ఎల్బీ వి ద్యార్థులు, గ్రూప్–1 అభ్యర్థులు పరీక్ష లకు సిద్ధమవుతున్నారన్నారు. హాస్టళ్ల లో చదువుకుంటున్న విద్యార్థుల్లో చాలా మంది పేద, మధ్య తరగతి విద్యార్థు లేనని వెల్లడించారు. వర్సిటీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. మరమ్మతులు చేయడం కోసం సరఫరా నిలిపినట్లు చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. విద్యుత్, నీటి సరఫరా ను పునరుద్ధరించాలని ఆదేశించారు. -
హాస్టళ్లపై పోలీసుల ఫోకస్.. ఈ పది నిబంధనలు పాటించాల్సిందే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్ల విడుదల ఒకవైపు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) కార్యాలయాల పునఃప్రారంభం మరోవైపు.. దీంతో వసతి గృహాలకు పూర్వ వైభవం వచ్చింది. ఈ నేపథ్యంలో హాస్టళ్లలో నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. సెప్టెంబర్ మొదటి వారంలో పెయింగ్ గెస్ట్ (పీజీ) హాస్టళ్లు, వసతి గృహాలను క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయాలని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించారు. భద్రతా నిబంధనలు పాటించని హాస్టళ్లకు నోటీసులు జారీ చేస్తారు. రెండు వారాల్లో ఆయా ఏర్పాట్లు చేయని వసతి గృహాలను సీజ్ చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. స్త్రీ, పురుష హాస్టళ్లకు కెమెరాలు ఒకటే సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 1,200 వసతి గృహాలు ఉన్నాయని, వీటన్నింటినీ మహిళా భదత్రా విభాగం, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ) ఆధ్వర్యంలో తనిఖీ చేయనున్నట్లు ఎస్సీఎస్సీ జనరల్ సెక్రటరీ కృష్ణా ఏదుల తెలిపారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు వాటిని ఎవరు నిర్వహిస్తున్నారనేది కూడా ముఖ్యమే అన్నారు. సైబరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో పురుషులు, మహిళల వసతి గృహాల యజమాని రెండు హాస్టళ్లలోనూ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారని, అయితే కానీ వాటి రికార్డ్ రూమ్‌ను మాత్రం జెంట్స్ హాస్టల్స్‌లోని పురుషులే నిర్వహిస్తున్నట్లు తనిఖీల్లో గుర్తించామన్నారు. వెంటనే వాటిని సీజ్ చేసి, యజమానిపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. రాచకొండలో 800 హాస్టల్స్.. ప్రస్తుతం రాచకొండ కమిషనరేట్ పరిధిలో 800 వసతి గృహాలు ఉన్నాయని మహిళా భద్రతా విభాగం పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. వచ్చే నెలలో ఆయా హాస్టళ్లను రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ (ఆర్కేఎస్సీ) ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయనున్నట్లు చెప్పారు. భద్రతా ఏర్పాట్లను పరిశీలించి, నిబంధనల ప్రకారం లేకపోతే నోటీసులు జారీ చేస్తామన్నారు. 10 నిబంధనలు పాటించాల్సిందే... ►హాస్టల్ ప్రవేశ, నిష్క్రమణ పాయింట్ల వద్ద యాక్సెస్ కంట్రోల్ ఫీచర్లుండాలి. ►కనీసం 5 అడుగుల ఎత్తు, అంతకంటే ఎత్తులో ప్రహరీ ఉండాలి. ►ప్రవేశం ద్వారం వద్ద 24/7 సెక్యూరిటీ గార్డు ఉండాలి. ►విజిటర్స్ రిజిస్టర్ మెయిన్‌టెన్ చేయాలి. ►ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద సీసీటీవీ కెమెరా ఉండాలి. ►అగ్నిప్రమాద నియంత్రణ ఉపకరణాలు ఉండాలి. ►నోటీసు బోర్డు, ప్రథమ చికిత్స కిట్, ఫిర్యాదులు, సూచనల బాక్స్ ఉండాలి. ►వసతి గృహంలో పనిచేసే కార్మికులకు గుర్తింపు కార్డులు ఉండాలి. ►హాస్టల్లోని ప్రతి ఒక్కరికీ లాకర్ ఉండాలి. ►ధ్రువీకరించుకోకుండా ఎవరికీ వసతిని కల్పించకూడదు. -
ప్రత్యక్ష బోధన, హాస్టల్ వసతి కావాలి
కేయూ క్యాంపస్ (వరంగల్): కాకతీయ యూనివర్సిటీలో పీజీ కోర్సుల రెండో సెమిస్టర్ విద్యార్థులకు ప్రత్యక్ష విద్యాబోధన, హాస్టల్ వసతి కల్పించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ, బీఎస్ఎఫ్, ఏబీఎస్ఎఫ్, ఏబీవీపీ, పీడీఎస్‌యూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సోమవారం విద్యార్థులు ఆందోళనకు దిగారు. విద్యార్థుల ఆందోళన విషయం తెలుసుకున్న వర్సిటీ అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. హాస్టళ్ల మరమ్మతులు పూర్తికాగానే హాస్టల్ సౌకర్యంతోపాటు ప్రత్యక్ష విద్యాబోధన ఉంటుందని రిజిస్ట్రార్ విద్యార్థులను సముదాయించే ప్రయత్నం చేశారు. మరమ్మతులు తొలుత ఈ నెల 7నాటికి పూర్తి చేస్తామని, ఆ తర్వాత 16వరకు అని చెప్పారని, ఇంకా ఎన్నిరోజులు చేస్తారని రిజిస్ట్రార్‌తో విద్యార్థులు వాగ్వాదానికి దిగారు. ఈ దశలో విద్యార్థులు పరిపాలనా భవనంలోనికి చొచ్చుకెళ్లేయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థులు ఆగ్రహంతో మొక్కల కుండీలను పగలగొట్టారు. రిజిస్ట్రార్ చాంబర్‌లోని కుర్చీలను ఎత్తిపడేశారు. చివరికి జూలై 4వతేదీ వరకు మరమ్మతులు పూర్తిచేసి హాస్టల్ వసతి కల్పిస్తామని, లేకుంటే తన పదవికి రాజీనామా చేస్తానని రిజిస్ట్రార్ హామీనివ్వడంతో విద్యార్థులు అక్కడినుంచి వెళ్లిపోయారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నేతలు పాల్గొన్నారు. -
హాస్టళ్లలో బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి!
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ వసతిగృహాల్లో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని ఈ విద్యాసంవత్సరం నుంచి పూర్తిస్థాయిలో అమలు చేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ఇదివరకు ప్రయోగాత్మక పద్ధతిలో బయోమెట్రిక్ హాజరు ప్రక్రియను అమ లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షే మ శాఖల పరిధిలో 1,345 సంక్షేమ వసతిగృహాలున్నాయి. వీటి పరిధిలో 2.25 లక్షలమంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. ప్రస్తుతం విద్యార్థుల హాజరును మాన్యువల్ పద్ధతిలో రికార్డు చేస్తున్నా రు. అయితే విద్యార్థుల సంఖ్యను అధికంగా చూపు తూ బిల్లులు డ్రా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకుగాను ప్రభుత్వం బయోమెట్రిక్ హాజరు విధానాన్ని తీసుకువస్తోంది. వారంలోగా క్షేత్రస్థాయి అవసరాలపై అంచనా హాస్టళ్లలో బయోమెట్రిక్ హాజరు అమలు కోసం బయోమెట్రిక్ మెషీన్లు అవసరం. వీటిని ఆధార్ నంబర్ ఆధారంగా వేలిముద్రలు తీసుకునేలా తయారు చేశారు. ప్రతి హాస్టల్లో మెషీన్లు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న మెషీన్లను పరిశీలించి పనితీరును అంచనా వేయాలని, అవసరమైనచోట కొత్తవి కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. ఈ బాధ్యతలను తెలంగాణ రాష్ట్ర సాంకేతిక సర్వీసులు(టీఎస్టీఎస్) విభాగానికి ఇవ్వాలని నిర్ణయించి లేఖ రాసినట్లు తెలిసింది. -
కేయూ క్యాంపస్.. కామన్మెస్లో ఏం జరుగుతోంది?
సాక్షి, కేయూ క్యాంపస్(వరంగల్): కాకతీయ యూనివర్సిటీలోని కామన్మెస్లో క్యాజువల్ ఉద్యోగి (సూపర్వైజర్) నిరంజన్‌రెడ్డిపై హాస్టళ్ల డైరెక్టర్ డాక్టర్ మంజుల ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈనెల 16న కామన్మెస్కు వచ్చిన మంజుల ‘నిన్ను లా కళాశాల హాస్టల్‌కు ట్రాన్స్ఫర్ చేశాను. ఇక్కడ్నుంచి వెళ్లు గెటవుట్’ అంటూ నిరంజన్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ‘నేను ఏం తప్పుచేశానో చెప్పాలి, నిరూపించాలి’ అని సూపర్వైజర్ నిరంజన్‌రెడ్డి హాస్టళ్ల డైరెక్టర్‌తో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. కాకతీయ యూనివర్సిటీ హాస్టల్లో క్యాజువల్ ఉద్యోగి కామన్మెస్ సూపర్వైజర్గా నిరంజన్‌రెడ్డి కొన్నేళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల కామన్మెస్కు సంబంధించిన పలు విషయాలను హాస్టళ్ల సూపరింటెండెంట్, హాస్టళ్ల డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. కేయూలోని ఓ నాన్బోర్డర్కు నిరంజన్‌రెడ్డికి మధ్య గతంలో కొన్ని విబేధాలున్నాయి. నాన్బోర్డర్లను కామన్ మెస్‌లోకి రాకుండా నిరంజన్‌రెడ్డి అడ్డుకుంటున్నట్లు, దీంతో ఓ నాన్బోర్డర్ కామన్మెస్ విధుల నుంచి నిరంజన్‌రెడ్డిని తొలగించాలని డైరెక్టర్‌తో ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతటితో ఆ నాన్బోర్డర్ ఆగకుండా.. నీతో కామన్మెస్ విధుల నుంచి తొలగించి చిప్పలు కడిగిస్తానని అని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన జరిగిన కొన్ని రోజులకే డైరెక్టర్ మంజుల కామన్ మెస్‌కు వచ్చి నిరంజన్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేయడం, లా కళాశాల హాస్టల్‌కు ట్రాన్స్ఫర్ చేశామని చెప్పడం, ఆ తర్వాత నిరంజన్‌రెడ్డి విధులకు హాజరవకపోవడం ప్రస్తుతం యూనివర్సిటీలో చర్చనీయాంశంగా మారింది. -
8 నుంచి ఓయూ హాస్టళ్ల మూసివేత
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలోని హాస్టళ్లను ఈనెల 8 నుంచి మూసివేయనున్నట్లు చీఫ్ వార్డెన్ శ్రీనివాస్‌రావు బుధవారం తెలిపారు. యూనివర్సిటీ అధికారుల ఆదేశాల మేరకు 8న మధ్యాహ్న భోజనం తర్వాత మెస్‌లను కూడా మూసివేస్తామని చెప్పారు. విద్యార్థులు హాస్టల్ గదుల్లోని తమ సామాన్లను వెంటతీసుకెళ్లాలని సూచించారు. హాస్టళ్లను తిరిగి ప్రారంభించే తేదీలను తర్వాత ప్రకటిస్తామన్నారు. పీజీఈసెట్ ప్రత్యేక కౌన్సెలింగ్ సాక్షి, హైదరాబాద్: ఎంఈ, ఎంటెక్, ఎంఆర్క్, ఎం ఫార్మసీ, ఫార్మా డీ కోర్సుల్లో ప్రవేశానికి టీఎస్ పీజీఈసెట్ ఈ నెల 6 నుంచి స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్టు సెట్ కన్వీనర్ పి.రమేష్‌బాబు ఓ ప్రకటనలో తెలిపారు. 7వ తేదీ వరకూ ఆన్లైన్ రిజిష్ట్రేషన్ చేసుకోవచ్చని, 9 నుంచి 11 వరకూ వెబ్ ఆప్షన్లు ఉంటాయని తెలిపారు. 16వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుందని, 19వ తేదీ వరకూ సెల్ఫ్ రిపోర్టింగ్‌కు గడువుంటుందని వెల్లడించారు. ‘డిగ్రీ వన్‌టైమ్ చాన్స్’ ఫలితాలు విడుదల ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్): ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో గతేడాది అక్టోబర్‌లో జరిగిన డిగ్రీ కోర్సుల వన్‌టైమ్ చాన్స్, బ్యాక్లాగ్ పరీక్షల ఫలితాలను బుధవారం విడుదల చేశారు. బీఏ, బీబీఏ కోర్సుల బ్యాక్లాగ్, వన్‌టైమ్ చాన్స్ ఫలితాలు.. బీఎస్సీ, బీఏ ఒకేషనల్, బీకాం ఆనర్స్, వార్షిక పరీక్షల ఫలితాలను ప్రకటించినట్లు కంట్రోలర్ శ్రీనగేశ్ తెలిపారు. (తెలంగాణలో పెరుగుతున్న కేసులు.. వైద్య సిబ్బందికి సెలవులు రద్దు) పీజీ ప్రవేశాల చివరి విడత వెబ్ కౌన్సెలింగ్ ఉస్మానియా యూనివర్సిటీ: రాష్ట్రంలోని ఏడు వర్సిటీల్లో వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు చివరి విడత కౌన్సెలింగ్ షెడ్యూలును బుధవారం విడుదల చేశారు. సీపీజీఈటీ–2021లో భాగంగా ఈ నెల 6 నుంచి ఈ నెల 10వరకు చివరి విడత వెబ్‌కౌన్సెలింగ్ జరగనున్నట్లు కన్వీనర్ ప్రొ.పాండురంగారెడ్డి పేర్కొన్నారు. ఎన్సీసీ, దివ్యాంగులు, సీఏపీ అభ్య ర్థులు ఈ నెల 10న నేరుగా ఓయూ క్యాంపస్‌లోని పీజీ అడ్మిషన్స్ కార్యాలయంలో జరిగే సర్టిఫికెట్ల వెరి ఫికేషన్‌కు హాజరు కావాలన్నారు. ఈ నెల 12నుంచి 15వరకు వెబ్ ఆప్షన్ ఇవ్వాలని, 16న ఎడిటింగ్, 19న వివిధ పీజీ కోర్సుల్లో సీట్లు సాధించిన అభ్యర్థుల చివరి జాబితాను ప్రకటిస్తామని తెలిపారు. సీట్లు లభించిన విద్యార్థులు 20 నుంచి 25 వరకు ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలన్నారు. ఎస్టీ గురుకుల సొసైటీ అదనపు కార్యదర్శిగా సర్వేశ్వర్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీటీడ బ్ల్యూఆర్‌ఈఐఎస్) అదనపు కార్యదర్శిగా వి.సర్వేశ్వర్‌రెడ్డి నియమితులయ్యారు. ఈమేరకు గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తూ ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం సర్వేశ్వర్‌రెడ్డి గిరిజన సంక్షేమ శాఖలో అదనపు సంచాలకుడిగా, టీసీఆర్టీఐ (గిరిజన సంస్కృతి పరిశోధన, శిక్షణ సంస్థ) సంచాలకుడిగా కొనసాగుతున్నారు. గిరిజన గురుకుల సొసైటీ అదనపు కార్యదర్శిగా పనిచేసిన నవీన్ నికోలస్ కేంద్ర సర్వీసులకు డిప్యుటేషన్‌పై వెళ్లడంతో మంగళవారం రిలీవ్ అయ్యారు. ఈ నేపథ్యంలో అదనపు కార్యదర్శిగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు సర్వేశ్వర్రెడ్డికి ప్రభుత్వం అప్పగించింది. -
సంక్షోభంలో ప్రైవేటు హాస్టళ్లు
సాక్షి, కరీంనగర్: కరోనా కారణంగా ప్రైవేటు వసతి గృహాలన్నీ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయి. లక్షల్లో అప్పులు చేసిన నిర్వాహకులను మహమ్మారి ఘోరంగా దెబ్బతీసింది. ప్రవేశాలు నిలిచిపోయి, నిర్వహణ భారాన్ని మోయలేక, పరిస్థితి ఎప్పుడు కుదుటపడుతుందో తెలియక, ఇప్పటికే సగానికి పైగా ఈ వ్యాపారం నుంచి తప్పుకున్నారు. నాలుగు నెలలుగా అద్దె భారం భరించలేక, నష్టాలను తట్టుకోలేక మానసికంగా కుంగిపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా గుర్తింపు పొందిన, పొందని వసతి గృహాలు దాదాపు 2వేలకు పైగా ఉన్నాయి. ఇందులో కరీంనగర్ పట్టణంలోని అధికంగా ఉన్నాయి. కరోనా వైరస్ కారణంగా శిక్షణ సంస్థలు మూతపడడంతో ఉద్యోగార్థులు, విద్యార్థులు సొంతూళ్లకు వెళ్లిపోయారు. దీంతో ప్రైవేట్ హాస్టల్స్ నిర్వాహకులు చేసేదేమి లేక వ్యాపారాలు మూసివేస్తున్నారు. సామగ్రి విక్రయించాలన్నా కష్టమే వసతి గృహాలను ఏర్పాటు చేసినప్పుడు ఫర్నీచర్‌కు రూ.లక్షల్లో ఖర్చుపెట్టారు. వీటిని విక్రయించాలంటే కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఒక మంచం, పరుపు కోసం కనీసం రూ.3500 నుంచి రూ. 5వేల వరకు వెచ్చించారు. విక్రయించడానికి ప్రయత్నిస్తే రూ.300–400 కూడా రావడం లేదు. మరోవైపు హాస్టళ్లపై ఆధారపడిన ఉద్యోగులు, వంట వారికీ ఉపాధి కరువైంది. కొన్ని వసతి గృహాల్లో రూ.50 వేల నుంచి రూ. లక్ష వరకు సరుకులు దెబ్బతిన్నాయి. వసతి గృహాలతో పాటు ప్రైవేటు స్టడీ కేంద్రాలను సిబ్బంది సీల్ చేయడంతో అందులో సామగ్రి, వస్తువుల నిర్వహణ లేకుండా పోయింది. -
హాస్టళ్లను ఖాళీ చేయాలని...
-
‘వసతి పాట్లు’పై నిశిత దృష్టి
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ వసతి గృహాల్లో సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించింది. క్షేత్రస్థాయిలో నెలకొన్న ప్రధాన సమస్యలపై సత్వరమే స్పందించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వసతిగృహాల వారీగా తక్షణ అవసరాలపై నివేదికలు కోరింది. ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వచ్చే నెల మొదటి వారం నుంచి సంక్షేమ వసతిగృహాలు పునఃప్రారంభం కానున్నాయి. ఈనేపథ్యంలో విద్యార్థులు వచ్చేనాటికి ప్రధాన సమస్యలు పరిష్కరించాలని, అవసరమైన చోట మరమ్మతులు చేపట్టడం, చిన్నపాటి నిర్మాణాలు పూర్తి చేయడం వంటి వాటికి ప్రాధాన్యతనిస్తోంది. ప్రాధాన్యతా క్రమంలో ప్రతిపాదనలు... సంక్షేమ వసతిగృహాల్లో సమస్యలపై జిల్లా స్థాయిలో ప్రతిపాదనలు సమర్పించాలని ఎస్సీ అభివృద్ధి శాఖ, గిరిజన సంక్షేమ శాఖలు సూచించాయి. ఈ మేరకు జిల్లా సంక్షేమ అధికారులకు ఆదేశాలు జారీ చేశాయి.ప్రత్యేక ఫార్మాట్‌ను తయారు చేసిన అధికారులు...ఆమేరకు వివరాలు పంపాలని, వసతిగృహాల్లో విద్యార్థుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ప్రాధాన్యతా క్రమంలో ప్రణాళికలు తయారు చేయాలని స్పష్టం చేశాయి. జిల్లాల వారీ ప్రతిపాదనలు ఈనెల 20వ తేదీలోగా రాష్ట్ర కార్యాలయానికి సమర్పించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. వసతి గృహాల్లో ప్రధానంగా విద్యుత్, నీటిసరఫరా, డ్రైనేజీ వ్యవస్థకు చెందిన సమస్యలున్నాయి. వీటితోపాటు దీర్ఘకాలికంగా పెయింటింగ్ వేయకపోవడంతో భవనాలు పాతవాటిలా కనిపిస్తున్నాయి. తాజా ప్రతిపాదనల్లో వీటికి సైతం ప్రాధాన్యమిచ్చే అవకాశం ఉంది. శాశ్వత భవనాల్లోని పనులకు రూ.25 కోట్లు అవసరమని అంచనా.. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ పరిధిలో 1850 వసతిగృహాలున్నాయి. వీటిలో దాదాపు 280 హాస్టళ్లు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ముందుగా శాశ్వత భవనాలకు ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో అక్కడి సమస్యలను ప్రస్తావిస్తూ ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు. అదేవిధంగా అద్దె భవనాల్లోని హాస్టళ్లకు మాత్రం యజమానితో సంప్రదింపులు జరిపి రంగులు, విద్యుత్ సమస్యను పరిష్కరించాలని, నీటి సరఫరా, డ్రైనేజీ పనులకు మాత్రం ప్రభుత్వం నుంచి సాయం అందించే అవకాశం ఉందని ఉన్నతాధికారులు తెలిపారు. శాశ్వత భవనాల్లో పనులకు దాదాపు రూ.25కోట్లు అవసరమవుతుందని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.ఈనెల 20లోపు జిల్లా స్థాయి ప్రతిపాదనలు వచ్చిన వెంటనే వాటి ఆధారంగా రాష్ట్రస్థాయిలో ప్రాధాన్యతా క్రమంలో తక్షణ అవసరాలకు తగినట్లు రాష్ట్ర కార్యాలయ అధికారులు ప్రణాళిక తయారు చేసి ప్రభుత్వానికి నివేదిస్తారు. నెలాఖరులోగా దానికి ప్రభుత్వ ఆమోదం లభిస్తే జూన్ రెండో వారం కల్లా పనులు పూర్తి చేయనున్నట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు. -
సీజనల్ హాస్టల్స్ అవినీతి బట్టబయలు!
కోడూరు (అవనిగడ్డ): సర్వశిక్షా అభియాన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సీజనల్ హాస్టల్స్‌లో జరుగుతున్న అవినీతి విజిలెన్స్ తనిఖీల్లో బట్టబయలైంది. ఎన్జీవోల పర్యవేక్షణలో సాగాల్సిన ఈ హాస్టల్స్ నిర్వహణ పాఠశాలల ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో జరుగుతున్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. మండలంలోని విశ్వనాథపల్లి, కోడూరు, ఉల్లిపాలెం ప్రాథమికోన్నత పాఠశాలల్లో నిర్వహిస్తున్న హాస్టల్స్‌పై మంగళవారం విజిలెన్స్ సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సిబ్బంది అకస్మిక దాడులు నిర్వహించారు. మూడు హాస్టల్స్‌లో విద్యార్థుల సంఖ్యకు రికార్డుల్లో ఉన్న సంఖ్యకు సంబంధం లేకపోవడంపై సీఐ నిర్వాహకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం, సాయంత్రం వేళల్లో మెనూ ప్రకారం భోజనం వండకుండా ఇష్టమొచ్చినట్లుగా వంటలు సిద్ధం చేస్తున్నారని సీఐ గుర్తించారు. ప్రతి నెల ఇవ్వాల్సిన కాస్మెటిక్స్ చార్జీలను సైతం నిర్వాహకులు విద్యార్థినులకు ఇవ్వకుండా తమ ఖాతాల్లో జమ చేసుకుంటున్నట్లు తనిఖీల్లో బయటపడింది. ఇళ్ల వద్ద నుంచి వచ్చే డబ్బులతోనే కావాల్సిన వస్తువులను కొనుగోలు చేసుకుంటున్నట్లు విద్యార్థులు అధికారులకు తెలిపారు. విద్యా వలంటీర్ల జీతాల్లోనూ చేతివాటం.. ప్రస్తుతం హాస్టల్స్‌లో ఉండే విద్యార్థుల సంరక్షణతో పాటు బోధన చేసేందుకు విద్యా వలంటీర్లను నియమించారు. వీరికి ప్రభుత్వం రూ.5 వేలు జీతం కూడా ఇస్తుంది. అయితే ఈ నగదును నిర్వాహకులు పూర్తిగా వాలంటీర్లకు ఇవ్వకుండా చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు సీఐ తెలిపారు. వారికి నిర్వాహకులు కేవలం రూ.3 వేలు మాత్రమే ఇచ్చి మిగిలిన రూ.2 వేలను కాజేస్తున్నట్లు తమ దర్యాప్తులో తెలిందన్నారు. కొన్ని చోట్ల హాస్టల్స్ నిర్వహణ బాగానే ఉన్నా, మరికొన్ని చోట్ల అధికారుల పర్యవేక్షణ లోపంతో మరీ అధ్వానంగా ఉందన్నారు. డీఎస్పీ విజయపాల్ ఆదేశాల మేరకు ఈ ఆకస్మిక దాడులు చేశామని, వీటిపై నివేదిక సిద్ధం చేసి ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు సీఐ వెంకటేశ్వర్లు వివరించారు. ఎఫ్ఆర్ఓ తిమోతి, డీఈ వెలుగొండయా, సీనియర్ అసిస్టెంట్ మణికుమార్, కానిస్టేబుల్ నాగభూషణం, ఎంఈవో టీవీఎం. రామదాసు తదితరులు తనిఖీల్లో పాల్గొన్నారు. -
అలాంటి ఇళ్లలో మీరుంటారా..?
ఒంగోలు టూటౌన్ :‘బాత్ రూములు, టాయిలెట్స్ లేకుండా మీరు ఉంటున్నారా..? మనం ఉంటున్నామా చెప్పండి.. మరి అలాంటి భవనాన్ని ఎందుకు అద్దెకు తీసుకున్నారు. బయటకు వెళ్లాలంటే పిల్ల్లలు ఎంత భయపడతారు, బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే ఎలా’ అంటూ గిద్దలూరు మండలంలోని క్రిష్టింశెట్టిపల్లె గిరిజన సంక్షేమశాఖ వసతి గృహ అధికారిపై జిల్లా డీటీడబ్ల్యూఓ మండిపడ్డారు. వెంటనే ఆ భవనాన్ని మార్చాలని ఆదేశించారు. వసతి గృహాల్లో పిల్లలను మన పిల్లలుగా చూడాలని హితవు పలికారు. స్థానిక ప్రగతి భవనంలోని గిరిజన సంక్షేమశాఖ, వెల్ఫేర్ కార్యాలయంలో వసతి గృహాల వార్డెన్లు, ఆశ్రమ పాఠశాలల హెచ్ఎంలతో జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి వెంకట సుధాకర్ మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వసతి గృహ వార్డెన్, గురుకుల పాఠశాలల హెచ్ఎంలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు పదో తరగతి పరీక్ష ఫలితాల వివరాల గురించి ఆరా తీశారు. ముఖ్యంగా వసతిగృహాల్లో ఎంత మంది పిల్లలు ఉంటున్నారనే విషయంపై చర్చించారు. తక్కువగా ఉంటే పిల్లలను ఎందుకు చేర్పించలేకపోయారంటూ ప్రశ్నించారు. ఎక్కువ మంది వార్డెన్లు వర్కర్స్ లేరని, గతంలో పనిచేసిన వర్కర్స్కు జీతాలు ఇవ్వాల్సి ఉందని డీటీడబ్ల్యూఓ దృష్టికి తీసుకువచ్చారు. కొన్ని చోట్ల ప్రస్తుతం ఉన్న వసతి గృహాలు సరిపోవడం లేదని తెలిపారు. అదనపు రూములకు నిధులు మంజూరైనా చాలా ప్రాంతాల్లో ఇంత వరకు పనులు ప్రారంభించలేదని తెలిపారు. మార్కాపురం వసతి గృహంలో పిల్లలు ఎక్కువ మంది ఉన్నారని, అయితే వర్కర్స్ లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నారని వసతిగృహం హెచ్‌డబ్ల్యూఓ తెలిపారు. గిద్దలూరు బాయ్స్ హాస్టల్ కట్టలేదని సమీక్ష దృష్టికి వార్డెన్ తీసుకువచ్చారు. వసతి గృహాల్లో పిల్లలను పెంచమని అడుగుతుంటే సౌకర్యాలు లేవని చెబుతారేంటని అసహనం వ్యక్తం చేశారు. ఒంగోలులో ఉన్న రెండు కళాశాల వసతి గృహాల్లో తక్కువ మంది పిల్లలు ఉండటంపై వార్డెన్లను నిలదీశారు. వందమంది పిల్లలకు అవకాశం కల్పిస్తుంటే 40 నుంచి 50 మంది పిల్లలు ఉండటం ఏంటని ప్రశ్నించారు. ఈ సారి సమావేశానికి కల్లా ఒక్కో వసతి గృహంలో 80 మంది పిల్లలు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కరపత్రాలు ముద్రించి ప్రచారం చేయడంతో పాటు ప్రసార మాద్యమాల్లో ప్రచారం కల్పించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రెండు రోజుల్లో వసతి గృహాలను తనిఖీ చేస్తామన్నారు. మంచి ఫలితాలు సాధించాలి.. పదో తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చేలా విద్యార్థులను బాగా చదివించాలని ఆయన సూచించారు. ముఖ్యంగా పిల్లలకు ఉపకార వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. పోస్ట్‌మెట్రిక్ ఉపకార వేతనానికి 3,533 దరఖాస్తులు రిజిస్ట్రేషన్ అవ్వగా, ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లకు 900 రిజిస్ట్రేషన్ అయినట్లు తెలిపారు. ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్‌లలో ఇంకా 242 మంది పిల్లల దరఖాస్తులకు సంబంధించి రిపోర్టు రావాల్సి ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరికీ ఉపకార వేతనం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యలన్నింటినీ నెల రోజుల్లో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సారి సమీక్షా సమావేశం నాటికి ఉద్యోగులకు సంబంధించిన ఇంక్రిమెంట్లు ఏ ఒక్కటీ పెండింగ్‌లో ఉండకూడదని సంబంధిత సెక్షన్ ఉద్యోగిని హెచ్చరించారు. ఉంటే మాత్రం చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ట్రైబల్ అధికారి జోజయ్య, కార్యాలయ సూపరింటెండెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు.