వసతి లేనట్టే
ఆదర్శంలో కరువైన వసతి
- నాలుగేళ్లుగా అతీగతీ లేదు
- 47 పాఠశాలలకు 25 హాస్టళ్లే పూర్తి
- విద్యార్థులపై రవాణా భారం
కరీంనగర్ ఎడ్యుకేషన్ : గ్రామీణ నిరుపేద విద్యార్థులకు ‘ఆదర్శ’ విద్య వ్యవహారం ఒక అడుగు ముందుకు... రెండడుగులు వెనక్కు అన్న చందంగా తయారైంది. నాలుగేళ్ల క్రితం ప్రారంభమైన మోడల్‌స్కూళ్లు నేటికీ హాస్టల్ వసతికి నోచుకోవడం లేదు. ఈ ఏడాది సైతం ప్రభుత్వం చేతులెత్తేసే పరిస్థితి ఉండడంతో విద్యార్థులకు రవాణాభారం తప్పేలా లేదు.
నిరుపేద విద్యార్థులకు సీబీఎస్‌ఈ తరహా విద్య అందించాలనే సదుద్దేశంతో ప్రభుత్వం నాలుగేళ్ల క్రితం మోడల్‌స్కూళ్లను ప్రారంభించింది. 6 నుంచి 12వ తరగతి వరకు ఇక్కడ బోధన అందించనున్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా మన జిల్లా 47 పాఠశాలలు మంజూరయ్యాయి. స్థల సేకరణ, భవన నిర్మాణంలో నిర్లక్ష్యంతో మేడిపల్లి, కొడిమ్యాల మండలాల్లో తరగతులు ఇప్పటికీ ప్రారంభం కాకపోగా మిగతా 45 మండలాల్లో తరగతులు ప్రారంభమయ్యాయి. మొదటినుంచే బాలబాలికలకు వేర్వేగా వసతిగృహ సదుపాయం కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వం ఆచరణలో విస్మరించింది. పూర్తిస్థాయిలో దృష్టి సారించకపోవడంతో ఇప్పటివరకు 25 పాఠశాలల్లో మాత్రమే వసతిగృహాల నిర్మాణం పూర్తయింది. 8 పాఠశాలల్లో భవన నిర్మాణాలు తుది దశలో ఉన్నాయి. మరో రెండు భవనాలు రూఫ్ స్థాయిలో, మూడు భవనాలు బేస్‌మెంట్ స్థాయిలో ఉండగా, ఎనిమిది టెండర్ దశలోనే మగ్గుతున్నాయి.
ఆదినుంచి ఇబ్బందులే...
మోడల్‌స్కూళ్లు ప్రారంభించినప్పటినుంచి ఆటుపోట్లు ఎదుర్కొంటున్నాయి. బోధన సిబ్బంది ఉన్నా బోధనేతర సిబ్బంది లేక ఇబ్బందులు తప్పడం లేదు. ప్రతీ మండలంలో ఎక్కడో ఊరు చివరన ఈ పాఠశాలలు ఏర్పాటు చేశారు. కొన్ని చోట్లనైతే బస్సులు కాదు కదా... కనీసం ఆటోలు కూడా వెళ్లే పరిస్థితి లేదు. పాఠశాలకు వెళ్లి మళ్లీ ఇంటికి రావాలంటే సాహసమే. ఊరికి దగ్గరగా ఉన్నవారు నడిచివెళ్లడమో... మిగతా వారు ప్రత్యేకంగా ఆటో మాట్లాడుకుని వెళ్లిరావడమో చేస్తున్నారు. దీంతో విద్యార్థులపై రవాణాభారం అధికంగా పడుతోంది. సమయమంతా ప్రయాణానికే సరిపోతోంది. ఈసారి కూడా హాస్టల్ సదుపాయంపై ప్రభుత్వం చేతులెత్తేసే అవకాశాలే కనిపిస్తుండడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కష్టాల మధ్య చదువు సాగించేకంటే సమీపంలోని పాఠశాలల్లో చేర్పించాలనే ఆలోచనలో ఉన్నట్లు పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.
ప్రతీ పాఠశాలకు రూ.3 కోట్లు
మోడల్‌స్కూళ్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి నిధులతో ఏర్పాటు చేశారు. రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ పథకం కింద ప్రభుత్వం ఒక్కో పాఠశాల నిర్మాణానికి రూ.3 కోట్లు కేటాయించింది. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా 75 శాతం కాగా, రాష్ట్ర ప్రభుత్వ వాటా 25 శాతం. దీనికితోడు పాఠశాల నిర్వహణ కోసం రూ.75 లక్షలు ప్రత్యేక గ్రాంటు విడుదల చేయాలని నిర్ణయించింది. ఒక్కో పాఠశాలలో ప్రయోగశాల, లైబ్రరీ, క్రీడా మైదానం, స్టాఫ్ రూంలు, బాలబాలికల వసతిగృహాలు, సిబ్బంది ఉండేందుకు వీలుగా నివాస గృహాలు ఏర్పాటు చేయాలనేది లక్ష్యం. కానీ, కేవలం పాఠశాల నిర్మాణం మినహా మిగతావన్నీ అటకెక్కాయి.