కాస్మోటిక్ చార్జీలు కరువు!
- బడులు ప్రారంభమైనా విద్యార్థులకు అందని రూ.62లు
- యూనిఫాంలకు దిక్కులేదు.. ఇబ్బంది పడుతున్న చిన్నారులు
మెదక్: వసతిగృహాల్లో ఉంటూ చదువుకునే విద్యార్థులకు ఇప్పటి వరకు కాస్మొటిక్ చార్జీలు అందలేదు. బడులు తెరచి రెండు నెలలు కావొస్తున్నా ‘సొమ్ము’ అందకపోవడంతో పేద విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతిగృహాలు దాదాపు 150 ఉన్నాయి. వీటిలో వేలాది మంది పేద విద్యార్థులు చదువుకుంటున్నారు. ఒక్కో విద్యార్థికి నెలకు ప్రభుత్వం అందించే రూ.62లతో సబ్బులు, నూనెలు, హెయిర్ కట్ చేయించుకుంటారు. ఈ నేపథ్యంలో రెండు నెలలుగా విద్యార్థులకు కాస్మొటిక్ చార్జీలు అందించడంతో మాసిన దుస్తులు, పెరిగిన జుట్టుతో పాఠశాలలకు వెళ్తున్నారు.
అంతేకాకుండా ఈ ఏడు పాఠశాలలు ప్రారంభమై రెండు మాసాలు గడుస్తున్నా విద్యార్థులకు యూనిఫామ్స్ ఇవ్వలేదు. ఫలితంగా చిరిగిన దుస్తులతో తరగతులకు హాజరవుతున్నారు. ఏటా పాఠశాలలు ప్రారంభమైన 10 రోజుల్లోనే అధికారులు యూనిఫామ్స్ అందించేవారు. వసతిగృహాల్లో చదువుతున్న విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామంటూ ప్రభుత్వం చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో అమలుకావడం లేదు. పాలకులు, అధికారులు వసతిగృహాల్లో నిద్రలు చేసిన పరిస్థితిలో ఎలాంటి మార్పు రావడం లేదు. ఈ విషయంలో ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.