రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టళ్లలో వసతులపై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం.. అవసరమైతే సైకియాట్రిస్ట్‌ను అందుబాటులో ఉంచాలని హితవు
సాక్షి, హైదరాబాద్: సర్కార్ వసతి గృహాల్లో ఉంటూ చదువుకుంటున్న వారంతా పేద కుటుంబాలకు చెందిన చిన్నారులని, వారి కోసం మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేసింది. వసతి గృహాల్లో పరుపులు, బెడ్‌షీట్లు, టవల్స్ అందించాలని, పాఠశాలల్లో కూడా విద్యార్థుల సంఖ్యకు తగినట్లు టాయిలెట్లు, బాత్‌రూమ్‌లు నిర్మించాలని సూచించింది. వీటన్నింటిపై జనవరి 22లోగా స్థాయీనివేదిక అందజేయాలంటూ విచారణను వాయిదా వేసింది.
ప్రభుత్వ పాఠశాలల్లో అందించే మధ్యాహ్న భోజనంలో నాణ్యతాప్రమాణాలు పాటించడం లేదని, ప్రైవేట్ బడుల్లో ఫీజు నియంత్రణకు కమిటీని నియమించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హెల్ప్ ది పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు కీతినీడి అఖిల్ శ్రీ గురు తేజ 2023లో హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాస్‌రావు ధర్మాసనం గురువారం మరోసారి విచారణ చేపట్టింది.
పిటిషనర్ తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపిస్తూ.. రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థులు ఖైదీలుగా ఉంటున్నారన్నారు. వారికి అందించే సౌకర్యాల విషయంలో ప్రభుత్వాలు చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని చెప్పారు. విద్యార్థులకు కల్పించాల్సిన వసతులపై ఆయన ఓ చార్ట్‌ను ధర్మాసనానికి సమర్పించారు.
దీనికి ధర్మాసనం న్యాయవాదిని అభినందిస్తూ, వీటిని వీలైనంత త్వరగా కల్పించేలా చూడాలని అడిషనల్ అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) ఇమ్రాన్‌ఖాన్‌కు సూచించింది. ప్రభుత్వ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో పిల్లలకు సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఏఏజీ చెప్పారు.
ధర్మాసనం పేర్కొన్న అంశాలివీ...
» ప్రభుత్వ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలల్లోని విద్యార్థులకు పరుపులు, దుప్పట్లు, బెడ్‌షీట్‌లు, దిండు, దోమతెర, కాటన్ టవల్స్ అందించాలి.
» విద్యార్థులకు శుద్ధి చేసిన తాగునీటిని మాత్రమే సరఫరా చేయాలి.
» నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ గైడ్‌లైన్స్ ప్రకారం మెనూ ఇవ్వాలి.
» విద్యార్థులకు సైకియాట్రిస్ట్/కౌన్సిలర్ అందుబాటులో ఉండాలి.
Comments
Please login to add a commentAdd a comment