Cosmetic charges
-
నిధులున్నా.. నిర్లక్ష్యమే...
సాక్షి, విజయనగరం అర్బన్: ఓ వైపు సర్కారు విద్యకు పెద్ద పీట వేస్తూ... అందులోని విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఆదేశిస్తుంటే... జిల్లా అధికారులు నిర్లక్ష్యం వల్ల కేజీబీవీ విద్యార్థినులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పేదరికంతో డ్రాపౌట్లుగా మారిన విద్యార్థినుల కోసం కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాల(కేజీబీవీ)ను నెలకొల్పారు. వారిపై ఎలాంటి ఆర్థిక భారం మోపకూడదనేది ప్రభుత్వ లక్ష్యం. కానీ జిల్లా అధికారుల నిర్వహణ లోపం వల్ల విద్యార్థినులే కాస్మొటిక్ చార్జీలు భరించాల్సి వస్తోంది. విద్యాసంవత్సరం ప్రారంభంలో విద్యార్థినులకు వసతితోపాటు స్టేషనరీ, కాస్మొటిక్ చార్జీలు వంటివాటిని యంత్రాంగం అందించాల్సి ఉంది. కానీ పాఠశాలలు పునఃప్రారంభమై నాలుగునెలలు కావస్తున్నా జిల్లా సర్వశిక్షాభియాన్ వాటిని అందివ్వలేదు. ఇందుకు సంబంధించిన నిధులు రెండు నెలల క్రితమే జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినా... పర్చేజింగ్ టెండర్ చేపట్టడంలో జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. సర్కారు చొరవ చూపుతున్నా... జిల్లాలో మొత్తం 33 కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు ఉన్నాయి. అందులో 6,500 మంది విద్యనభ్యసిస్తున్నారు. ప్రవేశం పొందిన విద్యార్థినికి రెండు జతల యూనిఫాం, పాదరక్షలు, స్టేషనరీ, వారికి అవసరమైన నోట్ పుస్తకాలు, ప్లేట్లు, పెట్టెలు, కాస్మొటిక్ వస్తువులు, పాఠ్యపుస్తకాలు వంటివి విద్యాలయాల్లోనే ఇవ్వాలి. తొలుత జిల్లా స్థాయిలోని పర్చేజింగ్ కమిటీల ద్వారానే కొనుగోలు చేసి జూన్ నెలలోనే వాటిని పంపిణీ చేసేవారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రస్థాయిలో టెండర్లు వేసి అన్ని జిల్లాలకు పంపి ణీ చేశారు. దానివల్ల ఆలస్యం అవుతోందని, ప్రస్తుత ప్రభుత్వం జిల్లా స్థాయిలోనే పర్చేజ్ చేసుకోమని రెండు నెలల క్రితమే నిధులు కేటాయించింది. టెండర్ల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ఒక్కో విద్యార్థినికి కాస్మొటిక్ వస్తువుల కోసం నెలకు రూ.125, శానిటరీ నాప్కిన్స్ కోసం నెలకు రూ.35లు ఇవ్వాలని ఆదేశించారు. కానీ జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగా నాలుగునెలలవుతున్నా టెండర్ ఊసే లేదు. కనీసం డబ్బులు చెల్లించలేదు. విద్యార్ధినులు తమకు అవసరమైన వస్తువులను సొంత డబ్బు వెచ్చించి బయటే కొనుగోలు చేసుకోవాల్సి వస్తోంది. విద్యార్థినులపై రూ. 41.6లక్షల భారం జిల్లాలో 33 కేజీబీవీల్లో 6,500 మంది విద్యార్థినులున్నారు. గడిచిన నాలుగు నెలల్లో వారు నెలకు కాస్మొటిక్ వస్తువులకోసం రూ.125, శానిటరీ నాప్కిన్స్కి రూ.35 వంతున రూ.41.6 లక్షల ఆర్థిక భారం మో యాల్సి వచ్చింది. కాస్మొటిక్ వస్తువులు పంపిణీ అయ్యేంతవరకు దుస్తులు శుభ్రపర్చుకోవడానికి నెలకు మూడు సబ్బులు, స్నానం సబ్బులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. పేస్టులు, తలకు కొబ్బరి నూనె, ముఖానికి రాసుకునేందుకు పౌడర్ డబ్బాలు, షాంపూలు, బ్రష్‌లు కొనుగోలు చేయాలి. అయితే నాలుగునెలలుగా వీటికి డబ్బులు రాకపోవడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పర్చేజింగ్ టెండర్ దశలో ఉంది.. కాస్మొటిక్ కిట్స్ పర్చేజింగ్ బాధ్యత గతంలో రాష్ట్రస్థాయిలో ఉండేది. ప్రస్తుత ప్రభుత్వం జిల్లా పర్చేజింగ్ కమిటీకి అప్పగించిం ది. నిధులు వచ్చి రెండునెలలు అయింది. గిరిజన ఉత్పత్తులు కొనుగోలు కోసం ప్రయత్నిస్తున్నాం. అందుకే ఆలస్యం అవుతోంది. ప్రస్తుతం వాటి కొనుగోలుకు సంబంధించిన పర్చేజింగ్ టెండర్ దశలో ఉంది. – ఎం.కృష్ణమూర్తినాయుడు, పీఓ, ఎస్ఎస్ఏ బయట షాపుల్లో కొని తెచ్చుకుంటున్నాం కాస్మొటిక్ వస్తువులు ఇవ్వడంలేదు. పాఠశాల ప్రారంభం నుంచి ఆ వస్తువులను ఇంటిదగ్గర నుంచి డబ్బులు తెచ్చుకొని బయట కొనుక్కుంటున్నాను. కొందరికి డబ్బులు లేక అవస్థలు పడుతున్నారు. త్వరగా ఇస్తే బాగుంటుంది. – బి.వి.లక్ష్మి, 9వ తరగతి, విజయనగరం కేజీబీవీ. -
‘కాస్మొటిక్’ వెతలు!
ఆదిలాబాద్‌రూరల్: అమ్మానాన్నలకు దూరంగా ఉండి.. చదువే లక్ష్యంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సంక్షేమ వసతి గృహాల విద్యార్థులు. ప్రభుత్వం హాస్టళ్లలో వసతులు కల్పిస్తున్నట్లు పేర్కొనడం కేవలం ప్రకటనలకే పరిమితమవుతోంది. ప్రభుత్వం విద్యార్థులకు సరిపడా కాస్మొటిక్ చార్జీలు చెల్లించకపోవడంతో ఆయా వసతిగృహ విద్యార్థులు విద్యపై దృష్టి సారించలేకపోతున్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా చార్జీలేవి..! ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వసతి గృహాల్లో ప్రైవేటుకు దీటుగా కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన విద్యతో పాటు సౌకర్యాలు కల్పిస్తామని చెబుతున్నా ఆచరణలో అవి కనిపించడం లేదని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ఆయా వసతిగృహాల్లో చదువుతున్న పేద విద్యార్థులకు కాస్మొటిక్ చార్జీలు ప్రభుత్వం చెల్లించడం లేదు. దీంతో వారు అనేక ఇబ్బందులకు గురై చదువుపై శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. ప్రభుత్వం విద్యార్థుల ఖర్చులకు సరిపడా చార్జీలు అందించకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతినెలా వాటిని కొనుగోలు చేస్తుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులపై అదనపు భారం పడుతోంది. కడు పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న కొంతమంది తల్లిదండ్రులు పిల్లల జీవితాలు చదువుతోనే బాగుపడుతాయని భావించి ప్రభుత్వ వసతిగృహాల్లో చేర్పిస్తున్నారు. అక్కడ విద్యార్థుల ఖర్చులకు నెలనెలా డబ్బులు పంపించాల్సి వస్తుండడంతో ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాస్మొటిక్ చార్జీలు ఇలా.. జిల్లాలో ఎస్సీ బాలుర 19 వసతి గృహాలు ఉండగా, ఇందులో 821 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. బీసీ ప్రీమెట్రిక్ 9 వసతిగృహాలు ఉండగా 573 మంది చదువుతున్నారు. గిరిజన వసతి గృహాలు 38 ఉండగా ఇందులో 10,621 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. బాలురకు కాస్మొటిక్ చార్జీల కింద నెలకు రూ.62 చెల్లిస్తున్నారు. ఆయా వసతి గృహాల్లో చదువుతున్న బాలుర విద్యార్థులకు కాస్మొటిక్ చార్జీల కింద ప్రభుత్వం నెలకు రూ.62 అందజేస్తుంది. ఇందులో విద్యార్థి రూ.50 తో సబ్బులు, నూనెలు, టూత్‌పేస్ట్, పౌడర్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు హెయిర్ కటింగ్‌కు రూ.12 చెల్లిస్తుంది. ఎస్సీ, బీసీ వసతిగృహాల కాస్మొటిక్ చార్జీలను నేరుగా విద్యార్థులకు అందజేస్తారు. కాగా ఐటీడీఏ పరిధిలోని వసతి గృహాల విద్యార్థులకు సంబంధించి కాస్మొటిక్ చార్జీలను టెండర్ ద్వారా అందజేస్తారు. కటింగ్ చార్జీలకు సంబంధించిన సొమ్మును సంబంధిత వసతిగృహ ప్రధానోపాధ్యాయుడి ఖాతాలో జమ చేస్తారు. అయితే ప్రభుత్వం చెల్లిస్తున్న చార్జీలతో నాయీ బ్రాహ్మణులు హెయిర్ కటింగ్ చేయడానికి ముందుకు రావడం లేదు. ప్రభుత్వం చెల్లిస్తున్న డబ్బులు నిత్యవసర వస్తువుల ధరలకు అనుగుణంగా లేకపోవడం, బయట మార్కెట్లో హెయిర్ కటింగ్‌కు ఒక విద్యార్థికి రూ.40 నుంచి రూ.50 తీసుకుంటుండడంతో ఇవి ఎటూ సరిపోవడం లేదని విద్యార్థులు పేర్కొంటున్నారు. ఈ విషయమై ఆయా వసతి గృహ నిర్వాహకులకు తెలియజేసినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో ఇటీవల జిల్లా కేంద్రంలోని ఓ వసతిగృహ విద్యార్థులు ఒకరికొకరు క్షవరం (హెయిర్ కటింగ్) చేసుకోవడం సంచలనం కలిగించింది. లోపిస్తున్న నాణ్యత.. ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు కాంట్రాక్టర్ల ద్వారా సరఫరా చేస్తున్న కాస్మొటిక్లలో నాణ్యత లోపిస్తోందనే విమర్శలున్నాయి. కాంట్రాక్టు దక్కించుకునే సమయంలో నాణ్యతగల వస్తువులను చూపించిన కాంట్రాక్టర్లు తీరా నాసిరకం వస్తువులు సరఫరా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. అధికారులు సైతం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాస్మొటిక్ కిట్ మాదిరిగా పంపిణీ చేయాలి.. వసతి గృహాల్లోని విద్యార్థులకు కేసీఆర్ కిట్ అందిస్తున్న విధంగానే బాలుర వసతిగృహ విద్యార్థులకు సైతం కిట్లాగా అందజేస్తే బాగుంటుంది. ప్రభుత్వం చెల్లిస్తున్న చార్జీలు విద్యార్థులకు సరిపోవడం లేదు. ఈ విషయంపై ప్రభుత్వం దృష్టిసారించాలి. – శివకుమార్, హెచ్‌డబ్ల్యూవో, బీసీ హాస్టల్, ఆదిలాబాద్ చార్జీలు సరిపోవడంలేదు ప్రస్తుతం ప్రభుత్వం అందజేస్తున్న కాస్మొటిక్ చార్జీలు రూ.62 సరిపోవడంలేదు. పెరిగిన నిత్యవసర ధరలకు అనుగుణంగా చార్జీలు పెంచాలి. హెయిర్ కటింగ్ కోసం ప్రభుత్వం రూ.12 మాత్రమే చెల్లిస్తుంది. కటింగ్ కోసం బయట రూ.40 నుంచి రూ.50 చెల్లించాల్సి వస్తోంది. దీంతో ఆర్థికంగా భారమవుతోంది. – సాయికృష్ణ, బీసీ హాస్టల్ విద్యార్థి, ఆదిలాబాద్ ప్రతిపాదనలు పంపించాం ప్రీమెట్రిక్ బాలుర వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రస్తుతం కాస్మొటిక్ చా ర్జీల కింద ఒక్కొక్కరికి నెలకు రూ.62 అందజేస్తున్నాం. ఇందులో హెయిర్ కటింగ్ కోసం రూ.12, మిగితా రూ.50తో సబ్బులు, పౌడర్, నూనె కొనుగోలు చేసేందుకు అం దిస్తుంది. విద్యార్థినులకు కాస్మొటిక్ కిట్లు అందజేస్తున్నట్లుగా బాలురకు కూడా అందించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. – ఆశన్న, జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారి -
గురుకులాలకు ‘కేసీఆర్ కాస్మెటిక్ కిట్లు’
సాక్షి, హైదరాబాద్: గురుకుల పాఠశాలల్లో చదివే విద్యార్థులకు శుభవార్త. ఏళ్లుగా ఇబ్బందులు పెడుతున్న కాస్మొటిక్ చార్జీల సమస్యకు ప్రభుత్వం పరిష్కారాన్నిచ్చింది. ఇప్పటివరకు ఇస్తున్న కాస్మొటిక్ చార్జీలకు బదులుగా వస్తువులు సరఫరా చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు త్వరలో సాంఘిక సంక్షేమ గురుకులాలతో పాటు గిరిజన సంక్షేమం, వెనుకబడిన తరగతులు, మైనార్టీ సంక్షేమ శాఖల పరిధిలోని గురుకులాల్లో ఒకే తరహా కాస్మొటిక్ వస్తువులను సరఫరా చేయనున్నారు. ఈ వస్తువులన్నింటినీ ఒక కిట్టు రూపంలోకి తీసుకొచ్చిన అధికారులు ‘కేసీఆర్ కిట్స్’ పేరిట విద్యార్థులకు ఇచ్చేందుకు చర్యలు వేగవంతం చేశారు. ప్రయోగాత్మకంగా ఒకట్రెండు గురుకులాల్లో పంపిణీ కూడా చేశారు. నెలాఖరులోగా అన్ని గురుకులాలకు ఈ కిట్లను పూర్తిస్థాయిలో పంపిణీ చేయనున్నారు. ఏళ్లుగా నలుగుతున్న సమస్య ప్రస్తుతం రాష్ట్రంలో 487 గురుకుల పాఠశాలలున్నాయి. ఇందులో 134 సాంఘిక సంక్షేమ, 51 గిరిజన సంక్షేమ, 160 మైనారిటీ సంక్షేమ, 142 బీసీ సంక్షేమ గురుకులాలు ఉన్నాయి. వీటిల్లో సుమారు రెండు లక్షల మంది విద్యార్థులున్నారు. వీరికి ప్రతి నెలా రూ.75 చొప్పున కాస్మొటిక్ చార్జీల కింద చెల్లిస్తున్నారు. ఈ మొత్తంతో విద్యార్థులు తమకు అవసరమైన సబ్బులు, టాల్కం పౌడర్, టూత్ పేస్ట్, శాంపూల వంటి వస్తువులను బయటినుంచి కొనుగోలు చేస్తున్నారు. కాగా, ఈ మొత్తాన్ని పెంచాలని గత పదేళ్లుగా పలుమార్లు నిరసనలు వ్యక్తమైనప్పటికీ ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. కాగా, 2017–18 బడ్జెట్ సమావేశాల సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కాస్మొటిక్ చార్జీల విషయంలో కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు చేశారు. మంత్రుల కమిటీ సూచనల మేరకు కిట్ల రూపంలో వస్తువులు ఇవ్వాలని సంక్షేమ శాఖలు ప్రతిపాదించాయి. ఇందుకు ప్రభుత్వం ఆమోదం తెలపడంతో విద్యా ర్థులకు సరికొత్తగా కిట్లు ఇచ్చేందుకు మార్గం సుగమమైంది. ఇప్పటి వరకు చెల్లిస్తున్న చార్జీలతో పోలిస్తే ఒక్కో కిట్టుపై నాలుగు రెట్లు అధికంగా ఖర్చు చేయనున్నారు. మూణ్ణెళ్లకోసారి పంపిణీ ఈ కిట్లు నెలవారీగా పంపిణీ చేయడం యంత్రాంగానికి భారం కానుండడంతో మూడు నెలలకు సరిపడా ఒకేసారి పంపిణీ చేసేలా కార్యాచరణ రూపొందించారు. విద్యార్థికి పంపిణీ చేసిన తేదీ నుంచి మూడు నెలలు నిండిన వెంటనే వీటిని అందిస్తారు. విద్యార్థులు ఇబ్బందులు పడకుండా కొంతమేర అదనపు కోటాను గురుకులంలో సైతం అందుబాటులో ఉంచేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. -
కాస్మొటిక్ కష్టాలు!
వెల్దుర్తి రూరల్: తలకు నూనె ఉండదు..ముఖం శుభ్రం చేసుకోవడానికి సబ్బు దొరకదు..చెమట వాసన వస్తున్న దుస్తులను ఉతుక్కోవడానికి కష్టమే..వసతిగృహాల్లో ఉండే విద్యార్థుల కష్టాలు ఇవీ. కాస్మొటిక్ చార్జీలు చెల్లిస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నా..వాస్తవం భిన్నంగా ఉంటోంది. ప్రభుత్వం ఇచ్చే చాలీచాలని డబ్బుతో విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రతకు దూరమవుతున్నారు. మాసిన దుస్తులు, చింపిరి జుట్టుతో హాస్టల్ విద్యార్థులు కునారిల్లుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే చార్జీలు సరిపడక ప్రతినెలా తల్లిదండ్రుల నుంచి ఎంతో కొంత తెప్పించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. పాతకాలపు ధరలతో... ప్రతినెలా విద్యార్థులకు ఒక్కో చోట ఒక్కో రకంగా కాస్మొటిక్ చార్జీలను చెల్లిస్తున్నారు. అవి ఎందుకూ సరిపోవడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. దుస్తులు ఉతుక్కోవడానికి మూడు సబ్బులు, స్నానానికి రెండు సబ్బులు, పేస్టు, బ్రష్‌లు, తలకు నూనె, షాంపులు, కటింగ్, ఇతరత్రా ఖర్చులు కలిపి ప్రతి బాలునికి కనీసం రూ.150కి మించి ఖర్చవుతోంది. అదే బాలికలకు వీటన్నిటితో పాటు పౌడర్, తిలకం, అదనంగా నూనె, నాప్కిన్ల ఖర్చు అంటూ రూ.200కు మించుతోంది. వాస్తవ ఖర్చు ఇలా ఉంటే పాతకాలపు ధరలతో కాస్మొటిక్ చార్జీలు చెల్లిస్తున్నారు. నాసిరకం నాప్కిన్లు బాలికలకు పీహెచ్‌సీల ద్వారా ఇటీవలే నాప్కిన్లు సరఫరా చేశారు. అయితే అవి నాసిరకంగా ఉండడంతో బాలికలు తిరస్కరిస్తున్నారు. నాసిరకాన్ని సైతం రూ.8కు అంటగట్టడం ప్రభుత్వానికే చెల్లిందనే విమర్శలు ఉన్నాయి. పదిరోజులకే అయిపోతాయి మాకు నెలకిచ్చే రూ.50 పదిరోజులకే అయిపోతాయి. ఇంటికాట్నుంచి డబ్బు తెప్పించుకోవాల. అమ్మా, నాయన కూడా ఏందిరా ఇది అంటారు. చెప్పులు తెగిపోతే కూడా కుట్టించుకోలేం. సారోళ్లు చూస్తే డ్రస్సు బాగుండాల, అది బాగుండాల, ఇది బాగుండాల అంటారు. ఈ డబ్బులతో అన్నీ ఎట్ల బాగుంటాయి. – డేవిడ్ రాజు,10వ తరగతి, ఎస్సీ బాలుర హాస్టల్, వెల్దుర్తి ఇంట్లో డబ్బులు అడగాల్సి వస్తోంది మాకిచ్చే రూ.75 తీసుకుని మార్కెట్కుపోతే ఏమీ రావు. ఇంట్లో వాళ్లని డబ్బులు అడగక తప్పదు. అమ్మా, నాన్న రావాలన్నా కూలిడిసిపెట్టాలి. రానీక పోనీక మళ్లా ఖర్చులు. కాస్మొటిక్ చార్జీలు పెంచాలని..మా హాస్టల్‌కు వచ్చిన సారోళ్లకు అడుగుతూనే ఉన్నాం..ఎవరూ వినడంలేదు. – శ్రీలక్ష్మి, 9వ తరగతి, బీసీ బాలికల హాస్టల్, వెల్దుర్తి డబ్బులు సరిపోవు హాస్టల్ విద్యార్థులకు ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చే కాస్మొటిక్ చార్జీలు ఏమాత్రం సరిపోవు. జూన్ నుంచి పెంచుతామన్న ప్రభుత్వం ఇంతవరకు పెంచలేదు. పరిశుభ్రతకు పెద్దపీట అంటున్న ప్రభుత్వం.. విద్యార్థుల దయనీయస్థితిని గమనించి వెంటనే కాస్మొటిక్ చార్జీలు పెంచాలి. – దొరస్వామి, వెల్దుర్తి ఎస్సీ బాలుర హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ డబ్బులు సరిపోవు హాస్టల్ విద్యార్థులకు ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చే కాస్మొటిక్ చార్జీలు ఏమాత్రం సరిపోవు. జూన్ నుంచి పెంచుతామన్న ప్రభుత్వం ఇంతవరకు పెంచలేదు. పరిశుభ్రతకు పెద్దపీట అంటున్న ప్రభుత్వం.. విద్యార్థుల దయనీయస్థితిని గమనించి వెంటనే కాస్మొటిక్ చార్జీలు పెంచాలి. – దొరస్వామి, వెల్దుర్తి ఎస్సీ బాలుర హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ -
కాస్మొటిక్ చార్జీల పెంపు లేనట్లే..!
⇔ తొమ్మిదేళ్ల క్రితం పెరిగిన కాస్మొటిక్ చార్జీలు ⇔ పెరిగిన ధరలతో సంక్షేమ విద్యార్థులకు ఇబ్బందులు ⇔ బడ్జెట్లో మెస్ చార్జీల పెంపుతో సరిపెట్టిన ప్రభుత్వం ⇔ కాస్మొటిక్ చార్జీలపై దాటవేత.. అటకెక్కిన ప్రతిపాదనలు సాక్షి, హైదరాబాద్: కాస్మొటిక్ చార్జీల విషయంలో సంక్షేమ వసతిగృహ విద్యార్థులకు నిరాశే మిగిలింది. ఇటీవల బడ్జెట్ సమావేశా ల్లో హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం.. కాస్మొటిక్ చార్జీల ఊసు ఎత్తలేదు. దీంతో ఈ పెంపు కోసం ఏళ్లుగా చూస్తున్న విద్యార్థులు.. పాత చార్జీలతోనే సర్దుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తొమ్మిదేళ్లుగా అవే చార్జీలు.. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల పరిధిలో 1,650 వసతిగృహాలు ఉన్నాయి. వీటి పరిధిలో 2.89 లక్షల మంది విద్యార్థులున్నారు. సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థులకు రెండు కేటగిరీల్లో కాస్మొటిక్ చార్జీలను ప్రభుత్వం అందిస్తోంది. ప్రతి నెలా ఏడో తరగతిలోపు ఉన్న బాలికలకు రూ.55, పదో తరగతిలోపున్న బాలికలకు రూ.75 చొప్పున ఇస్తోంది. అలాగే ఐదు నుంచి పదో తరగతి లోపు బాలురకు కాస్మొటిక్ చార్జీల కింద రూ.50, హెయిర్ కటింగ్ కోసం రూ.12 చొప్పున మొత్తం రూ.62 అందిస్తోంది. తొమ్మిదేళ్లుగా ఒకే రకమైన చార్జీలు ఇస్తుండటం.. మారిన పరిస్థితులకు అనుగుణంగా చార్జీలు పెరగకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. హెయిర్ కటింగ్‌కు నెలకు రూ.12 ఇవ్వడంతో చాలా హాస్టళ్లలోని విద్యార్థులు రెండు, మూడు నెలలకోసారి హెయిర్ కటింగ్ చేయిస్తున్నారు. కాస్మొటిక్ చార్జీల కింద ఇచ్చే మొత్తంతో సబ్బులు, నూనె, పౌడర్ తదితర వస్తువులు కొనుగోలు చేయాలి. కానీ ప్రభుత్వం అత్తెసరు చార్జీలు ఇవ్వడంతో విద్యార్థులు నాణ్యతలేని సబ్బులవైపు చూస్తున్నారు. కొందరైతే శరీరానికి, బట్టలు ఉతికేందుకు ఒకే సబ్బును వినియోగిస్తున్నారు. బాలికల విషయంలోనూ ఇలాంటి ఇబ్బందులే ఉన్నాయి. ప్రభుత్వం నుంచి స్పందన కరవు.. సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థుల కాస్మొటిక్ చార్జీలను 2008–09 విద్యాసంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పెంచారు. అప్పట్లో అమల్లో ఉన్న చార్జీలను రెట్టింపు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ తర్వాత చార్జీల పెంపు కోసం విద్యార్థి సంఘాలు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచినా పెంపుపై స్పష్టత ఇవ్వలేదు. అనంతరం రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. తాజా బడ్జెట్ సమావేశాల సందర్భంగా సంక్షేమ శాఖలు మెస్ చార్జీలు, కాస్మొటిక్ చార్జీల పెంపుపై ప్రతిపాదనలు సిద్ధం చేశాయి. బాలురకు కనిష్టంగా రూ.125, బాలికలకు రూ.200 చొప్పున ఇచ్చేలా ప్రతిపాదనలు తయారు చేసి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలోని మంత్రుల బృందానికి సమర్పించాయి. అయితే మెస్ చార్జీల పెంపుపై సీఎం కేసీఆర్ శాసనసభలో ప్రకటన చేసినప్పటికీ కాస్మొటిక్ చార్జీల పెంపు ఊసెత్తలేదు. ఆ తర్వాత ప్రత్యేక ప్రకటన చేస్తారని భావించినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. దీంతో ఈ ఏడాది కాస్మొటిక్ చార్జీలు పెరిగే అవకాశం లేదని స్పష్టమవుతోంది. -
కిరాణంలో ఖాతా!
హాస్టళ్ల విద్యార్థులకు అందని కాస్మొటిక్ చార్జీలు బీసీ, ఎస్సీ వసతి గృహాలకు ఏడు నెలలుగా విడుదల కాని నిధులు గిరిజన ఆశ్రమ పాఠశాలకు నాలుగు నెలలుగా మొండిచేయి నర్సంపేట : వారంతా నిరుపేద విద్యార్థులు. ఆర్థిక సమస్యల కారణంగా కన్నవారికి దూరంగా వసతి గృహాల్లో ఉంటూ చదువుకుంటున్నారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఉంటున్న విద్యార్థులకు నాలుగు నెలలుగా, బీసీ, ఎస్టీ హాస్టళ్లలోని విద్యార్థులకు ఏడు నెలలుగా కాస్మొటిక్ చార్జీలు చెల్లించడం లేదు. అంటే విద్యాసంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి వీరికి డబ్బు అందలేదు. దీంతో సబ్బుకు బదులు బియ్యపు పిండితో స్నానం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. మరికొన్ని చోట్ల ఒకే సబ్బును సగం చేసుకుంటూ ముగ్గురు చొప్పున వాడుకోవాల్సిన దుస్థితి! ఇక విద్యార్థుల్లో మరికొందరు సబ్బు లేకుండా నల్లాల కింద స్నానం చేస్తుండగా.. ఇంకొందరు కటింగ్ ఖర్చులు లేక పెరిగిన జుట్టుతో పాఠశాలలకు వెళ్తున్నారు. తల్లిదండ్రుల ఆర్థిక ఇబ్బందులను చూస్తూ డబ్బు అడగలేక.. ప్రభుత్వం నుంచి నిధులు రాక పూట ఎలా గడవాలో తెలియక విద్యార్థులు పడుతున్న అవస్థలు అన్నీఇన్నీ కావు. నాలుగు నెలలకోసారి... బడులకు దూరమవుతున్న నిరుపేద పిల్లలకు ఆశ్రయం కల్పిస్తూ చదువుకునేందుకు వీలుగా ప్రభుత్వం సంక్షేమ వసతిగృహాలను ఏర్పాటు చేసింది. ఇక్కడ వీరికి భోజనం, వసతి సౌకర్యం కల్పిస్తోంది. అయితే, ప్రభుత్వాల అలసత్వం.. అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా సౌకర్యాలు సమకూరక ఏటా విద్యార్థులు అవస్థలు పడుతూనే ఉన్నారు. విద్యార్థులకు సబ్బులు, కొబ్బరినూనె, పౌడర్ వంటి కనీస అవసరాల కోసం ప్రతీ నెల రూ.50తో పాటు కటింగ్ చేసుకోవడానికి ప్రత్యేకంగా రూ.12 అందజేయాల్సి ఉంటుంది. ఇక ఆడ పిల్లలకు ఏడో తరగతి వరకు రూ.55, ఆ తర్వాత వారికి రూ. 75 అందించాలి. కానీ ప్రతీ నాలుగు నెలలకోసారి ఇచ్చే ఈ డబ్బు ఈసారి సక్రమంగా అందకపోవడం గమనార్హం. గ్రూప్‌గా ఉద్దెర.. తల్లిదండ్రులు పేదరికంలో ఉండి హాస్టల్‌కు పంపించగా ప్రభుత్వం ఇవ్వాల్సిన కాస్మోటిక్ బిల్లులు రాకపోవడంతో విద్యార్థులు కొబ్బరినూనె, సబ్బు వంటి కనీస అవసరాల కోసం ఇబ్బంది పడుతున్నారు. దీంతో పలువురు గ్రూప్‌గా ఏర్పడి సమీపంలోని కిరాణం షాపుల్లో ఖాతాలు పెట్టి సబ్బు, కొబ్బరినూనె తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం పెరిగిన ధరలతో పోల్చితే సంక్షేమ వసతిగృహాల్లో ఉండే విద్యార్థులకు ప్రభుత్వం అందజేసే నగదు ఏ మూలకు సరిపోదు. ప్రస్తుతం ఏ కంపెనీ సబ్బు ధర చూసినా రూ.20కి పైగానే ఉంది. పౌడర్, కొబ్బరినూనె కోసం రూ.50వరకు కావాలి. కానీ ఇచ్చే అరకొర నగదు కూడా సక్రమంగా ఇవ్వకపోవడంతో విద్యార్థులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. వరంగల్ రూరల్ జిల్లాలో ఎస్సీ వసతి గృహాలు : 15 విద్యార్థులు : 689 బీసీ వసతి గృహాలు : 18 విద్యార్థులు : 1,876 ఎస్టీ వసతి గృహాలు : 08 విద్యార్థులు : 1,488 22 ఎన్ఎస్పీ 02 : కాస్మోటిక్ బిల్లులు రాలేదని చెబుతున్న హాస్టల్ విద్యార్థినులు -
కాస్మోటిక్ చార్జీలు కరువు!
బడులు ప్రారంభమైనా విద్యార్థులకు అందని రూ.62లు యూనిఫాంలకు దిక్కులేదు.. ఇబ్బంది పడుతున్న చిన్నారులు మెదక్: వసతిగృహాల్లో ఉంటూ చదువుకునే విద్యార్థులకు ఇప్పటి వరకు కాస్మొటిక్ చార్జీలు అందలేదు. బడులు తెరచి రెండు నెలలు కావొస్తున్నా ‘సొమ్ము’ అందకపోవడంతో పేద విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతిగృహాలు దాదాపు 150 ఉన్నాయి. వీటిలో వేలాది మంది పేద విద్యార్థులు చదువుకుంటున్నారు. ఒక్కో విద్యార్థికి నెలకు ప్రభుత్వం అందించే రూ.62లతో సబ్బులు, నూనెలు, హెయిర్ కట్ చేయించుకుంటారు. ఈ నేపథ్యంలో రెండు నెలలుగా విద్యార్థులకు కాస్మొటిక్ చార్జీలు అందించడంతో మాసిన దుస్తులు, పెరిగిన జుట్టుతో పాఠశాలలకు వెళ్తున్నారు. అంతేకాకుండా ఈ ఏడు పాఠశాలలు ప్రారంభమై రెండు మాసాలు గడుస్తున్నా విద్యార్థులకు యూనిఫామ్స్ ఇవ్వలేదు. ఫలితంగా చిరిగిన దుస్తులతో తరగతులకు హాజరవుతున్నారు. ఏటా పాఠశాలలు ప్రారంభమైన 10 రోజుల్లోనే అధికారులు యూనిఫామ్స్ అందించేవారు. వసతిగృహాల్లో చదువుతున్న విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామంటూ ప్రభుత్వం చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో అమలుకావడం లేదు. పాలకులు, అధికారులు వసతిగృహాల్లో నిద్రలు చేసిన పరిస్థితిలో ఎలాంటి మార్పు రావడం లేదు. ఈ విషయంలో ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.