కిరాణంలో ఖాతా!
హాస్టళ్ల విద్యార్థులకు అందని కాస్మొటిక్ చార్జీలు
బీసీ, ఎస్సీ వసతి గృహాలకు ఏడు నెలలుగా విడుదల కాని నిధులు
గిరిజన ఆశ్రమ పాఠశాలకు నాలుగు నెలలుగా మొండిచేయి
నర్సంపేట : వారంతా నిరుపేద విద్యార్థులు. ఆర్థిక సమస్యల కారణంగా కన్నవారికి దూరంగా వసతి గృహాల్లో ఉంటూ చదువుకుంటున్నారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఉంటున్న విద్యార్థులకు నాలుగు నెలలుగా, బీసీ, ఎస్టీ హాస్టళ్లలోని విద్యార్థులకు ఏడు నెలలుగా కాస్మొటిక్ చార్జీలు చెల్లించడం లేదు. అంటే విద్యాసంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి వీరికి డబ్బు అందలేదు. దీంతో సబ్బుకు బదులు బియ్యపు పిండితో స్నానం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. మరికొన్ని చోట్ల ఒకే సబ్బును సగం చేసుకుంటూ ముగ్గురు చొప్పున వాడుకోవాల్సిన దుస్థితి! ఇక విద్యార్థుల్లో మరికొందరు సబ్బు లేకుండా నల్లాల కింద స్నానం చేస్తుండగా.. ఇంకొందరు కటింగ్ ఖర్చులు లేక పెరిగిన జుట్టుతో పాఠశాలలకు వెళ్తున్నారు. తల్లిదండ్రుల ఆర్థిక ఇబ్బందులను చూస్తూ డబ్బు అడగలేక.. ప్రభుత్వం నుంచి నిధులు రాక పూట ఎలా గడవాలో తెలియక విద్యార్థులు పడుతున్న అవస్థలు అన్నీఇన్నీ కావు.
నాలుగు నెలలకోసారి...
బడులకు దూరమవుతున్న నిరుపేద పిల్లలకు ఆశ్రయం కల్పిస్తూ చదువుకునేందుకు వీలుగా ప్రభుత్వం సంక్షేమ వసతిగృహాలను ఏర్పాటు చేసింది. ఇక్కడ వీరికి భోజనం, వసతి సౌకర్యం కల్పిస్తోంది. అయితే, ప్రభుత్వాల అలసత్వం.. అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా సౌకర్యాలు సమకూరక ఏటా విద్యార్థులు అవస్థలు పడుతూనే ఉన్నారు. విద్యార్థులకు సబ్బులు, కొబ్బరినూనె, పౌడర్ వంటి కనీస అవసరాల కోసం ప్రతీ నెల రూ.50తో పాటు కటింగ్ చేసుకోవడానికి ప్రత్యేకంగా రూ.12 అందజేయాల్సి ఉంటుంది. ఇక ఆడ పిల్లలకు ఏడో తరగతి వరకు రూ.55, ఆ తర్వాత వారికి రూ. 75 అందించాలి. కానీ ప్రతీ నాలుగు నెలలకోసారి ఇచ్చే ఈ డబ్బు ఈసారి సక్రమంగా అందకపోవడం గమనార్హం.
గ్రూప్‌గా ఉద్దెర..
తల్లిదండ్రులు పేదరికంలో ఉండి హాస్టల్‌కు పంపించగా ప్రభుత్వం ఇవ్వాల్సిన కాస్మోటిక్ బిల్లులు రాకపోవడంతో విద్యార్థులు కొబ్బరినూనె, సబ్బు వంటి కనీస అవసరాల కోసం ఇబ్బంది పడుతున్నారు. దీంతో పలువురు గ్రూప్‌గా ఏర్పడి సమీపంలోని కిరాణం షాపుల్లో ఖాతాలు పెట్టి సబ్బు, కొబ్బరినూనె తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం పెరిగిన ధరలతో పోల్చితే సంక్షేమ వసతిగృహాల్లో ఉండే విద్యార్థులకు ప్రభుత్వం అందజేసే నగదు ఏ మూలకు సరిపోదు. ప్రస్తుతం ఏ కంపెనీ సబ్బు ధర చూసినా రూ.20కి పైగానే ఉంది. పౌడర్, కొబ్బరినూనె కోసం రూ.50వరకు కావాలి. కానీ ఇచ్చే అరకొర నగదు కూడా సక్రమంగా ఇవ్వకపోవడంతో విద్యార్థులు అవస్థలు ఎదుర్కొంటున్నారు.
వరంగల్ రూరల్ జిల్లాలో ఎస్సీ వసతి గృహాలు : 15
విద్యార్థులు : 689
బీసీ వసతి గృహాలు : 18
విద్యార్థులు : 1,876
ఎస్టీ వసతి గృహాలు : 08
విద్యార్థులు : 1,488
22 ఎన్‌ఎస్‌పీ 02 : కాస్మోటిక్ బిల్లులు రాలేదని చెబుతున్న హాస్టల్ విద్యార్థినులు