ఖమ్మంమయూరిసెంటర్: వసతి గృహాల్లో ఉంటూ విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు చలికి గజగజ వణికిపోతున్నారు. కనీస సౌకర్యాలు లేక నేలపైనే నిద్రిస్తూ చాలీచాలని దుప్పట్లతో అవస్థలు పడుతున్నారు. సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నాం.. సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. ఆచరణలో మాత్రం కనిపించని పరిస్థితి నెలకొంది. నాణ్యమైన విద్య కోసం తల్లిదండ్రులను వదిలి.. సంక్షేమ వసతి గృహాల్లో చేరిన విద్యార్థులకు తగిన విధంగా వసతి కల్పించలేకపోతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థులను రాత్రివేళ కంటికి రెప్పలా చూసుకోవాల్సిన సిబ్బంది సైతం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. సోమవారం రాత్రి ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల సందర్శనలో పలు సమస్యలు వెలుగుచూశాయి.
సంక్షేమ శాఖ వసతి గృహాలని ప్రభుత్వం చెబుతున్నా.. అవి కేవలం పేరుకే సంక్షేమ వసతి గృహాలుగా కనిపిస్తున్నాయి. విద్యార్థులకు అందించాల్సిన కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లా కేంద్రం లోని ఎస్టీ, బీసీ వసతి గృహాల్లో విద్యార్థులు నేలపైనే నిద్రించాల్సిన పరిస్థితి ఉంది. పూర్తిస్థాయిలో దుప్పట్లు, మ్యాట్‌లు ఇవ్వకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎస్టీ వసతి గృహాల్లో మినహా ఇతర శాఖల్లో విద్యార్థులు పడుకునేందుకు బంకర్ బెడ్స్ లేవు. అరకొర సౌకర్యాలతోనే బీసీ, ఎస్టీ సంక్షేమ శాఖ విద్యార్థులు నెట్టుకొస్తున్నారు.
సౌకర్యాల లేమితో ఇబ్బందులు..
వసతి గృహాల్లో కనీస సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వసతి గృహాల్లో విద్యార్థులకు దుప్పట్లు, మ్యాట్‌లు ఇచ్చినా.. సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు. ఎముకలు కొరికే చలిలో సైతం విద్యార్థులు పలుచటి మ్యాట్‌లను నేలపై వేసుకొని వాటిపైనే నిద్రిస్తున్నారు. దీంతో బండల చల్లదనం, పైన చలిగా లి విద్యార్థులకు నిద్రలేకుండా చేస్తోంది. నగరం లోని ముస్తఫా నగర్ ప్రాంతంలో ఉన్న బీసీ సంక్షేమ ప్రీమెట్రిక్ వసతి గృహంలో పలు గదుల కిటికీలకు తలుపులు లేకపోవడంతో విద్యార్థులు చలికి తట్టుకోలేక వారి వద్ద ఉన్న దుప్పట్లను కిటికీలకు అడ్డంగా ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ పారిశుద్ధ్యం నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండడంతో దుర్వాసన వెదజల్లుతోంది. ఇక గిరిజన సంక్షేమ వసతి గృహాల్లో కొత్తగా విద్యా సంవత్సరంలో చేరిన విద్యార్థులకు దుప్పట్లు లేని పరిస్థితి. నూతనంగా ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో చేరిన విద్యార్థులు ఇంటి నుంచే దుప్పట్లు తెచ్చుకొని చలి నుంచి రక్షణ పొందుతున్నారు.
కనిపించని వార్డెన్, వాచ్‌మెన్‌లు..
వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమశాఖ వసతి గృహాల్లో సౌకర్యాలే లేవను కుంటే.. వసతి గృహాలకు సంరక్షకులుగా ఉన్న సిబ్బంది అక్కడ కనిపించడం లేదు. ముస్తఫా నగర్ బీసీ వసతి గృహంలో రాత్రివేళ విధుల్లో ఉండాల్సిన వాచ్‌మన్ ఇంటికి వెళ్లిపోవడంతో వసతి గృహంలోని విద్యార్థులు అర్ధరాత్రి వరకు ఇష్టానుసారంగా రోడ్లపైనే తిరుగుతున్నారు. వారు ఇష్టారీతిగా తిరుగుతున్నా వార్డెన్ పట్టించుకోవడం లేదని స్థానికులు పేర్కొంటున్నారు. వార్డెన్, వాచ్‌మన్ వసతి గృహంలో ఉండకపోవడంతో విద్యార్థులకు రక్షణ లేకుండా పోయింది.
ఇక వసతి గృహంలో విద్యార్థి హత్య జరిగినా.. గిరిజన సంక్షేమ శాఖ అధికారులు మాత్రం వారి నిర్లక్ష్యాన్ని వీడలేదు. నెహ్రూ నగర్‌లోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో వార్డెన్, వాచ్‌మన్‌లు ఇద్దరూ వసతి గృహ గేట్లకు తాళం వేసి ఇంటికి వెళ్లిపోవడంతో వసతి గృహంలోని విద్యార్థులు గోడలు దూకి బయటకు వెళ్తున్నారు. వసతి గృహ సంక్షేమాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో విద్యార్థులు రోడ్లపైనే తిరుగుతున్నారు.
రాత్రివేళ విధుల్లో ఉండాల్సిన వాచ్‌మన్‌లు ఇంటికి వెళ్లడం, వసతి గృహాలపై పర్యవేక్షణగా ఉండాల్సిన సంక్షేమాధికారులు పట్టించుకోకపోవడంతో విద్యార్థు లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు నిర్లక్ష్యం వీడి వసతి గృహాలపై పర్యవేక్షణ ఉంచాలని స్థానిక ప్రజలు, విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment