సాక్షి, అశ్వారావుపేట రూరల్: సర్పంచ్‌గా పోటీచేసే అవకాశం ఇవ్వలేదనే మనస్తాపానికి గురైన ఓ గర్భిణి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట మండలం ఊట్లపల్లిలో సోమవారం చోటు చేసుకుంది. ఊట్లపల్లి పంచాయతీ ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. దీంతో గ్రామానికి చెందిన రెబక్కారాణి(26)ని టీఆర్‌ఎస్ మద్దతుతో బరిలో దింపేందుకు స్థానిక నాయకులు కుటుంబ సభ్యులతో చర్చించి ఆమె వివరాలు తీసుకున్నారు. అయితే ఈమె ఏడు నెలల గర్భిణి కావడంతో రెబక్కారాణి వదిన(సోదరుడి భార్య) సాధు జ్యోత్స్నబాయిని బరిలోకి దింపారు. ఈనెల 25న జరిగిన మొదటి విడత ఎన్నికల్లో జ్యోత్స్నబాయి సర్పంచ్‌గా గెలుపొందారు.
కాగా, తనకు వచ్చిన అవకాశాన్ని దక్కకుండా చేశారంటూ జ్యోత్స్నబాయి నామినేషన్ వేసిన రోజు నుంచి రెబక్కారాణి కుటుంబసభ్యులతో ఘర్షణ పడుతోంది. సోమవారం కూడా తన అన్న, తండ్రితో తీవ్రంగా వాగ్వాదం జరిగింది. ఆ కోపంతోనే తన ఇంటికి వెళ్లి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆ సమయంలో బయటకు వెళ్లిన భర్త నరేంద్ర కాసేపటి తర్వాత ఇంటికి వెళ్లి తలుపు తీసేందుకు ప్రయత్నించగా రాలేదు. దీంతో పక్క ఇంట్లోనే ఉన్న మామ, బావమరుదులను పిలిచి తలుపు పగులగొట్టి చూసేసరికి రెబక్కారాణి మృతి చెంది ఉంది. మృతురాలికి భర్తతో పాటు ఏడాదిన్నర వయసున్న కుమారుడు ఉన్నాడు. స్థానిక ఎస్‌ఐ వేల్పుల వెంకటేశ్వరరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment