వెల్దుర్తి ఎస్సీ బాలుర హాస్టల్‌లో దుస్తులు ఉతుక్కుంటున్న విద్యార్థులు
వెల్దుర్తి రూరల్: తలకు నూనె ఉండదు..ముఖం శుభ్రం చేసుకోవడానికి సబ్బు దొరకదు..చెమట వాసన వస్తున్న దుస్తులను ఉతుక్కోవడానికి కష్టమే..వసతిగృహాల్లో ఉండే విద్యార్థుల కష్టాలు ఇవీ. కాస్మొటిక్ చార్జీలు చెల్లిస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నా..వాస్తవం భిన్నంగా ఉంటోంది. ప్రభుత్వం ఇచ్చే చాలీచాలని డబ్బుతో విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రతకు దూరమవుతున్నారు. మాసిన దుస్తులు, చింపిరి జుట్టుతో హాస్టల్ విద్యార్థులు కునారిల్లుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే చార్జీలు సరిపడక ప్రతినెలా తల్లిదండ్రుల నుంచి ఎంతో కొంత తెప్పించుకోవాల్సిన దుస్థితి నెలకొంది.
పాతకాలపు ధరలతో...
ప్రతినెలా విద్యార్థులకు ఒక్కో చోట ఒక్కో రకంగా కాస్మొటిక్ చార్జీలను చెల్లిస్తున్నారు. అవి ఎందుకూ సరిపోవడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. దుస్తులు ఉతుక్కోవడానికి మూడు సబ్బులు, స్నానానికి రెండు సబ్బులు, పేస్టు, బ్రష్‌లు, తలకు నూనె, షాంపులు, కటింగ్, ఇతరత్రా ఖర్చులు కలిపి ప్రతి బాలునికి కనీసం రూ.150కి మించి ఖర్చవుతోంది. అదే బాలికలకు వీటన్నిటితో పాటు పౌడర్, తిలకం, అదనంగా నూనె, నాప్‌కిన్ల ఖర్చు అంటూ రూ.200కు మించుతోంది. వాస్తవ ఖర్చు ఇలా ఉంటే పాతకాలపు ధరలతో కాస్మొటిక్ చార్జీలు చెల్లిస్తున్నారు.
నాసిరకం నాప్‌కిన్లు
బాలికలకు పీహెచ్‌సీల ద్వారా ఇటీవలే నాప్‌కిన్లు సరఫరా చేశారు. అయితే అవి నాసిరకంగా ఉండడంతో బాలికలు తిరస్కరిస్తున్నారు. నాసిరకాన్ని సైతం రూ.8కు అంటగట్టడం ప్రభుత్వానికే చెల్లిందనే విమర్శలు ఉన్నాయి.
పదిరోజులకే అయిపోతాయి
మాకు నెలకిచ్చే రూ.50 పదిరోజులకే అయిపోతాయి. ఇంటికాట్నుంచి డబ్బు తెప్పించుకోవాల. అమ్మా, నాయన కూడా ఏందిరా ఇది అంటారు. చెప్పులు తెగిపోతే కూడా కుట్టించుకోలేం. సారోళ్లు చూస్తే డ్రస్సు బాగుండాల, అది బాగుండాల, ఇది బాగుండాల అంటారు. ఈ డబ్బులతో అన్నీ ఎట్ల బాగుంటాయి. – డేవిడ్ రాజు,10వ తరగతి, ఎస్సీ బాలుర హాస్టల్, వెల్దుర్తి
ఇంట్లో డబ్బులు అడగాల్సి వస్తోంది
మాకిచ్చే రూ.75 తీసుకుని మార్కెట్‌కుపోతే ఏమీ రావు. ఇంట్లో వాళ్లని డబ్బులు అడగక తప్పదు. అమ్మా, నాన్న రావాలన్నా కూలిడిసిపెట్టాలి. రానీక పోనీక మళ్లా ఖర్చులు. కాస్మొటిక్ చార్జీలు పెంచాలని..మా హాస్టల్‌కు వచ్చిన సారోళ్లకు అడుగుతూనే ఉన్నాం..ఎవరూ వినడంలేదు. – శ్రీలక్ష్మి, 9వ తరగతి, బీసీ బాలికల హాస్టల్, వెల్దుర్తి
డబ్బులు సరిపోవు
హాస్టల్ విద్యార్థులకు ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చే కాస్మొటిక్ చార్జీలు ఏమాత్రం సరిపోవు. జూన్ నుంచి పెంచుతామన్న ప్రభుత్వం ఇంతవరకు పెంచలేదు. పరిశుభ్రతకు పెద్దపీట అంటున్న ప్రభుత్వం.. విద్యార్థుల దయనీయస్థితిని గమనించి వెంటనే కాస్మొటిక్ చార్జీలు పెంచాలి. – దొరస్వామి, వెల్దుర్తి ఎస్సీ బాలుర హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్
డబ్బులు సరిపోవు
హాస్టల్ విద్యార్థులకు ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చే కాస్మొటిక్ చార్జీలు ఏమాత్రం సరిపోవు. జూన్ నుంచి పెంచుతామన్న ప్రభుత్వం ఇంతవరకు పెంచలేదు. పరిశుభ్రతకు పెద్దపీట అంటున్న ప్రభుత్వం.. విద్యార్థుల దయనీయస్థితిని గమనించి వెంటనే కాస్మొటిక్ చార్జీలు పెంచాలి. – దొరస్వామి, వెల్దుర్తి ఎస్సీ బాలుర హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్
Comments
Please login to add a commentAdd a comment