ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో గల ఒక హాస్టల్‌లో కలుషిత ఆహారం తిన్న సుమారు 200 మంది విద్యార్థులు అనారోగ్యం పాలయ్యారు. వీరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వీరికి వైద్యులు చికిత్సనందిస్తున్నారు.
ఫుడ్ పాయిజన్ కావడంతో విద్యార్థులంతా అస్వస్థతకు గురయ్యారని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఈ ఉదంతంపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆర్యన్ రెసిడెన్సీ అండ్ లాయిడ్స్ హాస్టల్ విద్యార్థులు కలుషిత ఆహారం తిన్న కారణంగా అనారోగ్యం పాలయ్యారని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. కాగా హాస్టల్‌లో తమకు నాసిరకం భోజనం పెడుతున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
హాస్టల్ నిర్వాహకునిపై బాధిత విద్యార్థులు పోలీసుల ఎదుట తీవ్ర ఆరోపణలు చేశారు. మార్చి 8వ తేదీ సాయంత్రం హాస్టల్‌లో ఆహారం తిన్న విద్యార్థులు అనారోగ్యం పాలయ్యారని నాలెడ్జ్ పార్క్ పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందగానే బాధిత విద్యార్థులందరినీ సమీపంలోని ఆసుపత్రిలో చేర్చామని పోలీసులు వివరించారు. ప్రస్తుతం విద్యార్థులంతా ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఈ వ్యవహారంపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ కేసులో ఇంతవరకూ ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు.
Comments
Please login to add a commentAdd a comment