Transport burden
-
పంజా విసిరిన చైనా.. అదే జరిగితే ప్రపంచానికే ముప్పు!
కోవిడ్ ప్రభావం నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇంకా కోలుకోలేదు. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ ప్రభావం ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఉంది. పులి మీద పుట్రలా తైవాన్ చుట్టూ చైనా చేస్తున్న సైనిక విన్యాసాలు, క్షిపణి దాడులు ఆందోళన పెంచుతున్నాయి. ఇరుపక్షాల మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాలిస్తే ప్రపంచ దేశాల మధ్య రవాణా వ్యవస్థ స్తంభించిపోయే అవకాశాలున్నాయి. అమెరికా కాంగ్రెస్ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్‌లో జరిపిన పర్యటన మరోసారి ప్రపంచ దేశాలకు డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఆమె పర్యటనకు ప్రతీకార చర్యగా తైవాన్ను అష్టదిగ్బంధం చేసి చైనా మిలటరీ విన్యాసాలు నిర్వహిస్తోంది. తైవాన్ జలాల్లోనూ, గగనతలంలోనూ క్షిపణి దాడులకు దిగుతూ తన బలాన్ని ప్రదర్శిస్తోంది. అయితే దీని వల్ల ప్రపంచంలో బిజీగా ఉండే షిప్పింగ్ జోన్లో సరకు రవాణాకు గండిపడే అవకాశాలున్నాయి. - తూర్పు ఆసియా వాణిజ్యంలో తైవాన్ జలసంధి రవాణా పరంగా అత్యంత కీలకమైనది. తూర్పు ఆసియా దేశాల్లోని కర్మాగారాల్లో తయారయ్యే ఎలక్ట్రానిక్ పరికరాలు ప్రపంచ మార్కెట్లకు చేరాలంటే ఈ జలసంధే మార్గం. - సహజ వాయువు సరఫరా కూడా ఈ మార్గం ద్వారానే జరుగుతుంది. - ప్రపంచవ్యాప్తంగా రవాణా నౌకల్లో సగం ఈ ఏడాది ఏడు నెలల్లో తైవాన్ జలసంధి ద్వారా తిరిగాయని అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. - చైనా దుందుడుకు చర్యలతో ఈ జలసంధిలో రవాణాకు అవకాశం లేకపోతే నౌకల్ని దారి మళ్లించినా ప్రపంచ దేశాల్లో సరఫరాకు ఆటంకాలు ఏర్పడతాయని, కోవిడ్, రష్యా ఉక్రెయిన్ యుద్ధం నుంచి ఇంకా కోలుకోని దేశాలు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని సింగపూర్‌కు చెందిన స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్‌కు చెందిన ఎస్. రాజరత్నం అభిప్రాయపడ్డారు. - తాత్కాలికంగా ఈ జలసంధిలో రవాణా నిలిచిపోతే జపాన్, దక్షిణ కొరియాపై అత్యధిక ప్రభావం పడుతుంది. - గురువారం నాటి విన్యాసాలతో నౌకల రవాణా సూచీ 4.6% నుంచి 1.05%కి పడిపోయింది - చైనా మిలటరీ విన్యాసాలతో ఉత్తర, తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో నౌకలు ప్రయాణించవద్దని ఇప్పటికే తైవాన్ నౌకాదళం హెచ్చరికలు జారీ చేసింది. - తైవాన్ జలసంధి నుంచి ఫిలిప్పీన్స్ సముద్రం వైపు నౌకలను మళ్లించాలన్నా భారీగా కురుస్తున్న వర్షాలతో ఆటంకాలున్నాయి. - చైనా సైనిక విన్యాసాల ప్రభావం గగనతల రాకపోకలపైనా పడింది. 400కు పైగా విమానాలు రద్దు అయ్యాయి. చైనా ఎంతవరకు వెళుతుంది ? అమెరికా కాంగ్రెస్ హౌస్ స్పీకర్ పెలోసి తైవాన్ పర్యటనపై అగ్గి మీద గుగ్గిలం అవుతున్న డ్రాగన్ దేశం తన బలాన్ని చూపించడానికి ఎంత వరకు ముందుకెళుతుందన్న చర్చ జరుగుతోంది. గతంలో 1990, 1996లో సంక్షోభాల సమయంలో కూడా తైవాన్ జలాల్లో చైనా క్షిపణులతో దాడులు దిగింది. కొన్ని నెలల పాటు సైనిక విన్యాసాలతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు రాజేసింది. అయితే ప్రపంచీకరణ పరిస్థితులతో ఇప్పుడు సరకు రవాణాకు ఏ చిన్న అవాంతరం వచ్చినా చైనా ఆర్థిక వ్యవస్థ మీద కూడా ఆ ప్రభావం పడుతుంది. ఇప్పటికే ఆర్థికపరమైన సవాళ్లను ఎదుర్కొంటున్న చైనా అగ్రరాజ్యం అమెరికాతో అమీతుమీకి సిద్ధపడే పరిస్థితుల్లేవని అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ ఏ న్యూ అమెరికన్ సెక్యూరిటీ సంస్థ ప్రతినిధి థామస్ షుగార్ట్ వ్యాఖ్యానించారు. - నేషనల్ డెస్క్, సాక్షి ఇది కూడా చదవండి: తైవాన్ను చుట్టుముట్టిన చైనా సైన్యం.. మిసైల్స్‌తో హడల్! -
వసతి లేనట్టే
ఆదర్శంలో కరువైన వసతి - నాలుగేళ్లుగా అతీగతీ లేదు - 47 పాఠశాలలకు 25 హాస్టళ్లే పూర్తి - విద్యార్థులపై రవాణా భారం కరీంనగర్ ఎడ్యుకేషన్ : గ్రామీణ నిరుపేద విద్యార్థులకు ‘ఆదర్శ’ విద్య వ్యవహారం ఒక అడుగు ముందుకు... రెండడుగులు వెనక్కు అన్న చందంగా తయారైంది. నాలుగేళ్ల క్రితం ప్రారంభమైన మోడల్‌స్కూళ్లు నేటికీ హాస్టల్ వసతికి నోచుకోవడం లేదు. ఈ ఏడాది సైతం ప్రభుత్వం చేతులెత్తేసే పరిస్థితి ఉండడంతో విద్యార్థులకు రవాణాభారం తప్పేలా లేదు. నిరుపేద విద్యార్థులకు సీబీఎస్ఈ తరహా విద్య అందించాలనే సదుద్దేశంతో ప్రభుత్వం నాలుగేళ్ల క్రితం మోడల్‌స్కూళ్లను ప్రారంభించింది. 6 నుంచి 12వ తరగతి వరకు ఇక్కడ బోధన అందించనున్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా మన జిల్లా 47 పాఠశాలలు మంజూరయ్యాయి. స్థల సేకరణ, భవన నిర్మాణంలో నిర్లక్ష్యంతో మేడిపల్లి, కొడిమ్యాల మండలాల్లో తరగతులు ఇప్పటికీ ప్రారంభం కాకపోగా మిగతా 45 మండలాల్లో తరగతులు ప్రారంభమయ్యాయి. మొదటినుంచే బాలబాలికలకు వేర్వేగా వసతిగృహ సదుపాయం కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వం ఆచరణలో విస్మరించింది. పూర్తిస్థాయిలో దృష్టి సారించకపోవడంతో ఇప్పటివరకు 25 పాఠశాలల్లో మాత్రమే వసతిగృహాల నిర్మాణం పూర్తయింది. 8 పాఠశాలల్లో భవన నిర్మాణాలు తుది దశలో ఉన్నాయి. మరో రెండు భవనాలు రూఫ్ స్థాయిలో, మూడు భవనాలు బేస్మెంట్ స్థాయిలో ఉండగా, ఎనిమిది టెండర్ దశలోనే మగ్గుతున్నాయి. ఆదినుంచి ఇబ్బందులే... మోడల్‌స్కూళ్లు ప్రారంభించినప్పటినుంచి ఆటుపోట్లు ఎదుర్కొంటున్నాయి. బోధన సిబ్బంది ఉన్నా బోధనేతర సిబ్బంది లేక ఇబ్బందులు తప్పడం లేదు. ప్రతీ మండలంలో ఎక్కడో ఊరు చివరన ఈ పాఠశాలలు ఏర్పాటు చేశారు. కొన్ని చోట్లనైతే బస్సులు కాదు కదా... కనీసం ఆటోలు కూడా వెళ్లే పరిస్థితి లేదు. పాఠశాలకు వెళ్లి మళ్లీ ఇంటికి రావాలంటే సాహసమే. ఊరికి దగ్గరగా ఉన్నవారు నడిచివెళ్లడమో... మిగతా వారు ప్రత్యేకంగా ఆటో మాట్లాడుకుని వెళ్లిరావడమో చేస్తున్నారు. దీంతో విద్యార్థులపై రవాణాభారం అధికంగా పడుతోంది. సమయమంతా ప్రయాణానికే సరిపోతోంది. ఈసారి కూడా హాస్టల్ సదుపాయంపై ప్రభుత్వం చేతులెత్తేసే అవకాశాలే కనిపిస్తుండడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కష్టాల మధ్య చదువు సాగించేకంటే సమీపంలోని పాఠశాలల్లో చేర్పించాలనే ఆలోచనలో ఉన్నట్లు పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. ప్రతీ పాఠశాలకు రూ.3 కోట్లు మోడల్‌స్కూళ్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి నిధులతో ఏర్పాటు చేశారు. రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ పథకం కింద ప్రభుత్వం ఒక్కో పాఠశాల నిర్మాణానికి రూ.3 కోట్లు కేటాయించింది. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా 75 శాతం కాగా, రాష్ట్ర ప్రభుత్వ వాటా 25 శాతం. దీనికితోడు పాఠశాల నిర్వహణ కోసం రూ.75 లక్షలు ప్రత్యేక గ్రాంటు విడుదల చేయాలని నిర్ణయించింది. ఒక్కో పాఠశాలలో ప్రయోగశాల, లైబ్రరీ, క్రీడా మైదానం, స్టాఫ్ రూంలు, బాలబాలికల వసతిగృహాలు, సిబ్బంది ఉండేందుకు వీలుగా నివాస గృహాలు ఏర్పాటు చేయాలనేది లక్ష్యం. కానీ, కేవలం పాఠశాల నిర్మాణం మినహా మిగతావన్నీ అటకెక్కాయి.