కార్పొరేట్‌కు దీటుగా... ప్రతిభకు రెడ్‌ కార్పెట్‌ | IITs offer poor students with merit | Sakshi
Sakshi News home page

కార్పొరేట్‌కు దీటుగా... ప్రతిభకు రెడ్‌ కార్పెట్‌

Published Thu, Dec 2 2021 3:52 AM | Last Updated on Thu, Dec 2 2021 3:52 AM

IITs offer poor students with merit - Sakshi

సాక్షి, అమరావతి: ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ)లు దేశంలోనే అత్యంత ప్రముఖ విద్యాసంస్థలు. ఆ విద్యాసంస్థల్లో చదవాలనే కోరిక చాలా మంది విద్యార్థుల్లో ఉంటుంది. అయితే ప్రతిభ కలిగినా పేదరికం కారణంగా కొంతమంది ఆ విద్యా సంస్థల్లో చేరడానికి వెనుకాడతారు. అలాంటి వారికి మెరుగైన అవకాశాలు కల్పించడం కోసం పలు ఐఐటీలు గతంలో ఎన్నడూ లేనంతగా ప్రత్యేక ఆఫర్లు ప్రకటించాయి. పేద విద్యార్థులకు ఫీజులను పూర్తిగా తామే భరిస్తామంటూ కొన్ని ముందుకు రాగా వసతి, భోజనాలతో పాటూ ఫీజుల భారమూ తామే చూసుకుంటామని మరికొన్ని ప్రకటించాయి.

ఇంకొన్ని అయితే  ఆయా విద్యార్థులకు ఫీజులు, వసతితో పాటు పుస్తకాలు ఇతర మెటీరియల్‌ ఖర్చులు, ప్రయాణ భత్యాలు, పాకెట్‌ మనీ కూడా ఇస్తామని ఆఫర్‌ ఇచ్చాయి. ఐఐటీలలో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభమైన వెంటనే ఆయా విద్యాసంస్థలు తమ ఆఫర్లను ప్రకటించాయి. జాయింట్‌ సీట్‌ అలోకేషన్‌ అథారిటీ (జోసా) జేఈఈ అడ్వాన్స్‌ అనంతరం కౌన్సెలింగ్‌ ప్రక్రియను చేపట్టి మొత్తం ఆరు విడతల కౌన్సెలింగ్‌ మెరిట్‌ జాబితాలను ప్రకటించింది. జేఈఈ అడ్వాన్స్‌లో మెరిట్‌ సాధించిన పేద విద్యార్థుల తల్లిదండ్రుల ఆదాయం ఆధారంగా వారి విద్యను కొనసాగించడంలో సహాయపడటానికి ఈ ఐఐటీలు స్కాలర్‌షిప్‌లు, ఫీజు మినహాయింపులను అందిస్తామని పేర్కొన్నాయి. ఫలితంగా మెరిట్‌ ఉన్న పేద విద్యార్థులు ఐఐటీల్లో చేరేందుకు మొగ్గుచూపారు. బాగా చదివితే చాలు ఇక అన్నీ ఉచితమే అన్నట్లుగా ఐఐటీలు పోటీపడి ఆఫర్లు ఇచ్చాయి. 

ఐఐటీలు.. వాటి ఆఫర్లు
ఐఐటీ బాంబే: బీటెక్‌ లేదా డ్యూయల్‌–డిగ్రీ ప్రోగ్రామ్‌లలో అడ్మిషన్‌ కోరుకునే అభ్యర్థులకు జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మంచి ర్యాంక్‌ ఉండి, వారి తల్లిదండ్రుల సంవత్సరాదాయం రూ. 5 లక్షలకు మించకుంటే  మెరిట్‌–కమ్‌ మీన్స్‌ స్కాలర్‌షిప్‌ను అందిస్తామని ఐఐటీ బాంబే పేర్కొంది. తల్లిదండ్రుల సంవత్సరాదాయం రూ. 4.5 లక్షలకన్నా తక్కువ ఉన్న ఎస్సీ, ఎస్టీలకు భోజన సదుపాయంతో పాటు నెలకు రూ. 250 పాకెట్‌ అలవెన్స్‌ ఇస్తామంది. అవే కాకుండా ఆ విద్యార్థులకు అధికారికంగా నిర్ణయించిన ట్యూషన్‌ ఫీజు, హాస్టల్‌ అద్దె చెల్లింపు నుంచి మినహాయింపును ప్రకటించింది.

ఐఐటీ గాంధీనగర్‌: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ కామన్‌ ర్యాంకు జాబితాలో 1,000, ఆపైన ర్యాంకును పొందిన విద్యార్థులకు ప్రత్యేక స్కాలర్‌షిప్‌ను అందిస్తామని ఐఐటీ గాంధీనగర్‌ వెల్లడించింది. బీటెక్‌ నాలుగేళ్ల ట్యూషన్‌ ఫీజు మొత్తాన్ని సంస్థ భరించేలా ఆ స్కాలర్‌షిప్‌ ఉంటుందని వివరించింది. 

ఐఐటీ భిలాయ్‌: అన్‌రిజర్వ్‌డ్‌ విద్యార్థులతో పాటు ఓబీసీ వర్గాలకు చెందిన అండర్‌ గ్రాడ్యుయేట్‌ విద్యార్థులకు మెరిట్‌–కమ్‌–మీన్స్‌ స్కాలర్‌షిప్‌ను ఐఐటీ భిలాయ్‌ అందిస్తోంది. వీరి గరిష్ట పరిమితి సంఖ్యను 25 శాతంగా పేర్కొంది. కుటుంబ ఆదాయం సంవత్సరానికి రూ.1 లక్ష నుంచి రూ. 5 లక్షల మధ్య ఉన్న ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీ విద్యార్థులకు ట్యూషన్‌ ఫీజులో మూడింట రెండు వంతుల రాయితీని ఇస్తోంది. నెలకు రూ. 1,000 పాకెట్‌ మనీని అందించనున్నట్లు పేర్కొంది. 

ఐఐటీ మద్రాస్‌: తల్లిదండ్రుల సంవత్సరాదాయం రూ. 1 లక్ష కంటే తక్కువ ఉండే మెరిటోరియస్‌ అభ్యర్థులు బీటెక్‌ లేదా డ్యూయల్‌–డిగ్రీ ప్రోగ్రామ్‌లలో అడ్మిషన్‌ పొందితే పూర్తి ట్యూషన్‌ ఫీజు మినహాయింపు ఇవ్వనున్నట్లు ఐఐటి మద్రాస్‌ ప్రకటించింది. తల్లిదండ్రుల సంవత్సరాదాయం రూ.4.5 లక్షల కంటే తక్కువ ఉన్న అభ్యర్థులకు నెలకు రూ. 1,000తో కూడిన మెరిట్‌ –కమ్‌ –మీన్స్‌ స్కాలర్‌షిప్‌ ఇవ్వనున్నట్లు పేర్కొంది. తల్లిదండ్రుల ఆదాయం రూ. 4.5 లోపు ఉన్నవారికి ట్యూషన్‌ ఫీజులో మూడింట రెండు వంతుల మినహాయింపు ప్రకటించింది. 

ఐఐటీ ఢిల్లీ
జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మెరిట్‌ సాధించిన విద్యార్థులకోసం ఐఐటీ ఢిల్లీ ఎండోమెంట్‌ ఫండ్‌ను ఏర్పాటు చేసింది. 30 మంది మెరిట్‌ విద్యార్థులకు ఏడాదికి 1 లక్ష చొప్పున అందించనుంది. ఈ స్కాలర్‌షిప్‌ పథకంలో 15 మంది పురుషులకు, 15 మంది మహిళా విద్యార్థులకు అవకాశం కల్పిస్తామని వెల్లడించింది. 

ఐఐటీ కాన్పూర్‌
మెరిట్‌ విద్యార్థుల కోసం ఐఐటీ కాన్పూర్‌ ‘బ్రైట్‌ మైండ్‌ స్కాలర్‌షిప్‌’ను ప్రకటించింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ మొదటి 100 ర్యాంక్‌లలో నిలిచిన విద్యార్థులు తమ ఇన్‌స్టిట్యూట్‌లో బీటెక్, బీఎస్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశం పొందితే ఈ స్కాలర్‌షిప్‌ కింద రూ.3 లక్షలు ఇవ్వనుంది. విద్యార్థుల హాస్టల్, పుస్తకాలు, ఇతర ఖర్చులతో పాటు మొత్తం ట్యూషన్‌ ఫీజులను ఈ స్కాలర్‌షిప్‌ కవర్‌ చేస్తుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement