JEE Advance
-
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదల.. రిజల్ట్ డైరెక్ట్ లింక్ ఇదే..
సాక్షి, ఢిల్లీ: జేఈఈ అడ్వాన్స్డ్–2022 ఫలితాలను పరీక్ష నిర్వహణ సంస్థ ఐఐటీ ముంబై ఆదివారం ప్రకటించింది. ఫలితాలతోపాటే తుది ఆన్సర్ కీ, మెరిట్ లిస్ట్‌ను విడుదల చేసింది. విజయవాడకు చెందిన పొలిశెట్టి కార్తికేయ ఆరో ర్యాంకు సాధించింది. అభ్యర్థులు స్కోర్ కార్డులను jeeadv.ac.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫలితాలను రిజర్వేషన్లవారీగా ఆయా వర్గాల కోటా ప్రకారం విడుదల చేశారు. రిజల్ట్ కోసం క్లిక్ చేయండి.. ఇక జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) సీట్ల కేటాయింపు కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలుకానుంది. 12వ తేదీ నుంచి ‘జోసా’ రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయి. అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించిన విద్యార్థులకు ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీ, జీఎఫ్టీఐలలో మెరిట్, రిజరేషన్ల ప్రాతిపదికన ప్రవేశాలు లభిస్తాయి. 23 ఐఐటీలలో 16,598 సీట్లు, 31 ఎన్ఐటీలలో 23,994, 26 ఐఐఐటీలలో 7,126, 33 జీఎఫ్టీఐలలో 6,759 సీట్లు ఈసారి భర్తీకి అందుబాటులో ఉన్నట్లు ‘జోసా’ సీట్ల వివరాలను విడుదల చేసింది. వాటిలోనే మహిళలకు సూపర్ న్యూమరరీ కోటా కూడా అమలు కానుంది. ఐఐటీలలో 1,567, ఎన్ఐటీలలో 749, ఐఐఐటీలలో 625, జీఎఫ్టీఐలలో 30 సీట్లు మహిళలకు సూపర్ న్యూమరరీ కోటా కింద రానున్నాయి. ఆర్కిటెక్చర్ కోర్సులకు సంబంధించిన అభ్యర్థులు ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్టుకు 11, 12 తేదీల్లో రిజిస్ట్రేషన్లు చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 14న ఏఏటీ పరీక్షను నిర్వహించి 17న ఫలితాలను విడుదల చేయనున్నారు. -
చాయిస్ ఫిల్లింగ్‌లో అప్రమత్తం
సాక్షి, హైదరాబాద్: ఐఐటీల్లో ప్రవేశాలకు ఆన్లైన్లో నిర్వహించే ‘జోసా’ ప్రక్రియలో జేఈఈ అడ్వాన్స్డ్ ఉత్తీర్ణులు తమ చాయిస్ ఫిల్లింగ్, ఇంజనీరింగ్ బ్రాంచ్‌ల ప్రాథమ్యాల ఎంపికలో అప్రమత్తంగా వ్యవహరించాలని ఐఐటీ–మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి.కామకోటి సూచించారు. వందల సంఖ్యలో ఆప్షన్స్ ఇచ్చే అవకాశమున్నందున చిన్న పొరపాటు కూడా భవిష్యత్తుకు ఇబ్బందికరంగా మారవచ్చునని హెచ్చరించారు. ఈ నెల 11న జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల విడుదల, ఆ మర్నాడే ‘జోసా’ ఆన్లైన్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థులు ‘ఆస్క్ ఐఐటీఎం’ పేరుతో.. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల కోసం శనివారం నిర్వహించిన అవగాహన సదస్సులో కామకోటి పాల్గొన్నారు. వారి సందేహాలు నివృత్తి చేశారు. ఐఐటీ మద్రాస్ విశిష్టతలను వివరించారు. ఇష్టమైన సబ్జెక్టులు ఎంచుకోవచ్చు ప్రస్తుతం ఇంటర్ డిసిప్లినరీ విధానంలో ఐఐటీ మద్రాస్‌లో బీటెక్‌లో ఏ బ్రాంచ్ విద్యార్థులైనా.. కోర్ సబ్జెక్ట్‌లతోపాటు తమకు ఆసక్తి ఉన్న ఇతర సబ్జెక్ట్‌లను చదివే అవకాశం ఉందని.. వీటిలో పొందిన క్రెడిట్స్‌ను సైతం బీటెక్ ప్రోగ్రామ్‌కు కలుపుతారని కామకోటి తెలిపారు. ఫలితంగా తమ ర్యాంకుకు వచ్చిన బ్రాంచ్‌తో తృప్తిపడకుండా ఇష్టమైన సబ్జెక్ట్‌లు చదివే అవకాశం విద్యార్థులకు లభిస్తుందన్నారు. ఇంటిగ్రేటెడ్ పీజీ (బీటెక్+ఎంటెక్) ప్రోగ్రామ్‌ల ద్వారా విద్యార్థులు నాలుగో సెమిçÜ్టర్‌లో తమకు ఆసక్తిఉన్న వేరే బ్రాంచ్‌కు బదిలీ అయ్యే అవకాశం కూడా ఉందని తెలిపారు. ఇంజనీరింగ్ రంగానికి మాత్రమే పరిమితం కాకుండా.. వైద్య రంగానికి అవసరమైన టెక్నాలజీలను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించామన్నారు. వైద్య అనుబంధ అంశాలకు సంబంధించి ప్రత్యేక విభాగాన్ని త్వరలోనే ఏర్పాటు చేస్తామన్నారు. వాస్తవ పరిస్థితులను పరిగణిస్తూ బోధన, కరిక్యులం, పరిశోధనల విషయంలో ఎప్పటికొప్పుడు మార్పులు, చేర్పులు చేపడుతున్నామని సృజనాత్మకతకు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు అన్ని రకాల అవకాశాలు, సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ చర్యల ఫలితంగానే ఐఐటీ మద్రాస్ ఏడేళ్లుగా ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్‌లో తొలిస్థానంలో కొనసాగుతోందన్నారు. విద్యార్థులకు మంచి ప్లేస్మెంట్లూ దక్కుతున్నాయని కామకోటి చెప్పారు. 2021–22 విద్యా సంవత్సరంలో మొత్తం విద్యార్థుల్లో 80 శాతం మందికి ప్లేస్మెంట్ ఆఫర్స్ లభించాయని, మొత్తం 1,199 మందికి ఆఫర్లు లభించగా అందులో 45 మందికి అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగావకాశాలు వచ్చాయని తెలిపారు. 25 శాతం మేర తెలుగు విద్యార్థులే ఐఐటీ మద్రాస్‌లో తెలుగు విద్యార్థుల సంఖ్య ఎక్కువగానే ఉందని, అన్ని విభాగాలను పరిగణనలోకి తీసుకుంటే దాదాపు 25 శాతం మంది విద్యార్థులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారని ప్రొఫెసర్ కామకోటి తెలిపారు. అన్ని రంగాల్లోనూ మంచి అవకాశాలు ‘ప్రస్తుత తరం విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో కెరీర్ అంటే ఇంజనీరింగ్, అందుకు ఐఐటీలే మేలు మార్గమని అనే భావన నెలకొంది. అయితే ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ అవకాశాలు బాగానే ఉన్నాయి. కాబట్టి విద్యార్థుల సహజ ఆసక్తి, నైపుణ్యాలకు అనుగుణంగా ఇతర కోర్సులకూ ప్రాధాన్యమివ్వాలి. ఐఐటీలో సీటు రాకపోతే భవిష్యత్తు లేదన్న ఆందోళన అర్థరహితం. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల ఆసక్తి ఏంటో తెలుసుకోకుండానే వారిని బీటెక్, కంప్యూటర్ సైన్స్ కోర్సులో చేరేలా ఒత్తిడి చేస్తున్నారు. ఇది సరికాదు’ అని కామకోటి అన్నారు. ఆన్లైన్ కోర్సులను అందిపుచ్చుకోవాలి ‘ఐఐటీలో చేరే అవకాశం కోల్పోయిన విద్యార్థులు ఆన్లైన్ కోర్సుల అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. ప్రస్తుతం ఎన్పీటీఈఎల్ పోర్టల్ ద్వారా ఐఐటీ ప్రొఫెసర్ల లెక్చర్లు వేల సంఖ్యలో అందుబాటులో ఉన్నాయి. ఐఐటీ తరగతి గదిలో చెప్పిన అంశాలు యథాతథంగా ఉంటాయి. వీటిని అనుసరించడం ఫలితంగా నిపుణులైన ప్రొఫెసర్ల లెక్చర్లు విని తమ సబ్జెక్ట్‌లలో నైపుణ్యం పెంచుకునే అవకాశం లభిస్తుంది’ అని కామకోటి సూచించారు. రెండేళ్లుగా జేఈఈ–అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసుకొనే వారి సంఖ్య తగ్గుతున్నప్పటికీ ఐఐటీలపై క్రేజ్ తగ్గుతోందనే అభిప్రాయం సరికాదని అన్నారు. పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులు హాజరైన ఈ సదస్సులో కామకోటితోపాటు ఐఐఎం–ఎం అలూమ్నీ అండ్ కార్పొరేట్ రిలేషన్స్ డీన్ ప్రొఫెసర్ మహేశ్ పంచాజ్ఞుల, ఆస్క్ ఐఐటీఎం ప్రతినిధులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. -
కార్పొరేట్‌కు దీటుగా... ప్రతిభకు రెడ్ కార్పెట్
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లు దేశంలోనే అత్యంత ప్రముఖ విద్యాసంస్థలు. ఆ విద్యాసంస్థల్లో చదవాలనే కోరిక చాలా మంది విద్యార్థుల్లో ఉంటుంది. అయితే ప్రతిభ కలిగినా పేదరికం కారణంగా కొంతమంది ఆ విద్యా సంస్థల్లో చేరడానికి వెనుకాడతారు. అలాంటి వారికి మెరుగైన అవకాశాలు కల్పించడం కోసం పలు ఐఐటీలు గతంలో ఎన్నడూ లేనంతగా ప్రత్యేక ఆఫర్లు ప్రకటించాయి. పేద విద్యార్థులకు ఫీజులను పూర్తిగా తామే భరిస్తామంటూ కొన్ని ముందుకు రాగా వసతి, భోజనాలతో పాటూ ఫీజుల భారమూ తామే చూసుకుంటామని మరికొన్ని ప్రకటించాయి. ఇంకొన్ని అయితే ఆయా విద్యార్థులకు ఫీజులు, వసతితో పాటు పుస్తకాలు ఇతర మెటీరియల్ ఖర్చులు, ప్రయాణ భత్యాలు, పాకెట్ మనీ కూడా ఇస్తామని ఆఫర్ ఇచ్చాయి. ఐఐటీలలో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైన వెంటనే ఆయా విద్యాసంస్థలు తమ ఆఫర్లను ప్రకటించాయి. జాయింట్ సీట్ అలోకేషన్ అథారిటీ (జోసా) జేఈఈ అడ్వాన్స్ అనంతరం కౌన్సెలింగ్ ప్రక్రియను చేపట్టి మొత్తం ఆరు విడతల కౌన్సెలింగ్ మెరిట్ జాబితాలను ప్రకటించింది. జేఈఈ అడ్వాన్స్‌లో మెరిట్ సాధించిన పేద విద్యార్థుల తల్లిదండ్రుల ఆదాయం ఆధారంగా వారి విద్యను కొనసాగించడంలో సహాయపడటానికి ఈ ఐఐటీలు స్కాలర్షిప్లు, ఫీజు మినహాయింపులను అందిస్తామని పేర్కొన్నాయి. ఫలితంగా మెరిట్ ఉన్న పేద విద్యార్థులు ఐఐటీల్లో చేరేందుకు మొగ్గుచూపారు. బాగా చదివితే చాలు ఇక అన్నీ ఉచితమే అన్నట్లుగా ఐఐటీలు పోటీపడి ఆఫర్లు ఇచ్చాయి. ఐఐటీలు.. వాటి ఆఫర్లు ఐఐటీ బాంబే: బీటెక్ లేదా డ్యూయల్–డిగ్రీ ప్రోగ్రామ్‌లలో అడ్మిషన్ కోరుకునే అభ్యర్థులకు జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మంచి ర్యాంక్ ఉండి, వారి తల్లిదండ్రుల సంవత్సరాదాయం రూ. 5 లక్షలకు మించకుంటే మెరిట్–కమ్ మీన్స్ స్కాలర్షిప్ను అందిస్తామని ఐఐటీ బాంబే పేర్కొంది. తల్లిదండ్రుల సంవత్సరాదాయం రూ. 4.5 లక్షలకన్నా తక్కువ ఉన్న ఎస్సీ, ఎస్టీలకు భోజన సదుపాయంతో పాటు నెలకు రూ. 250 పాకెట్ అలవెన్స్ ఇస్తామంది. అవే కాకుండా ఆ విద్యార్థులకు అధికారికంగా నిర్ణయించిన ట్యూషన్ ఫీజు, హాస్టల్ అద్దె చెల్లింపు నుంచి మినహాయింపును ప్రకటించింది. ఐఐటీ గాంధీనగర్: జేఈఈ అడ్వాన్స్డ్ కామన్ ర్యాంకు జాబితాలో 1,000, ఆపైన ర్యాంకును పొందిన విద్యార్థులకు ప్రత్యేక స్కాలర్షిప్ను అందిస్తామని ఐఐటీ గాంధీనగర్ వెల్లడించింది. బీటెక్ నాలుగేళ్ల ట్యూషన్ ఫీజు మొత్తాన్ని సంస్థ భరించేలా ఆ స్కాలర్షిప్ ఉంటుందని వివరించింది. ఐఐటీ భిలాయ్: అన్రిజర్వ్డ్ విద్యార్థులతో పాటు ఓబీసీ వర్గాలకు చెందిన అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు మెరిట్–కమ్–మీన్స్ స్కాలర్షిప్ను ఐఐటీ భిలాయ్ అందిస్తోంది. వీరి గరిష్ట పరిమితి సంఖ్యను 25 శాతంగా పేర్కొంది. కుటుంబ ఆదాయం సంవత్సరానికి రూ.1 లక్ష నుంచి రూ. 5 లక్షల మధ్య ఉన్న ఈడబ్ల్యూఎస్ కేటగిరీ విద్యార్థులకు ట్యూషన్ ఫీజులో మూడింట రెండు వంతుల రాయితీని ఇస్తోంది. నెలకు రూ. 1,000 పాకెట్ మనీని అందించనున్నట్లు పేర్కొంది. ఐఐటీ మద్రాస్: తల్లిదండ్రుల సంవత్సరాదాయం రూ. 1 లక్ష కంటే తక్కువ ఉండే మెరిటోరియస్ అభ్యర్థులు బీటెక్ లేదా డ్యూయల్–డిగ్రీ ప్రోగ్రామ్‌లలో అడ్మిషన్ పొందితే పూర్తి ట్యూషన్ ఫీజు మినహాయింపు ఇవ్వనున్నట్లు ఐఐటి మద్రాస్ ప్రకటించింది. తల్లిదండ్రుల సంవత్సరాదాయం రూ.4.5 లక్షల కంటే తక్కువ ఉన్న అభ్యర్థులకు నెలకు రూ. 1,000తో కూడిన మెరిట్ –కమ్ –మీన్స్ స్కాలర్షిప్ ఇవ్వనున్నట్లు పేర్కొంది. తల్లిదండ్రుల ఆదాయం రూ. 4.5 లోపు ఉన్నవారికి ట్యూషన్ ఫీజులో మూడింట రెండు వంతుల మినహాయింపు ప్రకటించింది. ఐఐటీ ఢిల్లీ జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మెరిట్ సాధించిన విద్యార్థులకోసం ఐఐటీ ఢిల్లీ ఎండోమెంట్ ఫండ్‌ను ఏర్పాటు చేసింది. 30 మంది మెరిట్ విద్యార్థులకు ఏడాదికి 1 లక్ష చొప్పున అందించనుంది. ఈ స్కాలర్షిప్ పథకంలో 15 మంది పురుషులకు, 15 మంది మహిళా విద్యార్థులకు అవకాశం కల్పిస్తామని వెల్లడించింది. ఐఐటీ కాన్పూర్ మెరిట్ విద్యార్థుల కోసం ఐఐటీ కాన్పూర్ ‘బ్రైట్ మైండ్ స్కాలర్షిప్’ను ప్రకటించింది. జేఈఈ అడ్వాన్స్డ్ మొదటి 100 ర్యాంక్‌లలో నిలిచిన విద్యార్థులు తమ ఇన్స్టిట్యూట్లో బీటెక్, బీఎస్ ప్రోగ్రామ్‌లో ప్రవేశం పొందితే ఈ స్కాలర్షిప్ కింద రూ.3 లక్షలు ఇవ్వనుంది. విద్యార్థుల హాస్టల్, పుస్తకాలు, ఇతర ఖర్చులతో పాటు మొత్తం ట్యూషన్ ఫీజులను ఈ స్కాలర్షిప్ కవర్ చేస్తుంది. -
జేఈఈ–అడ్వాన్స్డ్ టాపర్ చిరాగ్
న్యూఢిల్లీ/పుణే: ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్(జేఈఈ)–అడ్వాన్స్డ్ పరీక్షలో మహారాష్ట్రలోని పుణే విద్యార్థి చిరాగ్ ఫలోర్ టాపర్‌గా నిలిచాడు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన గంగుల భువన్‌రెడ్డి రెండో ర్యాంకు, బిహార్‌కు చెందిన వైభవ్‌రాజ్ మూడో ర్యాంకు సాధించారు. ఈ పరీక్ష ఫలితాలను ఐఐటీ–ఢిల్లీ సోమవారం ప్రకటించింది. ఈ ఏడాది జేఈఈ–అడ్వాన్స్డ్ పరీక్షను ఐఐటీ–ఢిల్లీ నిర్వహించింది. దేశవ్యాప్తంగా మొత్తం 1.6 లక్షల మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా, 1.5 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. 43 వేల మందికిపైగా అర్హత సాధించారు. వీరిలో 6,707 మంది బాలికలు ఉన్నారు. మొదటి ర్యాంకు సాధించిన చిరాగ్ ఫలోర్ మొత్తం 396 మార్కులను గాను 352 మార్కులు సాధించాడు. 17వ ర్యాంకర్ కనిష్కా మిట్టల్ బాలికల్లో అగ్రస్థానంలో నిలిచారు. అమె 315 మార్కులు సాధించారు. జేఈఈ–అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించిన వారికి కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ అభినందనలు తెలియజేశారు. ఆయన సోమవారం ట్వీట్ చేశారు. సమీప భవిష్యత్తులో ఆత్మ నిర్భర్ భారత్ కోసం పని చేయాలని కోరారు. పరీక్షలో కోరుకున్న ర్యాంకు పొందలేకపోయిన వారికి ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయని గుర్తు చేశారు. జేఈఈ–అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించిన విద్యార్థులు దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో ప్రవేశాలు పొందనున్నారు. ఎంఐటీలోనే చదువు కొనసాగిస్తా: చిరాగ్ జేఈఈ–అడ్వాన్స్డ్ టెస్టులో తనకు మొదటి ర్యాంకు దక్కినప్పటికీ అమెరికాలోని ప్రతిష్టాత్మక మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ)లోనే చదువు కొనసాగిస్తానని చిరాగ్ ఫలోర్ తెలిపాడు. ఈ ఏడాది మార్చి లో ఎంఐటీలో అడ్మిషన్ పొందానని, ప్రస్తుతం ఆన్లైన్ ద్వారా క్లాస్‌లకు హాజరవుతున్నానని వెల్లడించాడు. జేఈఈ–మెయిన్‌లో 12వ ర్యాంకు పొందిన చిరాగ్ అడ్వాన్స్‌డ్‌లో ఏకంగా ఫస్టు ర్యాంకు సొంతం చేసుకోవడం విశేషం. ఐఐటీల్లో సీటు దక్కించుకోవడం చాలా కష్టమైన విషయమని చిరాగ్ వివరించాడు. ప్రతిభకు మెరుగుదిద్దే విద్యావిధానం ఉన్న ఎంఐటీలోనే చదువు కొనసాగిస్తానని పేర్కొన్నాడు. ఎంఐటీ ప్రవేశ పరీక్ష కంటే జేఈఈ టెస్టే కఠినంగా ఉంటుందని, ఈ పరీక్ష తనకు భిన్నమైన ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని పేర్కొన్నాడు. చిరాగ్ ఫలోర్ ఢిల్లీని ప్రగతి పబ్లిక్ స్కూల్, పుణేలోని సెయింట్ ఆర్నాల్డ్ సెంట్రల్ స్కూల్లో చదివాడు. 2019లో హంగేరీలో జరిగిన 13వ అస్ట్రానమీ, ఆస్ట్రోఫిజిక్స్ ఇంటర్నేషనల్ ఒలంపియాడ్లో గోల్డ్ మెడల్ గెలుచుకున్నాడు. 2019లో అమెరికన్ మ్యాథమెటిక్స్ పోటీలో ఫస్టు ర్యాంకు కైవసం చేసుకున్నాడు. 2020 సంవత్సరానికి గాను బాలశక్తి పురస్కారం స్వీకరించాడు. ప్రధాని మోదీ నుంచి ప్రశంసలు అందుకున్నాడు. జాతీయ స్థాయిలో టాప్ 10 ర్యాంకర్లు... 1. చిరాగ్ ఫాలర్ (మహారాష్ట్ర) 2. గంగుల భువన్ రెడ్డి (ఆంధ్రప్రదేశ్) 3. వైభవ్‌రాజ్ (బిహార్) 4. ఆర్.మహేందర్‌రాజ్ (రాజస్తాన్) 5. కేశవ్ అగర్వాల్ (హరియాణా) 6. హర్ధిక్ రాజ్‌పాల్ (తెలంగాణ) 7. వేదాంగ్ ధీరేంద్ర అస్గోవాంకర్ (మహారాష్ట్ర) 8. స్వయం శశాంక్ చూబే (మహారాష్ట్ర) 9. హర్షవర్ధన్ అగర్వాల్ (హరియాణా) 10. ధ్వనిత్ బేనీవాల్ (హరియాణా) -
జేఈఈ అడ్వాన్స్ టాపర్.. చిరాగ్ ఫలోర్
న్యూఢిల్లీ: జేఈఈ అడ్వాన్స్ ఫలితాల్లో పుణేకు చెందిన చిరాగ్ ఫలోర్ మొదటి ర్యాంకు దక్కించుకున్నాడు. 352 మార్కులతో ఆల్ ఇండియా టాపర్‌గా నిలిచాడు. ఐఐటీ బాంబే జోన్ నుంచి అతడు జేఈఈ అడ్వాన్స్ పరీక్ష రాశాడు. కాగా 317 మార్కులతో కనిష్కా మిట్టల్ అనే విద్యార్థిని బాలికల విభాగంలో మొదటి స్థానం దక్కించుకుంది. ప్రధాని మోదీతో అనుబంధం... ఈ ఏడాది జనవరి 24న చిరాగ్ ఫలోర్ ప్రతిష్ఠాత్మక 'బాల పురస్కార్' అవార్డు దక్కించుకున్నాడు. స్వయంగా ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోవడం విశేషం. మాథ్స్, సైన్స్ కాంపిటీషన్స్‌లో పాల్గొని ఆస్ట్రోనమీ, ఆస్ట్రోఫిజిక్స్ సబ్జెక్టుల్లో భారత్ తరపున అంతర్జాతీయ ఒలంపియాడ్ అవార్డు దక్కించుకున్నాడు. ఈ విషయాన్ని ప్రధాని తన ట్విటర్లో షేర్ చేశారు. Meet my friend Chirag Falor, a Bal Puraskar awardee. Winner of national and international math and science competitions, he represented India in the International Olympiad Award on Astronomy and Astrophysics. Chirag has a bright future ahead and I wish him success. pic.twitter.com/B2YPdIsWb3 — Narendra Modi (@narendramodi) January 24, 2020 -
కటాఫ్ 86.19 మించి?
సాక్షి, హైదరాబాద్: ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు పరిగణనలోకి తీసుకునే విద్యార్థుల కటాఫ్ పర్సంటైల్ ఈసారి ఓపెన్ కేటగిరీలో 86.19 వరకు ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 7 నుంచి 9 వరకు జరిగిన జేఈఈ మెయిన్ పరీక్షలకు హాజరైన విద్యార్థుల సంఖ్యను బట్టి ఈ అంచనాకు వచ్చారు. అయితే ఏప్రిల్‌లో మరో దశ జేఈఈ మెయిన్ నిర్వహించనున్న నేపథ్యంలో అడ్వాన్స్డ్ కటాఫ్ పర్సంటైల్‌లో మార్పు ఉంటుందని చెబుతున్నారు. ఏప్రిల్ 3 నుంచి 9లోపు జరిగే పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల సంఖ్యను బట్టి కటాఫ్ పర్సంటైల్ నిర్ధారణ జరుగుతుందని పేర్కొంటున్నారు. జనవరిలో జేఈఈ మెయిన్‌కు దరఖాస్తు చేసుకుని పరీక్షలకు హాజరు కాని విద్యార్థులంతా ఏప్రిల్‌లో హాజరైతే ఓపెన్ కేటగిరీలో కటాఫ్ పర్సంటైల్ 86.98 వరకు ఉండొచ్చని, విద్యార్థుల సంఖ్య మరింత పెరిగితే కటాఫ్ కూడా పెరుగుతుందని చెబుతున్నారు. అయితే ఏప్రిల్ జేఈఈ ఫలితాల తర్వాత అడ్వాన్స్‌డ్‌ను పరిగణనలోకి తీసుకునే కటాఫ్ పర్సంటైల్‌ను ఎన్టీఏ అధికారికంగా ప్రకటించనుంది. లెక్కించుకోవడం సులభమే.. జేఈఈ మెయిన్ పరీక్షలను ఆన్లైన్లో నిర్వహిస్తున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) వివిధ దశల్లో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల స్కోరును పర్సంటైల్ రూపంలో ఇస్తోంది. ఈసారి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు కటాఫ్ లెక్కింపుపై విద్యార్థుల్లో కొంత ఆందోళన నెలకొంది. విద్యార్థుల స్కోరును మార్కుల రూపంలో కాకుండా పర్సంటైల్ విధానంలో ఇచ్చినా.. జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఎంపికయ్యే వారి సంఖ్యను లెక్కించుకోవడం సులభమేనని నిపుణులు చెబుతున్నారు. కటాఫ్ లెక్కింపు ఇలా.. ఈ సారి మే 17న నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు అన్ని కేటగిరీల్లో కలిపి 2.5 లక్షల మందిని ఎంపిక చేస్తామని జేఈఈ ఆర్గనైజింగ్ కమిటీ ప్రకటించింది. అందులో 50.5 శాతం విద్యార్థులను (1,26,250 మంది) ఓపెన్ కేటగిరీలో జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు అర్హులుగా పరిగణనలోకి తీసుకుంటారు. అందులో దివ్యాంగులు 5 శాతం మినహాయిస్తే 1,19,938 మందిని ఓపెన్ కేటగిరీలో అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేస్తారు. అయితే మొన్నటి జేఈఈ మెయిన్‌కు మొత్తం 8,69,010 మంది విద్యార్థులు హాజరయ్యారు. అందులో అడ్వాన్స్‌డ్‌కు ఓపెన్ కేటగిరీలో పరిగణనలోకి తీసుకునే విద్యార్థుల సంఖ్య 1,19,938. అంటే అది 13.80168237 శాతం అవుతుంది. దీన్ని టాప్ 100.0000 పర్సంటైల్ నుంచి తీసేస్తే 86.19 పర్సంటైల్ వస్తుందని, అదే జనవరి పరీక్షల ప్రకారం ఓపెన్ కేటగిరీలో కటాఫ్ అయ్యే అవకాశం ఉందని జేఈఈ నిపుణుడు కుమార్ వివరించారు. ఏప్రిల్‌లో పెరగనున్న విద్యార్థుల సంఖ్య.. ఇటీవల జరిగిన జేఈఈ మెయిన్ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న వారిలో 52,251 మంది విద్యార్థులు పరీక్షలు రాయలేదు. వారంతా ఏప్రిల్‌లో జరిగే పరీక్షలకు కచ్చితంగా హాజరవుతారు. దీంతో మొత్తం విద్యార్థుల సంఖ్య 9,21,261కి చేరనుంది. మరోవైపు ప్రభుత్వ కాలేజీల విద్యార్థులు రెండుసార్లు దరఖాస్తు చేసుకోరు కాబట్టి ఏప్రిల్‌లో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల సంఖ్య 9,21,261కి మించి కూడా ఉండే అవకాశం ఉంది. అయితే జనవరి జేఈఈకి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులంతా (9,21,261 మంది) ఏప్రిల్‌లో జేఈఈ మెయిన్‌కు హాజరైతే, అందులో ఓపెన్ కేటగిరీలో అడ్వాన్స్డ్ పరిగణనలోకి తీసుకునే విద్యార్థుల సంఖ్య (1,19,938) అనేది 13.01889475 శాతం అవుతుంది. దానిని టాప్ 100.000 పర్సంటైల్ నుంచి తీసివేస్తే 86.98 పర్సంటైల్ వస్తుంది. అప్పుడు అది ఓపెన్ కేటగిరీ కటాఫ్ కానుంది. ఏప్రిల్‌లో పరీక్షలకు హాజరయ్యేందుకు దరఖాస్తు చేసుకునే విద్యార్థుల సంఖ్య పెరిగితే ఓపెన్ కటాఫ్ మరింతగా పెరిగే అవకాశం ఉంది. పర్సంటైల్ ఆధారంగా ర్యాంకు.. విద్యార్థులకు వచి్చన పర్సంటైల్ ఆధారంగా ర్యాంకు లెక్కించుకోవడం సులభమేనని నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు 91.6438702 పర్సంటైల్ విద్యారి్థని తీసుకుంటే.. టాప్ 100 పర్సంటైల్ నుంచి ఈ విద్యార్థి పర్సంటైల్ తీసేస్తే ఆ విద్యారి్థకి వచ్చేది 8.3561298. అంటే ప్రతి 100 మంది విద్యార్థుల్లో ఆ విద్యార్థి ర్యాంకు 8.3561298 అన్నమాట. ఆ లెక్కన పరీక్షకు హాజరైన మొత్తం విద్యార్థుల సంఖ్య 8,69,010తో గుణించి శాతం లెక్కిస్తే 72,615 వస్తుంది. అదే ఆ విద్యార్థి అంచనా ర్యాంకు అవుతుంది. అయితే జనవరిలో జరిగిన జేఈఈ పరీక్షలను 6 స్లాట్లలో నిర్వహించినందున (ఒకే ర్యాంకు ఆరుగురికి వచ్చే అవకాశం ఉన్నందున) అతడి ర్యాంకు 72,615కు 6 స్థానాలు అటూ ఇటుగా మారే అవకాశం ఉంటుంది. ఒకే ర్యాంకు ఉండదు ర్యాంకుల కేటాయింపు సమయంలో 100 పర్సంటైల్ వచి్చన విద్యార్థులు అందరికీ ఒకే ర్యాంకు ఇవ్వరు. వారికి ర్యాంకులను కేటాయించే సమయంలో విద్యార్థి మొత్తం మార్కులు చూస్తారు. పలువురు విద్యార్థులకు సమాన మార్కులు ఉంటే.. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో వచి్చన మార్కులను చూసి, ఆయా సబ్జెక్టుల వరుస క్రమంలో ఎక్కువ మార్కులు ఉన్న వారికి ముందు ర్యాంకులు కేటాయిస్తారు. ఆ మార్కులు సమానంగా ఉంటే ఎక్కువ వయసు వారికి ముందు ర్యాంకు కేటాయించి, మిగతా వారికి వరుసగా కిందకు ర్యాంకులు కేటాయిస్తారు. అయితే ఈ ర్యాంకులను విద్యార్థులకు ఇప్పుడే ఇవ్వరు. ఏప్రిల్‌లో జరిగే పరీక్ష తర్వాతే 2 దశల్లో జేఈఈ మెయిన్‌కు హాజరైన విద్యార్థులను, వారికి వచి్చన పర్సంటైల్‌ను తీసుకొని ర్యాంకులను కేటాయిస్తారు. వాటి ఆధారంగానే ఐఐటీల్లో ప్రవేశాలు చేపడతారు. -
కొత్తగా జేఈఈ–మెయిన్
ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్స్ ఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రవేశం కోసం నిర్వహించే పరీక్ష.. జేఈఈ మెయిన్ 2020కు నోటిఫికేషన్ విడుదలైంది. జేఈఈ మెయిన్‌తో నేరుగా ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలతోపాటు కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్లో ప్రవేశం పొందొచ్చు. అదేవిధంగా ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు సైతం అర్హత పరీక్ష జేఈఈ మెయిన్. ఏటా రెండుసార్లు జనవరి, ఏప్రిల్‌లో పరీక్ష జరగనుంది. లక్షల మంది ఇంటర్ ఎంపీసీ/10+2 విద్యార్థులు ఎదురు చూసే జేఈఈ మెయిన్ పరీక్షలో జాయింట్ అడ్మిషన్ బోర్డు(జేఏబీ) కీలక మార్పులు చేసింది. మరో నాలుగు నెలల్లోనే పరీక్ష జరగనున్న నేపథ్యంలో జేఈఈ మెయిన్‌లో మార్పులు, దరఖాస్తు తీరుతెన్నులు, పరీక్ష విధానంపై సమగ్ర కథనం.. మార్పులు ఇవే గతేడాది వరకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్‌ల నుంచి ప్రతీ దాంట్లో నుంచి 30 చొప్పున 90 ప్రశ్నలు ఉండేవి. వచ్చే జనవరి మెయిన్ పరీక్షల నుంచి వాటిలో ఒక్కో సబ్జెక్ట్ నుంచి ఐదు ప్రశ్నలను తగ్గించి 25 ప్రశ్నల చొప్పున మొత్తం 75 ప్రశ్నలను ఇవ్వనుంది. గతంలో మొత్తం 360 మార్కులకు పరీక్షలను నిర్వహించగా.. ఇకపై వాటిని 300 మార్కులకే పరిమితం చేసింది. గతంలో అన్నీ బహుళ ఐచ్చిక ప్రశ్నలు ఉండగా.. ఇకపై 20 బహుళ ఐచ్చిక ప్రశ్నలు, 5 దశాంశ∙స్థాన తరహ(న్యూమరికల్ వాల్యు) ప్రశ్నలు అడగనున్నారు. గతంలో అన్ని ప్రశ్నలకు నెగిటివ్ మార్కింగ్ విధానం అమల్లో ఉండేది. ఇకపై దశాంశ స్థాన ప్రశ్నలకు రుణాత్మక మార్కుల విధానం నుంచి మినహాయింపు ఇచ్చారు. బీఆర్క్ పేపర్లో జరిగిన మార్పు బీఆర్క్‌లో ప్రవేశానికి నిర్వహించే మెయిన్ పేపర్ 2 పరీక్షల్లోనూ జేఏబీ మార్పులు చేసింది. బీఆర్క్ పరీక్షల్లో ఇప్పటి వరకు 100 ప్రశ్నలు ఉండేవి. ఇకపై వాటి సంఖ్యను 77కు తగ్గించింది. వీటిలో అయిదు ప్రశ్నలను న్యూమరికల్ వాల్యూ తరహా ప్రశ్నలు ఇవ్వనుంది. గతంలో డ్రాయింగ్కు సంబంధించి 3 ప్రశ్నలు అడిగితే.. ఇకపై వాటి సంఖ్యను 2 కే పరిమితం చేసింది. బీఆర్క్‌లో మ్యాథమెటిక్స్ పార్ట్–1, ఆప్టిట్యూడ్ టెస్ట్ పార్ట్–2.. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో ఆన్లై న్లో జరుగుతాయి. డ్రాయింగ్ టెస్ట్ మాత్రం పెన్–పేపర్ విధానంలో ఆఫ్‌లైన్‌లో ఉంటుంది. బీప్లానింగ్ పేపర్లో ఇలా.. గతంలో బీ ప్లానింగ్‌లో ప్రవేశానికి ఇంటర్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ తప్పనిసరి, ఇప్పుడు మ్యాథ్స్ మినహా మిగతా ఏ సబ్జెక్టు ఉన్న పర్వాలేదు. దీంతో ఎంఈసీ విద్యార్థులు కూడా బీప్లానింగ్‌లో ప్రవేశానికి అర్హులవుతారు. బీప్లానింగ్‌లో మ్యాథమెటిక్స్ పార్ట్–1, ఆప్టిట్యూడ్ టెస్ట్ పార్ట్–2, ప్లానింగ్ బేస్డ్ కొశ్చన్స్ పార్ట్–3 కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ) విధానంలో జరుగుతాయి. పరీక్ష జేఈఈ మెయిన్ పరీక్షను ఏడాదికి రెండుసార్లు జనవరి, ఏప్రిల్‌లో ఆన్లైన్లో నిర్వహిస్తారు. ప్రస్తుతం జేఈఈ మెయిన్–2020(జనవరి) పరీక్షకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఒక అభ్యర్థి రెండుసార్లు పరీక్షకు హాజరుకావచ్చు. రెండు పరీక్షల్లో దేనిలో ఎక్కువ మార్కులు వస్తే వాటినే అడ్మిషన్ సమయంలో పరిగణనలోకి తీసుకుంటారు. ఇంటర్మీడియెట్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలపై ప్రశ్నలు ఉంటాయి. ప్రతి సబ్జెక్టులో 25కు 20 ప్రశ్నలు మల్టిపుల్ ఛాయిస్విగా ఉంటాయి. మిగిలిన ఐ దు ప్రశ్నలు దశాంశ స్థాన తరహావి అడుగు తారు. 20 ప్రశ్నలకు నెగిటివ్ మార్కుల విధా నం ఉండగా.. మిగతా ఐదు ప్రశ్నలకు మా త్రం రుణాత్మక మార్కుల నుంచి మినహయిం పు ఉంది. ప్రతి సరైన సమాధానానికి 4 మార్కు లు కేటాయిస్తే; ప్రతి తప్పు సమాధానానికి ఒక మా ర్కు కోత ఉంటుంది. న్యుమరికల్ వాల్యూ ప్రశ్నలకు సరైన సమాధానానికి 4 మార్కులు లభిస్తాయి, తప్పు సమాధానానికి ఎలాంటి నెగిటివ్ మార్కులు ఉండవు. అర్హత ఇంటర్(ఎంపీసీ)/10+2 2018, 2019లో ఉత్తీర్ణులైన విద్యార్థులు జేఈఈ మెయిన్ రాసేందుకు అర్హులు. అలాగే 2020లో ఫైనల్ ఇయర్ ప్రవేశాలు పరీక్షలు రాయనున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. జేఈఈ మెయిన్‌కు ఎలాంటి గరిష్ట వయోపరిమితిలేదు. కానీ, ఐఐటీల్లో ప్రవేశాలకు గరిష్ట వయోపరిమితి నిబంధన ఉంది. ప్రిపరేషన్ టిప్స్ జేఈఈ మెయిన్‌లో మంచి స్కోర్ సాధించేందుకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీపై పట్టు సాధించడం తప్పనిసరి. కాబట్టి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల సిలబస్‌ను లోతుగా అధ్యయనం చేయాలి. గత ప్రశ్న పత్రాలను పరిశీలించి.. ఏ అంశాలకు ఎక్కువ వెయిటేజీ ఉందో గుర్తించాలి. సిలబస్‌లోని అన్ని టాపిక్స్ ముఖ్యమైనవే అయినప్పటికీ.. పరీక్ష కోణం లో కొన్ని అంశాలు కీలకంగా ఉంటాయి. వీటిని గుర్తించడం చాలా ముఖ్యం. ఆయా సబ్జెక్టుల ప్రిపరే షన్‌కు ప్రణాళిక రూపొందించుకొని ప్రతిరోజూ చదు వుతుండాలి. నాలుగు నెలల సమయం మాత్రమే అందుబాటులో ఉన్నందున అందుకు తగ్గట్లు ఎవ్రీ డే, వీక్లీ, మంత్లీ ప్రిపరేషన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలి. కష్టమైన టాపిక్స్‌కు కొంత ఎక్కువ సమయం కేటాయించాలి. ఎన్సీఈఆర్టీ పుస్తకాలను చదు వుతూ.. తొలుత కాన్సెప్ట్లపై అవగాహన పెంచు కోవాలి. ఆ తర్వాత రోజూ వీలైనన్ని ఎక్కువ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి. అలాగే ఆయా పుస్తకాలు చదివేటప్పుడే ముఖ్యాంశాలు, సూత్రాలు నోట్స్‌లో రాసుకోవాలి. ఈ షార్ట్‌నోట్స్ పరీక్షకు ముందు వేగంగా రివిజిన్ చేయడంలో దోహదపడుతుంది. దరఖాస్తు ఫీజు ♦ జనరల్, ఓబీసీ (అబ్బాయిలు) రూ.650; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, అమ్మాయిలకు (జనరల్, ఓబీసీ) రూ.325. ♦ ఏపీలో పరీక్ష కేంద్రాలు: అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, నర్సరావుపేట, ప్రొద్దుటూరు, సూరంపాలెం. ♦ తెలంగాణలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్/సికింద్రాబాద్/రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్గొండ, వరంగల్. ముఖ్య సమాచారం ♦ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: సెప్టెంబర్ 3, 2019. ♦ దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 30, 2019. ♦ అడ్మిట్ కార్డ్ డౌన్లోడింగ్: డిసెంబర్ 6, 2019. ♦ పరీక్ష విధానం: ఆన్లైన్లో. ♦ పరీక్ష సమయం: 3 గంటలు. ♦ పరీక్ష తేదీ : 2020, జనవరి 6 నుంచి 11 వరకు. ♦ ఫలితాల వెల్లడి : 31.01.2020. ♦ వెబ్సైట్ : www.nta.ac.in -
అడ్వాన్స్‌డ్‌లో మరో 13,850 మందికి అర్హత
సాక్షి, హైదరాబాద్: ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ కటాఫ్‌ను ఐఐటీ కాన్పూర్ మరింత తగ్గించింది. ఈ నెల 10న ప్రకటించిన ఫలితాల్లో 18,138 మందే అర్హత సాధించడంతో తాజాగా కటాఫ్ మార్కులను తగ్గించి అర్హుల సంఖ్యను పెంచింది. మొదట ఓపెన్ కేటగిరీలో కటాఫ్ 126 మార్కులు ఉండగా, తాజాగా దానిని 90 మార్కులకు తగ్గి ంచింది. ఓబీసీ నాన్ క్రీమీలేయర్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీల్లోనూ కటాఫ్‌ను తగ్గించింది. దీంతో జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించిన వారి సంఖ్య 31,988కి పెరిగింది. తాజా తగ్గింపుతో 13,850 మంది విద్యార్థులకు అర్హత లభించింది. గత నెల 20న జరిగిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలకు 2.31 లక్షల మందిని అర్హులుగా ప్రకటించగా, 1,65,656 మంది దరఖాస్తు చేసుకోగా, 1,55,158 మంది పరీక్షలకు హాజరైన సంగతి తెలిసిందే. కటాఫ్ మార్కులను తగ్గించడంతో అర్హత సాధించిన బాలికల సంఖ్య రెట్టింపైంది. ఇంతకుముందు ప్రకటించిన ఫలితాల్లో 2,076 మంది బాలికలే అర్హత సాధించగా.. ప్రస్తుతం వారి సంఖ్య 4,179కి పెరిగింది. తాజా తగ్గింపుతో అదనంగా 2,013 మంది బాలికలకు అర్హత లభించింది. 1:2 రేషియో ఉండాలనే.. ఈసారి అడ్వాన్స్‌డ్‌లో అర్హుల సంఖ్య తగ్గడంపై కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సమీక్షించింది. గత సంవత్సరాల కంటే ఈసారి అ ర్హుల సంఖ్య భారీగా తగ్గినట్లు గుర్తించింది. అందుబాటులో ఉన్న సీట్లకు కనీసం 1:2 నిష్పత్తిలో అర్హులుండాలని ఐఐటీ కాన్పూర్‌కు తెలిపింది. దీంతో కటాఫ్ మార్కులను తగ్గించి, అర్హుల సంఖ్యను పెంచింది. తగ్గిన కటాఫ్ మార్కుల ప్రకారం అర్హత సాధించిన వారి ఫలితాలను వెబ్సైట్లో ఉంచింది. నేటి నుంచి కౌన్సెలింగ్ ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, జీఎఫ్‌టీఐల్లో ప్రవేశాల కోసం ఈ నెల 15 నుంచి కౌన్సెలింగ్‌ను నిర్వహించేందుకు జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ(జోసా) చర్యలు చేపట్టింది. విద్యార్థులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్ల ప్రక్రియను చేపట్టేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏడు దశల్లో ఈ కౌన్సె లింగ్‌ను నిర్వహించనుంది. రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్లకు 25వ తేదీ వరకు అవకాశం కల్పించి, 27న మొదటి దశ సీట్లను కేటాయించనుంది. జూలై 3న రెండో దశ, 6న మూడో దశ, 9న నాలుగో దశ, 12న ఐదో దశ, 15న 6వ దశ, 18న చివరి దశ సీట్ల కేటాయింపును ప్రకటించనుంది. కటాఫ్ మార్కుల వివరాలు ఇవీ.. కేటగిరీ ఇదివరకు తాజాగా ఓపెన్ 126 90 ఓబీసీ నాన్ క్రీమీలేయర్ 114 81 ఎస్సీ 63 45 ఎస్టీ 63 45 వికలాంగులు 63 45 -
రేపు జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్ : ఐఐటీల్లో ప్రవేశాలకు గత నెల 20న నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలను ఆదివారం విడుదల చేసేందుకు ఐఐటీ కాన్పూర్ ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 15 నుంచి ప్రవేశాలకు రిజిస్ట్రేషన్‌ను ప్రారంభించేందుకు జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ (జోసా) చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం 10 గంటలకు ఫలితాలను విడుదల చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ పరీక్షలకు దేశ వ్యాప్తంగా 1,55,091 మంది హాజరుకాగా రాష్ట్రం నుంచి 14 వేల మంది హాజరయ్యారు. -
రైతు కుటుంబంలో మెరిసిన విద్యా కుసుమం
బత్తలపల్లి : ఐఐటీ ప్రవేశాలు కోసం గత నెల 21న నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షా ఫలితాల్లో బత్తలపల్లి మండల కేంద్రానికి చెందిన గడుపూటి సుమంత్ జాతీయ స్థాయిలో 409వ ర్యాంకు సాధించాడు. బత్తలపల్లికి చెందిన రైతు గడుపూటి రమేష్‌బాబు, లక్ష్మీదేవి దంపతుల కుమారుడు గడుపూటి సుమంత్ జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంక్ సాధించడం పట్ల ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. పెద్దనాన్న గడుపూటి శేషయ్య ప్రోత్సాహంతో 10వ తరగతి నుంచే విజయవాడలోని శ్రీచైతన్యలో విద్య అభ్యసించాడు. ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం కూడా విజయవాడలోని శ్రీచైతన్యలోనే విద్య అభ్యసించాడు. ఇంటర్లో 15వ ర్యాంకు, తెలంగాణా ఎంసెట్‌లో 85వ ర్యాంకు సాధించాడు. మొదటగా జేఈఈ మెయిన్స్‌లో 589వ ర్యాంకు సాధించి అడ్వాన్స్డ్ పరీక్షలకు అర్హత సాధించగలిగాడు. అనంతరం జరిగిన పరీక్షల్లో 409వ ర్యాంకు సాధించాడు. డిల్లీ, చెన్నైలలోని ఐఐటీ క్యాంపస్‌ల్లో సీట్ దక్కె అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా సుమంత్ మాట్లాడుతూ ఐఏఎస్ చేసి కలెక్టర్ కావాలన్న లక్ష్యంతో ముందుకు వెళుతున్నట్లు వివరించారు.తన వెనుక కుటుంబ ప్రోత్సాహం ఉందన్నారు. వారి ఆశలను నెరవేర్చేందుకు కృషి చేస్తానన్నారు. అదేవిధంగా బత్తలపల్లికి చెందిన మరో విద్యార్థి కల్లె కార్తీక్ జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో 2501వ ర్యాంకు దక్కింది. -
ఏ ర్యాంకుకు ఎక్కడ సీటు?
వెబ్సైట్లో గతేడాది వివరాలు పొందుపరిచిన ఐఐటీ బాంబే సాక్షి, హైదరాబాద్: జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఏ ర్యాంకు వారికి ఎక్కడ సీటు వస్తుంది. ఏ బ్రాంచీల సీటు వచ్చే అవకాశం ఉంటుంది. ఇష్టమైన కాలేజీ, కోరుకున్న బ్రాంచిలో సీటు వస్తుందా? లేదా? వంటి అనుమానాలు నివృత్తి చేసుకునేందుకు ఐఐటీ బాంబే ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు 2013, 2014 సంవత్సరాల్లోని విద్యార్థుల ర్యాంకు, వారు పొందిన బ్రాంచి సీటు తదితర వివరాలను తమ వెబ్సైట్లో (http://jeeadv.iitb.ac.in/seat information) పొందుపరిచింది. విద్యార్థులు వెబ్సైట్లో పెట్టిన ప్రత్యేక లింక్‌ను ఉపయోగించుకొని తమ ర్యాంకులతో ఎక్కడ సీటు వస్తుందో తెలుసుకోవచ్చని (కచ్చితంగా అలాగే ఉండకపోవచ్చు కూడా) వెల్లడించింది. -
ఐఐటీలో అదరగొట్టారు..
జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో తెలుగు విద్యార్థుల జయకేతనం ♦ ఆలిండియా టాప్ టెన్‌లో ఐదు ర్యాంకులు మనవే ♦ తెలంగాణ, ఏపీ నుంచి 2,938 మంది అర్హులు ♦ ఏపీ నుంచి 2,155 మంది, తెలంగాణ నుంచి 783 మంది ♦ అత్యధికంగా 15,311 మంది సీబీఎస్ఈ విద్యార్థుల ఎంపిక ♦ మొత్తం అర్హులు 26,456 మంది సాక్షి, హైదరాబాద్: ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో తెలుగు విద్యార్థులు జయకేతనం ఎగురవేశారు. దేశవ్యాప్తంగా 1,24,741 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా వారిలో 1,17,238 మంది పరీక్షలకు హాజరయ్యారు. అందులో 26,456 మంది అర్హత సాధించారు. వీరిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచే 2,938 మంది విద్యార్థులు ఉన్నారు. జాతీయ స్థాయిలో టాప్-10 ర్యాంకుల్లో ఐదు ర్యాంకులను కూడా తెలుగు విద్యార్థులే కైవసం చేసుకున్నారు. గత నెల 24న నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ పూర్తిస్థాయి ఫలితాలను ఐఐటీ బాంబే గురువారం ప్రకటించింది. ఇందులో అర్హత సాధించిన వారిలో అత్యధికంగా సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) బోర్డుకు చెందిన విద్యార్థులే ఉన్నారు. ఇక తెలుగు విద్యార్థులు రెండో స్థానంలో నిలిచారు. ఇందులోనూ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు 2,155 మంది ఉండగా, తెలంగాణ నుంచి 783 మంది ఉన్నారు. అయితే టాప్ ర్యాంకులు సాధించిన తెలుగు విద్యార్థుల్లో ఎక్కువ మంది తెలంగాణ బోర్డు నుంచే ఇంటర్మీడియెట్ చదివిన వారు కావడం విశేషం. మొత్తానికి టాప్-500 ర్యాంకుల్లో ఎక్కువ మంది తెలుగు రాష్ట్రాల విద్యార్థులే ఉన్నారు. కాగా, జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో టాప్ ర్యాంకులను సాధించిన విద్యార్థులంతా బాలురే. టాప్-50 ర్యాంకుల్లో ఒకే ఒక్క బాలిక ఉంది. ఏఏటీ రిజిస్ట్రేషన్‌కు నేటి వరకే గడువు ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశానికి ప్రత్యేకంగా ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్టును(ఏఏటీ) ఈ నెల 21 నిర్వహించేందుకు ఐఐటీ బాంబే షెడ్యూల్ ప్రకటించింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్ష ఉంటుంది. ఇందుకోసం విద్యార్థులు శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ పరీక్షను బాంబే, ఢిల్లీ, గౌహతి, కాన్పూర్, ఖరగ్‌పూర్, మద్రాసు, రూర్కీ ఐఐటీల్లోనే నిర్వహించనుంది. పరీక్షకు హాజరయ్యే వారు జేఈఈ అడ్వాన్స్డ్ ఒరిజినల్ హాల్‌టికెట్(అడ్మిట్ కార్డు)ను వెంట తీసుకెళ్లాలి. విద్యార్థులు ఉదయం 8:30 గంటలకల్లా పరీక్ష కేంద్రంలో రిపోర్టు చేయాలి. ఆలస్యమైతే పరీక్షకు అనుమతించరు. అనారోగ్యాన్ని లెక్క చేయలేదు పరీక్షకు నెలరోజుల ముందు తీవ్రమై న జ్వరంతో బాధపడ్డాను. ఏమాత్రం అధైర్యపడకుండా పరీక్షకు హాజరయ్యా. ఆల్ ఇండియా 4వర్యాంకు రావడం గర్వంగా ఉంది. విజయం టీచర్ల ప్రోత్సాహం, తల్లిదండ్రుల దీవెనలు ఉన్నాయి. - నాగేంద్రరెడ్డి, ఆలిండియా4 వ ర్యాంక్ అందరి ప్రోత్సాహం వల్లే మాది కడప జిల్లా రాయచోటి. 504 మార్కులకు 424 వచ్చాయి. పటిష్టమైన ప్రణాళిక, అంకిత భావం, మంచి శిక్షణ నా విజయ రహస్యాలు. ముంబై ఐఐటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నాను. - కె.విష్ణువర్దన్‌రెడ్డి, ఆల్ ఇండియా 9వ ర్యాంక్ మామయ్యే స్ఫూర్తి మాది గుడివాడ. నాకు తొలి గురువు మామయ్య విజయప్రకాష్. ఆయన స్ఫూర్తితోనే కష్టపడి చదివాను. ఆల్ ఇండియాలో 39వ ర్యాంకు(ఎస్సీ కేటగిరీలో ఫస్ట్ ర్యాంక్) సాధించాను. ముంబై ఐఐటీలో సీఎస్సీ కోర్సులో చేరుతాను. - టి.భవన్, ఆల్ఇండియా 39వ ర్యాంక్ నమ్మలేక పోతున్నా నాకు 61వ ర్యాంకు వచ్చిందంటే నేనే నమ్మలేకపోతున్నా. ఈ విజయాన్ని నా గురువులకు అంకితమిస్తున్నా. ఆసక్తితో చదివితే ఏదైనా సాధ్యమే. నా విజయానికి కారణమైన నా తల్లిదండ్రులకు, గురువులకు కృతజ్ఞతలు. - అఖిల్, ఆల్ ఇండియా 61వ ర్యాంక్ చాలా ఆనందంగా ఉంది ఆల్ ఇండియా స్థాయిలో వందో ర్యాంకు రావడం చాలా సంతోషంగా ఉంది. నా తల్లిదండ్రులకు, నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించిన గురువులకు ఈ విజయాన్ని అంకితమిస్తున్నా. - కార్తీకేయ శర్మ, ఆల్ ఇండియా వందో ర్యాంకు -
‘జేఈఈ’లో రాష్ట్రమే టాప్
అడ్వాన్సడ్ పరీక్షకు 21,818 మంది ఎంపిక సాక్షి, హైదరాబాద్: జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించిన వారిలో మనరాష్ట్ర విద్యార్థులే ఎక్కువ మంది ఉన్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే మనమే ముందంజలో ఉన్నాం. జేఈఈ మెయిన్స్‌లో అత్యధిక మార్కులు సాధించిన వారే కాదు.. గత ఏడాది అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించిన విద్యార్థుల్లో రాష్ట్ర విద్యార్థులే ఎక్కువ. ఈసారి జేఈఈ మెయిన్స్‌కు రాష్ట్రం నుంచి 1.15 లక్షల మంది విద్యార్థులు హాజరుకాగా అందులో 21,818 మంది అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించారు. సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఈనెల 2న జేఈఈ మెయిన్స్ ఫలితాలు ప్రకటించింది. అందులో కేటగిరీల వారీగా అర్హత మార్కులను ప్రకటించింది. జనరల్ కేటగిరీలో 155 మార్కులు, ఓబీసీలకు 74 మార్కులు, ఎస్సీలకు 53 మార్కులు, ఎస్టీలకు 47 మార్కులను అర్హత మార్కులుగా ప్రకటించింది. వాటి ప్రకారం రాష్ట్రం నుంచి అడ్వాన్స్‌డ్‌కు 21,818 మంది ఎంపికయ్యారు. రెండవ స్థానంలో ఉత్తరప్రదేశ్ నిలిచింది. అక్కడి నుంచి ఈసారి 19,409 మంది విద్యార్థులు అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించారు. గత ఏడాది కంటే ఎక్కువే.. రాష్ట్రం నుంచి గత ఏడాది 18,242 మంది జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించగా వారిలో 3,698 మంది ఐఐటీల్లో సీట్లు పొందారు. గత ఏడాది యూపీ నుంచి 16,557 మంది అర్హత సాధించారు. అందులో 2,520 మంది ఐఐటీల్లో ప్రవేశాలు పొందారు. అడ్వాన్స్‌డ్‌లో అర్హులైనా టాప్ 20 పర్సంటైల్‌లో ఉంటేనే ప్రవేశం.. జేఈఈ మెయిన్స్‌లో అర్హత సాధించిన లక్షన్నర మంది విద్యార్థులనే అడ్వాన్స్‌డ్‌కు అనుమతిస్తారు. అలా అర్హత సాధించిన విద్యార్థి ఆయా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఇంటర్ పరీక్షల్లో టాప్-20 పర్సంటైల్‌లో ఉండాలి. టాప్-20 పర్సంటైల్ లెక్కింపు ఇలా.. రాష్ట్ర ప్రభుత్వ ఇంటర్మీడియట్ బోర్డుల నిర్వహించే పరీక్షల్లో ఆ విద్యార్థికంటే తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థుల సంఖ్యను పరీక్షలో ఉత్తీర్ణులైన మొత్తం విద్యార్థుల సంఖ్యతో భాగించి వందతో గుణించి పర్సంటైల్‌ను నిర్ణయిస్తారు. సదరు విద్యార్థి ఆ రాష్ట్రం నుంచి ఉత్తీర్ణులైన విద్యార్థుల్లో టాప్-20 పర్సంటైల్‌లో ఉంటే అతనికి ఐఐటీలో ప్రవేశం కల్పిస్తారు. ఈసారికి జేఈఈలో కామన్ పర్సంటైల్ రాష్ట్రం నుంచి జేఈఈ మెయిన్స్ రాసి అర్హత సాధించిన విద్యార్థులు, జేఈఈ అడ్వాన్స్డ్ రాసి ఐఐటీల్లో సీటు సంపాదించాలంటే ఇంటర్మీడియెట్‌లో ఉత్తీర్ణులైన విద్యార్థుల్లో టాప్-20 పర్సంటైల్‌లో విధిగా ఉండాల్సిందే. జూన్ 2న రెండు రాష్ట్రాలు ఏర్పడుతున్నందున రెండు రాష్ట్రాలకు టాప్-20 పర్సంటైల్‌ను వేర్వేరుగా ఇవ్వకుండా ఈసారికి కామన్ పర్సంటైల్ ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఆగస్టు వరకు కొనసాగనున్నందున ఈసారి ఇంటర్మీడియెట్‌లో మార్కుల టాప్-20 పర్సంటైల్ కామన్‌గానే ఉంటుందన్నారు. కాగా, టాప్-20 పర్సంటైల్‌కు కటాఫ్ మార్కులపై ఇంటర్‌బోర్డు మల్లాగుల్లాలు పడుతోంది. గతేడాది బోర్డు ప్రకటించిన పర్సంటైల్ కటాఫ్‌పై కొందరు కోర్టుకెక్కినందున కటాఫ్ మార్కులను, పర్సంటైల్‌ను తాము నిర్ధారించకపోవచ్చని, ఐఐటీ అడ్వాన్స్డ్ నిర్వాహక సంస్థకు ఫలితాల సీడీని పంపి, వారినే నిర్ధారించుకొమ్మని సూచించనున్నట్టు తెలిసింది. -
ప్రాక్టీస్‌తోనే మెరుగైన మార్కులు..
పి. ఎస్. రవికుమార్ సీనియర్ ఫ్యాకల్టీ శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఎంసెట్ .. జేఈఈ మెయిన్.. జేఈఈ అడ్వాన్స్డ్.. ఇంటర్ తర్వాత లక్షలాది విద్యార్థులు ఎదుర్కొనే పోటీ పరీక్షలు. ఇవి ఉన్నత విద్యా సంస్థల్లో ఇంజనీరింగ్ కలల కోర్సుల్లో చేరేందుకు బాటలు వేస్తాయి. ఇంటర్ తొలి ఏడాదిలో అడుగుపెట్టినప్పటి నుంచే పక్కా ప్రణాళికతో ప్రిపరేషన్ కొనసాగిస్తేనే పోటీ పరీక్షల్లో మెరుగైన మార్కులు చేజిక్కుతాయి. ఈ నేపథ్యంలో ఇంటర్ పబ్లిక్ పరీక్షలతో పాటు ఎంసెట్, జేఈఈలకు మ్యాథమెటిక్స్ సబ్జెక్టుకు సంబంధించిన దీర్ఘ కాలిక ప్రిపరేషన్ వ్యూహాలు.. విద్యార్థి ఎదుర్కొనే పరీక్ష ఏదైనప్పటికీ ప్రిపరేషన్ ప్రారంభించే ముందు ఆ పరీక్షకు సంబంధించిన సిలబస్‌పై పూర్తి అవగాహన పెంపొందించుకోవాలి. ఎన్ని అధ్యాయాలున్నాయి? ఏ అధ్యాయానికి ఎంత వెయిటేజీ ఉందో తెలుసుకోవాలి. మొత్తం అధ్యాయాలను సులభమైనవి, కఠినమైనవిగా విభజించుకోవాలి. విద్యార్థులు తొలుత సులువైన టాపిక్స్‌ను త్వరగా పూర్తిచేయడం వల్ల సబ్జెక్టుపై సానుకూల దృక్పథం ఏర్పడుతుంది. ఇది కఠినమైన సబ్జెక్టులపై ఆసక్తిని పెంచేందుకు, ఏకాగ్రతతో చదివేందుకు తోడ్పడుతుంది. ఏదైనా అధ్యాయాన్ని చదివేటప్పుడు తొలుత అందులోని కాన్సెప్టులను ఆకళింపు చేసుకోవాలి. సిద్ధాంతాలను, సూత్రాలను బాగా చదివిన తర్వాత సమస్యల్ని సాధించడంపై దృష్టిసారించాలి. గత పరీక్షలకు సంబంధించిన పేపర్లను పరిశీలించి, ఆ తరహా ప్రశ్నల్ని ప్రాక్టీస్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా ఇంటర్ పరీక్షల విషయంలో గత ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయడం ప్రధానం. ఇంటర్ ప్రిపరేషన్: ఏ పోటీ పరీక్ష అయినా ఇంటర్ సిలబస్ ఆధారంగా ఉంటుంది కాబట్టి దీనికి చాలా ప్రాధాన్యం ఉంది. వివిధ పోటీ పరీక్షలకు ఇంటర్ మార్కులను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నందున వంద శాతం మార్కులను సాధించే దిశగా సిద్ధమవాలి. ముందు సులభమైన, వెయిటేజీ ఎక్కువగా ఉన్న యూనిట్లతో ప్రిపరేషన్ ప్రారంభించాలి. సాధారణంగా అతిస్వల్ప, స్వల్ప సమాధాన ప్రశ్నలు ఎక్కువగా కాన్సెప్టులపై ఆధారపడి ఉంటాయి. అందువల్ల వాటిపై ఎక్కువ శ్రద్ధపెట్టాలి. మ్యాథ్స్‌లో మంచి మార్కులు రావాలంటే ప్రాక్టీస్‌కు మించిన మార్గం మరొకటి లేదు. ఏదైనా సమస్యను ప్రాక్టీస్ చేసేముందు అందులో ఉపయోగించిన సూత్రాలు, ఇతర అంశాలను నిశితంగా పరిశీలించి, తర్వాత చూడకుండా చేయాలి. అతిస్వల్ప సమాధాన ప్రశ్నల్లో చాయిస్ లేదు కాబట్టి ఈ విభాగంపై ఎక్కువ దృష్టిసారించాలి. ఇందులోని ప్రశ్నలు ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలకు ఉపయోగపడతాయి. 2- ఎ మ్యాథ్స్: సెకండియర్ విద్యార్థులు కొంత సమయాన్ని ప్రాక్టికల్స్‌కు కేటాయించాల్సి ఉంటుంది. అందువల్ల వీరు ప్రిపరేషన్‌ను తొందరగా ముగించి, పునశ్చరణ ప్రారంభించాలి. 2-ఎ టాపిక్స్‌లో వర్గ సమీకరణాలు, సమీకరణ వాదాలను ఒక యూనిట్‌గా; ప్రస్తారాలు, సంయోగాలు, సంభావ్యత చాప్టర్లను ఒక యూనిట్‌గా;స్టాటిస్టిక్స్, యాదృచ్ఛిక చలరాశులు, సంభావ్యతా విభాజనాలను ఒక యూనిట్‌గా; సంకీర్ణ సంఖ్యలు, డీమోవియర్స్ సిద్ధాంతం చాప్టర్లను మరో యూనిట్‌గా, ద్విపద సిద్ధాంతం, పాక్షిక భిన్నాలను మరో యూనిట్‌గా విభజించుకోవాలి. వీటిలో విద్యార్థి తనకు నచ్చిన దాన్ని ఎంపిక చేసుకొని ప్రిపరేషన్ ప్రారంభించాలి. గత రెండుమూడేళ్ల ప్రశ్నపత్రాల ఆధారంగా కేవలం ఇంపార్టెంట్ ప్రశ్నలకే పరిమితం కాకుండా వీలైనన్ని ఎక్కువ అంశాలకు ప్రిపరేషన్‌ను విస్తరించాలి. అప్పుడే ప్రశ్న ఏ మూల నుంచి వచ్చినా సమాధానం రాయగలం. గత పరీక్షల్లో బెర్నూలీ సిద్ధాంతాన్ని ప్రవచించి, నిరూపించండి? అనే ప్రశ్న వచ్చింది. ఇది చాలా సులభమైన ప్రశ్న. కానీ, విద్యార్థులు ఈ కోణంలో ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల సమాధానం రాయలేకపోయారు. ఇలాంటి విషయాలను దృష్టిలో ఉంచుకొని ప్రిపరేషన్ కొనసాగించాలి. 2- బి మ్యాథ్స్: 2-బిలో వృత్తాలు, వృత్తసరణిని ఒక యూనిట్‌గా; శాంకవాలను ఒక యూనిట్‌గా; అనిశ్చిత సమాకలని, అవకలన సమీకరణాలను ఒక యూనిట్‌గా; నిశ్చిత సమాకలని, ప్రదేశాలు, వైశాల్యాలను ఒక యూనిట్‌గా విభజించుకొని ప్రిపరేషన్ ప్రారంభించాలి. ఈ పేపర్‌కు కొంత ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. నిరూపక జ్యామితిలో సిద్ధాంతాలు, వాటి నిరూపణలతో పాటు వాటిపై ఆధారపడిన ప్రశ్నల్ని ప్రాక్టీస్ చేయాలి. ఈ ప్రశ్నలను పరిశీలించి ఏ విధంగా ఇచ్చారో అర్థం చేసుకోవాలి. కలన గణితంలో ఫార్ములాలు ఎక్కువగా ఉంటాయి. ఏ ఫార్ములాను ఎక్కడ, ఏ విధంగా ఉపయోగించాలో నేర్చుకోవాలి. వైశాల్యాలను నేర్చుకునేటప్పుడు వక్రాలు ఏ విధంగా ఉంటాయో పరిశీలించాలి. 1- ఎ మ్యాథ్స్: 1-ఎ పేపర్ సులభమైనప్పటికీ అప్రమత్తంగా లేకుంటే మార్కులు కోల్పోయే ప్రమాదముంది. మాత్రికలు, గణితానుగమనం, ప్రమేయాలతో ప్రిపరేషన్ ప్రారంభించాలి. మార్కుల పరంగా మాత్రికలు యూనిట్ ప్రధానమైంది. త్రికోణమితిలో త్రికోణమితి పరావర్తనాలు, త్రిభుజ ధర్మాలు చాలా ముఖ్యమైనవి. వీటి తర్వాత త్రికోణమితి సమీకరణాలు, విలోమ ప్రమేయాలను ప్రాక్టీస్ చేయాలి. విలోమ ప్రమేయాల్లోని అన్ని అంశాలను చదవాలి. ఇది ఆబ్జెక్టివ్ పరీక్షలకు కూడా ప్రధానమైనది. త్రికోణమితిలోని మిగిలిన చాప్టర్లను వాటి మార్కుల ప్రాధాన్యతను బట్టి ప్రాక్టీస్ చేయాలి. ఇక సదిశలు భాగం చాలా సులువైనది. అయితే ఏకాగ్రత సాధన ముఖ్యం. ఎందుకంటే ఇందులోని అంశాలు ఫిజిక్స్, 3-డి జామెట్రీలోనూ ఉపయోగిస్తారు. 1- బి మ్యాథ్స్: ఒక అధ్యాయాన్ని చదవడం ప్రారంభించినప్పుడు తొలుత అందులోని కాన్సెప్టులను ఆకళింపు చేసుకోవాలి. సిద్ధాంతాలను, సూత్రాలను బాగా చదివిన తర్వాత సమస్యల సాధనపై దృష్టిసారించాలి. 1-బి విషయానికి వస్తే బిందుపథం, అక్ష పరివర్తన చాప్టర్లు చిన్నవి కాబట్టి తొందరగా పూర్తిచేయొచ్చు. సరళరేఖలు, సరళరేఖాయుగ్మాల చాప్టర్లకు సంబంధించి విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ముఖ్యంగా సరళరేఖాయుగ్మాల్లో దీర్ఘ సమాధాన ప్రశ్నలు పెద్దవిగానూ, కొంచెం కష్టంగానూ ఉంటాయి. ఈ రెండు చాప్టర్లకు వెయిటేజీ ఎక్కువ కావున వీలైనన్ని సార్లు పునశ్చరణ చేయాలి. 3-డి జ్యామితి కొంచెం సులువైన అంశం అయినప్పటికీ దిక్ సంఖ్యలు, దిక్ కొసైన్లకు అధిక సమయం కేటాయించాలి. కలనగణితంలో అవధులు, అవిచ్ఛిన్నతల్లో ఎడమ, కుడి అవధుల సమస్యల్ని జాగ్రత్తగా సాధన చేయాలి. అవధులను ఎన్ని రకాలుగా, ఏ విధంగా కనుగొంటారు, వాటి నియమాలపై దృష్టిపెట్టాలి. అవకలనాలు చాలా ప్రాముఖ్యమున్న చాప్టర్. మూలసూత్రంపై ప్రశ్నలు, అవకలనాలను కనుగొనే పద్ధతులు, వాటిపై ఆధారపడిన ప్రశ్నల్ని ఎక్కువ సాధన చేయాలి. అవకలనాల అనువర్తనాల్లో స్పర్శరేఖ; అభిలంబరేఖ; గరిష్ట-కనిష్ట విలువలు, ఎర్రర్స - అప్రాక్షిమేషన్స ప్రశ్నలపై ఎక్కువ ప్రాక్టీస్ అవసరం. 1-బి పేపర్ సుదీర్ఘమైనది కాబట్టి ప్రిపరేషన్లో టైం మేనేజ్మెంట్ కీలకమైంది. ఎంసెట్ ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థులు పబ్లిక్ పరీక్షలకు ప్రిపరేషన్‌తో పాటు ఆబ్జెక్టివ్ ప్రశ్నల సాధన పూర్తయ్యేటట్లు ప్రణాళిక రూపొందించుకోవాలి. ఎంసెట్‌కు ప్రిపరేషన్ మొదలుపెట్టే ముందు మొత్తం సిలబస్‌ను యూనిట్లుగా విభజించాలి. ఒక్కో యూనిట్‌కు ఎంత సమయం అవసరమవుతుందో చూసుకుని ప్రణాళిక వేసుకోవాలి. రెండో సంవత్సరం విద్యార్థులు ఐపీఈ ప్రిపరేషన్‌తో పాటు ఆబ్జెక్టివ్ ప్రశ్నల సాధన పూర్తయ్యేటట్లు ప్రణాళిక రూపొందించుకోవాలి. ఇలా చేస్తే ఐపీఈ పరీక్షల తర్వాత అందుబాటులో ఉన్న స్వల్ప వ్యవధిలో మెరుగైన పునశ్చరణకు అవకాశముంటుంది. ఎంసెట్‌లో ఫార్ములా ఆధారిత ప్రశ్నలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఫార్ములాలు, కాన్సెప్టులపై పట్టు సాధించాలి. బాగా కష్టంగా ఉన్న టాపిక్స్‌కు ఎక్కువ సమయం వెచ్చించకుండా వాటిలోని ముఖ్యమైన అంశాలను మాత్రమే ప్రిపేర్ కావాలి. పాత అంశాలపై పూర్తిస్థాయి పట్టు సాధించేందుకు ప్రయత్నించాలి. ప్రతిక్షేపణ పద్ధతుల్ని ఎప్పుడు అనుసరించాలనే దాన్ని నిశితంగా గమనించాలి. ఫార్ములాల అనువర్తనాలపై దృష్టిపెట్టాలి. తక్కువ సమయంలో ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి కాబట్టి ఆ దిశగా ప్రాక్టీస్ చేయాలి. పరీక్ష పది రోజులు ముందుకు జరిగిందనుకొని సిలబస్‌ను పూర్తిచేయాలి. ఆ పది రోజుల్లో మరోసారి ముఖ్యమైన అంశాలను పునశ్చరణ చేయగలిగితే ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. గత ప్రశ్నపత్రాలను పరిశీలించి, ఏ చాప్టర్లకు ఎక్కువ వెయిటేజీ ఇస్తున్నారో పరిశీలించి, వాటిపై శ్రద్ధపెట్టాలి. ఎంసెట్‌లో నెగటివ్ మార్కులు లేవు కాబట్టి అన్ని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. కష్టంగా ఉన్న ప్రశ్నకు సమాధానం గుర్తించే క్రమంలో సమయం వృథా చేయకూడదు. సక్సెస్ సోపానాలు: విద్యార్థులు సానుకూల ధోరణిని అలవరచుకొని, లక్ష్యం దిశగా పయనించాలి. ఇతరులతో పోల్చుకోకుండా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి. ప్రిపరేషన్ లోపాలను ఎప్పటికప్పుడు గుర్తించి, సరిదిద్దుకునేందుకు ప్రయత్నించాలి. ఏ అంశాల్లో బలహీనంగా ఉన్నారో వాటిపై ఎక్కువ దృష్టిపెట్టాలి. సాధనకు లొంగనిది ఏదీ ఉండదనే విషయాన్ని గుర్తించాలి. వీలైనన్ని ఎక్కువసార్లు పునశ్చరణ చేస్తూ, ప్రాక్టీస్ టెస్ట్‌లు ఎక్కువగా రాయాలి. టైం మేనేజ్మెంట్ను అలవరచుకొని, స్వీయ క్రమశిక్షణతో ప్రిపరేషన్ కొనసాగించాలి. ఏ పరీక్షలోనైనా 30- 40 శాతం కష్టతరమైన, 25 శాతం సులభమైన, మిగిలినవి మధ్యస్థంగా ఉంటాయని భావించి ప్రిపరేషన్ కొనసాగించాలి. ఇంటర్ మొదటి ఏడాది విద్యార్థులు ఆబ్జెక్టివ్ ప్రశ్నలపై ఇప్పుడే దృష్టిపెట్టాలి. సెకండియర్‌లో చూసుకుందాంలే! అని అనుకోవద్దు. ఇప్పుడు ఆబ్జెక్టివ్పై శ్రద్ధ కనబర్చకుంటే సెకండియర్‌లో ఒత్తిడిని కోరికోరి ఆహ్వానించిన వారవుతారు. Self Confidence, Hard Work and Will Powerఅనేవి ఓ విద్యార్థిని విజయానికి దగ్గర చేసే మార్గాలని గుర్తుంచుకోవాలి. జేఈఈ పరీక్ష జేఈఈ మెయిన్: ఐపీఈ పరీక్షల తర్వాత చాలా తక్కువ వ్యవధిలో జేఈఈ మెయిన్ పరీక్ష ఉంటుంది. అందువల్ల మొత్తం సిలబస్‌ను డిసెంబర్ నాటికి పూర్తిచేయాలి. ఈ పరీక్ష సిలబస్‌కు, ఎంసెట్ సిలబస్‌కు కొంత తేడా ఉంది. దీన్ని గమనించి ప్రాధాన్యత గల చాప్టర్లను బాగా చదవాలి. జేఈఈ మెయిన్‌లో గంటలో 30 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. నెగటివ్ మార్కులు కూడా ఉన్నాయి. అందువల్ల ఎన్ని ప్రశ్నలకు సమాధానాల్ని గుర్తించామనే కన్నా ఎన్నింటికి కచ్చితమైన సమాధానాలు గుర్తించామన్నదే ముఖ్యం. స్టాటిస్టిక్స్, సరళరేఖలు (3-డి), మధ్యమ విలువల సిద్ధాంతాలు, మ్యాథమెటికల్ రీజనింగ్, సమితులు- సంబంధాలు చాప్టర్లను క్షుణ్నంగా ప్రాక్టీస్ చేయాలి. వీటి నుంచి ఒక్కో ప్రశ్న వస్తోంది. సంకీర్ణ సంఖ్యలు; మాత్రికలు; ప్రస్తారాలు, సంయోగాలు, సంభావ్యత; అవకలనం- వాటి అనువర్తనాలు; నిశ్చిత సమాకలనం; వైశాల్యాలు; అవకలన సమీకరణాలు; వృత్తాలు, శాంకవాలు; సదిశలు, సరళరేఖలు, త్రికోణమితి సమీకరణాలు, విలోమ త్రికోణమితి ప్రమేయాలు, త్రిభుజ ధర్మాలు నుంచి కచ్చితంగా రెండు, అంతకంటే ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి కాబట్టి వీటిని పూర్తిగా చదవాలి. గత ప్రశ్నపత్రాన్ని పరిశీలిస్తే చాలా వరకు సులభమైన ప్రశ్నలు వచ్చాయి. ఎంసెట్‌తో పోల్చితే ఇందులో కొంత ఎక్కువ సమయం అందుబాటులో ఉంటుంది కాబట్టి కచ్చితమైన ప్రణాళికతో ప్రిపరేషన్ కొనసాగిస్తే మంచి స్కోర్ సాధించవచ్చు. జేఈఈ అడ్వాన్స్డ్: మిగిలిన పరీక్షలతో పోలిస్తే జేఈఈ అడ్వాన్స్డ్ కొంత భిన్నమైనది. ఇందులో కాన్సెప్ట్‌ల ఆధారిత ప్రశ్నలు వ స్తాయి. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో రెండు పేపర్లుంటాయి. దీని సిలబస్.. మెయిన్ సిలబస్‌ను పోలి ఉంటుంది. కానీ, ప్రశ్నలు ఇచ్చే విధానంలో తేడా ఎక్కువగా ఉంటుంది. పరీక్ష రాసేటప్పుడు ఏ ప్రశ్నలకు నెగటివ్ మార్కులున్నాయి? వేటికి లేవు? అన్నది తెలుసుకోవడం చాలా ముఖ్యం. మెయిన్‌లో ప్రాధాన్యమున్న సబ్జెక్టులకే అడ్వాన్స్‌డ్‌లోనూ ప్రాధాన్యం ఉంది. గతేడాది ప్రశ్నపత్రాన్ని పరిశీలిస్తే క్లిష్టంగా ఉండే ప్రశ్నలు దాదాపు 40 శాతం వరకు ఉన్నాయి. మెయిన్ పరీక్ష పూర్తయ్యాక అందుబాటులో ఉన్న సమయంలో అధ్యాపకుల సహాయంతో అన్ని అధ్యాయాల్లోని అంశాలనూ పునశ్చరణ చేయాలి. జేఈఈ మెయిన్‌తో పోలిస్తే అడ్వాన్సడ్ ప్రశ్నల తీరులో చాలా తేడా ఉంటుంది. అడ్వాన్సడ్ ప్రశ్నలు లోతుగా ఉండి, ఎక్కువ అంశాలపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి సబ్జెక్టుపై పట్టు సాధించాలి.