సాక్షి, హైదరాబాద్: ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు పరిగణనలోకి తీసుకునే విద్యార్థుల కటాఫ్ పర్సంటైల్ ఈసారి ఓపెన్ కేటగిరీలో 86.19 వరకు ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 7 నుంచి 9 వరకు జరిగిన జేఈఈ మెయిన్ పరీక్షలకు హాజరైన విద్యార్థుల సంఖ్యను బట్టి ఈ అంచనాకు వచ్చారు. అయితే ఏప్రిల్‌లో మరో దశ జేఈఈ మెయిన్ నిర్వహించనున్న నేపథ్యంలో అడ్వాన్స్‌డ్ కటాఫ్ పర్సంటైల్‌లో మార్పు ఉంటుందని చెబుతున్నారు.
ఏప్రిల్ 3 నుంచి 9లోపు జరిగే పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల సంఖ్యను బట్టి కటాఫ్ పర్సంటైల్ నిర్ధారణ జరుగుతుందని పేర్కొంటున్నారు. జనవరిలో జేఈఈ మెయిన్‌కు దరఖాస్తు చేసుకుని పరీక్షలకు హాజరు కాని విద్యార్థులంతా ఏప్రిల్‌లో హాజరైతే ఓపెన్ కేటగిరీలో కటాఫ్ పర్సంటైల్ 86.98 వరకు ఉండొచ్చని, విద్యార్థుల సంఖ్య మరింత పెరిగితే కటాఫ్ కూడా పెరుగుతుందని చెబుతున్నారు. అయితే ఏప్రిల్ జేఈఈ ఫలితాల తర్వాత అడ్వాన్స్‌డ్‌ను పరిగణనలోకి తీసుకునే కటాఫ్ పర్సంటైల్‌ను ఎన్‌టీఏ అధికారికంగా ప్రకటించనుంది.
లెక్కించుకోవడం సులభమే..
జేఈఈ మెయిన్ పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) వివిధ దశల్లో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల స్కోరును పర్సంటైల్ రూపంలో ఇస్తోంది. ఈసారి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు కటాఫ్ లెక్కింపుపై విద్యార్థుల్లో కొంత ఆందోళన నెలకొంది. విద్యార్థుల స్కోరును మార్కుల రూపంలో కాకుండా పర్సంటైల్ విధానంలో ఇచ్చినా.. జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఎంపికయ్యే వారి సంఖ్యను లెక్కించుకోవడం సులభమేనని నిపుణులు చెబుతున్నారు.
కటాఫ్ లెక్కింపు ఇలా..
ఈ సారి మే 17న నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు అన్ని కేటగిరీల్లో కలిపి 2.5 లక్షల మందిని ఎంపిక చేస్తామని జేఈఈ ఆర్గనైజింగ్ కమిటీ ప్రకటించింది. అందులో 50.5 శాతం విద్యార్థులను (1,26,250 మంది) ఓపెన్ కేటగిరీలో జేఈఈ అడ్వాన్స్‌డ్ రాసేందుకు అర్హులుగా పరిగణనలోకి తీసుకుంటారు. అందులో దివ్యాంగులు 5 శాతం మినహాయిస్తే 1,19,938 మందిని ఓపెన్ కేటగిరీలో అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేస్తారు. అయితే మొన్నటి జేఈఈ మెయిన్‌కు మొత్తం 8,69,010 మంది విద్యార్థులు హాజరయ్యారు. అందులో అడ్వాన్స్‌డ్‌కు ఓపెన్ కేటగిరీలో పరిగణనలోకి తీసుకునే విద్యార్థుల సంఖ్య 1,19,938. అంటే అది 13.80168237 శాతం అవుతుంది. దీన్ని టాప్ 100.0000 పర్సంటైల్ నుంచి తీసేస్తే 86.19 పర్సంటైల్ వస్తుందని, అదే జనవరి పరీక్షల ప్రకారం ఓపెన్ కేటగిరీలో కటాఫ్ అయ్యే అవకాశం ఉందని జేఈఈ
నిపుణుడు కుమార్ వివరించారు.
ఏప్రిల్‌లో పెరగనున్న విద్యార్థుల సంఖ్య..
ఇటీవల జరిగిన జేఈఈ మెయిన్ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న వారిలో 52,251 మంది విద్యార్థులు పరీక్షలు రాయలేదు. వారంతా ఏప్రిల్‌లో జరిగే పరీక్షలకు కచ్చితంగా హాజరవుతారు. దీంతో మొత్తం విద్యార్థుల సంఖ్య 9,21,261కి చేరనుంది. మరోవైపు ప్రభుత్వ కాలేజీల విద్యార్థులు రెండుసార్లు దరఖాస్తు చేసుకోరు కాబట్టి ఏప్రిల్‌లో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల సంఖ్య 9,21,261కి మించి కూడా ఉండే అవకాశం ఉంది. అయితే జనవరి జేఈఈకి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులంతా (9,21,261 మంది) ఏప్రిల్‌లో జేఈఈ మెయిన్‌కు హాజరైతే, అందులో ఓపెన్ కేటగిరీలో అడ్వాన్స్‌డ్ పరిగణనలోకి తీసుకునే విద్యార్థుల సంఖ్య (1,19,938) అనేది 13.01889475 శాతం అవుతుంది. దానిని టాప్ 100.000 పర్సంటైల్ నుంచి తీసివేస్తే 86.98 పర్సంటైల్ వస్తుంది. అప్పుడు అది ఓపెన్ కేటగిరీ కటాఫ్ కానుంది. ఏప్రిల్‌లో పరీక్షలకు హాజరయ్యేందుకు దరఖాస్తు చేసుకునే విద్యార్థుల సంఖ్య పెరిగితే ఓపెన్ కటాఫ్ మరింతగా పెరిగే అవకాశం ఉంది.
పర్సంటైల్ ఆధారంగా ర్యాంకు..
విద్యార్థులకు వచి్చన పర్సంటైల్ ఆధారంగా ర్యాంకు లెక్కించుకోవడం సులభమేనని నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు 91.6438702 పర్సంటైల్ విద్యారి్థని తీసుకుంటే.. టాప్ 100 పర్సంటైల్ నుంచి ఈ విద్యార్థి పర్సంటైల్ తీసేస్తే ఆ విద్యారి్థకి వచ్చేది 8.3561298. అంటే ప్రతి 100 మంది విద్యార్థుల్లో ఆ విద్యార్థి ర్యాంకు 8.3561298 అన్నమాట. ఆ లెక్కన పరీక్షకు హాజరైన మొత్తం విద్యార్థుల సంఖ్య 8,69,010తో గుణించి శాతం లెక్కిస్తే 72,615 వస్తుంది. అదే ఆ విద్యార్థి అంచనా ర్యాంకు అవుతుంది. అయితే జనవరిలో జరిగిన జేఈఈ పరీక్షలను 6 స్లాట్‌లలో నిర్వహించినందున (ఒకే ర్యాంకు ఆరుగురికి వచ్చే అవకాశం ఉన్నందున) అతడి ర్యాంకు 72,615కు 6 స్థానాలు అటూ ఇటుగా మారే అవకాశం ఉంటుంది.
ఒకే ర్యాంకు ఉండదు
ర్యాంకుల కేటాయింపు సమయంలో 100 పర్సంటైల్ వచి్చన విద్యార్థులు అందరికీ ఒకే ర్యాంకు ఇవ్వరు. వారికి ర్యాంకులను కేటాయించే సమయంలో విద్యార్థి మొత్తం మార్కులు చూస్తారు. పలువురు విద్యార్థులకు సమాన మార్కులు ఉంటే.. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో వచి్చన మార్కులను చూసి, ఆయా సబ్జెక్టుల వరుస క్రమంలో ఎక్కువ మార్కులు ఉన్న వారికి ముందు ర్యాంకులు కేటాయిస్తారు. ఆ మార్కులు సమానంగా ఉంటే ఎక్కువ వయసు వారికి ముందు ర్యాంకు కేటాయించి, మిగతా వారికి వరుసగా కిందకు ర్యాంకులు కేటాయిస్తారు. అయితే ఈ ర్యాంకులను విద్యార్థులకు ఇప్పుడే ఇవ్వరు. ఏప్రిల్‌లో జరిగే పరీక్ష తర్వాతే 2 దశల్లో జేఈఈ మెయిన్‌కు హాజరైన విద్యార్థులను, వారికి వచి్చన పర్సంటైల్‌ను తీసుకొని ర్యాంకులను కేటాయిస్తారు. వాటి ఆధారంగానే ఐఐటీల్లో ప్రవేశాలు చేపడతారు.
Comments
Please login to add a commentAdd a comment