‘జేఈఈ’లో రాష్ట్రమే టాప్ | andhra pradesh top in jee entrance exams | Sakshi
Sakshi News home page

‘జేఈఈ’లో రాష్ట్రమే టాప్

Published Wed, May 7 2014 12:32 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

andhra pradesh top in jee entrance exams

అడ్వాన్‌‌సడ్ పరీక్షకు 21,818 మంది ఎంపిక
 
 సాక్షి, హైదరాబాద్: జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించిన వారిలో మనరాష్ట్ర విద్యార్థులే ఎక్కువ మంది ఉన్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే మనమే ముందంజలో ఉన్నాం. జేఈఈ మెయిన్స్‌లో అత్యధిక మార్కులు సాధించిన వారే కాదు.. గత ఏడాది అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించిన విద్యార్థుల్లో రాష్ట్ర విద్యార్థులే ఎక్కువ. ఈసారి జేఈఈ మెయిన్స్‌కు  రాష్ట్రం నుంచి 1.15 లక్షల మంది విద్యార్థులు హాజరుకాగా అందులో 21,818 మంది అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించారు. సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఈనెల 2న జేఈఈ మెయిన్స్ ఫలితాలు ప్రకటించింది. అందులో కేటగిరీల వారీగా అర్హత మార్కులను ప్రకటించింది. జనరల్  కేటగిరీలో 155 మార్కులు, ఓబీసీలకు 74 మార్కులు, ఎస్సీలకు 53 మార్కులు, ఎస్టీలకు 47 మార్కులను అర్హత మార్కులుగా ప్రకటించింది. వాటి ప్రకారం రాష్ట్రం నుంచి అడ్వాన్స్‌డ్‌కు 21,818 మంది ఎంపికయ్యారు. రెండవ స్థానంలో ఉత్తరప్రదేశ్ నిలిచింది. అక్కడి నుంచి ఈసారి 19,409 మంది విద్యార్థులు అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించారు.
 
 గత ఏడాది కంటే ఎక్కువే..
 
 రాష్ట్రం నుంచి గత ఏడాది 18,242 మంది  జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించగా వారిలో 3,698 మంది ఐఐటీల్లో సీట్లు పొందారు. గత ఏడాది యూపీ నుంచి 16,557 మంది అర్హత సాధించారు. అందులో 2,520 మంది ఐఐటీల్లో ప్రవేశాలు పొందారు.
 
 అడ్వాన్స్‌డ్‌లో అర్హులైనా టాప్ 20 పర్సంటైల్‌లో ఉంటేనే ప్రవేశం..
 జేఈఈ మెయిన్స్‌లో అర్హత సాధించిన లక్షన్నర మంది విద్యార్థులనే అడ్వాన్స్‌డ్‌కు అనుమతిస్తారు. అలా అర్హత సాధించిన విద్యార్థి ఆయా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఇంటర్ పరీక్షల్లో టాప్-20 పర్సంటైల్‌లో ఉండాలి.
 
 టాప్-20 పర్సంటైల్ లెక్కింపు ఇలా..
 
 రాష్ట్ర ప్రభుత్వ ఇంటర్మీడియట్ బోర్డుల నిర్వహించే పరీక్షల్లో ఆ విద్యార్థికంటే తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థుల సంఖ్యను పరీక్షలో ఉత్తీర్ణులైన మొత్తం విద్యార్థుల సంఖ్యతో భాగించి వందతో గుణించి పర్సంటైల్‌ను నిర్ణయిస్తారు. సదరు విద్యార్థి ఆ రాష్ట్రం నుంచి ఉత్తీర్ణులైన విద్యార్థుల్లో టాప్-20 పర్సంటైల్‌లో ఉంటే అతనికి ఐఐటీలో ప్రవేశం కల్పిస్తారు.
 
 ఈసారికి జేఈఈలో  కామన్ పర్సంటైల్
 
 రాష్ట్రం నుంచి జేఈఈ మెయిన్స్ రాసి అర్హత సాధించిన విద్యార్థులు, జేఈఈ అడ్వాన్స్‌డ్ రాసి ఐఐటీల్లో సీటు సంపాదించాలంటే  ఇంటర్మీడియెట్‌లో ఉత్తీర్ణులైన విద్యార్థుల్లో టాప్-20 పర్సంటైల్‌లో విధిగా ఉండాల్సిందే.  జూన్ 2న రెండు రాష్ట్రాలు ఏర్పడుతున్నందున రెండు రాష్ట్రాలకు  టాప్-20 పర్సంటైల్‌ను వేర్వేరుగా ఇవ్వకుండా ఈసారికి కామన్ పర్సంటైల్ ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఆగస్టు వరకు కొనసాగనున్నందున ఈసారి ఇంటర్మీడియెట్‌లో మార్కుల టాప్-20 పర్సంటైల్ కామన్‌గానే ఉంటుందన్నారు. కాగా, టాప్-20 పర్సంటైల్‌కు కటాఫ్ మార్కులపై ఇంటర్‌బోర్డు మల్లాగుల్లాలు పడుతోంది.

 

గతేడాది బోర్డు ప్రకటించిన పర్సంటైల్ కటాఫ్‌పై కొందరు కోర్టుకెక్కినందున కటాఫ్ మార్కులను, పర్సంటైల్‌ను తాము నిర్ధారించకపోవచ్చని, ఐఐటీ అడ్వాన్స్‌డ్ నిర్వాహక సంస్థకు ఫలితాల సీడీని పంపి, వారినే నిర్ధారించుకొమ్మని సూచించనున్నట్టు తెలిసింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement