రైతు కుటుంబంలో మెరిసిన విద్యా కుసుమం
బత్తలపల్లి : ఐఐటీ ప్రవేశాలు కోసం గత నెల 21న నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షా ఫలితాల్లో బత్తలపల్లి మండల కేంద్రానికి చెందిన గడుపూటి సుమంత్ జాతీయ స్థాయిలో 409వ ర్యాంకు సాధించాడు. బత్తలపల్లికి చెందిన రైతు గడుపూటి రమేష్‌బాబు, లక్ష్మీదేవి దంపతుల కుమారుడు గడుపూటి సుమంత్ జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంక్ సాధించడం పట్ల ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. పెద్దనాన్న గడుపూటి శేషయ్య ప్రోత్సాహంతో 10వ తరగతి నుంచే విజయవాడలోని శ్రీచైతన్యలో విద్య అభ్యసించాడు. ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం కూడా విజయవాడలోని శ్రీచైతన్యలోనే విద్య అభ్యసించాడు. ఇంటర్‌లో 15వ ర్యాంకు, తెలంగాణా ఎంసెట్‌లో 85వ ర్యాంకు సాధించాడు.
మొదటగా జేఈఈ మెయిన్స్‌లో 589వ ర్యాంకు సాధించి అడ్వాన్స్‌డ్ పరీక్షలకు అర్హత సాధించగలిగాడు. అనంతరం జరిగిన పరీక్షల్లో 409వ ర్యాంకు సాధించాడు. డిల్లీ, చెన్నైలలోని ఐఐటీ క్యాంపస్‌ల్లో సీట్ దక్కె అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా సుమంత్ మాట్లాడుతూ ఐఏఎస్ చేసి కలెక్టర్ కావాలన్న లక్ష్యంతో ముందుకు వెళుతున్నట్లు వివరించారు.తన వెనుక కుటుంబ ప్రోత్సాహం ఉందన్నారు. వారి ఆశలను నెరవేర్చేందుకు కృషి చేస్తానన్నారు. అదేవిధంగా బత్తలపల్లికి చెందిన మరో విద్యార్థి కల్లె కార్తీక్ జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో 2501వ ర్యాంకు దక్కింది.