రేపల్లెలోని ఓ వసతి గృహంలో వంట గది పక్కనే పడేసిన ఆహారం
సాక్షి, గుంటూరు: ప్రభుత్వం సంక్షేమ హాస్టళ్ల నిర్వహణకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని చెబుతున్నా వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. పేద విద్యార్థులకు మాత్రం కష్టాలు తప్పడం లేదు. జిల్లాలో పలుచోట్ల హాస్టళ్లు సమస్యల లోగిళ్లుగానే ఉన్నాయి. అస్తవ్యస్త మరుగుదొడ్లు, తాగునీటి కరువు, దోమల బాధ, ఉక్కపోతతో విద్యార్థులు అల్లాడుతున్నారు. గత నెల 25న జిల్లావ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని సాంఘిక సంక్షేమ హాస్టళ్లు, బాలికల గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలలు సహా 20చోట్ల విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. రేపల్లె, తెనాలి, అమరావతి, చేబ్రోలు, గురజాల, గుంటూరు నగరం, నిజాంపట్నంలోని హాస్టళ్లను ఐదు బృందాలుగా పరిశీలించారు. ఈ సందర్భంగా అనేక అక్రమాలు, సమస్యలు వెలుగు చూశాయి. 70 శాతానికి పైగా వసతి గృహాల్లో బోగస్ ఎన్‌రోల్‌మెంట్లు బయటపడ్డాయి. ఉన్న విద్యార్థుల కన్నా అధికంగా 20శాతం చూపించి వార్డెన్లు జేబులు నింపుకుంటున్నారు. బయోమెట్రిక్ విధానం ఎందుకు వినియోగించడం లేదని ప్రశ్నించగా.. సాంకేతిక సమస్యలు ఉన్నాయని అధికారులకు పొంతనలేని సమాధానాలు చెప్పారు.
భద్రత ప్రశ్నార్థకం
బాలికల వసతి గృహాల వద్ద భద్రత ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలో చాలా వరకూ ప్రభుత్వ బాలికల సంక్షేమ వసతి గృహాలు, గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలల వద్ద నైట్ డ్యూటీ వాచ్‌మెన్‌లు లేకుండానే నిర్వహిస్తున్నారు. దీంతో విద్యార్థినులు రాత్రయితే చాలు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. మరుగుదొడ్లకు సరైన నీటి సరఫరా లేకపోవడంతో వాటి నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది. కొన్నిచోట్ల విద్యార్థినులు అరుబయట కాలకృత్యాలకు వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. రేపల్లెలోని ఓ సంక్షేమ వసతి గృహంలో సీలింగ్ ఫ్యాన్లు ఉన్నప్పటికీ వాటికి కరెంటు సరఫరా లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హాస్టళ్ల వద్ద మురుగు నీటి వ్యవస్థ సరిగా లేకపోవడంతో విద్యార్థులు తరచూ అనారోగ్యాల పాలవుతున్నారు.
పౌష్టికాహారం అందని ద్రాక్షే..
విద్యార్థులకు పౌష్టికాహారం కూడా అందని ద్రాక్షలానే మారింది. జిల్లాలోని చాలా వరకూ వసతి గృహాల్లో కొత్త డైట్ విధానం అమలు కావడం లేదు. వారానికి ఒక్కసారి కూడా కోడిగుడ్డు ఇవ్వడం లేదని విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో బయటపడింది. పాలు కూడా విద్యార్థులకు అంతంత మాత్రంగానే ఇస్తున్నారు. హాస్టళ్లలో ఎక్కడా ఆర్‌వో వాటర్ సిస్టమ్ అమలు కావడం లేదు. నేటికీ కొన్ని హాస్టళ్లలో కట్టెల పొయ్యి మీదనే వంటలు వండుతూ పొగ చూరిన ఆహారాన్ని విద్యార్థులకు పెడుతున్నారు.
గురుకులాల్లో టీచర్ల కొరత
విజిలెన్స్ అధికారుల తనఖీల్లో గురుకులాల్లో సిబ్బంది కొరత బయటపడింది. సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో టీచర్ల కొరత ఎక్కువగా ఉండడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఇంటర్ విద్యార్థులకు బోధించే సిబ్బందే ఎనిమిది, తొమ్మిది, పది విద్యార్థులకు బోధిస్తున్నారు. ప్రిన్సిపాళ్ల గైర్హాజరు ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువ అక్రమాలు జరుగుతున్నాయి. వంటలు చేసే సిబ్బంది నాణ్యత ప్రమాణాలను పాటించకుండా ఆహారాన్ని విద్యార్థులకు అందిస్తున్నారు.
నిధుల దుర్వినియోగం
తనిఖీల సమయంలో జిల్లాలోని చాలా హాస్టళ్లలో పలు సమస్యల్ని గుర్తించాం. విద్యార్థులకు పౌష్టికాహారం అందించడం కోసం ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా ఫలితం ఉండటం లేదు. అధికారులు ఎప్పటికప్పుడు హాస్టళ్లను పరిశీలించాలి. అప్పుడే వార్డెన్‌లు అక్రమాలకు పాల్పడకుండా నిధులు వినియోగిస్తారు. – శోభామంజరి, విజిలెన్స్ అండ్‌ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment