
అద్దె భవనంలో కొనసాగుతున్న ఎస్సీ బాలికల వసతి గృహం
- సంక్షేమ వసతి గృహాల్లో వసతులు కరువు
- ఇబ్బంది పడుతున్న విద్యార్థులు
- పట్టించుకోని అధికారులు
- హాస్టళ్లలో ఉండలేమంటున్న విద్యార్థులు
ఝరాసంగం రూరల్: విద్యతోనే సమాజంలో మంచి గుర్తింపు వస్తుందని విద్యావేత్తలు, నిపుణులు అభిప్రాయం. అందుకు తగ్గట్లుగానే ప్రభుత్వం తనవంతుగా ప్రచారం కూడా చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని పాలకులు చెబుతున్నారు. వాస్తవానికి విరుద్దంగా ఉంటోందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.
ఎన్నో ఆశలతో ప్రభుత్వ బడుల్లో తమ పిల్లలను చదివిస్తున్నారు పేద మధ్యతరగతి కుటుంబాలు. అయితే వసతి గృహాలు మాత్రం వారికి సమస్యలతో స్వాగతం పలుకుతున్నాయి. హాస్టళ్లలో ఉండలేమని విద్యార్థులు తమ తల్లిదండ్రులకు తెగేసి చెబుతున్నారు. కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
వసతి గృహాల్లో సమస్యల తిష్ట
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే దూరప్రాంత విద్యార్థులకు వసతి గృహాలే దిక్కు. అయితే వాటిలో కనీస సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బందిపడుతున్నారు. సమస్యలు పరిష్కరిస్తారని ఎదురు చూస్తున్న వారి ఆశలు అడియాసలవుతున్నాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు విద్యాభివృద్ధికోసం కృషి చేస్తున్నామని చెబుతున్న వారి మాటలు నీటిమూటలుగానే మిగులుతున్నాయి. కనీస సౌకర్యాలైన తాగునీరు. విద్యుత్, మరుగుదొడ్లు లేకపోవడంతో చదువుపై దృష్టిని కేంద్రీకరించలేకపోతున్నారు.
ఇరకు గదులతో ఇబ్బందులు
ఝరాసంగం ఎస్సీ బాలికల వసతి గృహానికి స్వంత భవనం లేక గత ఎనిమిది సంవత్సరాల నుంచి అద్దె భవనంలో కొనసాగుతోంది. ఈ భవనంలో గదులు ఇరుకుగా ఉండడంతో బాలికలు నానా అవస్థలు పడుతున్నారు. విద్యార్థులు తమ దుస్తులు, పుస్తకాలు పెట్టుకునేందుకు చాలినంత స్థలం లేదు.
ఇరుకు గదుల్లోనే సమస్యలతో సహవాసంచేస్తున్నారు. అయినా అధికారులు సౌకర్యాలపై దృష్టిసారించకపోవడం విచారకరం. వసతి గృహంలో ఆరు నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న దాదాపు 90 మంది విద్యార్థులున్నారు. ఇంత మందికి రెండు మరుగుదొడ్లు మాత్రమే ఉన్నాయి. స్నానం చేయడానికి కూడా రెండు గదులతోనే సరిపెట్టుకుంటున్నారు. బీసీ వసతి గహంలో మరుగుదొడ్లు ఉన్నా నీటి సౌకర్యం లేక నిరూపయోగంగా మారాయి.
దీంతో కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఆరుబయటకు వెళుతున్నారు. కాగా ఇటీవల ఎస్సీ బాలికల వసతి గృహం నిర్మాణానికి రూ.65 లక్షలు మంజూరయ్యాయి. అయితే సదురు కాంట్రాక్టర్ పిల్లర స్థాయిలో పనులను నిలిపివేయడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నిరాశ చెందుతున్నారు. సొంత భవనం సమకూరుతుందనుకున్న వారి ఆశలపై నీళ్లు కుమ్మరించినట్లయింది. అధికారులు చర్యలు తీసుకుని వెంటనే నిర్మాణం పూర్తి అయ్యే చూడాలని కోరుతున్నారు.
త్వరగా భవనం పూర్తి చేయాలి
గత కొన్నేళ్ల నుంచి సొంత భవనం ఏర్పాటు చేస్తామని అధికారులు చెబుతున్నారు. సొంత భవనం లేక నానా ఇబ్బందులు పడుతున్నాం. నూతన నిర్మాణం త్వరగా పూర్తి చేసి మా కష్టాలు తీర్చాలి. హాస్టల్‌లో ఉండలేకపోతున్నాం. - స్వరూప, 10వ తరగతి విద్యార్థిని, ఝరాసంగం
ఇరుకైన గదులతో ఇబ్బందులు
ప్రస్తుతం ఉన్న భవనంలో మాకు సరిపడా గదులు లేవు. ఉన్న గదులు ఇరుకుగా ఉన్నాయి. మా అందరికి కలిపి రెండు మరుగుదొడ్లే ఉన్నాయి. కొత్త భవనం కడుతూ మధ్యలోనే ఆపేశారు. భవనం పూర్తిచేసి వెంటనే వినియోగంలోకి వచ్చేలా చూడాలి. - సుజాత, 9వ తరగతి విద్యార్థి, ఝరాసంగం
జిల్లా అధికారులకు నివేదించాం
సొంత భవనం లేక విద్యార్థులకు ఇబ్బందులు పడుతున్నారని జిల్లా అధికారులకు నివేదించాం. అలాగే భవనం ఏర్పాటు చేయాలని పలుమార్లు నాయకులు, అధికారుల దృష్టికి తీసుళ్లాం. భవనం పూర్తి చేసి వెంటనే వినియోగం వస్తే విద్యార్థులకు ఇబ్బందిలేకుండా ఉంటుంది. - చంద్రమ్మ, వార్డెన్