
జిల్లాకో మైనార్టీ గురుకులం, వసతి గృహం
డిప్యూటీ సీఎం మహమూద్ అలీ
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు ఒకటి చొప్పున 10 మైనార్టీ గురుకుల పాఠశాలలు, 10 పోస్టు మెట్రిక్ వసతి గృహాలు మంజూరు చేసినట్లు ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ వెల్లడించారు. గురువారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మైనార్టీ విద్యార్థుల విదేశీ చదువు కోసం ఓవర్సీస్ స్టడీ స్కీం కింద రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉపకార వేతనం అందించనున్నట్లు చెప్పారు.
ప్రభుత్వం ఈ పథకం కింద ఇప్పటికే రూ.25 కోట్లు కేటాయించిందని తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఉర్దూను మొదటి భాషగా తీసుకునేందుకు ప్రభుత్వం అనుమతించిందని గుర్తు చేశారు. మైనార్టీ విద్యార్థులు, నిరుద్యోగుల కోసం కెరీర్ కౌన్సెలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ముస్లిం కుటుంబాల కోసం మ్యారేజ్ కౌన్సెలింగ్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. పాతబస్తీలోని చిరు వ్యాపారులకు స్వల్ప కాలిక రుణాలు అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.