Deputy CM Mohammed Ali
-
కోలుకుంటున్న ఉప ముఖ్యమంత్రి : లక్ష్మారెడ్డి
హైదరాబాద్ : స్వైన్‌ఫ్లూ సోకి చికిత్స పొందుతున్న ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ కోలుకుంటున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. నగరంలోని ఫిల్మ్‌నగర్ దుర్గాభవాని నగర్లో జరిగిన పోలియో చుక్కల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వైన్‌ఫ్లూ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. స్వైన్‌ఫ్లూ వచ్చిందని ఆందోళన చెందవద్దని, చికిత్స ద్వారా నయమవవుతుందని, దీనిపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. అలాగే పల్స్ పోలియోకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. -
హజ్‌కు కేంద్రం రాయితీ కొనసాగించాలి
కేంద్ర మంత్రి నఖ్వీకి డిప్యూటీ సీఎం మహమూద్ అలీ లేఖ సాక్షి, హైదరాబాద్: హజ్‌యాత్రకు సబ్సిడీని యథావిధిగా కొనసాగించాలని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గతేడాది కేంద్రం నుంచి రూ.690 కోట్ల రాయితీ ఇవ్వగా.. ఈ ఏడాది ఆ మొత్తాన్ని రూ.వెయ్యి కోట్లకు పెంచాలని కోరారు. ఈ మేరకు కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీకి ఆదివారం ఆయన లేఖ రాశారు. హజ్‌ను సందర్శించడం ముస్లింల జీవిత ఆశయమని, పేద ముస్లింలకు హజ్‌యాత్ర సులభతరం కానందునే ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసి వారి కలను సాకారం చేస్తుందని తెలిపారు. అయితే హజ్‌యాత్ర రాయితీ నిధులపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీ వేసినట్లు తెలిసిందని, కమిటీ నివేదికతో సంబంధం లేకుండా నిధులు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా హజ్ యాత్రికులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోందని లేఖలో ఆయన వివరించారు. -
అహం వీడి పనిచేస్తే అందరికీ మేలు
డిప్యూటీ సీఎం మహమూద్ అలీ సాక్షి, హైదరాబాద్: అధికారులు అహం వీడి పనిచేస్తేనే అందరికీ మేలు జరుగుతుందని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. ప్రజలకు సత్వర సేవలందించడం ద్వారా బంగారు తెలంగాణ నిర్మాణంలో రెవెన్యూ శాఖ కీలకం కావాలన్నారు. ఆదివారం తన నివాసంలో తెలంగాణ తహసీల్దార్ల సంఘం నూతన డైరీ-2016ని మహమూద్ అలీ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ... ‘గ్రామాల్లో చిన్నచిన్న సమస్యలు కూడా పరిష్కారం కావడం లేదని జనం మా వద్దకు వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఉద్యోగులు అందుబాటులో ఉండకపోవడమే ఇందుకు కారణం. పోలీసు శాఖ మాదిరిగానే రెవెన్యూ శాఖలోనూ అత్యాధునిక సదుపాయాలు కల్పిస్తున్నాం.. తెలంగాణ వ్యాప్తంగా భూముల రీసర్వే ప్రక్రియను త్వరలోనే ప్రారంభిస్తాం. వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచే వెబ్‌ల్యాండ్ ద్వారా క్రాప్ బుకింగ్ ప్రక్రియ ప్రారంభిస్తామని ప్రధాన కమిషనర్ రేమండ్ పీటర్ అన్నారు. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి బీఆర్ మీనా, టీజీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
12న ‘నిజాం’ మైదానంలో దావత్-ఎ- ఇఫార్త్
ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన డిప్యూటీ సీఎం మహమూద్ అలీ సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ఈ నెల 12న నిజాం కాలేజీ మైదానంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రంజాన్ దావత్-ఎ-ఇఫ్తార్ కార్యక్రమానికి ఏర్పాట్లను పక్కాగా పూర్తి చేయాలని ఉపముఖ్యమంత్రి మహమూద్‌అలీ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన సచివాలయంలో టాస్క్‌ఫోర్స్ కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహించారు. ఇఫ్తార్‌కు ఎలాంటి ఆటంకాలు కలుగకుండా చూడాలని, గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. రంజాన్ కానుకగా ప్రభుత్వం ప్రకటించిన కొత్త దుస్తుల పంపిణీ కార్యక్రమానికి మసీదు కమిటీలు సంపూర్ణ సహకారం అందించేలా చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రంలోని రెండు లక్షల మంది నిరుపేదలకు రూ.10 కోట్ల విలువైన బట్టలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ఈనెల 15లోగా బట్టలు పంపిణీ పూర్తి చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ సమావేశంలో టాస్క్‌ఫోర్స్ కమిటీ చైర్మన్, ఏసీబీ డీజీపీ ఏకే ఖాన్, ప్రొటోకాల్ కార్యదర్శి వికాస్‌రాజ్, డెరైక్టర్ అరవింద్ సింగ్, మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్, డెరైక్టర్ జలాలుద్దీన్ అక్బర్, రాష్ట్ర హజ్ కమిటీ స్పెషల్ అధికారి ఎస్ఎం షుకూర్ పాల్గొన్నారు. -
‘మసీదుల మరమ్మతులకు రూ.కోటి కేటాయించండి’
సాక్షి, సిటీ బ్యూరో : మహా నగరంలో పవిత్ర రంజాన్ నెలను పురస్కరించుకొని మసీదుల మరమ్మతులు,పెయింటింగ్ తదితర ఏర్పాట్లకు రూ. కోటి నిధుల కేటాయించాలని మైనార్టీ సంక్షేమ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేసింది. చారిత్రాత్మకమైన మక్కా మసీదు, నాంపల్లిలోని రాయల్ మసీదుల్లో వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం ప్రత్యేక నిధుల కోసం మరోక ప్రతిపాదన సమర్పించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రంజాన్ గ్రాంట్ కింద ఐదు కోట్లు కేటాయిస్తామని ప్రకటించడంతో జంట జిల్లాల పరిధిలోని మసీదుల వాట కిందరూ.కోటి నిధుల దక్కనున్నాయి. మరోవైపు పాతబస్తీలోని మక్కా మసీదులో వివిధ సదుపాయల కల్పన కోసం ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగా ఆదివారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, స్థానిక ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ, మైనార్టీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఉమర్ జలీల్, డెరైక్టర్ మహ్మద్ జలాలుద్దీన్ అక్బర్ లతో కలిసి మక్కామసీదును పరిశీలించారు. సకాలంలో నిధులు ప్రశ్నార్ధకమే... మసీదుల మరమ్మత్తులకు సకాలంలో రంజాన్ గ్రాంట్ విడుదల కావడం ప్రశ్నార్థకమే. మరో ఐదు రోజుల్లో పవిత్ర రంజాన్ నెల ప్రారంభం కానుంది. పక్షం రోజుల క్రితమే రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ నగరంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిధ శాఖల అధికారులతో రంజాన్ నెల ఏర్పాట్లపై సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి నిధుల కేటాయింపు ప్రకటన చేశారు.అయితే ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి జీవో జారీ కాలేదు. గత ఏడాది రంజాన్ పండుగ సందర్భంగా ప్రభుత్వం రూ.2.79 కోట్లు కేటాయించినప్పటికి నిధుల విడుదలలో జాప్యం జరగడంతో ఫలితం లేకుండా పోయింది. అధికారికంగా జీవో జారీ చేయండి : రంజాన్ పురస్కరించుకొని మసీదుల మరమత్తులు ఏర్పాట్ల కోసం నిధులు మంజూరు చేస్తూ తక్షణమే జీవో జారీ చేయాలని జమియతుల్ ముషాయఖ్ కార్యదర్శి ఆబుల్ ఫతహ్ సయ్యద్ బందగీ బాద్షా ఖాద్రీ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. నిధుల మంజూరు చేస్తే విడుదల అలస్యంతో మరమ్మత్తు పనులకు అటంకం ఏర్పడుతుందన్నారు. -
జిల్లాకో మైనార్టీ గురుకులం, వసతి గృహం
డిప్యూటీ సీఎం మహమూద్ అలీ హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు ఒకటి చొప్పున 10 మైనార్టీ గురుకుల పాఠశాలలు, 10 పోస్టు మెట్రిక్ వసతి గృహాలు మంజూరు చేసినట్లు ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ వెల్లడించారు. గురువారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మైనార్టీ విద్యార్థుల విదేశీ చదువు కోసం ఓవర్సీస్ స్టడీ స్కీం కింద రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉపకార వేతనం అందించనున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ఈ పథకం కింద ఇప్పటికే రూ.25 కోట్లు కేటాయించిందని తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఉర్దూను మొదటి భాషగా తీసుకునేందుకు ప్రభుత్వం అనుమతించిందని గుర్తు చేశారు. మైనార్టీ విద్యార్థులు, నిరుద్యోగుల కోసం కెరీర్ కౌన్సెలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ముస్లిం కుటుంబాల కోసం మ్యారేజ్ కౌన్సెలింగ్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. పాతబస్తీలోని చిరు వ్యాపారులకు స్వల్ప కాలిక రుణాలు అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.