
‘మసీదుల మరమ్మతులకు రూ.కోటి కేటాయించండి’
సాక్షి, సిటీ బ్యూరో : మహా నగరంలో పవిత్ర రంజాన్ నెలను పురస్కరించుకొని మసీదుల మరమ్మతులు,పెయింటింగ్ తదితర ఏర్పాట్లకు రూ. కోటి నిధుల కేటాయించాలని మైనార్టీ సంక్షేమ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేసింది. చారిత్రాత్మకమైన మక్కా మసీదు, నాంపల్లిలోని రాయల్ మసీదుల్లో వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం ప్రత్యేక నిధుల కోసం మరోక ప్రతిపాదన సమర్పించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రంజాన్ గ్రాంట్ కింద ఐదు కోట్లు కేటాయిస్తామని ప్రకటించడంతో జంట జిల్లాల పరిధిలోని మసీదుల వాట కిందరూ.కోటి నిధుల దక్కనున్నాయి.
మరోవైపు పాతబస్తీలోని మక్కా మసీదులో వివిధ సదుపాయల కల్పన కోసం ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగా ఆదివారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, స్థానిక ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ, మైనార్టీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఉమర్ జలీల్, డెరైక్టర్ మహ్మద్ జలాలుద్దీన్ అక్బర్ లతో కలిసి మక్కామసీదును పరిశీలించారు.
సకాలంలో నిధులు ప్రశ్నార్ధకమే...
మసీదుల మరమ్మత్తులకు సకాలంలో రంజాన్ గ్రాంట్ విడుదల కావడం ప్రశ్నార్థకమే. మరో ఐదు రోజుల్లో పవిత్ర రంజాన్ నెల ప్రారంభం కానుంది. పక్షం రోజుల క్రితమే రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ నగరంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిధ శాఖల అధికారులతో రంజాన్ నెల ఏర్పాట్లపై సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి నిధుల కేటాయింపు ప్రకటన చేశారు.అయితే ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి జీవో జారీ కాలేదు. గత ఏడాది రంజాన్ పండుగ సందర్భంగా ప్రభుత్వం రూ.2.79 కోట్లు కేటాయించినప్పటికి నిధుల విడుదలలో జాప్యం జరగడంతో ఫలితం లేకుండా పోయింది.
అధికారికంగా జీవో జారీ చేయండి :
రంజాన్ పురస్కరించుకొని మసీదుల మరమత్తులు ఏర్పాట్ల కోసం నిధులు మంజూరు చేస్తూ తక్షణమే జీవో జారీ చేయాలని జమియతుల్ ముషాయఖ్ కార్యదర్శి ఆబుల్ ఫతహ్ సయ్యద్ బందగీ బాద్‌షా ఖాద్రీ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. నిధుల మంజూరు చేస్తే విడుదల అలస్యంతో మరమ్మత్తు పనులకు అటంకం ఏర్పడుతుందన్నారు.