విజయవాడలో ప్రభుత్వం నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్
దేవుడు మన నుంచి కోరుకునేది ఒక్కటే.. అధికారంలో ఉన్న వారు అధికార దర్పంతో వ్యవహరించకూడదని, వారు ప్రజలకు సేవకులుగా ఉండాలని కోరుకుంటాడు. నేను అదే నమ్ముతాను. దేవుడి ఆశీస్సులతో మీ అందరి చల్లని దీవెనలతో ఇంకా గొప్ప సేవకుడిగా ఉండాలని కోరుకుంటున్నాను.
– ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి, అమరావతి: అధికారంలో ఉన్న వారు ప్రజలకు సేవకులుగా ఒదిగి ఉండటం నేర్చుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. విజయవాడలోని ఎ–ప్లస్ కన్వెన్షన్ సెంటర్‌లో మంగళవారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వం సెమీక్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించి తేనీటి విందు ఏర్పాటుచేసింది. రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ కేక్ కట్‌చేసి క్రైస్తవ ప్రముఖులకు తినిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారంలో ఉండి ఇంకా ఒదిగి ఉండేలా నేర్చుకోవాలన్నారు. ప్రజలకు ఇంకా మంచిచేసే అవకాశం.. గొప్ప సేవకుడిగా ఉండేలా దేవుడు అవకాశం ఇవ్వాలని సీఎం ఈ సందర్భంగా ప్రార్థించారు. ముఖ్యమంత్రి ఇంకా ఏమన్నారంటే..
ఈ రోజు నాతో పాటు వేదికపై ఉన్న పెద్దలు మోస్ట్ రెవరెండ్ జోసెఫ్, డాక్టర్ జార్జ్, పాస్టర్ జాన్‌వెస్లీ, బాలస్వామి, ఇక్కడ ఉన్న ఫాదర్లు, పాస్టర్లే కాకుండా ఇక్కడికి వచ్చినా, రాలేకపోయినా నా అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములందరికీ కూడా ఈ క్రిస్మస్ మాసంలో ఈ వేడుక జరుపుకుంటున్న శుభసందర్భంలో అందరికీ మెర్రీ క్రిస్మస్ తెలియజేస్తున్నాను. కాసేపటి క్రితం ఇక్కడికి వచ్చాక ఏం మాట్లాడాలని అడిగాను. దేవుడి గురించి చెప్పాలంటే నా కంటే ఇక్కడ ఉన్న వారు చాలా చక్కగా చెబుతారు. మనం నేర్చుకోదగ్గ పాఠం ఒకటి ఉంది. మన నుంచి దేవుడు కోరుకునేది ఒక్కటే.
అధికారం అన్నది అధికారం కాదు. అధికారంలో ఉన్నవాళ్లు ప్రజలకు ఇంకా ఒదిగి ఉండాలి. ఇంకా సేవలకులమని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నేను మీ బిడ్డగా ఉన్నానంటే అందుకు దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలే కారణం. దేవుడి దయతో ఇంకా మంచిచేసే అవకాశం.. ఇంకా ఒదిగి ఉండే అవకాశం దేవుడు ఇవ్వాలని, ఇంకా గొప్ప సేవకుడిగా మీ అందరికీ సేవచేసే అవకాశం దేవుడు ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రతి ఇంట్లో ఉన్న వారికి మరొక్కసారి మెర్రీ క్రిస్మస్ శుభాకాంక్షలు అంటూ సీఎం జగన్ తన సందేశాన్ని అందించారు.
క్రీస్తు జననం లోకానికి పండుగ
ఇక ఏపీ క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ బొల్లవరపు జాన్‌వెస్లీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా మాట్లాడుతూ.. క్రీస్తు జననం లోకానికి పండుగ అన్నారు. సీఎం వైఎస్ జగన్ అధికారం చేపట్టిన నాటి నుంచి రాష్ట్రంలోని అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమానికి సువర్ణాధ్యాయం మొదలైందన్నారు.
గత ప్రభుత్వం ఐదేళ్లలో ముస్లిం మైనార్టీల కోసం కేవలం రూ.2,655 కోట్లు ఖర్చుచేస్తే వైఎస్సార్‌సీపీ మూడున్నరేళ్లలో రూ.20,330.63 కోట్లు ఖర్చుచేయడం గొప్ప విషయమన్నారు. ప్రభుత్వ సలహాదారు (సామాజిక న్యాయం) జూపూడి ప్రభాకర్, ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ, బిషప్ రాజారావు, హోసన్న మినిస్ట్రీస్ జాన్‌వెస్లీ, బందెల రాజు మాట్లాడారు.
ఉత్తమ సేవలకు అవార్డులు అందించిన సీఎం
ఇక పలు రంగాల్లో ఉత్తమ సేవలు అందించిన ఏడుగురికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అవార్డులు అందజేశారు. సామాజిక సేవలో ఉన్నం మేరీ సుజాత, వల్లూర్ అశవ్‌కుమార్.. వైద్య రంగంలో డాక్టర్ కోలా విజయ కిసింజెర్.. విద్యా రంగంలో కంచి డొమినిక్‌రెడ్డి, డాక్టర్ ఎం. సండ్ర కార్మెల్ సోఫియా.. సాహిత్యంలో తేర జాన్‌జర్షన్ శ్రీనివాస్, పెద్దేటి యోహాన్‌లకు అవార్డులను అందించి సత్కరించారు.
తేనిటి విందులో సీఎం వైఎస్ జగన్
అనంతరం ఇచ్చిన తేనీటి విందులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోపాటు ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, మంత్రులు అంబటి రాంబాబు, ఆదిమూలపు సురేష్, తానేటి వనిత, విడదల రజిని, జోగి రమేష్, కారుమూరి నాగేశ్వరరావు, శాసన మండలి వైస్ చైర్మన్ జకియాఖానం, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ రుహుల్లా, కృష్ణాజిల్లా జెడ్పీ చైర్మన్ ఉప్పాల హారికా రాము, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఏపీ పైబర్‌నెట్ చైర్మన్ పి.గౌతంరెడ్డి, విజయవాడ తూర్పు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి దేవినేని అవినాష్, పలువురు క్రైస్తవ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment