హజ్‌కు కేంద్రం రాయితీ కొనసాగించాలి
కేంద్ర మంత్రి నఖ్వీకి డిప్యూటీ సీఎం మహమూద్ అలీ లేఖ
సాక్షి, హైదరాబాద్: హజ్‌యాత్రకు సబ్సిడీని యథావిధిగా కొనసాగించాలని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గతేడాది కేంద్రం నుంచి రూ.690 కోట్ల రాయితీ ఇవ్వగా.. ఈ ఏడాది ఆ మొత్తాన్ని రూ.వెయ్యి కోట్లకు పెంచాలని కోరారు. ఈ మేరకు కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీకి ఆదివారం ఆయన లేఖ రాశారు. హజ్‌ను సందర్శించడం ముస్లింల జీవిత ఆశయమని, పేద ముస్లింలకు హజ్‌యాత్ర సులభతరం కానందునే ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసి వారి కలను సాకారం చేస్తుందని తెలిపారు. అయితే హజ్‌యాత్ర రాయితీ నిధులపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీ వేసినట్లు తెలిసిందని, కమిటీ నివేదికతో సంబంధం లేకుండా నిధులు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా హజ్ యాత్రికులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోందని లేఖలో ఆయన వివరించారు.