సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి.. ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తన పదవికి రాజీనామా చేశారు. రాజ్యసభ ఎంపీగా గురువారం ఆయన పదవీ కాలం ముగుస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. యూపీ నుంచి ఆయన రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
అయితే.. ఈ నిర్ణయం వెనుక ఉపరాష్ట్రపతి రేసులో ఆయన నిల్చునే అవకాశాలు ఉన్నట్లు చర్చ మొదలైంది. ఇదిలా ఉంటే.. చివరిసారిగా బుధవారం జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో నఖ్వీ పాల్గొనగా.. మంత్రిగా నఖ్వీ సేవలను ప్రశంసించారు ప్రధాని మోదీ. కేబినెట్ భేటీ అనంతరం బీజేపీ ప్రధాన కార్యాలయంకు వెళ్లిన నఖ్వీ.. పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు.
మైనార్టీ నేతగా నఖ్వీకి ప్రాధాన్యం ఇస్తూ.. ఆయన ఉపరాష్ట్రపతి రేసులో నిలపాలని బీజేపీ యోచనలో ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. రాజ్యసభ వ్యవహారాలపై నఖ్వీకి మంచి పట్టు ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన పేరు తెర మీదకు వచ్చింది. అయితే బీజేపీ తరపున దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment