ఆదిత్యనాథ్ ఎందుకు రాజీనామా చేయలేదు?
న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి పదవికి ఆగస్టు 8వ తేదీన ఎన్నికలు ముగియగానే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య తమ లోక్‌సభ సభ్యత్వాలకు రాజీనామా చేస్తారని రాజకీయ విశ్లేషకులు భావించారు. ఉప రాష్ట్రపతి పదవికి ఇవాళ (8వ తేదీన) ఓటు వేయగానే ఆదిత్యనాథ్ పార్లమెంట్‌కు రాజీనామా చేశారని కూడా ప్రచారమైంది.
అయితే ఆ విషయాన్ని యూపీ సమాచార శాఖ ప్రధాన కార్యదర్శి అవినాశ్ కుమార్ అవస్థి ఖండించారు. ఇక తాను లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్‌లోని ఫుల్పూర్ నుంచి మళ్లీ బీజీపీ అభ్యర్థే విజయం సాధిస్తారని మౌర్య వ్యాఖ్యానించారు. లోక్‌సభకు ఎప్పుడు రాజీనామా చేస్తున్నారన్న ప్రశ్నకు మాత్రం ఆయన సమాధానాన్ని దాటవేశారు.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంతో లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆదిత్యనాథ్, మౌర్యలు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులుగా ఈ ఏడాది మార్చి 19న ప్రమాణ స్వీకారం చేశారు. ఈ లెక్కన వారిరువురు సెప్టెంబర్ 19లోగా రాష్ట్ర అసెంబ్లీకిగానీ, రాష్ట్ర శాసన మండలికిగానీ ఎన్నిక కావాల్సి ఉంది. ఇంకా నెల పదిరోజుల్లో రాష్ట్ర అసెంబ్లీ లేదా శాసన మండలికి ఎన్నిక కావాల్సి ఉన్న నేపథ్యంలో వారెందుకు లోక్‌సభకు రాజీనామా చేయడం లేదనే అంశం ప్రశ్నార్థకం అయింది.
వీరిరువురు ఖాళీచేసే పార్లమెంట్ స్థానాలకు ఉమ్మడిగా పోటీ చేసి విజయం సాధించాలని బహుజన సమాజ్ పార్టీ, సమాజ్‌వాది పార్టీలు పరస్పర చర్చలు జరుపుతున్నారు. రాజ్యసభకు రాజీనామా చేసిన మాయావతి ఫుల్పూర్ నుంచి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్నారు. ఆదిత్యనాథ్ ప్రాతినిథ్యం వహిస్తున్న గోరఖ్‌పూర్ నుంచి సమాజ్‌వాది పార్టీ అభ్యర్థి పోటీ చేయాలనుకుంటున్నారు. ఈ ఇరువురు అభ్యర్థులకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వాలనుకుంటోంది. 2019లో జరిగే పార్లమెంట్ ఎన్నికలకు ముందు యూపీలో ప్రతిపక్ష పార్టీలు ఏకంకావడాన్ని ఎలాగైనా అడ్డుకోవాలనే ఆలోచనలో బీజేపీ అధిష్టానం ఉంది. అందుకనే పార్టీ అధిష్టానం ఇంతవరకు యోగి, మౌర్య రాజీనామాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ప్రస్తుతానికి ‘వేచి చూద్దాం’ ధోరణని అనుసరిద్ధామని సూచించినట్లు పార్టీ విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
యూపీ నుంచి ఖాళీ అయ్యే రెండు లోక్‌సభ స్థానాలకే కాకుండా, ఆదిత్యానాథ్, మౌర్యలు అసెంబ్లీకి పోటీ చేసేందుకు వీలుగా ఎవరైనా బీజేపీ అభ్యర్థులు తమ స్థానాలకు రాజీనామా చేసిన పక్షంలో ఆ స్థానాల్లో కూడా బీఎస్పీ, ఎస్పీ పార్టీలు ఉమ్మడిగా పోటీచేసి విజయం సాధించాలని ఆశిస్తున్నాయి. అయితే ఆ అవకాశం ఇవ్వరాదనే ఉద్దేశంలో పాలకపక్ష బీజేపీ శాసన మండలికి యోగి, మౌర్యాలు ప్రాతినిథ్యం వహించేలా చర్యలు తీసుకొంటోందని తెల్సింది.