uttarpradesh chief minister
-
ఆదిత్యనాథ్ ఎందుకు రాజీనామా చేయలేదు?
న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి పదవికి ఆగస్టు 8వ తేదీన ఎన్నికలు ముగియగానే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య తమ లోక్‌సభ సభ్యత్వాలకు రాజీనామా చేస్తారని రాజకీయ విశ్లేషకులు భావించారు. ఉప రాష్ట్రపతి పదవికి ఇవాళ (8వ తేదీన) ఓటు వేయగానే ఆదిత్యనాథ్ పార్లమెంట్‌కు రాజీనామా చేశారని కూడా ప్రచారమైంది. అయితే ఆ విషయాన్ని యూపీ సమాచార శాఖ ప్రధాన కార్యదర్శి అవినాశ్ కుమార్ అవస్థి ఖండించారు. ఇక తాను లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్‌లోని ఫుల్పూర్ నుంచి మళ్లీ బీజీపీ అభ్యర్థే విజయం సాధిస్తారని మౌర్య వ్యాఖ్యానించారు. లోక్‌సభకు ఎప్పుడు రాజీనామా చేస్తున్నారన్న ప్రశ్నకు మాత్రం ఆయన సమాధానాన్ని దాటవేశారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంతో లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆదిత్యనాథ్, మౌర్యలు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులుగా ఈ ఏడాది మార్చి 19న ప్రమాణ స్వీకారం చేశారు. ఈ లెక్కన వారిరువురు సెప్టెంబర్ 19లోగా రాష్ట్ర అసెంబ్లీకిగానీ, రాష్ట్ర శాసన మండలికిగానీ ఎన్నిక కావాల్సి ఉంది. ఇంకా నెల పదిరోజుల్లో రాష్ట్ర అసెంబ్లీ లేదా శాసన మండలికి ఎన్నిక కావాల్సి ఉన్న నేపథ్యంలో వారెందుకు లోక్‌సభకు రాజీనామా చేయడం లేదనే అంశం ప్రశ్నార్థకం అయింది. వీరిరువురు ఖాళీచేసే పార్లమెంట్ స్థానాలకు ఉమ్మడిగా పోటీ చేసి విజయం సాధించాలని బహుజన సమాజ్ పార్టీ, సమాజ్‌వాది పార్టీలు పరస్పర చర్చలు జరుపుతున్నారు. రాజ్యసభకు రాజీనామా చేసిన మాయావతి ఫుల్పూర్ నుంచి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్నారు. ఆదిత్యనాథ్ ప్రాతినిథ్యం వహిస్తున్న గోరఖ్‌పూర్ నుంచి సమాజ్‌వాది పార్టీ అభ్యర్థి పోటీ చేయాలనుకుంటున్నారు. ఈ ఇరువురు అభ్యర్థులకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వాలనుకుంటోంది. 2019లో జరిగే పార్లమెంట్ ఎన్నికలకు ముందు యూపీలో ప్రతిపక్ష పార్టీలు ఏకంకావడాన్ని ఎలాగైనా అడ్డుకోవాలనే ఆలోచనలో బీజేపీ అధిష్టానం ఉంది. అందుకనే పార్టీ అధిష్టానం ఇంతవరకు యోగి, మౌర్య రాజీనామాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ప్రస్తుతానికి ‘వేచి చూద్దాం’ ధోరణని అనుసరిద్ధామని సూచించినట్లు పార్టీ విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. యూపీ నుంచి ఖాళీ అయ్యే రెండు లోక్‌సభ స్థానాలకే కాకుండా, ఆదిత్యానాథ్, మౌర్యలు అసెంబ్లీకి పోటీ చేసేందుకు వీలుగా ఎవరైనా బీజేపీ అభ్యర్థులు తమ స్థానాలకు రాజీనామా చేసిన పక్షంలో ఆ స్థానాల్లో కూడా బీఎస్పీ, ఎస్పీ పార్టీలు ఉమ్మడిగా పోటీచేసి విజయం సాధించాలని ఆశిస్తున్నాయి. అయితే ఆ అవకాశం ఇవ్వరాదనే ఉద్దేశంలో పాలకపక్ష బీజేపీ శాసన మండలికి యోగి, మౌర్యాలు ప్రాతినిథ్యం వహించేలా చర్యలు తీసుకొంటోందని తెల్సింది. -
యోగి రుణమాఫీ కూడా.. కంటి తుడుపేనా?
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించిన రైతు రుణమాఫీ కంటితుడుపు మాత్రమేనని, దాంతో తమకు ఏమంత గొప్ప ప్రయోజనం ఉండబోదని రైతులు మండిపడుతున్నారు. దాదాపు లక్ష మంది సన్నకారు, చిన్నకారు రైతులకు ప్రయోజనం కల్పించేలా మొత్తం రూ. 36,359 కోట్ల రుణాలను మాఫీ చేస్తున్నట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అది ప్రభుత్వానికి పండగ కావచ్చు గానీ, రైతులకు మాత్రం కాదని.. ఆకలితో ఏడుస్తున్న పిల్లాడికి లాలీపాప్ ఇచ్చినట్లే ఉందని మథుర జిల్లాలోని బోర్పా గ్రామానికి చెందిన కేదార్ సింగ్ అన్నారు. మొత్తం రైతులకు ఉన్న రుణాలన్నింటినీ మాఫీ చేస్తారని తాము భావించినట్లు మథుర తాలూకా దామోదర్పురా గ్రామ సర్పంచ్, రైతు దేవీ సింగ్ చెప్పారు. ఎన్నికలకు ముందు నిర్వహించిన సమావేశాల్లో తమను ఘోరంగా మోసం చేశారని రాజన్ సింగ్ మండిపడ్డారు. రుణమాఫీ గురించి ప్రధానమంత్రి ఎన్నికల సభలలో చెప్పేటప్పుడు ఎవరెవరికి ఇది వర్తిస్తుందన్న విషయాన్ని అప్పట్లో చెప్పలేదని, ఇప్పుడు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం తూతూ మంత్రంగా రుణమాఫీ చేసి చేతులు దులిపేసుకొంటోందని, ఇదంతా కంటితుడుపు చర్యగా ఉంటోందని విమర్శించారు. కేవలం 2016-17 సంవత్సరంలో తీసుకున్న రుణాలకు మాత్రమే మాఫీ వర్తిస్తుందని చెప్పడం కూడా అన్యాయమన్నారు. గత మూడేళ్లుగా ప్రకృతి ప్రకోపం వల్ల రైతుల పరిస్థితి ఘోరంగా ఉందని, ఇలాంటి సమయంలో కేవలం లక్ష రూపాయల లోపు రుణాలే మాఫీ చేస్తామంటే ఇది సముద్రంలో నీటిబొట్టు వేయడం లాంటిదని దీన్ దయాళ్ గౌతమ్ అనే రైతు తెలిపారు. కొద్ది మంది రైతులు మాత్రం రుణమాఫీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. సాధారణంగా చిన్న రైతులకు బ్యాంకులు లక్ష రూపాయలకు మించి రుణాలు ఇవ్వవని కుశాల్ సింగ్ అనే రైతు అన్నారు. కేవలం గత సంవత్సరంలోనే పంట రుణాలు తీసుకున్న రైతులకు ఇది మంచి వరం లాంటిదని లోకేంద్ర అనే ఇంకో రైతు చెప్పారు. ఇంతకుముందు తీసుకున్న రుణాలు కూడా కట్టలేని రైతులు ఉన్నారని, వాళ్లకు కూడా ఇది వర్తింపజేసి ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. -
రేషన్ మాఫియాపై సీఎం యోగి కన్నెర్ర
అధికారం చేపట్టినప్పటి నుంచి వరుసగా ఒక్కో విషయంపై తనదైన మార్కు చూపిస్తున్న యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. తాజాగా రేషన్ మాఫియాపై ఉక్కుపాదం మోపారు. రాష్ట్రంలో మూతపడిన చక్కెర కర్మాగారాలపై తనకు ఓ నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. పేదలకు తప్పనిసరిగా రేషన్ కార్డులు ఇవ్వాలని, అదేసమయంలో ఆహార ధాన్యాలు, రేషన్ సరుకులను నల్లబజారుకు తరలిస్తున్న మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ విషయాలపై తగిన ప్రచారం చేయడంతో పాటు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు కఠినంగా వ్యవహరించాలని గోరఖ్‌పూర్, బస్తీ డివిజన్ల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో సూచించారు. ప్రభుత్వ పథకాలు అసవరంలో ఉన్నవాళ్లకు అందేలా చూడాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లదేనని ఆయన స్పష్టం చేశారు. మైనింగ్, అటవీ, పశువుల మాఫియా విషయంలో కూడా గట్టిగా ఉండాలని చెప్పారు. చెరుకు రైతుల బకాయిలను 15 రోజుల్లోగా చెల్లించాలని అధికారులను సీఎం యోగి ఆదేశించారు. తదుపరి చెరుకు సీజన్‌కు సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. డీనోటిఫైడ్ గిరిజన తెగలను గుర్తించాలని, అలాగే గిరిజనులు ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకుంటున్నారో లేదో తేల్చేందుకు ఓ సర్వే చేయాలని సూచించారు. సర్వే తర్వాత వన్ తంగియా, ముసాహర్ తెగలవాళ్లు ఎక్కువగా ఉండే ప్రాంతాలను రెవెన్యూ గ్రామాలుగా ప్రకటించి అక్కడ విద్య, ఆరోగ్యం, తాగునీరు, రోడ్లు, ఇళ్లు, విద్యుత్ సదుపాయాలు కల్పించి ప్రభుత్వ రేషన్ దుకాణాలను తెరవాలని చెప్పారు. నేరచరిత్ర లేనివారికి మాత్రమే నిర్మాణ పనుల కాంట్రాక్టులు ఇవ్వాలని సీఎం గట్టిగా స్పష్టం చేశారు. నేరస్తులు ఏవైనా ఒత్తిళ్లు తెస్తే, ఆ విషయాన్ని జిల్లా కలెక్టర్లు, ఎస్పీల దృష్టికి తెచ్చి వాళ్లపై ఎఫ్ఐఆర్లు దాఖలు చేయాలన్నారు. -
ఇక తేలాల్సింది ఒక్క పేరే!
నాలుగింట మూడొంతుల మెజారిటీ వచ్చిన రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రిని ఎంపిక చేసుకోవడం ఇంత కష్టమా అన్నది ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ పరిస్థితి చూస్తే తెలుస్తుంది. ఇప్పటికి ఈ పదవి కోసం చాలా పేర్లు వినిపిస్తున్నాయి. కానీ ఎప్పటికప్పుడు ఎవరికి వాళ్లు మేము కాదంటే మేము కాదని వెనుదిరుగుతున్నారు. ఇంతకుముందు యూపీ బీజేపీ చీఫ్ కేశవ్ ప్రసాద్ మౌర్య పేరు వినిపించింది. కానీ, చివరకు ముఖ్యమంత్రిని ఎంపిక చేయాల్సిన బాధ్యతే ఆయన మీద పడింది. దాంతో, 'నన్ను నేను ఎలా ఎంపిక చేసుకుంటాను' అంటూ ఆయన తప్పుకొన్నారు. ఆ తర్వాత కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, మనోజ్ సిన్హాల పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే, ఇప్పుడు వాళ్లలోంచి మనోజ్ సిన్హా కూడా తప్పుకొన్నట్లే కనిపిస్తోంది. 'నేను రేసులో లేను' అని ఆయన చెప్పడంతో.. ఇక ప్రస్తుతానికి గట్టిగా వినవస్తున్న పేరు కేంద్ర హోం మంత్రి, యూపీ మాజీ ముఖ్యమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఒక్కరే. ఆదివారం ప్రమాణస్వీకారం చేయాల్సి ఉన్నా.. ఇప్పటివరకు ముఖ్యమంత్రి ఎవరన్నది మాత్రం స్పష్టత రాలేదు. కేశవ్ ప్రసాద్ మౌర్య రేసులో లేని విషయాన్ని బీజేపీ చీఫ్ అమిత్ షా కూడా చెప్పేశారు. 'కేశవ్ ఎవరి పేరును నా ముందుంచితే ఆ పేరు మీదే ముద్ర కొట్టేస్తాను' అని ఆయన వ్యాఖ్యానించారు. తద్వారా, ఎంపిక బాధ్యతలను మౌర్య మీద పెట్టినట్లు స్పష్టంగా చెప్పేశారు. దానికితోడు గురువారం నాడు మౌర్య బీపీ సంబంధిత సమస్యలతో ఢిల్లీలోని రాం మనోహర్ లోహియా ఆస్పత్రిలో కూడా చేరాల్సి వచ్చింది. దాంతో.. ఇక ముఖ్యమంత్రి ఎంపిక బాధ్యతలు దాదాపుగా అమిత్ షా, మోదీల మీదే ఉన్నట్లయ్యాయి. ఏదైనా ఆశ్చర్యకరమైన ప్రకటన వస్తుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఉత్తరాఖండ్ విషయంలో కూడా ఇలాగే దాదాపు చివరి నిమిషం వరకు ఆగి.. శనివారం ప్రమాణస్వీకారం ఉందనగా శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే, ఉత్తరప్రదేశ్‌లో కూడా ఆదివారం ప్రమాణ స్వీకారం ఉన్నందున ఇక శనివారమే పేరు బయటకు వస్తుందని అనుకుంటున్నారు. పార్టీ ఎమ్మెల్యేలందరితో శనివారం ఒక సమావేశం ఏర్పాటుచేసి పేరును ఖరారు చేస్తామని మౌర్య అన్నారు. శనివారం సాయంత్రం 4 గంటలకల్లా పేరు బయటకు రావచ్చన్నది ఒక అంచనా. -
అబ్బాయ్కు బాబాయ్ మద్దతు
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు ఊహించని మద్దతు లభించింది. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ మళ్లీ విజయం సాధిస్తే అఖిలేష్ ముఖ్యమంత్రి అవుతారని, ఆయన బాబాయ్, యూపీ ఎస్పీ చీఫ్ శివపాల్ సింగ్ యాదవ్ చెప్పారు. ముఖ్యమంత్రి పదవికి అఖిలేష్ పేరును తాను ప్రతిపాదిస్తానని తెలిపారు. ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి ఎవరన్నది పార్టీ ఎమ్మెల్యేలు నిర్ణయిస్తారంటూ ఎస్పీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ములాయం ప్రకటనతో ఆయన కుమారుడు అఖిలేష్ షాకయ్యారు. ఈ నేపథ్యంలో పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ తనతో విబేధిస్తున్న బాబాయ్ శివపాల్ అండగా నిలబడటం అఖిలేష్‌కు ఊరట కలిగించే విషయం. సమాజ్‌వాదీ పార్టీలో విభేదాలు లేవని, అందరూ ఐకమత్యంగా ఉన్నామని శివపాల్ చెప్పారు.