యోగి రుణమాఫీ కూడా.. కంటి తుడుపేనా?
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించిన రైతు రుణమాఫీ కంటితుడుపు మాత్రమేనని, దాంతో తమకు ఏమంత గొప్ప ప్రయోజనం ఉండబోదని రైతులు మండిపడుతున్నారు. దాదాపు లక్ష మంది సన్నకారు, చిన్నకారు రైతులకు ప్రయోజనం కల్పించేలా మొత్తం రూ. 36,359 కోట్ల రుణాలను మాఫీ చేస్తున్నట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అది ప్రభుత్వానికి పండగ కావచ్చు గానీ, రైతులకు మాత్రం కాదని.. ఆకలితో ఏడుస్తున్న పిల్లాడికి లాలీపాప్ ఇచ్చినట్లే ఉందని మథుర జిల్లాలోని బోర్పా గ్రామానికి చెందిన కేదార్ సింగ్ అన్నారు. మొత్తం రైతులకు ఉన్న రుణాలన్నింటినీ మాఫీ చేస్తారని తాము భావించినట్లు మథుర తాలూకా దామోదర్‌పురా గ్రామ సర్పంచ్, రైతు దేవీ సింగ్ చెప్పారు. ఎన్నికలకు ముందు నిర్వహించిన సమావేశాల్లో తమను ఘోరంగా మోసం చేశారని రాజన్ సింగ్ మండిపడ్డారు.
రుణమాఫీ గురించి ప్రధానమంత్రి ఎన్నికల సభలలో చెప్పేటప్పుడు ఎవరెవరికి ఇది వర్తిస్తుందన్న విషయాన్ని అప్పట్లో చెప్పలేదని, ఇప్పుడు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం తూతూ మంత్రంగా రుణమాఫీ చేసి చేతులు దులిపేసుకొంటోందని, ఇదంతా కంటితుడుపు చర్యగా ఉంటోందని విమర్శించారు. కేవలం 2016-17 సంవత్సరంలో తీసుకున్న రుణాలకు మాత్రమే మాఫీ వర్తిస్తుందని చెప్పడం కూడా అన్యాయమన్నారు. గత మూడేళ్లుగా ప్రకృతి ప్రకోపం వల్ల రైతుల పరిస్థితి ఘోరంగా ఉందని, ఇలాంటి సమయంలో కేవలం లక్ష రూపాయల లోపు రుణాలే మాఫీ చేస్తామంటే ఇది సముద్రంలో నీటిబొట్టు వేయడం లాంటిదని దీన్ దయాళ్ గౌతమ్ అనే రైతు తెలిపారు. కొద్ది మంది రైతులు మాత్రం రుణమాఫీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. సాధారణంగా చిన్న రైతులకు బ్యాంకులు లక్ష రూపాయలకు మించి రుణాలు ఇవ్వవని కుశాల్ సింగ్ అనే రైతు అన్నారు. కేవలం గత సంవత్సరంలోనే పంట రుణాలు తీసుకున్న రైతులకు ఇది మంచి వరం లాంటిదని లోకేంద్ర అనే ఇంకో రైతు చెప్పారు. ఇంతకుముందు తీసుకున్న రుణాలు కూడా కట్టలేని రైతులు ఉన్నారని, వాళ్లకు కూడా ఇది వర్తింపజేసి ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు.