ఇక తేలాల్సింది ఒక్క పేరే!
నాలుగింట మూడొంతుల మెజారిటీ వచ్చిన రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రిని ఎంపిక చేసుకోవడం ఇంత కష్టమా అన్నది ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ పరిస్థితి చూస్తే తెలుస్తుంది. ఇప్పటికి ఈ పదవి కోసం చాలా పేర్లు వినిపిస్తున్నాయి. కానీ ఎప్పటికప్పుడు ఎవరికి వాళ్లు మేము కాదంటే మేము కాదని వెనుదిరుగుతున్నారు. ఇంతకుముందు యూపీ బీజేపీ చీఫ్ కేశవ్ ప్రసాద్ మౌర్య పేరు వినిపించింది. కానీ, చివరకు ముఖ్యమంత్రిని ఎంపిక చేయాల్సిన బాధ్యతే ఆయన మీద పడింది. దాంతో, 'నన్ను నేను ఎలా ఎంపిక చేసుకుంటాను' అంటూ ఆయన తప్పుకొన్నారు. ఆ తర్వాత కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, మనోజ్ సిన్హాల పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే, ఇప్పుడు వాళ్లలోంచి మనోజ్ సిన్హా కూడా తప్పుకొన్నట్లే కనిపిస్తోంది. 'నేను రేసులో లేను' అని ఆయన చెప్పడంతో.. ఇక ప్రస్తుతానికి గట్టిగా వినవస్తున్న పేరు కేంద్ర హోం మంత్రి, యూపీ మాజీ ముఖ్యమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఒక్కరే. ఆదివారం ప్రమాణస్వీకారం చేయాల్సి ఉన్నా.. ఇప్పటివరకు ముఖ్యమంత్రి ఎవరన్నది మాత్రం స్పష్టత రాలేదు.
కేశవ్ ప్రసాద్ మౌర్య రేసులో లేని విషయాన్ని బీజేపీ చీఫ్ అమిత్ షా కూడా చెప్పేశారు. 'కేశవ్ ఎవరి పేరును నా ముందుంచితే ఆ పేరు మీదే ముద్ర కొట్టేస్తాను' అని ఆయన వ్యాఖ్యానించారు. తద్వారా, ఎంపిక బాధ్యతలను మౌర్య మీద పెట్టినట్లు స్పష్టంగా చెప్పేశారు. దానికితోడు గురువారం నాడు మౌర్య బీపీ సంబంధిత సమస్యలతో ఢిల్లీలోని రాం మనోహర్ లోహియా ఆస్పత్రిలో కూడా చేరాల్సి వచ్చింది.
దాంతో.. ఇక ముఖ్యమంత్రి ఎంపిక బాధ్యతలు దాదాపుగా అమిత్ షా, మోదీల మీదే ఉన్నట్లయ్యాయి. ఏదైనా ఆశ్చర్యకరమైన ప్రకటన వస్తుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఉత్తరాఖండ్ విషయంలో కూడా ఇలాగే దాదాపు చివరి నిమిషం వరకు ఆగి.. శనివారం ప్రమాణస్వీకారం ఉందనగా శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే, ఉత్తరప్రదేశ్‌లో కూడా ఆదివారం ప్రమాణ స్వీకారం ఉన్నందున ఇక శనివారమే పేరు బయటకు వస్తుందని అనుకుంటున్నారు. పార్టీ ఎమ్మెల్యేలందరితో శనివారం ఒక సమావేశం ఏర్పాటుచేసి పేరును ఖరారు చేస్తామని మౌర్య అన్నారు. శనివారం సాయంత్రం 4 గంటలకల్లా పేరు బయటకు రావచ్చన్నది ఒక అంచనా.